బలంగా ఆర్థిక కార్యకలాపాలు
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
వృద్ధిపై ఆందోళనలను తేలికపరిచే ప్రయత్నం
రేట్ల కోతకు సమయం ఉందన్న సంకేతం
ముంబై: దేశ జీడీపీ వృద్ధికి సంబంధించి వస్తున్న గణాంకాలు మిశ్రమంగా ఉన్నాయంటూ.. ప్రతికూలతల కంటే సానుకూలతలే ఎక్కువని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా కార్యకలాపాలు మొత్తానికి బలంగానే కొనసాగుతున్నట్టు చెప్పారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంపై ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ మాట్లాడారు. ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే, వెనక్కిలాగే 70 అధిక వేగంతో కూడిన సూచికలను ట్రాక్ చేసిన తర్వాతే ఆర్‌బీఐ అంచనాలకు వస్తుందని వివరించారు.
2024–25 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి 6.7 శాతంగా నమోదు కావడం గమనార్హం. 15 నెలల కనిష్ట స్థాయి ఇది. దీంతో వృద్ధిపై విశ్లేషకుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుండడం తెలిసిందే. కానీ, జీడీపీ 2024–25లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందంటూ ఆర్‌బీఐ గత అంచనాలను కొనసాగించడం గమనార్హం. ప్రతికూలతల విషయానికొస్తే.. పారిశ్రామికోత్పత్తి సూచీ డేటా (ఐఐపీ), పట్టణాల్లో డిమాండ్ మోస్తరు స్థాయికి చేరినట్టు ఎఫ్‌ఎంసీజీ విక్రయ గణాంకాల ఆధారంగా తెలుస్తోందని దాస్ అన్నారు. దీనికితోడు సబ్సిడీల చెల్లింపులు కూడా పెరగడం సెపె్టంబర్ త్రైమాసికం జీడీపీ (క్యూ2) గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు.
బలంగా ఆటో అమ్మకాలు
డిమాండ్ బలహీనంగా ఉండడంతో ఆటోమొబైల్ కంపెనీల ఇన్వెంటరీ స్థాయిలు పెరిగిపోవడం పట్ల చర్చ జరుగుతుండడం తెలిసిందే. ఆర్‌బీఐ గవర్నర్ దాస్ ఇదే అంశంపై స్పందిస్తూ అక్టోబర్‌లో ఈ రంగం మంచి పనితీరు చూపించిందని, 30 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. దీనికి అదనంగా వ్యవసాయం, సేవల రంగాలు సైతం మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించారు. కనుక వృద్ధి మందగిస్తుందని ప్రకటించడానికి తాను తొందరపడబోనన్నారు. భారత్ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగుపెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. ఆర్థిక వ్యవస్థకు పెద్దపులి లాంటి బలం ఉందంటూ, దీనికి ఆర్‌బీఐ చలాకీతనాన్ని అందిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.
అధిక ద్రవ్యోల్బణం.. రేట్ల కోత
అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం సెపె్టంబర్‌లో వచ్చిన 5.5 శాతం కంటే అధికంగా ఉంటుందని శక్తికాంతదాస్ సంకేతం ఇచ్చారు. ఈ నెల 12న గణాంకాలు వెల్లడి కానున్నాయి. రెండు నెలల పాటు అధిక స్థాయిలోనే కొనసాగొచ్చన్న ఆర్‌బీఐ అంచనాలను గుర్తు చేశారు. మానిటరీ పాలసీ విషయంలో ఆర్‌బీఐ తన విధానాన్ని మార్చుకోవడం (కఠినం నుంచి తటస్థానికి) తదుపరి సమావేశంలో రేట్ల కోతకు సంకేతంగా చూడొద్దని కోరారు. తదుపరి కార్యాచరణ విషయంలో ప్యానెల్‌పై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు.
దిద్దుబాటు కోసమే చర్యలు..
నాలుగు ఎన్‌బీఎఫ్‌సీలపై నియంత్రణ, పర్యవేక్షణ చర్యల గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. దేశంలో 9,400 ఎన్‌బీఎఫ్‌సీలు ఉండగా, కేవలం కొన్నింటిపైనే చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఆయా సంస్థలతో నెలల తరబడి సంప్రదింపుల అనంతరమే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీన్ని పర్యవేక్షించడం చాలా కష్టమని అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment