IND Vs ENG: నరాలు తెగే ఉత్కంఠ: టీమిండియా ధనాధన్‌ షో.. .. దర్జాగా ఫైనల్‌కు | T20 World Cup 2026 IND Vs ENG Semis, India Beat England In Thriller Match And Enters Into Final, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

IND Vs ENG Semis: నరాలు తెగే ఉత్కంఠ: టీమిండియా ధనాధన్‌ షో.. .. దర్జాగా ఫైనల్‌కు

Mar 5 2026 10:50 PM | Updated on Mar 6 2026 5:38 PM

T20 World Cup 2026 Semis: India Beat England Thriller Enters Final

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్‌.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది.

253 పరుగులు
ముంబైలోని వాంఖడేలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మరోసారి ధనాధన్‌ దంచికొట్టాడు. 42 బంతుల్లో 89 పరుగులతో ఈ వికెట్‌ కీపర్‌బ్యాటర్‌ అదరగొట్టాడు.

వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39) కూడా వేగంగా ఆడగా.. ఆల్‌రౌండర్లు శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపులు మెరిపించారు. తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21) సైతం రాణించాడు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్‌ జాక్స్‌, ఆదిల్‌ రషీద్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్‌కు ఒక వికెట్‌ దక్కింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఆదిలోనే ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (5), వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (7)​ వికెట్లు కోల్పోయింది.

పట్టువదలని విక్రమార్కుడిలా
ఇక టామ్‌ బాంటన్‌ (17) కాసేపు నిలబడగా.. జోస్‌ బట్లర్‌ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా జేకబ్‌ బెతెల్‌ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం బాది.. టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఫిన్‌ అలెన్‌ (న్యూజిలాండ్‌) రికార్డు సమం చేశాడు.

నరాలు తెగే ఉత్కంఠ
అదే జోరు కొనసాగిస్తూ బెతెల్ భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో  బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి.. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లలో ఇంగ్లండ్‌ విజయ సమీకరణం  39 పరుగులుగా మారింది.

అయితే, హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో పందొమ్మిదో ఓవర్లో సిక్స్‌ బాది బెతెల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. దీంతో ఉత్కంఠ పెరిగింది. అయితే, పాండ్యా మూడో బంతికి సామ్‌ కర్రాన్‌ (18)ను అవుట్‌ చేశాడు. పాండ్యా బౌలింగ్‌లో కర్రాన్‌ బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న తిలక్‌ అద్భుతంగా క్యాచ్‌పట్టాడు.

ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో
తన ఓవర్లో పాండ్యా 9 పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్‌ గెలుపునకు 30 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బంతిని శివం దూబేకు ఇచ్చాడు.  అతడి ఓవర్లో తొలి బంతికే బెతెల్‌ (105) రనౌట్‌ అయ్యాడు. దీంతో ఐదు బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. ఆర్చర్ ఆఖరి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టినా లాభం లేకుండా పోయింది. 

ఇంగ్లండ్‌ 22 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.  ఇక అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో ట్రోఫీ కోసం సూర్యకుమార్‌ సేన తలపడుతుంది.

 

 స్కోర్లు: 
భారత్ - 253/7(20)
ఇంగ్లండ్ - 246/7(20)
ఫలితం: ఏడు పరుగుల తేడాతో భారత్ గెలుపు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement