
కోహ్లి- పాటిదార్ (PC: RCB)
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడం గిల్‌క్రిస్ట్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి తానెప్పుడూ వ్యతిరేకం కాదని పేర్కొన్నాడు. అయితే, ఆర్సీబీలో ఓ దేశానికి చెందిన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని.. అందుకే ఈసారి ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలుస్తుందంటూ వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేశాడు.
నాయకుడిగా రజత్ పాటిదార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ శనివారం (మార్చి 22)ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-2025కి తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతాతో పాటు ఆర్సీబీకి కూడా ఈసారి కొత్త కెప్టెన్ వచ్చాడు. కేకేఆర్‌కు అజింక్య రహానే సారథ్యం వహించనుండగా... బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకుడిగా వ్యవహరించనున్నాడు.
ఈసారి చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీ
ఈ నేపథ్యంలో ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతున్న ఆసీస్ దిగ్గజం గిల్‌క్రిస్ట్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈసారి ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉండే జట్టు ఏది? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆ జట్టులో అనేక మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉన్నారు.
కాబట్టి.. వాస్తవాల ఆధారంగానే నేను ఈ మాట చెబుతున్నా. ఈసారి చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీ. వాళ్లకే ఈసారి ఆఖర్లో ఉండే అర్హతలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’ అని పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో ఆర్సీబీ, కోహ్లి అభిమానులకు గిల్‌క్రిస్ట్ క్షమాపణలు కూడా చెప్పడం విశేషం.
మనస్ఫూర్తిగా క్షమాపణలు
‘‘విరాట్ లేదంటే.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు నేను వ్యతిరేకం కాదు. ఇలా మాట్లాడినందుకు వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. కానీ మీ రిక్రూట్‌మెంట్ ఏజెంట్లకు మీరైనా చెప్పండి.
ఆటగాళ్ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అత్యంత ముఖ్యం’’ అని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ ప్లేయర్ల ప్రదర్శన అంతగొప్పగా ఉండదని.. ఈసారి వారి వల్ల ఆర్సీబీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
కాగా మెగా వేలం-2025 సందర్భంగా ఆర్సీబీ.. ఇంగ్లండ్ స్టార్లు లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెతెల్, ఫిల్ సాల్ట్ తదితరులను కొనుగోలు చేసింది. సాల్ట్ ఈసారి కోహ్లితో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.
కాగా ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు జట్టుకు రెండుసార్లు ట్రోఫీని దూరం చేసిన జట్టు హైదరాబాద్. 2009లో ఆడం గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలో నాటి దక్కన్ చార్జర్స్.. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఫైనల్లో ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాయి.
ఇక ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన ఈ జట్టు.. ఈసారి టైటిల్ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది.
ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండగే, జేకబ్ బెతెల్, దేవ్‌దత్ పడిక్కల్, స్వస్తిక్‌చికార, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠీ.
చదవండి: 44 బంతుల్లో శతక్కొట్టిన పాక్ ఓపెనర్.. 9 వికెట్ల తేడాతో చిత్తైన న్యూజిలాండ్
Comments
Please login to add a commentAdd a comment