
భారత జట్టు ‘బలం’ ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(Michael Vaughan) తలవంచాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడిన అతడే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచంలోనే గొప్ప జట్టు అని భారత్‌ను కొనియాడాడు.
‘హోం అడ్వాంటేజ్’ అంటూ విమర్శలు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో రోహిత్ సేనకు ‘హోం అడ్వాంటేజ్’ ఉంటుందని విమర్శించిన వాన్.. ఇప్పుడు ద్వితీయ శ్రేణి జట్టుతోనే టీమిండియా టైటిల్ గెలవగలదని కితాబు ఇచ్చాడు.
కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలు కాగా.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడింది.
అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల ఇతర జట్లతో పోలిస్తే భారత్‌కు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని.. అలవాటైన స్టేడియంలో ఆడటం వారికి సానుకూలాంశమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు విమర్శించారు.
అంతేగాక.. టీమిండియాతో మ్యాచ్‌ల కోసం ఇతర జట్లు పాకిస్తాన్- దుబాయ్(Dubai) మధ్య ప్రయాణాలు చేయడం కూడా ఇబ్బందికరమేనని పేర్కొన్నారు. వేదిక ఏదైనా టీమిండియాకు తిరుగు లేదంటూ సునిల్ గావస్కర్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఈ విమర్శలను తిప్పికొట్టారు.
ఏదేమైనా గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి టాపర్‌గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది.
టీమిండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది
ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ భారత జట్టు ఆట తీరును కొనియాడాడు. అదే విధంగా.. భారత్ ‘బెంచ్ స్ట్రెంత్’ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇండియా అత్యుత్తమ జట్టుగా కొనసాగుతోంది. ఈ విజయానికి వారు అర్హులు. టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే.. ఇండియా చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది.
జైస్వాల్, వర్మ, శర్మ, స్కై, పంత్, రెడ్డి, సుందర్, చహల్, అర్ష్‌దీప్, బుమ్రా, బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా ఫైనల్‌కు చేరేది. టైటిల్ కూడా గెలిచేది. వైట్‌బాల్ క్రికెట్‌లో వారి బెంచ్ బలానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదు’’ అని మైకేల్ వాన్ ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చాడు.
అతడు దూరం.. వారు బెంచ్‌కే పరిమితం
కాగా భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా చాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరం కాగా.. యశస్వి జైస్వాల్‌ను ఆఖరి నిమిషంలో తప్పించి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది మేనేజ్‌మెంట్. ఇక ఈ జట్టులో రిషభ్ పంత్‌కు స్థానం దక్కినా.. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌ను తుదిజట్టులో ఆడించారు. దీంతో పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌లదీ ఇదే పరిస్థితి.
ఇక వీరితో పాటు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరేదంటూ మైకేల్ వాన్ పేర్కొనడం విశేషం.
చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు
Comments
Please login to add a commentAdd a comment