
సౌతాంప్టన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు జూలు విధిల్చారు. సిరీస్ కోల్పోయిన కసిని ఆఖరి మ్యాచ్‌లో చూపించేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
తొలుత ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెన్ డకెట్(31), జేమీ స్మిత్(48 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 62) తొలి వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ జో రూట్(96 బంతుల్లో 6 ఫోర్లతో 100), యువ ఆటగాడు జాకబ్ బెతల్( 82 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 110) సెంచరీలతో కదం తొక్కారు.
వీరిద్దరూ మూడో వికెట్‌కు 181 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రూట్ ఆచితూచి ఆడితే.. స్మిత్ మాత్రం టీ20 తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. బెతల్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. వీరిద్దరూ ఔటయ్యాక జోజ్ బట్లర్(62 నాటౌట్), విల్ జాక్స్ మెరుపులు మెరిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా అరంగేట్ర పేసర్ యూసఫ్ వికెట్ ఏమీ తీయకుండా 80 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించిన ఇంగ్లండ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సార్లు 400కు పైగా స్కోర్లు సాధించిన రెండో జట్టుగా టీమిండియా సరసన ఇంగ్లండ్ నిలిచింది. ఇంగ్లండ్ 7 సార్లు 400 ప్లస్ స్కోర్లు చేయగా.. భారత్ కూడా సరిగ్గా ఏడు సార్లు 400కు పైగా స్కోర్లు నమోదు చేసింది. ఈ జాబితాలో సౌతాఫ్రికా (8 సార్లు) అగ్రస్ధానంలో ఉంది.
చదవండి: ఖాళీ కడుపుతోనే పాక్‌పై సెంచరీ చేశా: వీరేంద్ర సెహ్వాగ్