
తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer). ప్రస్తుతం తన కాళ్లు నేలమీద నిలవడం లేదని.. ఇంతకంటే గొప్ప భావన మరొకటి ఉండదంటూ ఆనందంలో మునిగితేలుతున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్ల సంతోషం చూసి తన మనసు గాల్లో తేలిందని ఉద్వేగానికి లోనయ్యాడు.
అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరం
కాగా వన్డే ప్రపంచకప్-2023లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలతో సెంట్రల్ కాంట్రాక్టు(BCCI Cetral Contract) కూడా కోల్పోయాడు. అయితే, ఈ ముంబైకర్ తనకు ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తనను తాను సరిదిద్దుకున్నాడు.
తప్పులు సరిదిద్దుకుని..
బోర్డు ఆదేశాలను పాటిస్తూ ముంబై తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగిన శ్రేయస్.. కఠినశ్రమ, అంకితభావంతో తనను నిరూపించుకున్నాడు. వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డ ఈ ముంబై ఆటగాడు... దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ గెలిచాడు. రంజీల్లో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.
అంతేకాదు.. ఐపీఎల్-2024(IPL 2024)లో కోల్‌కతా నైట్ రైడర్స్ సారథిగా వ్యవహరించి.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సూపర్ ఫామ్‌తో పరుగులు రాబట్టాడు. తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకుని జట్టుకు విజయాలు అందించాడు.
జట్టుకు వెన్నెముకలా నిలిచి
ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించిన శ్రేయస్ అయ్యర్ ఇక్కడా అద్బుతంగా రాణించాడు. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తూ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తంగా టీమిండియా ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి శ్రేయస్ 48.60 సగటుతో 243 పరుగులు రాబట్టాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.
20 పరుగుల తేడాతో..
తద్వారా ఈ టోర్నీలో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన రచిన్ రవీంద్రకు 20 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. రచిన్ రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించి ఓవరాల్‌గా అత్యధిక పరుగుల వీరుడిగా నిలవగా.. శ్రేయస్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక ఆదివారం నాటి ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించడంలోనూ శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. కివీస్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ శుబ్‌మన్ గిల్(31), విరాట్ కోహ్లి(1) రూపంలో కీలక వికెట్లు కోల్పోయిన వేళ.. రోహిత్ శర్మ(76)తో కలిసి శ్రేయస్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 48 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. తద్వారా మరో ఓవర్ మిగిలి ఉండగానే రోహిత్ సేన టార్గెట్ పూర్తి చేసి నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
మాటలకు అందని అనుభూతి
అనంతరం చాంపియన్‌గా నిలిచిన భారత్‌కు ట్రోఫీతో పాటు విన్నింగ్స్ మెడల్స్ అందించారు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఈ అనుభూతిని మాటల్లో ఎలా వర్ణించాలో తెలియడం లేదు. నేను గెలిచిన మొదటి ఐసీసీ ట్రోఫీ ఇదే. ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఫైనల్ వరకు మా జట్టు జైత్రయాత్ర అమోఘం.
నిజం చెప్పాలంటే.. నేను ఒత్తిడిలోనే మరింత గొప్పగా రాణించగలను. సవాళ్లను ఎదుర్కోవడం నాకు భలే మజాను ఇస్తుంది. ఈ టోర్నమెంట్లో నాకు అద్భుత ఆరంభం లభించింది. దానిని అలాగే కొనసాగించాను.
అయితే, భారీ స్కోర్లు సాధించలేకపోయాను. అయినప్పటికీ జట్టు విజయాలకు నా ప్రదర్శన దోహదం చేసింది కాబట్టి ఆనందంగానే ఉన్నాను. ఇంతకంటే సంతృప్తి, సంతోషం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు.
చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment