
భారత్‌లో క్రికెట్ ఓ ‘మతం’ లాంటిది.. వేదిక ఏదైనా టీమిండియా ఆడుతోందంటే అందరూ టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఆ వెసలుబాటు లేని వాళ్లకు డిజిటల్ మీడియా రూపంలో ప్రత్యామ్నాయం ఉండనే ఉంది. ఇక ఇటీవల జరిగిన మెగా ఐసీసీ ఈవెంట్ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జియోహాట్‌స్టార్(JioHotstar)లో ప్రత్యక్ష ప్రసారం అయిన విషయం తెలిసిందే.
11 వేల కోట్ల నిమిషాలకు పైగా
ఈ నేపథ్యంలో తాజాగా ఈ టోర్నమెంట్ వ్యూయర్‌షిప్‌నకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ వన్డే టోర్నీకి 540.3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక వాచ్ టైమ్ ఏకంగా 11 వేల కోట్ల నిమిషాలకు పైగా నమోదు కావడం విశేషం. అంతేకాదు.. ఓవరాల్‌గా 6.2 కోట్ల మంది వ్యూయర్స్ ఈ మెగా ఈవెంట్‌ను వీక్షించినట్లు బ్రాడ్‌కాస్టర్ వెల్లడించింది.
కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారు. నాటి ఫైనల్లో టీమిండియాపై గెలిచి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది. అయితే, అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు ఈ టోర్నీని వాయిదా వేశారు.
ఈ క్రమంలో 2025లో తిరిగి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్(Pakistan) ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల వల్ల దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది.
కాగా పాకిస్తాన్‌లో 1996 తర్వాత ఓ ఐసీసీ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌లో మొదలైన ఈ వన్డే ఈవెంట్ మార్చి 9న భారత్- న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్‌తో ముగిసింది.
హిట్‌మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్
ఇక ఈ టోర్నమెంట్లో రోహిత్ సేన ఆది నుంచి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్... సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.
తద్వారా హిట్‌మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరింది. మరోవైపు.. ఈ వన్డే టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టును చిత్తు చేసి గెలుపు నమోదు చేయడం విశేషం. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆసీస్‌పై రన్నరప్ టీమిండియా ప్రతీకారం తీర్చుకోవడం కూడా హైలైట్‌గా నిలిచింది.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చాంపియన్స్ ట్రోఫీ-2025ని కోట్లాది మంది వీక్షించడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 540 కోట్లకు పైగా వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్' 18 నెట్‌వర్క్‌లో టీవీలో ప్రసారాలు జరుగగా.. జియోహాట్‌స్టార్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు.
అత్యధిక వ్యూస్ ఆ మ్యాచ్‌కే
కాగా మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌కు అత్యధిక వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ పోరుకు ఏకంగా 124.2 కోట్ల వీక్షణలు వచ్చాయి.
కాగా మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన వ్యూయర్‌షిప్‌లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి 38 శాతం మేర వ్యూస్ వచ్చినట్లు సమాచారం.
ఇక వైఫై సాయంతో మ్యాచ్ వీక్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు ఉంది. కాగా 16 మాధ్యమాల్లో చాంపియన్స్ ట్రోఫీని ప్రసారం చేశారు. తొమ్మిది భాషల్లో కామెంట్రీ ఇచ్చారు.
ఇక ఈ మెగా టోర్నీలో గెలవడం ద్వారా భారత్ ఖాతాలో ఏడో ఐసీసీ టైటిల్ చేరింది. 1983 వన్డే వరల్డ్‌కప్, 2002లో శ్రీలంకతో కలిసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 చాంపియన్స్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది.
కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొన్నాయి. దుబాయ్‌తో పాటు కరాచీ, లాహోర్, రావల్పిండి ఇందుకు వేదికలు.
చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా?
Comments
Please login to add a commentAdd a comment