రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడంటూ వార్తలు.. జడ్డు రియాక్షన్‌ ఇదే! | No unnecessary Rumors: India Star Brushes Away Retirement Murmurs CT Final | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ ప్రకటనే తరువాయి అంటూ వార్తలు.. జడ్డూ రియాక్షన్‌ ఇదే!

Published Mon, Mar 10 2025 6:51 PM | Last Updated on Mon, Mar 10 2025 7:31 PM

No unnecessary Rumors: India Star Brushes Away Retirement Murmurs CT Final

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్‌ జరుగగా.. టీమిండియా విజేతగా అవతరించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ పాకిస్తాన్‌ ఒక్క గెలుపు కూడా లేకుండా నిష్క్రమించగా.. భారత్‌ ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. దుబాయ్‌ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో న్యూజిలాండ్‌(India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది.

ఆ నలుగురు.. అప్పుడూ.. ఇప్పుడూ
ఇక 2017 చాంపియన్స్‌ ట్రోఫీ నాటి భారత జట్టులో ఉన్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), హార్దిక్‌ పాండ్యా.. తాజా ఎడిషన్‌లోనూ ఆడారు. ప్రస్తుతం ఈ వన్డే టోర్నమెంట్‌ గెలిచిన జట్టుకు రోహిత్‌ కెప్టెన్‌గా ఉండగా.. మిగతా ముగ్గురు అతడితో కలిసి టీమిండియాను విజేతగా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు.

ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలించిన దుబాయ్‌ పిచ్‌పై ఆల్‌రౌండర్‌ జడ్డూ ప్రభావం చూపాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో పొదుపుగా బౌలింగ్‌ చేసిన జడ్డూ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ కీలక వికెట్లు కూల్చి టీమిండియాను విజయపథంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. 

ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లలో కలిపి 42 ఓవర్లు బౌలింగ్‌ చేసిన జడేజా.. 4.35 ఎకానమీ రేటుతో 183 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. బంతితోనే కాకుండా.. అవసరమైన వేళ బ్యాట్‌తోనూ జడ్డూ రాణించాడు. ముఖ్యంగా కివీస్‌తో ఫైనల్లో ఫోర్‌ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేసి.. ఈ టోర్నీని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. 

జడేజా రిటైర్మెంట్‌ గురించి ఊహాగానాలు
అయితే, ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో జడేజా తన బౌలింగ్‌ ఓవర్ల కోటా పూర్తి చేయగానే విరాట్‌ కోహ్లి వచ్చి జడ్డూను ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్‌ అయ్యాయి.

ఈ నేపథ్యంలో చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్‌ స్మిత్‌కు కోహ్లి హగ్‌ ఇచ్చిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. జడేజా రిటైర్మెంట్‌ గురించి ఊహాగానాలు వచ్చాయి. జడ్డూ వన్డేల్లో తన చివరి స్పెల్‌ వేసేశాడని.. ఇక రిటైర్మెంట్‌ ‍ప్రకటనే తరువాయి అన్నట్టుగా ప్రచారం సాగింది.

జడ్డు రియాక్షన్‌ ఇదే!
టీమిండియా విజయానంతరం ఈ విషయంపై స్పందించిన జడేజా.. ‘‘అనవసరంగా వదంతులు ప్రచారం చేయద్దు.. ధన్యవాదాలు’’ అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీతో పాటు సెల్యూట్‌ చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని జత చేశాడు. 

కాగా ఫైనల్లో జడ్డూ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆరు బంతుల్లో ఒక ఫోర్‌ సాయంతో తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత స్టీవ్‌ స్మిత్‌ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

అంతకంటే ముందు కోహ్లి అతడిని ఆలింగనం చేసుకోగా.. అధికారిక ప్రకటన కంటే ముందే స్మిత్‌ కోహ్లికి ఈ విషయం చెప్పాడని వార్తలు వచ్చాయి. జడ్డూ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని భావించిన వాళ్లకు తాజాగా అతడి పోస్టుతో స్పష్టతవచ్చింది.

చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్‌’ రన్‌ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement