![Plan to Play Yashasvi But: Aakash Chopra Slams BCCI Over CT 2025 Squad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Plan-to-Play-Yashasvi-But.jpg.webp?itok=lCZptjhn)
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ఖరారు చేసింది. ప్రాథమిక జట్టులో రెండు మార్పులు చేస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)ను తప్పించిన యాజమాన్యం.. జట్టులో కొత్తగా ఇద్దరు బౌలర్లకు చోటిచ్చింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) బీసీసీఐ సెలక్టర్ల తీరును విమర్శించాడు. జైస్వాల్‌పై వేటు వేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈ మాజీ ఓపెనర్.. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టడాన్నీ తప్పుబట్టాడు.
యశస్వి జైస్వాల్‌పై వేటు
కాగా జనవరి 18న బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీకి తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో యశస్వి జైస్వాల్‌తో పాటు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేర్లు కూడా ఉన్నాయి. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.
ఇక చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ఖరారు చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆయా బోర్డులకు ఫిబ్రవరి 12 వరకు గడువు ఇవ్వగా.. మంగళవారం రాత్రి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.
యశస్వి జైస్వాల్‌పై వేటు వేయడంతో పాటు బుమ్రా ఈ టోర్నీ నుంచి తప్పుకొన్నట్లు తెలిపింది. వీరి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాతో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను ప్రధాన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా భారత జట్టు గురించి ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఆఖరికి అతడికి జట్టులోనే స్థానమే లేకుండా చేశారు
ఈ మేరకు.. ‘‘బుమ్రా గైర్హాజరీ కారణంగా సెలక్టర్లు సిరాజ్ వైపు మొగ్గు చూపుతారని అనుకున్నా. అలా అయితే నలుగురు పేసర్లు జట్టులో ఉండేవారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తుదిజట్టులో యశస్విని ఆడించేందుకు శ్రేయస్ అయ్యర్‌నే పక్కనపెట్టాలని చూసిన యాజమాన్యం ఇప్పుడు కనీసం అతడికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కూడా కల్పించకపోవడం గమనార్హం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
కాగా ఇప్పటికే టెస్టుల్లో, టీ20లలో ఓపెనర్‌గా తనను తాను నిరూపించుకున్న యశస్వి జైస్వాల్.. ఇటీవల ఇంగ్లండ్‌తో స్వదేశంలో తొలి మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడు భారత ఇన్నింగ్స్ ఆరంభించగా.. వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వన్‌డౌన్‌లో వచ్చాడు.
ఇక మోకాలి గాయం వల్ల భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ధనాధన్ ఇన్నింగ్స్(36 బంతుల్లో 59) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కోహ్లి గాయం కారణంగానే
ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. కోహ్లి గాయం కారణంగానే తనకు తుదిజట్టులో చోటు దక్కిందని.. లేదంటే ఈ మ్యాచ్‌లో తాను భాగమయ్యేవాడినే కాదని తెలిపాడు.
అంటే.. జైస్వాల్‌ను ఆడించే క్రమంలో అయ్యర్‌ను తప్పించేందుకు కూడా మేనేజ్‌మెంట్ వెనుకాడలేదని తేలింది. అయితే, తాజాగా జైసూను చాంపియన్స్ ట్రోఫీ ప్రధాన జట్టు నుంచి తీసేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.
ఇదిలా ఉంటే.. అరంగేట్ర వన్డేలో జైస్వాల్ విఫలమయ్యాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు ఫోర్ల సాయంతో 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ల సందర్భంగా సత్తా చాటిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఏకంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించారు.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
చదవండి: Chris Gayle: అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే
Comments
Please login to add a commentAdd a comment