వారణాసి: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో పాల్గొనే ఉత్తరప్రదేశ్ అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు ప్రోత్సహకాలు ప్రకటించారు. వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధిస్తే రూ. 6 కోట్లు, రజతం గెలిస్తే రూ. 4 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ . 2 కోట్ల చొప్పున నగదు బహుమతిగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. టీమ్ ఈవెంట్లలో స్వర్ణం గెలిచే క్రీడాకారులకు మూడేసి కోట్లు, రజతానికి రెండు, కాంస్యానికి కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
అలాగే, ఒలింపిక్స్‌లో పాల్గొననున్న క్రీడాకారులందరికీ రూ.10లక్షల చొప్పున నగదు ఇస్తామని సీఎం యోగి తెలిపారు. విశ్వక్రీడలకు సన్నద్ధమయ్యేందుకు ఈ నగదు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్‌లో యూపీకి చెందిన పది మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరికి షూటర్ సౌరభ్ చౌదరీ నాయకత్వం వహిస్తున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్ కోసం ఈ నెల 17న భారత తొలి బృందం బయల్దేరనుంది.
14నే ఈ బృందాన్ని పంపాలని భారత ఒలింపిక్ సంఘం భావించినప్పటికీ.. ఒలింపిక్స్ నిర్వాహకుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో 17వ తేదీన భారత బృందం టోక్యోకు వెళ్లనుంది. ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నాక మూడు రోజులు క్రీడాకారులందరూ క్వారంటైన్‌లో ఉండాలి. మిగతా క్రీడాకారులు మరో రెండు రోజుల తర్వాత టోక్యోకు వెళ్తారు. మరోవైపు ప్రస్తుతం క్రొయేషియాలో ఉన్న భారత షూటింగ్ జట్టు 16న టోక్యోకు బయల్దేరనుంది. మొత్తంగా భారత్ నుంచి 120కి పైగా అథ్లెట్లు విశ్వక్రీడలకు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment