
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2027 వరకు హిట్‌మ్యాన్ సారథిగా కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ అసాధారణ విజయాలు సాధించాడన్న కైఫ్.. అతడు సమీపకాలంలో రిటైర్ అయ్యే ప్రసక్తి లేదని పేర్కొన్నాడు.
కాగా టీమిండియా ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వేదికగా బుధవారం ఈ మెగా టోర్నీ మొదలుకాగా.. దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ ఆడనుంది. తొలుత గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్‌లతో మ్యాచ్‌లు ఆడుతుంది.
ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ?
ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందంటూ సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో టీమిండియా ఓడిపోయినా రోహిత్ శర్మ భవిష్యత్తుకు ఢోకా ఏమీ ఉండబోదని జోస్యం చెప్పాడు.
కోచ్‌లకే ఇబ్బంది.. రోహిత్ సేఫ్
ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా.. ‘‘కెప్టెన్‌గా రోహిత్ శర్మ సాధించిన విజయాలు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వన్డే ప్రపంచకప్-2023 ఈవెంట్లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత మనవాళ్లు ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడలేదు. ఆ దేవుడి దయ వల్ల ఇలా జరుగకూడదు.. కానీ ఒకవేళ టీమిండియా గనుక చాంపియన్స్ ట్రోఫీలో గొప్పగా రాణించకపోతే కోచ్‌లు మాత్రమే ఇబ్బందుల్లో పడతారు.
అప్పటి దాకా అతడే కెప్టెన్
అయితే, రోహిత్ శర్మకు మాత్రం ఎలాంటి సమస్యా ఉండదు. టెస్టుల్లో చోటు విషయంలో స్పష్టత లేదు గానీ.. వన్డేల్లో మాత్రం అతడి స్థానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రస్తుతం అతడు ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డేల్లో విధ్వంసర సెంచరీ బాదాడు.
జట్టుకు అద్భుతమైన క్లీన్‌స్వీప్ విజయం అందించాడు. బ్యాటర్‌గా వన్డేల్లో అతడి రికార్డు గొప్పగా ఉంది. సారథిగా విజయాల శాతం కూడా ఎక్కువే. అందుకే ఈ టోర్నమెంట్లో టీమిండియా కాస్త చెత్తగా ఆడినా.. ఓడినా జట్టులో అతడి స్థానం పదిలంగానే ఉంటుంది. 2027 వన్డే వరల్డ్‌ప్ వరకు అతడు కొనసాగుతాడు’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొంటున్న భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్