ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్‌ | You Are Right: Aakash Chopra On CT 2025 Could Be Kohli Rohit Last ICC event | Sakshi
Sakshi News home page

రోహిత్‌, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్‌

Published Sat, Feb 15 2025 1:17 PM | Last Updated on Sat, Feb 15 2025 3:11 PM

You Are Right: Aakash Chopra On CT 2025 Could Be Kohli Rohit Last ICC event

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్‌ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్‌ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. పాకిస్తాన్‌ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్‌ మొదలుకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌.. గ్రూప్‌-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి.

ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక 2017లో చివరగా విరాట్‌ కోహ్లి(Virat Kohli) సారథ్యంలో చాంపియన్స్‌ ట్రోఫీ ఆడిన టీమిండియా.. ఈసారి రోహిత్‌ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో బరిలో దిగనుంది. నాటి జట్టులో భాగమైన కోహ్లి, రోహిత్‌తో పాటు.. రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా కూడా ఈసారి చాంపియన్స్‌ ట్రోఫీ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు.

ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నలుగురిలో ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కాబోతుందంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మీ అంచనా వందశాతం నిజమేనని మనస్ఫూర్తిగా చెబుతున్నా.

కచ్చితంగా ఇలా జరిగే అవకాశం అయితే ఉంది. త్వరలోనే చాంపియన్స్‌ ట్రోఫీ మొదలుకానుంది.  ఆ తర్వాత వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ రూపంలో మరో ఐసీసీ టోర్నీ ఉంది. అయితే, ఈ ఈవెంట్లో టీమిండియా ఫైనల్‌కు చేరలేదు కాబట్టి.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా ఇందులో ఆడే అవకాశం లేదు.

కారణం ఇదే
ఇక మరుసటి ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరుగనుంది. అయితే, ఇప్పటికే ఈ ముగ్గురు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. కాబట్టి ఇందులోనూ వీరు భాగం కాలేరు. ఇక.. మళ్లీ 2027లో వన్డే వరల్డ్‌కప్‌ జరుగుతుంది. 

అందుకు ఇంకా చాలా సమయమే ఉంది. అప్పటికి పరిస్థితుల్లో భారీ మార్పులు రావచ్చు. కాబట్టి.. కోహ్లి, రోహిత్‌, జడేజాలకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందని చెప్పవచ్చు’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

అన్నీ బాగుండి ఆడాలని కోరుకుంటే  మాత్రం
అయితే, ఈ ముగ్గురు లేని లోటు తెలియకుండా టీమిండియా ఆడగలిగినపుడే ఇది సాధ్యమవుతుందని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ఫిట్‌గా ఉండటంతో పాటు ఫామ్‌ కొనసాగిస్తూ తమకు నచ్చినంత కాలం ఆడాలని ఫిక్సయితే మాత్రం వీరిని ఎవరూ ఆపలేరనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్‌ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. అయితే, ఐపీఎల్‌లో మాత్రం ఈ ముగ్గురూ కొనసాగుతున్నారు. ఇక రోహిత్‌ త్వరలోనే 38వ వసంతంలో అడుగుపెట్టనుండగా.. కోహ్లి, జడేజాలకు ఇప్పుడు 36 ఏళ్లు. 

చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి  భారత జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి.

చదవండి: CT 2025: సురేశ్‌ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్‌ వీరులకు నో ఛాన్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement