
టీమిండియాపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం(Wasim Akram) ప్రశంసలు కురిపించాడు. వేదిక ఏదైనా రోహిత్ సేనకు తిరుగులేదని.. అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధిస్తున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఎల్లవేళలా తమ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌లకు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగిందని ప్రశంసించాడు.
కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి టైటిల్ సాధించింది.
బీసీసీఐ అనుసరించిన విధానాల వలనే..
అయితే, ఒకే వేదికపై ఆడటం భారత్‌కు సానుకూలంగా మారిందనే విమర్శల నేపథ్యంలో పాక్ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రం తనదైన శైలిలో స్పందించాడు. బీసీసీఐ అనుసరించిన విధానాలే టీమిండియా జైత్రయాత్రకు కారణమని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ప్రస్తుత భారత జట్టు ప్రపంచంలోని ఏ వేదికపై ఆడినా కచ్చితంగా గెలుస్తుంది.
ఒక్క ఓటమి కూడా లేకుండా
దుబాయ్‌లో ఆడినందుకు టీమిండియా లాభపడిందని చాలా మంది అంటున్నారు. కానీ పాకిస్తాన్‌లో ఆడినా రోహిత్ సేన టైటిల్ గెలిచేది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత జట్టు కూడా అన్ని టీమ్స్ మాదిరే వివిధ వేదికలకు ప్రయాణాలు చేసింది. మరి అజేయంగానే చాంపియన్‌గా నిలిచింది కదా! ఒక్క ఓటమి కూడా లేకుండా ట్రోఫీని ముద్దాడింది.
ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టుకు నిలకడకు ఇది నిదర్శనం. రోహిత్ శర్మ నాయకత్వ పటిమకు ఇదో కొలమానం. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్‌లో కనీవినీ ఎరుగని రీతిలో 3-0తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.
అంతకు ముందు శ్రీలంకకు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఇలాంటి సమయాల్లో బోర్డుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కెప్టెన్, కోచ్‌లను తొలగించాలనే డిమాండ్లు వస్తాయి. అయితే, బీసీసీఐ మాత్రం తమ సారథికి, శిక్షకుడికి అన్ని వేళలా పూర్తి మద్దతుగా నిలిచింది. అందుకు తగ్గ ఫలితాన్ని చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్‌గా నిలవడం ద్వారా పొందింది’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.
మూడోసారి ఈ ఐసీసీ టైటిల్‌ను కైవసం
కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడోసారి(2002, 2013, 2025) ఈ ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దుబాయ్‌లో ఆదివారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(40 బంతుల్లో 53 నాటౌట్) రాణించడం ద్వారా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకం(83 బంతుల్లో 76)తో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక్క విజయం కూడా లేకుండా నిష్క్రమించడం గమనార్హం.
చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్
TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL
— Star Sports (@StarSportsIndia) March 9, 2025
Comments
Please login to add a commentAdd a comment