
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఫైనల్లో టీమిండియా విజయం పట్ల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) హర్షం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్ ఆసాంతం జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు టైటిల్ గెలిచేందుకు తమ వంతు సహకారం అందించాడని తెలిపాడు. భారత జట్టులో ప్రస్తుతం ప్రతిభకు కొదువలేదని.. యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు తీసుకుంటూనే తమదైన శైలిలో ముందుకు సాగుతున్న తీరును కొనియాడాడు.
కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్.. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగిసింది. ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ పోటీపడ్డాయి. అయితే, ఆసీస్‌ను ఓడించి టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ తుదిపోరుకు అర్హత సాధించాయి.
ఈ క్రమంలో మార్చి 9 నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన ఆఖరి వరకు పోరాడి కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘ఇది అద్భుత విజయం. ఆస్ట్రేలియా పర్యటనలో చేదు అనుభవం తర్వాత పెద్ద టోర్నమెంట్ గెలవాలని మేము కోరుకున్నాం.
సరైన దిశలో
ఇలాంటి తరుణంలో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది. యువ ఆటగాళ్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. సీనియర్లుగా మేము మా అనుభవాలను వారితో పంచుకుంటున్నాం. వారు కూడా మా సలహాలు, సూచనలు తీసుకుంటూనే తమదైన శైలిలో రాణిస్తున్నారు.
జట్టు ప్రస్తుతం సరైన దిశలో వెళ్తోంది. ఈ టోర్నీ మొత్తాన్ని మేము ఆస్వాదించాం. కొంతమంది బ్యాట్‌తో రాణిస్తే.. మరికొందరు బంతితో ప్రభావం చూపారు. అంతా కలిసి జట్టు విజయంలో భాగమయ్యారు. ఐదు మ్యాచ్‌లలో ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన విధంగా రాణించి జట్టు గెలుపునకు బాటలు వేశారు. నిజంగా మాకు ఇది చాలా చాలా అద్భుతమైన టోర్నమెంట్’’ అంటూ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
కాగా ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శతకం(100 నాటౌట్)తో మెరిసిన కోహ్లి.. ఆసీస్‌తో సెమీ ఫైనల్లోనూ అద్భుత అర్ధ శతకం(84)తో రాణించాడు. అయితే టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.
ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్లో కివీస్‌ను ఓడించి అజేయంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది రెండో ఐసీసీ టైటిల్. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన హిట్‌మ్యాన్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కూడా సాధించాడు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు
👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్
👉టాస్: న్యూజిలాండ్... తొలుత బ్యాటింగ్
👉న్యూజిలాండ్ స్కోరు: 251/7 (50)
👉కివీస్ టాప్ రన్ స్కోరర్: డారిల్ మిచెల్(101 బంతులలో 63)
👉టీమిండియా స్కోరు: 254/6 (49)
👉ఫలితం: న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్‌లు,3 సిక్స్ లు 76 పరుగులు).
చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment