Cash reward
-
తగ్గుతున్న జనాభా.. చైనా కీలక నిర్ణయం..
చైనాలో జననాల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతూ యుక్తవయస్సు వారు తగ్గిపోతున్నారు. యుక్త వయస్కులు పెళ్లికి దూరంగా ఉండటమే దీనికి కారణం అని గుర్తించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లికూతురు వయస్సు 25 ఏళ్లు, అంతకంటే తక్కువగా ఉంటే రూ.11,340 నగదును కానుకగా ఇవ్వనుంది. ఈ మేరకు హాంకాంగ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రోత్సాహంతోనైనా యువత త్వరగా పెళ్లి చేసుకుని జననాల సంఖ్యను పెంచుతారని ప్రభుత్వం భావిస్తోంది. సరైన వయస్సులో చేసుకునే మొదటి పెళ్లికి మాత్రమే ఈ కానుక వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. చైనాలో గత ఆరు దశాబ్దాలుగా జనాభా రేటు ఘణనీయంగా తగ్గిపోతోంది. వృద్దుల సంఖ్య పెరుగుదలతో ఆందోళన చెందుతున్న అధికారులు.. జననాల సంఖ్యను పెంచడానికి అనేక చర్యలను తీసుకుంటున్నారు. చైనాలో సాధారణంగా పెళ్లికి కనీస వయ్సస్సు అబ్బాయికి 22, అమ్మాయికి 20గా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ పెళ్లి చేసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఆర్థికపరమైన చిక్కులతో పాటు ఒంటరి మహిళలు పిల్లలను కనే చట్టాలను ప్రభుత్వం కఠినతరం చేయడంతో జననాల సంఖ్య తగ్గిపోయింది. 2022లో వివాహాల సంఖ్య 68 లక్షలు కాగా.. 1986 తర్వాత ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. 2021 కంటే 2022లో 8 లక్షల వివాహాలు తక్కువగా అయ్యాయి. జననాల రేటులో ప్రపంచంలోనే అతి తక్కువ స్థానానికి చైనా చేరుకుంది. 2022లో రికార్డ్ స్థాయిలో 1.09గా నమోదు కావడం గమనార్హం. పిల్లల సంరక్షణకు అధిక ఖర్చు కావడం వల్ల చాలా మంది తల్లులు ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు. అదీగాక మహిళల పట్ల వివక్ష కూడా ఇందుకు శాపంగా మారింది. ఇదీ చదవండి: 3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి -
బరువు తగ్గితే రూ.10 లక్షలు.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్
ముంబై: జెరోడా అనే ఆన్లైన్ బ్రోకరేజీ కంపెనీ ఉద్యోగులకు సీఈఓ నితిన్ కామత్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బరువు తగ్గితే మంచి ఇన్సెంటివ్‌లు ఇస్తారట. అంతేకాదు, ఒక లక్కీ విజేతకు ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. ఇందుకోసం వారు రోజుకు కనీసం 350 క్యాలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ఏడాది పాటు శ్రమించి లక్ష్యంలో 90 శాతం సాధించిన వారందికీ నెల వేతనం బోనస్‌గా ఇస్తారు! దీనికి తోడు రూ.10 లక్షల బంపర్ బొనాంజా ఉండనే ఉంది! దాంతో ఈ ఫిట్నెస్ చాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకుని ఉద్యోగులంతా గట్టిగానే శ్రమిస్తున్నారట. అన్నట్టూ, ఎవరు ఏ మేరకు కొవ్వు కరిగిస్తున్నదీ కంపెనీ తాలూకు ఫిట్నెస్ ట్రాకర్ గమనిస్తుంటుందట. ఉద్యోగుల ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ కంపెనీకి కొత్తేమీ కాదట. 25 కంటే తక్కువ బీఎంఐ ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే సగం నెల వేతనం బోనస్‌గా ఇస్తోంది!! వర్క్ ఫ్రం హోం వల్ల స్థూలకాయం తెచ్చుకుని అనారోగ్యం పాలు కావొద్దన్నదే తమ ఉద్దేశమంటున్నారు కామత్. కరోనా కాలంలో పెరిగిన బరువును తానెలా తగ్గించుకున్నదీ చెబుతూ ఉద్యోగులను మోటివేట్ చేస్తున్నారు. -
కల్నల్ సంతోష్‌బాబు సతీమణికి రూ.1.25 కోట్లు
సాక్షి, హైదరాబాద్: చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు సతీమణి బిక్కుమళ్ల సంతోషికి రూ.1.25 కోట్ల నగదు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. సంతోష్‌బాబు మరణానంతరం ప్రతిష్టాత్మకమైన ‘మహావీర్ చక్ర’ పురస్కారానికి ఎంపికైనందున.. నిబంధనల మేరకు ఈ నగదును మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బి.సంతోషికి ఈ నగదును అందజేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. (క్లిక్: దేవుడు అన్యాయం చేసినా.. సీఎం న్యాయం చేస్తున్నారు) -
ఈ చిలుకను పట్టిస్తే రూ.5 వేలు.. ‘దయచేసి ఇచ్చేయండి ప్లీజ్’
చాలా మందికి పెంపెడు జంతువులు అంటే ప్రాణం. వాటిని ఇంట్లో పెంచుకోవడానికి తెగ ఇష్టపడతారు. వాటికి ఏలోటు రాకుండా మనుషులతో సమానంగా చూసుకుంటారు. ఎక్కువగా కుక్కలు, పిల్లలు, కొంతమంది చిలుకలు కూడా పెంచుకుంటారు. పెంపుడు జంతువులు కూడా తమ యజమానులపై ఎనలేని ప్రేమను చూపుతున్నాయి. తాజాగా ఓ కుటుంబం తాము ప్రేమగా పెంచుకుంటున్న చిలుక కనిపించకపోవడంతో ఊరంతా గోడలపై పోస్టర్లు అతికించారు. అంతేగాక చిలుకను పట్టించిన వారికి క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. గయాకు చెందిన శామ్‌దేవ్ గుప్తా, సంగీత గుప్తా పిప్పరపాటి రోడ్డులో నివసిస్తున్నారు. వీరు గత 12 ఏళ్లుగా ‘పోపో’ అనే చిలుకను పెంచుకుంటున్నారు. అ క్రమంలో గత నెల ఏప్రిల్ 5న ఆ చిలుక తమ ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చిలుక ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చెట్ల దగ్గరికి వెళ్లి, తాము రోజూ మాట్లాడుకునే భాషలో పిలుస్తున్నామని, అయినా అది దొరకడం లేదని వాపోయారు. ఎవ్వరికీ అయినా కనిపిస్తే తమకు అప్పగించాలని కోరుతున్నారు. చిలుకను ఆచూకీ తెలిపిన వారికి రూ.5,100 రివార్డు ప్రకటించారు. ఈ దంపతులు కేవలం పోస్టర్లకు మాత్రమే పరమితం కాలేదు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా తన పక్షిని తీసుకెళ్తే దయచేసి తమకు అప్పగించాలని కోరారు. వారికి అదనంగా మూడు పక్షలు కొనిస్తానని ఆఫర్ ఇచ్చారు. అది కేవలం పక్షి మాత్రమే కాదని తమ కుటుంబంలో ఓ సభ్యడని తెలిపారు. -
పారాలింపిక్స్ పతకధారులకు రూ.10 కోట్ల భారీ నజరాన
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన షూటర్లకు హర్యానా ప్రభుత్వం శనివారం భారీ నజరానా ప్రకటించింది. 50 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో మనీష్ నర్వాల్ బంగారు పతకం సాధించగా, సింఘ్ రాజ్ అధనా రజత పతకం కైవసం చేసుకున్నాడు. గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న మనీష్ నర్వాల్‌కు రూ .6 కోట్లు, రజత పతకం సాధించిన సింఘ్ రాజ్ అధనాకు రూ.4 కోట్లు రివార్డు ను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. పతకాలు గెలిచిన ఈ ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వనున్నట్లు హర్యానా సర్కార్ ప్రకటించింది. కాగా అంతకముందు పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్ ఆంటిల్‌కు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రూ .6 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. డిస్కస్ త్రో ఎఫ్ -56 లో రజత పతకం సాధించినందుకు యోగేష్ కథునియాకు కూడా రూ. 4 కోట్ల రివార్డును ఆయన ప్రకటించారు. ఈ ఇద్దరు అథ్లెట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. చదవండి: Tokyo Paralympics 2021: భారత్ ఖాతాలో మరో బంగారు పతకం.. -
టోక్యో ఒలింపిక్స్ విజేతలకు రివార్డు ప్రకటించిన బీసీసీఐ
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లోని పతకాలు సాధించిన క్రీడాకారులపై దేశ వ్యాప్తంగా ప్రశంసలతో పాటు, రివార్డుల జల్లు కురుస్తోంది. తాజాగా టోక్యో ఒలింపిక్స్ విజేతలకు బీసీసీఐ భారీ రివార్డు ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన నీరజ్ చోప్రాకు రూ.కోటి, వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం పతకం గెలిచిన మీరాబాయి చాను, రెజ్లింగ్‌లో రజతం సాధించిన రవికుమార్ దహియాకు రూ.50లక్షలు చొప్పున.. పీవీ సింధు- కాంస్యం( బాడ్మింటన్), లవ్లీనా బొర్గోహెయిన్- కాంస్యం( బాక్సింగ్), భజరంగ్ పూనియా- కాంస్యం(రెజ్లింగ్)కు రూ.25లక్షల చొప్పున, కాంస్యం పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు రూ.1.25 కోట్ల రివార్డును బీసీసీఐ ప్రకటించింది. అదే విధంగా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నీరజ్ చోప్రాకు రూ.2 కోట్ల రివార్డు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఇప్పటికే హరియాణాకు చెందిన అథ్లెట్ నీరజ్ చోప్రాకు హరియాణా సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. అతడికి 6 కోట్ల రూపాయల నగదు బహుమానంతోపాటు.. క్లాస్-1 గ్రేడ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. -
Mirabai Chanu: ‘మణి’పూస చానుకు భారీ నజారానా
ఇంఫాల్: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొంది త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన మీరాబాయి చానుకు సొంత రాష్ట్రం మణిపూర్ భారీ నజారానా ప్రకటించింది. ఆమెకు రూ.కోటి నగదు బహుమతిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ శనివారం ప్రకటించారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. స్నాచ్‌లో 87 కేజీలు ఎత్తిన మీరాబాయి, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్ ఎత్తింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. చివరకు రజత పతకం సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆమె విజయంతో భారతదేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె సొంత రాష్ట్రం మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చానును అభినందించారు. అంతకుముందు బిరేన్ సింగ్ విజేతగా నిలిచిన మీరాబాయి చానుతో వీడియో కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు అద్భుతంగా పేర్కొన్నారు. So good to speak to our Champion @mirabai_chanu today.@narendramodi @AmitShah @ianuragthakur @JPNadda @blsanthosh pic.twitter.com/1phL16ibh3 — N.Biren Singh (@NBirenSingh) July 24, 2021 -
యూపీ అథ్లెట్లకు సీఎం యోగి బంపర్ ఆఫర్..
వారణాసి: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో పాల్గొనే ఉత్తరప్రదేశ్ అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు ప్రోత్సహకాలు ప్రకటించారు. వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధిస్తే రూ. 6 కోట్లు, రజతం గెలిస్తే రూ. 4 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ . 2 కోట్ల చొప్పున నగదు బహుమతిగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. టీమ్ ఈవెంట్లలో స్వర్ణం గెలిచే క్రీడాకారులకు మూడేసి కోట్లు, రజతానికి రెండు, కాంస్యానికి కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఒలింపిక్స్‌లో పాల్గొననున్న క్రీడాకారులందరికీ రూ.10లక్షల చొప్పున నగదు ఇస్తామని సీఎం యోగి తెలిపారు. విశ్వక్రీడలకు సన్నద్ధమయ్యేందుకు ఈ నగదు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్‌లో యూపీకి చెందిన పది మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరికి షూటర్ సౌరభ్ చౌదరీ నాయకత్వం వహిస్తున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్ కోసం ఈ నెల 17న భారత తొలి బృందం బయల్దేరనుంది. 14నే ఈ బృందాన్ని పంపాలని భారత ఒలింపిక్ సంఘం భావించినప్పటికీ.. ఒలింపిక్స్ నిర్వాహకుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో 17వ తేదీన భారత బృందం టోక్యోకు వెళ్లనుంది. ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నాక మూడు రోజులు క్రీడాకారులందరూ క్వారంటైన్లో ఉండాలి. మిగతా క్రీడాకారులు మరో రెండు రోజుల తర్వాత టోక్యోకు వెళ్తారు. మరోవైపు ప్రస్తుతం క్రొయేషియాలో ఉన్న భారత షూటింగ్ జట్టు 16న టోక్యోకు బయల్దేరనుంది. మొత్తంగా భారత్ నుంచి 120కి పైగా అథ్లెట్లు విశ్వక్రీడలకు వెళ్లనున్నారు. -
రివార్డు మొత్తం పెరిగింది!
సాక్షి, సిటీబ్యూరో: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బంది అందించే క్యాష్ రివార్డ్ మొత్తాలు గణనీయంగా పెరిగాయి. ఎన్నో ఏళ్లుగా నామ్‌కే వాస్తేగా ఉండిపోయిన ఈ మొత్తాన్ని పెంచాలంటూ గత ఏడాది నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు ఓ సమగ్ర ప్రతిపాదనలు రూపొందించారు. కేవలం సిటీని మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం తయారు చేసిన ఈ ఫైల్ డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి పంపింది. వీటిని అన్ని కోణాల్లో పరిశీలించిన సర్కారు ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇటీవల వెలువడటంతో రివార్డుగా ఇచ్చే క్యాష్ పరిమితి అమలులో ఉన్న దానికి గరిష్టంగా పదిరెట్లు పెరిగింది. పోలీసు విభాగంలో ప్రస్తుతం కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు మాత్రమే క్యాష్ రివార్డులు అందుకోవడానికి అర్హులుగా ఉండేది. ఆపై స్థాయి వారికి వీటిని అందుకునే అవకాశమే లేదు. ఈ రివార్డులు అందించే విధానం ఏళ్లుగా అమలులో ఉంది. ఒకప్పుడు ఈ మొత్తాలు మరీ దారుణంగా ఉండేవి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 2002లో ఆఖరిసారిగా సవరించారు. ఆ తర్వాత సవరణ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం రివార్డు అందుకున్నట్లు వారి సర్వీసు రికార్డుల్లోకి వెళ్తోంది. అయితే ఆ మొత్తం ఎంతన్నది మాత్రం ఎదుటి వారికే కాదు కనీసం కుటుంబీకులకు కూడా చెప్పుకోవడానికే సిగ్గుపడేలా ఉండేది. ఈ రివార్డు మొత్తాన్ని డీసీపీ (ఎస్పీ) నుంచి జేసీపీ (డీఐజీ) అదనపు సీపీ (ఐజీ), కమిషనర్ (అదనపు డీజీ) స్థాయి అధికారులు ప్రకటిస్తుంటారు. కానిస్టేబుల్‌కు డీసీపీ, ఎస్సైలకు జేసీపీ, ఇన్స్పెక్టర్లకు ఐజీలు రివార్డులు ప్రకటిస్తారు. పోలీసు కమిషనర్‌కు వీరిలో స్థాయి వారికైనా రివార్డు ఇచ్చే అధికారం ఉంది. ఓ కేసు ఛేదన, నేరగాడిని పట్టుకోడానికి సంబంధించి ఒకరికైనా, బృందానికైనా డీసీపీ గరిష్టంగా రూ.750, సంయుక్త పోలీసు కమిషనర్ (జేసీపీ) రూ.1000, అదనపు సీపీ రూ.1500, సీపీ రూ.2000 మాత్రమే మంజూరు చేయలగలిగే వారు. డీసీపీ నుంచి సీపీ వరకు అంతా కలిసి పెద్ద మొత్తం కింద ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. ఒక పనికి సంబంధించి ఒకరు మాత్రమే రివార్డు ప్రకటించాలి. సాధారణంగా కమిషనరేట్లలో డీసీపీ, జిల్లాల్లో ఎస్పీలే నగదు రివార్డులు ప్రకటిస్తుంటారు. దీని ప్రకారం వీరు గరిష్టంగా రూ.750 మాత్రమే మంజూరు చేయగలరు. దీనిని పరిగణలోకి తీసుకున్న నగర సీసీఎస్ పోలీసులు డీసీపీకి రూ.3 వేలు, జేసీపీకి రూ.4 వేలు, అదనపు సీపీ రూ.6 వేలు, సీపీ రూ.8 వేల వరకు మంజూరు చేసేలా ప్రతిపాదనలు రూపొందించి డీజీపీ కార్యాలయానికి పంపారు. డీజీపీ స్థాయి అధికారి తాను కోరుకున్న స్థాయి అధికారులకు గరిష్టంగా రూ.50 వేల వరకు రివార్డు ఇచ్చేలా ప్రతిపాదించారు. సీసీఎస్ పోలీసుల పంపిన ప్రతిపాదనల్ని పరిగణలోకి తీసుకున్న డీజీపీ కార్యాలయం కొన్ని మార్పుచేర్పులు చేస్తూ ప్రభుత్వానికి నివేదించింది. వీటిని సమగ్రంగా అధ్యయనం చేసిన హోమ్ శాఖ రివార్డుల మొత్తం పెంపు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రస్తుతం అమలులో ఉన్న మొత్తాలకు దాదాపు పది రెట్ల వరకు ప్రతిభ చూసిన అధికారులు, సిబ్బందికి రివార్డుగా ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడింది. దీంతో పాటు పనితీరు ఆధారంగా ఇన్స్పెక్టర్ కంటే పై స్థాయి వారికీ ఉన్నతాధికారులు రివార్డులు అందించడానికీ ఆస్కారం ఏర్పడింది. -
జపాన్ కుబేరుడు సంచలన నిర్ణయం
టోక్యో : జపాన్ కుబేరుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అత్యధిక ధనవంతుడు, ఫ్యాషన్ డిజైన్ ఇండస్ట్రీ దిగ్గజం యుసాకు మేజావా తన ఫాలోవర్స్‌కి ఏకంగా రూ. 64.36 కోట్లు పంచిపెట్టడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకో తెలిస్తే ఆశ్యర్యం కలుగుతుంది. సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఆయన తన ట్విటర్లో అనుచరులు వెయ్యిమందికి ఈ నగదును పంచిపెట్టనున్నారు. 6.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న యుసాకు మేజావా జనవరి 1వ తేదీన ట్విటర్లో తన పోస్ట్‌ను రీట్వీట్ చేసిన వెయ్యిమంది ఫాలోవర్స్‌ను ఎంపిక చేసి వారికి 9 మిలియన్ డాలర్లు ( సుమారు రూ .64.36 కోట్లు) అందజేయనున్నామని ప్రకటించడం విశేషం. జపాన్ లో రెండవ అతిపెద్ద షాపింగ్ సంస్థ జోజో ఇంక్ వ్యవస్థాపకుడైన యుసాకు చేసిన ఈ ట్వీట్ రికార్డు స్థాయిలో 3.8 మిలియన్ల షేర్లను సాధించింది. 9 లక్షలకుపై పైగా లైక్‌లు కొట్టేసింది. అంతేకాదు జనవరి 7 నాటికి అత్యధిక సార్లు రీట్వీట్ అయిన ట్వీట్‌గా నిలిచింది. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ (బీఐ) భావనను నిశితంగా అర్థం చేసుకోవడంలో భాగమే ఈ ప్రయత్నమని యుసాకు మేజావా ట్విటర్లో వివరించారు. తాను పెద్ద రాజకీయ నాయకుడిని కానందున ప్రజల కనీసం ఆదాయంపై ఇంతకుమించి తానేమీ చేయలేనని వరుస ట్వీట్లలో చెప్పుకొచ్చారు. అంతేకాదు జపాన్ ప్రభుత్వం, కనీస ఆదాయ పథకాన్ని...అంటే ప్రతి నెలా పౌరులకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించే ఒక విధానం ప్రవేశ పెట్టవలసిన అవసరాన్ని వివరించారు. మరోవైపు అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యాంగ్ఇ లాంటి పథకాన్ని ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. తాను ఎన్నికైతే 18 ఏళ్లలోపు ప్రతి వయోజన అమెరికన్‌కు నెలకు వెయ్యి డాలర్లు ఇస్తానని వాగ్దానం చేశారనీ, ఆయననే యుసాకా ఫాలో అయ్యారని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. కాగా మేజావా ఇటీవల 2023లో ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్లో చంద్రయానానికి సంతకం చేసిన మొదటి ప్రైవేట్ ప్రయాణీకుడిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో యుసాకు (ఫైల్ ఫోటో) -
చారిత్రక విజయానికి బీసీసీఐ నజరానా!
ముంబై : ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నజరానా ప్రకటించింది. జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలు, రిజర్వ్ ఆటగాళ్లకు రూ.7.5 లక్షలు చొప్పున నగదు బహుమానం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఆగాళ్లకే కాకుండా కోచ్‌లకు సైతం రూ.25 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. సపోర్టింగ్ స్టాఫ్‌కు వేతనంతో సమానమైన నజరానా అందజేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఆటగాళ్లు అందుకోబోయే నగదు బహుమానం మ్యాచ్ ఫీజుకి సమానం కాగా.. ఆటగాళ్ల కంటే కోచ్‌లకు ఇచ్చే నజరానా ఎక్కువగా ఉండటం గమనార్హం. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా కోహ్లిసేన 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుని 72 ఏళ్ల కలను నెరవేర్చిన విషయం తెలిసిందే. -
ఆ గోరక్షకులను గుర్తిస్తే నగదు రివార్డు!
గో సంరక్షణ పేరిట 55 ఏళ్ల పెహ్లూ ఖాన్‌ను కిరాతకంగా చంపిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజస్థాన్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పెహ్లూ ఖాన్‌ను కొట్టిచంపిన 'గోరక్షకుల' గురించి ఎవరైనా సమాచారం ఇస్తే.. వారికి రూ. 5వేల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఆరుగురు దుండగులను గుర్తించారు. హర్యానాకు చెందిన పెహ్లూ ఖాన్ రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా మీదుగా గోవులను వాహనంలో తరలిస్తుండగా.. ఆయన బృందంపై రహదారిపై మాటువేసిన గోరక్షకులు అత్యంత దారుణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్‌కు చెందిన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ దాడిలో నలుగురు గాయపడగా.. తీవ్రంగా గాయపడిన పెహ్లూ ఖాన్ అల్వార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ అమానుష దారుణంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పవర్ లిఫ్టర్‌కు ఐదు లక్షల చెక్కు
కొత్తగూడెం రూరల్: రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో జరిగిన జూనియర్ ఆసియా పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించిన వి.లావణ్యగౌడ్‌కు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రూ.5 లక్షల చెక్కు అందజేశారు. కొత్తగూడెంలో వ్యాయామశాల నిర్వహిస్తున్న లావణ్యగౌడ్‌కు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఈ చెక్కును అందించింది. ఈ కార్యక్రమంలో పవర్ లిప్టింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మల్లేశ్, నేతాజీ వ్యాయామశాల కోచ్ కుంచన కృష్ణారావు, టీఆర్ఎస్ నాయకులు జీవీకే మనోహర్, కంచర్ల చంద్రశేఖర్, నాగేంద్రత్రివేది, అక్బర్ పాల్గొన్నారు. -
ఆ డ్రోన్‌ను పట్టిస్తే లక్ష
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంపై అనుమానాస్పదంగా పలుమార్లు చక్కెర్లు కొట్టిన డ్రోన్ వివరాలను వెల్లడిస్తే రూ.లక్ష ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ విషయంలో ఎంత త్వరగా సమాచారం అందిస్తే అంత సహాయం చేసినట్లవుతుందని అన్నారు. గత అక్టోబర్ 27న ఓ డ్రోన్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో నాలుగైదు సార్లు కనిపించింది. అది పలు అనుమానాలు రేకెత్తించింది. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అది వ్యతిరేక చర్య కావడంతోపాటు ఇటీవల ఉగ్రవాదులు ఎక్కువగా డ్రోన్ లతోనే రెక్కీలు నిర్వహిస్తున్నారని తెలుస్తుండటంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే కేసును నమోదుచేసి విచారణ చేపట్టిన ఇప్పటి వరకు ఆధారాలు గుర్తించలేకపోయారు. డ్రోన్ పంపించిన వారికోసం మేధావులతో చాలాసార్లు సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో తాజాగా లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.