ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champion Trophy-2025) ముందు ఇంగ్లండ్‌కు (England) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ జేకబ్ బేతెల్ (Jacob Bethell) గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ధృవీకరించాడు. బేతెల్ లాంటి ప్రామిసింగ్ ఆల్‌రౌండర్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడం దురదృష్టకరమని బట్లర్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బేతెల్ సేవలు కోల్పోనుండటంపై విచారం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ బేతెల్‌కు కవర్‌గా టామ్ బాంటన్‌ను ఎంపిక చేసింది.21 ఏళ్ల బేతెల్ ఇటీవలే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పెద్దగా రాణించలేని బేతెల్.. నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీ సహా వికెట్ తీసుకున్నాడు. గాయం కారణంగా బేతెల్ భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆడలేదు.తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లండ్ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడనుంది. కరాచీలో జరిగే ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలువుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో ఉండగా.. భారత్, పాక్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో పోటీపడనున్నాయి. మెగా టోర్నీలో భారత్, పాక్‌ల సమరం ఫిబ్రవరి 23న జరుగనుంది.రెండో వన్డేలోనూ భారత్‌దే విజయంమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు తొలి వన్డేలోనూ నెగ్గిన భారత్.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా భారత్ 4-1 తేడాతో గెలుపొందింది.రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65), జో రూట్ (69) అర్ద సెంచరీలతో రాణించారు. సాల్ట్ 26, హ్యారీ బ్రూక్ 31, బట్లర్ 34, లివింగ్‌స్టోన్ 41, ఆదిల్ రషీద్ 14 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ దక్కించుకున్నారు.సెంచరీతో చెలరేగిన రోహిత్ఛేదనలో రోహిత్ శర్మ (119) సెంచరీతో చెలరేగడంతో భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (60), శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41 నాటౌట్) రాణించారు. విరాట్ కోహ్లి (5) మరోసారి నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ 10, హార్దిక్ పాండ్యా 10 పరుగులకు ఔటయ్యారు. రవీంద్ర జడేజా (11 నాటౌట్) సాయంతో అక్షర్ భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు. నామమాత్రపు మూడో వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరుగనుంది.