CT 2025: రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్‌ వీరులకు నో ఛాన్స్‌! | CT 2025: Suresh Raina Picks India playing 11 Leaves out KL Rahul Shami | Sakshi
Sakshi News home page

CT 2025: సురేశ్‌ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్‌ వీరులకు నో ఛాన్స్‌!

Published Fri, Feb 14 2025 3:58 PM | Last Updated on Sat, Feb 15 2025 1:08 PM

CT 2025: Suresh Raina Picks India playing 11 Leaves out KL Rahul Shami

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభానికి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్‌ వేదికగా ఫిబ్రవరి 19న ఈ వన్డే మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇందులో పాల్గొనే ఎనిమిది జట్ల వివరాలు వెల్లడయ్యాయి. ఇక భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) సైతం ఈ ఐసీసీ టోర్నీకి తొలుత ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో టీమ్‌ను ఖరారు చేసింది.

యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ను ఈ జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ(BCCI).. అతడి స్థానంలో ఐదో స్పిన్నర్‌గా వరుణ్‌ చక్రవర్తి(Varun Chakravarthy)ని జట్టులో చేర్చింది. అదే విధంగా.. స్టార్‌ బౌలర్‌, పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా ఇంకా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో అతడి స్థానంలో యువ పేసర్‌ హర్షిత్‌ రాణాను ఎంపిక చేసింది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత తుదిజట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తన ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదేనని ప్రకటించిన ఈ మాజీ బ్యాటర్‌.. అనూహ్యంగా వన్డే వరల్డ్‌కప్‌-2023 హీరోలను మాత్రం పక్కనపెట్టాడు.

అద్బుత ప్రదర్శన
స్వదేశంలో 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ టోర్నమెంట్లో ఆలస్యంగా అడుగుపెట్టినా అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మహ్మద్‌ షమీ. మెగా ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేశాడు.

సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టీ20, వన్డే సిరీస్‌లలో షమీ ఆడాడు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లలో ఈ బెంగాల్‌ పేసర్‌ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు.

మరోవైపు.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా ఇంగ్లండ్‌తో వన్డేల్లో ఆకట్టుకోలేకపోయాడు. అయితే, అతడిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో డిమోట్‌ చేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. సాధారణంగా ఐదో స్థానంలో వచ్చే ఈ కర్ణాటక బ్యాటర్‌ను మేనేజ్‌మెంట్‌ ఆరో స్థానంలో పంపింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల్లో రాహుల్‌(2, 10) విఫలమయ్యాడు.

రాహుల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌
అయితే, మూడో వన్డే సందర్భంగా తన రెగ్యులర్‌ ప్లేస్‌లో బ్యాటింగ్‌ చేసిన కేఎల్‌ రాహుల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌(29 బంతుల్లో 40) ఆడాడు. ఇక అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లోనూ రాహుల్‌ రాణించాడు. అయినప్పటికీ షమీతో పాటు కేఎల్‌ రాహుల్‌కు కూడా సురేశ్‌ రైనా తన చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో చోటివ్వకపోవడం గమనార్హం.

ఇక షమీని కాదని యువ పేసర్‌ హర్షిత్‌ రాణా వైపు మొగ్గు చూపిన సురేశ్‌ రైనా.. వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ స్థానంలో రిషభ్‌ పంత్‌ను ఎంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో యాజమాన్యం రిషభ్‌ పంత్‌ను పూర్తిగా పక్కనపెట్టడం గమనార్హం.

చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి.

చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి సురేశ్‌ రైనా ఎంచుకున్న తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.

చదవండి: ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement