
పుష్కరకాలం తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)ని ముద్దాడింది. పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని 2025 విజేతగా ఆవిర్భవించింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సాంట్నర్ బృందంపై పైచేయి సాధించి అభిమానులకు కనులవిందు చేసింది.
మా స్పిన్నర్లు అద్భుతం
ఈ నేపథ్యంలో విజయానంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లే గెలుపు సాధ్యమైందని సహచరులపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆసాంతం అదరగొట్టారని కితాబులిచ్చాడు. అదే విధంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.
‘‘ఇది మా సొంత మైదానం కాదు. అయినప్పటికీ మాకు మద్దతుగా అభిమానులు ఇక్కడికి తరలివచ్చారు. మా హోం గ్రౌండ్ ఇదే అన్నంతలా మాలో జోష్ నింపారు. గెలుపుతో మేము వారి మనసులను సంతృప్తిపరిచాం.
ఫైనల్లో మాత్రమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచీ మా స్పిన్నర్లు గొప్పగా రాణించారు. దుబాయ్ పిచ్ స్వభావరీత్యా వారిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా పనిపూర్తి చేశారు. వారి నైపుణ్యాలపై నమ్మకంతో మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని నిరూపించారు. వారి బలాలను మాకు అనుకూలంగా మలచుకోవడంలో మేము సఫలమయ్యాం.
అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు
ఇక.. కేఎల్ రాహుల్(KL Rahul) గురించి చెప్పాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయడు. అందుకే మేము అతడి సేవలను మిడిల్‌లో ఎక్కువగా ఉపయోగించుకున్నాం. ఈరోజు తను బ్యాటింగ్ చేస్తున్నపుడు పరిస్థితులు మాకు అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తడబడకుండా షాట్ల ఎంపికలో సంయమనం పాటించాడు.
తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేలా చక్కటి సహకారం అందిస్తాడు. తను సరికొత్తగా కనిపిస్తున్నాడు.
నాణ్యమైన బౌలర్
ఇక వరుణ్ టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అయితే, న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో మెరిసిన తర్వాత అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అతడొక నాణ్యమైన బౌలర్.
ట్రోఫీ గెలవడంలో ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతు పాత్ర పోషించారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల రోహిత్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమీ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్(31) శుభారంభం అందించారు. విరాట్ కోహ్లి(1) విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్(48)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
76 పరుగుల వద్ద రోహిత్ స్టంపౌట్ కాగా.. అక్షర్ పటేల్(29), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) వేగంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment