
భారత అండర్–19 మహిళల హెడ్ కోచ్ నూషీన్ ఆకాంక్ష
వరుసగా రెండోసారి టి20 ప్రపంచకప్ టైటిల్ గెలవడంపై సంతోషం
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఆ్రస్టేలియా తరహాలో ఎదురులేని జట్టులా భారత బృందం మారాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటామని భారత మహిళల అండర్–19 టీమ్ హెడ్ కోచ్ నూషీన్ అల్ ఖదీర్ వ్యాఖ్యానించింది. మలేసియాలో విశ్వవిజేతలుగా నిలిచిన అనంతరం జట్టు సభ్యులు గొంగడి త్రిష, కేసరి ధృతి, ట్రెయినర్ షాలినిలతో కలిసి నూషీన్ మంగళవారం నగరానికి చేరుకుంది.
రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళలు అండర్–19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ఆమెనే హెడ్ కోచ్‌గా ఉంది. ఆఫ్ స్పిన్నర్‌గా భారత్ తరఫున 85 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లు తీసిన నూషీన్ ఖాతాలో ఇప్పుడు కోచ్ హోదాలో వరుసగా రెండు వరల్డ్ కప్ టైటిల్స్ చేరాయి. ‘మా అమ్మాయిల నుంచి అత్యుత్తమ ప్రదర్శన వచ్చింది. ఇదంతా సమష్టిగా సాధించిన విజయం.
దాదాపు ఎనిమిది నెలల క్రితమే ఈ టోర్నీ కోసం ప్రణాళికలు రూపొందించి ఎంతో కష్టపడ్డాం. దాని ఫలితమే ఇప్పుడు కనిపించింది. మా విజయంలో టీమ్ సహాయక సిబ్బంది పాత్ర కూడా ఎంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు మాత్రమే కాకుండా ట్రెయినర్, ఫిజియో కూడా ఎంతో శ్రమించారు’ అని నూషీన్ పేర్కొంది.
తమకు అందించిన బాధ్యతలకు అనుగుణంగా అమ్మాయిలు స్పందించిన తీరును హెడ్ కోచ్ ప్రశంసించింది. ‘పరిస్థితులను బట్టి తమను తాము మార్చుకునే విషయంలో మా అమ్మాయిలు సరైన రీతిలో స్పందించారు. డిమాండ్ ప్రకారం తమ ఆటను మార్చుకున్నారు. చాలా కాలంగా కలిసి ఆడుతుండటం వల్ల ప్లేయర్లందరి మధ్య మంచి బంధం ఏర్పడింది.
పైగా తమకు అందించిన బాధ్యతలపై ప్రతీ ప్లేయర్‌కు స్పష్టత ఉండటం కూడా ఎంతో మేలు చేసింది. అందుకే వరల్డ్ కప్‌లో కీలక క్షణాల్లో ఒత్తిడిని అధిగమించి అంత గొప్పగా ఆడగలిగాం’ అని కోచ్ వెల్లడించింది. రెండేళ్ల క్రితం సాధించిన విజయం కూడా ఎంతో ఆనందాన్నిచ్చిందని... అయితే దాంతో పోలిస్తే ఈ టైటిల్ మరింత ప్రత్యేకమని నూషీన్ పేర్కొంది. ‘2023లో సాధించిన విజయంతో పోలిస్తే ఈసారి మేం మరింత నిలకడగా, దూకుడుగా, సంపూర్ణ ఆధిపత్యంతో ఆడాం. మానసికంగా కూడా అమ్మాయిలు ఈసారి దృఢంగా ఉన్నారు.
అందుకే ఈ గెలుపుపై మాకు ముందునుంచే అంచనాలు ఉన్నాయి. సెమీస్‌లో ఇంగ్లండ్ రూపంలో మాకు పెద్ద సవాల్ ఎదురైంది. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్ గట్టి ప్రత్యర్థి. కానీ అక్కడా మనోళ్లు జోరు కొనసాగించడం జట్టు బలాన్ని చూపించింది. మహిళల క్రికెట్‌లో వన్డేలు, టి20లు కలిపి ఆ్రస్టేలియా 13 వరల్డ్ కప్‌లు గెలిచింది. మా జట్టు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని, అంతే బలంగా మారాలని కోరుకుంటున్నాం. మా తర్వాతి లక్ష్యం కూడా అదే’ అని ఈ మాజీ స్పిన్నర్ సగర్వంగా చెప్పింది.
‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన తెలంగాణ అమ్మాయి త్రిషను కోచ్ ప్రత్యేకంగా అభినందించింది. ‘త్రిష అనుభవాన్ని బట్టి ఆమెను ఓపెనర్‌గా పంపాలని వరల్డ్ కప్‌నకు ముందే నిర్ణయించాం. నిజాయితీగా చెప్పాలంటే ఆమె దూకుడైన బ్యాటింగ్ శైలి మమ్మల్నీ ఆశ్చర్యపర్చింది. త్రిష తన షాట్లను మెరుగుపర్చుకోవడంలో ఎంతో కష్టపడింది’ అని నూషీన్ అభిప్రాయపడింది.
వరుసగా రెండు అండర్–19వరల్డ్ కప్ టైటిల్స్ భారత్‌లో మహిళల క్రికెట్‌కు మరింత ఊతం ఇస్తాయని... ఈ స్థాయిలో అమ్మాయిలకు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించి భవిష్యత్తులో వారిని మరింత బలమైన ప్లేయర్లుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బోర్డుదేననే నూషీన్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజా వరల్డ్ కప్‌తో కోచ్‌గా నూషీన్ కాంట్రాక్ట్ కూడా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment