
ఇంగ్లండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్(India vs England)ను ఘనంగా ముగించిన టీమిండియా తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీ కానుంది. బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. ఆత్మవిశ్వాసంతో ఈ ఐసీసీ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.
ఇక ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న.. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో.. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది.
అరుదైన రికార్డు ముంగిట హిట్‌మ్యాన్
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. దుబాయ్‌లో చరిత్ర సృష్టించేందుకు హిట్‌మ్యాన్ ఇంకా 183 పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమైన రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు.
డెబ్బై ఆరు బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రోహిత్ శర్మ... తన వన్డే కెరీర్‌లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కటక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 119 పరుగులు చేశాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లో మాత్రం పేసర్ మార్క్ వుడ్ సంధించిన సూపర్ డెలివరీని ఆడలేక.. మళ్లీ విఫలమై ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.
ఇంకో 183 పరుగులు జతచేశాడంటే
ఇక తదుపరి రోహిత్ శర్మ దుబాయ్ వేదికగా ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. కాగా దుబాయ్‌లో ఇప్పటి వరకు అతడు వన్డేల్లో 317 పరుగులు సాధించాడు. ఈ ఈవెంట్ సందర్భంగా ఇందుకు ఇంకో 183 పరుగులు జతచేశాడంటే.. దుబాయ్‌లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కుతాడు.
ప్రస్తుతం ఈ ప్రపంచ రికార్డు స్కాట్లాండ్‌కు చెందిన రిచీ బెరింగ్‌టన్ పేరిట ఉంది. అతడు ఇప్పటి వరకు దుబాయ్‌లో వన్డేల్లో 424 పరుగులు సాధించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 342 పరుగులతో భారత బ్యాటర్లలో టాప్‌లో కొనసాగుతున్నాడు.
కాగా వన్డేల్లో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతడి అత్యధిక స్కోరు 264. ఇక మొత్తంగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 260 వన్డేలు పూర్తి చేసుకుని 10988 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 338 వన్డే సిక్సర్లు ఉన్నాయి.
చాంపియన్స్ ట్రోఫీ-2025కి టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్