Under-19 Women
-
నేడు అండర్–19 మహిళల ఆసియాకప్ ఫైనల్ – బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ
ఆసియాకప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత జట్టు ఆదివారం కౌలాలంపూర్‌లో జరగనున్న తుది పోరులో బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు ‘సూపర్ ఫోర్’ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించగా... మరోవైపు బంగ్లాదేశ్ ఈ టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి తుది పోరుకు చేరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న యువ భారత జట్టు... ఆఖరి సమరంలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీ కి మలేసియా ఆతిథ్యమిస్తోంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఫుల్ ఫామ్‌లో ఉండగా... కెపె్టన్ నిక్కీ ప్రసాద్, కమలిని, మిథిల, ఐశ్వరి కూడా మంచి టచ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో ఆయుషి శుక్లా, షబ్నమ్, పరుణిక, ధ్రుతి కీలకం కానున్నారు. -
టీ20 వరల్డ్‌కప్ షురూ.. దక్షిణాఫ్రికాను ఢీకొట్టనున్న భారత్
Under 19 Women T20 WC: తొట్ట తొలి అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ దక్షిణాఫ్రికా వేదికగా నేటి నుంచి ప్రారంభంకానుంది. 16 జట్లు తలపడుతున్న ఈ టోర్నీ ఈనెల 29న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అమెరికా; గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, పాకిస్తాన్, జింబాబ్వే, రువాండా; గ్రూప్ ‘సి’లో ఇండోనేసియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్; గ్రూప్ ‘డి’లో భారత్, దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్, యూఏఈ జట్లున్నాయి. నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతుంది. భారత జట్టులో హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష, వైజాగ్‌కు చెందిన షబ్నమ్ సభ్యులుగా ఉన్నారు. భారత జట్టు: షెఫాలి వర్మ (కెప్టెన్), శ్వేత సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), జి త్రిష, సౌమ్య తివారి, సోనియా మెహ్దియా, హుర్లీ గాలా, హ్రిశిత బసు (వికెట్‌కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చనా దేవీ, పర్శవీ చోప్రా, టిటాస్ సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు.. జనవరి 14న సౌతాఫ్రికాతో (భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5:15 గంటలకు ప్రారంభం) జనవరి 16న యూఏఈతో (మధ్యాహ్నం 1:30 గంటలకు) జనవరి 18న స్కాట్లాండ్తో (సాయంత్రం 5:15 గంటలకు) -
Under-19 Women cricket: సిరీస్ భారత మహిళల సొంతం
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా మహిళల (అండర్–19)తో జరిగిన టి20 సిరీస్‌లో భారత మహిళలు (అండర్–19) పైచేయి సాధించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకున్నారు. సోమవారం జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 86 పరుగులే చేయగలిగింది. కేలే రెనెకే (18) టాప్ స్కోరర్‌గా నిలవగా...భారత బౌలర్లలో నజీలా సీఎంసీ (3/4), ఫలక్ నాజ్ (2/11) ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. అనంతరం భారత్ 15 ఓవర్లలో 6 వికెట్లకు 87 పరుగులు సాధించింది. కెప్టెన్ షఫాలీ వర్మ (27 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ గెలవగా, తర్వాతి రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సిరీస్‌లో చివరి మ్యాచ్ రేపు జరుగుతుంది. -
అమెరికా జట్టు వైస్ కెప్టెన్‌గా అనికా.. మూలాలు మనవే
కీసర: దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే నెలలో జరగనున్న అండర్– 19 టీ 20 ప్రపంచకప్ పోటీలకు అగ్రరాజ్యం అమెరికా జట్టు తరఫున తెలంగాణ మూలాలు ఉన్న కొలన్ అనిక వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీకి చెందిన ముప్పు సత్తిరెడ్డి కూతురు కొలన్ మంజుల, అల్లుడు సురేష్‌రెడ్డి అమెరికాలో పదేళ్ల క్రితమే స్థిరపడ్డారు. మంజుల వైద్యురాలు కాగా.. సురేష్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. 8 ఏళ్ల వయసులోనే క్రికెట్‌పై ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు తమ కూతురు అనికకు శిక్షణ ఇప్పించారు. ఆమె క్రికెట్లో శిక్షణ తీసుకుంటూ వివిధ టోర్నమెంట్లలో సత్తా చాటుకుంది. 17 ఏళ్ల అనిక అమెరికాలో పదో తరగతి చదువుతోంది. అండర్ –19 టీ20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు అమెరికా జట్టు వైఎస్ కెప్టెన్‌గా తమ కూతురు ఎంపికవ్వడంపై అనిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారని బంధువులు తెలిపారు. కాగా.. అమెరికా రెగ్యులర్ టీమ్‌లో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌గా అనిక రాణిస్తోంది. నాగారంలో ఉంటున్న అనిక తాతయ్య ముప్పు సత్తిరెడ్డి, మేనమామ అశోక్‌రెడ్డిలు మాట్లాడుతూ.. అనిక మూడు నెలల క్రితం అమెరికా నుంచి నాగారానికి వచ్చిందన్నారు. నెల రోజుల పాటు సికింద్రాబ్ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుందన్నారు. అమెరికా జట్టు తరఫున అండర్ – 19 టీ 20 ప్రపంచ కప్ పోటీలకు తన మనవరాలు ఎంపికై వైస్‌కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తుండటంపై సత్తిరెడ్డితో పాటు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: IND vs BAN 1st Test: తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం -
IND-19 vs NZ-19: భారత జట్టులో తెలంగాణ అమ్మాయి..
స్వదేశంలో న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హోమ్ సిరీస్‌లో భాగంగా భారత జట్టు కివీస్‌తో ఐదు టీ20లు ఆడనుంది. మొత్తం మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగా జరగనున్నాయి. నవంబర్ 27న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక 15 మంది సభ్యుల భారత జట్టుకు శ్వేతా సెహ్రావత్ కెప్టెన్‌గా ఎంపికైంది. కాగా వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న తొలి మహిళల అండర్-19 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది. భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషకు చోటు దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష 8 ఏళ్లకే జిల్లా స్థాయిలో ఆడి ఉమెన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైంది. అదే విధంగా బీసీసీఐ నిర్వహించిన డర్-19, సీనియర్ ఇండియా బ్లూ తరఫున త్రిష అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. అదే విధంగా జైపుర్ వేదికగా జరిగిన అండర్-19 మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ-2021లోను త్రిష ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. చదవండి: IND vs NZ: సూర్యకుమార్‌పై కోహ్లి ప్రశంసలు.. వీడియో గేమ్ ఇన్నింగ్స్ అంటూ! -
హైదరాబాద్ రీజియన్‌కు హాకీ టైటిల్
రాయదుర్గం: జాతీయ స్థాయి కేంద్రీయ విద్యాలయాల అండర్-19 మహిళల పోటీల్లో హైదరాబాద్ రీజియన్ హాకీ జట్టు మళ్లీ చాంపియన్‌షిప్ నిలబెట్టుకుంది. వరుసగా ఏడోసారి పసిడి పతకం సాధించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్ రీజియన్‌కు ఆడిన 11 మంది క్రీడాకారులు గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయ విద్యార్థులే కావడం విశేషం. ఏకపక్షంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ 10-0 గోల్స్‌తో ముంబై రీజియన్‌పై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో గీతాసాగర్ 24 గోల్స్ చేసింది. అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో అక్షయ చాంపియన్‌గా నిలిచింది. 200 మీటర్ల పరుగులో ఆమె రజతం నెగ్గింది. 400 మీటర్ల హర్డిల్స్, 400 మీటర్ల రిలేలో హఫీజా రజత పతకాలు గెలుచుకుంది. 100 మీటర్ల హార్డిల్స్‌లో ఆమె కాంస్యం గెలిచింది. 100 మీటర్ల బటర్ ఫ్లయ్‌లో కావ్యశ్రేయ కాంస్య పతకం సాధించింది. ఈ పోటీల్లో పతకాల పంట పండించిన నగర విద్యార్థినులను స్కూల్ వర్గాలు ఘనంగా సత్కరించాయి. గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు విజేతలను అభినందించారు. పీఈటీ విజయభాస్కర్‌రెడ్డి, హకీ కోచ్ రాంబాబు, త్రోబాల్ కోచ్ అవినాష్‌లను కూడా సన్మానించారు.