టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ల‌కు బీసీసీఐ భారీ న‌జ‌రానా.. ఎన్ని కోట్లంటే? | BCCI announces cash reward of Rs 5 cr for Under-19 womens WC Winner | Sakshi
Sakshi News home page

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ల‌కు బీసీసీఐ భారీ న‌జ‌రానా.. ఎన్ని కోట్లంటే?

Published Mon, Feb 3 2025 8:19 AM | Last Updated on Mon, Feb 3 2025 9:45 AM

BCCI announces cash reward of Rs 5 cr for Under-19 womens WC Winner

మహిళ‌ల అండర్‌ 19 టీ20 ప్రపంచకప్‌ 2025 ఛాంపియ‌న్స్‌గా భార‌త జ‌ట్టు నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించిన భార‌త్‌.. వ‌రుసగా రెండోసారి అండర్‌–19 టి20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది.

ఫైన‌ల్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షో అద‌ర‌గొట్టింది. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు ప‌డ‌గొట్టిన త్రిష‌.. అనంత‌రం బ్యాటింగ్‌లోనూ 44(నాటౌట్‌) స‌త్తాచాటింది. ఫ‌లితంగా ద‌క్షిణాఫ్రికా నిర్ధేశించిన 83 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భారత్.. 11.2 ఓవర్లలోనే ఊదిప‌డేసింది.

బీసీసీఐ భారీ న‌జ‌రానా..
ఇక వ‌రుస‌గా రెండోసారి వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్‌గా నిలిచిన  భారత జట్టుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. విజేత జట్టుకు రూ. 5 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఆదివారం బోర్డు వెల్లడించింది. ‘విశ్వ విజేతలకు శుభాకాంక్షలు. అండర్‌–19 ప్రపంచకప్‌ టైటిల్‌ నిలబెట్టుకున్న జట్టు సభ్యులకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం.

రెండోసారి వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టు, సహాయక సిబ్బంది రూ. 5 కోట్లు అందిస్తాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా టైటిల్‌ గెలిచిన భారత జట్టుకు హైదరాబాద్‌కు చెందిన నౌషీన్‌ అల్‌ ఖదీర్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరించింది. ఈ విజయం దేశంలో మహిళల క్రికెట్‌ ప్రాధాన్యత మరింత పెంచుతుందని బోర్డు అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ అన్నారు.

జట్టంతా సమష్టిగా రాణించడంతోనే ఈ ప్రదర్శన సాధ్యమైందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా అన్నారు. 2023లో తొలిసారి జరిగిన అండర్‌–19 టి20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు కూడా అప్పట్లో బోర్డు రూ. 5 కోట్ల నజరానా అందించింది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్‌​.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement