
టీమిండియాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో విజేతగా నిలిచినందుకు భారీ క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ మెగా వన్డే టోర్నీలో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా చాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేనకు రూ. 58 కోట్ల నజరానా ఇచ్చింది.
రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావిస్తూ
ఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది.. అదే విధంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు బీసీసీఐ పంచనుంది. ఇందుకు సంబంధించి బోర్డు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియాకు రూ. 58 కోట్ల క్యాష్ రివార్డు ప్రకటిస్తున్నాం.
మెన్స్ సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది పనితీరును గుర్తిస్తూ వారిని ఇలా సత్కరిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా.. ‘‘కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబరిచింది. ఓటమన్నదే ఎరుగక నాలుగు విజయాలతో ఫైనల్ చేరింది.
తొలుత బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత పాకిస్తాన్‌పై కూడా ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. అదే జోరును కొనసాగిస్తూ న్యూజిలాండ్‌పై 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ టాపర్ అయ్యింది.
సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించింది’’ అని బీసీసీఐ తమ ప్రకటనలో రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావించింది.
అందుకే ఈ నగదు బహుమతి
ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘‘వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించడం ఎంతో ప్రత్యేకమైనది. భారత జట్టు అంకిత భావం, ప్రపంచ వేదికపై దేశానికి వారు తెచ్చి పెట్టిన కీర్తి ప్రతిష్టలకు గుర్తింపుగా నగదు బహుమతి అందజేస్తున్నాం.
ఈ గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరి సేవలను మేము గుర్తించాం. భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. అండర్-19 వుమెన్స్ వరల్డ్‌కప్‌లో మనం చాంపియన్లుగా నిలిచాం. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నాం.
దేశంలో క్రికెటింగ్ ఎకోసిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్-2024 సాధించిన రోహిత్ సేన.. ఆ టోర్నీలోనూ అన్ని మ్యాచ్‌లలో అజేయంగా నిలిచింది. నాడు బీసీసీఐ రోహిత్ సేనకు ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది.
ఎనిమిది జట్ల మధ్య పోటీ
తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయగా.. ఈసారి రూ. 58 కోట్ల బహుమతి ఇచ్చింది. ఇది ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ (భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం.
ఇక ఈ మెగా ఈవెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడింది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి.
తొలి సెమీస్‌లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించగా.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ క్రమంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య మార్చి 9న జరిగిన టైటిల్ పోరులో రోహిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత అర్ధ శతకం(76) బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: ‘రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’
Comments
Please login to add a commentAdd a comment