under 19 world cup
-
‘మా జట్టు ఆసీస్‌లా మారాలి’
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆ్రస్టేలియా తరహాలో ఎదురులేని జట్టులా భారత బృందం మారాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటామని భారత మహిళల అండర్–19 టీమ్ హెడ్ కోచ్ నూషీన్ అల్ ఖదీర్ వ్యాఖ్యానించింది. మలేసియాలో విశ్వవిజేతలుగా నిలిచిన అనంతరం జట్టు సభ్యులు గొంగడి త్రిష, కేసరి ధృతి, ట్రెయినర్ షాలినిలతో కలిసి నూషీన్ మంగళవారం నగరానికి చేరుకుంది. రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళలు అండర్–19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ఆమెనే హెడ్ కోచ్‌గా ఉంది. ఆఫ్ స్పిన్నర్‌గా భారత్ తరఫున 85 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లు తీసిన నూషీన్ ఖాతాలో ఇప్పుడు కోచ్ హోదాలో వరుసగా రెండు వరల్డ్ కప్ టైటిల్స్ చేరాయి. ‘మా అమ్మాయిల నుంచి అత్యుత్తమ ప్రదర్శన వచ్చింది. ఇదంతా సమష్టిగా సాధించిన విజయం. దాదాపు ఎనిమిది నెలల క్రితమే ఈ టోర్నీ కోసం ప్రణాళికలు రూపొందించి ఎంతో కష్టపడ్డాం. దాని ఫలితమే ఇప్పుడు కనిపించింది. మా విజయంలో టీమ్ సహాయక సిబ్బంది పాత్ర కూడా ఎంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు మాత్రమే కాకుండా ట్రెయినర్, ఫిజియో కూడా ఎంతో శ్రమించారు’ అని నూషీన్ పేర్కొంది. తమకు అందించిన బాధ్యతలకు అనుగుణంగా అమ్మాయిలు స్పందించిన తీరును హెడ్ కోచ్ ప్రశంసించింది. ‘పరిస్థితులను బట్టి తమను తాము మార్చుకునే విషయంలో మా అమ్మాయిలు సరైన రీతిలో స్పందించారు. డిమాండ్ ప్రకారం తమ ఆటను మార్చుకున్నారు. చాలా కాలంగా కలిసి ఆడుతుండటం వల్ల ప్లేయర్లందరి మధ్య మంచి బంధం ఏర్పడింది. పైగా తమకు అందించిన బాధ్యతలపై ప్రతీ ప్లేయర్‌కు స్పష్టత ఉండటం కూడా ఎంతో మేలు చేసింది. అందుకే వరల్డ్ కప్‌లో కీలక క్షణాల్లో ఒత్తిడిని అధిగమించి అంత గొప్పగా ఆడగలిగాం’ అని కోచ్ వెల్లడించింది. రెండేళ్ల క్రితం సాధించిన విజయం కూడా ఎంతో ఆనందాన్నిచ్చిందని... అయితే దాంతో పోలిస్తే ఈ టైటిల్ మరింత ప్రత్యేకమని నూషీన్ పేర్కొంది. ‘2023లో సాధించిన విజయంతో పోలిస్తే ఈసారి మేం మరింత నిలకడగా, దూకుడుగా, సంపూర్ణ ఆధిపత్యంతో ఆడాం. మానసికంగా కూడా అమ్మాయిలు ఈసారి దృఢంగా ఉన్నారు. అందుకే ఈ గెలుపుపై మాకు ముందునుంచే అంచనాలు ఉన్నాయి. సెమీస్‌లో ఇంగ్లండ్ రూపంలో మాకు పెద్ద సవాల్ ఎదురైంది. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్ గట్టి ప్రత్యర్థి. కానీ అక్కడా మనోళ్లు జోరు కొనసాగించడం జట్టు బలాన్ని చూపించింది. మహిళల క్రికెట్లో వన్డేలు, టి20లు కలిపి ఆ్రస్టేలియా 13 వరల్డ్ కప్‌లు గెలిచింది. మా జట్టు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని, అంతే బలంగా మారాలని కోరుకుంటున్నాం. మా తర్వాతి లక్ష్యం కూడా అదే’ అని ఈ మాజీ స్పిన్నర్ సగర్వంగా చెప్పింది.‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన తెలంగాణ అమ్మాయి త్రిషను కోచ్ ప్రత్యేకంగా అభినందించింది. ‘త్రిష అనుభవాన్ని బట్టి ఆమెను ఓపెనర్‌గా పంపాలని వరల్డ్ కప్‌నకు ముందే నిర్ణయించాం. నిజాయితీగా చెప్పాలంటే ఆమె దూకుడైన బ్యాటింగ్ శైలి మమ్మల్నీ ఆశ్చర్యపర్చింది. త్రిష తన షాట్లను మెరుగుపర్చుకోవడంలో ఎంతో కష్టపడింది’ అని నూషీన్ అభిప్రాయపడింది. వరుసగా రెండు అండర్–19వరల్డ్ కప్ టైటిల్స్ భారత్‌లో మహిళల క్రికెట్‌కు మరింత ఊతం ఇస్తాయని... ఈ స్థాయిలో అమ్మాయిలకు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించి భవిష్యత్తులో వారిని మరింత బలమైన ప్లేయర్లుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బోర్డుదేననే నూషీన్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజా వరల్డ్ కప్‌తో కోచ్‌గా నూషీన్ కాంట్రాక్ట్ కూడా ముగిసింది. -
సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌కు అభిమానిగా ఉండటం చాలా కష్టం..!
టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా గ్రాము అదృష్టం కూడా లేని క్రికెట్ జట్టు ఏదైనా ఉందా అంటే అది దక్షిణాఫ్రికా (South Africa) జట్టే అని చెప్పాలి. ఇటీవలికాలంలో ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే ఇది వందకు వంద శాతం నిజం అనిపిస్తుంది. జెండర్‌తో, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆ జట్టు ఇటీవలికాలంలో వరుసగా మెగా టోర్నీల ఫైనల్స్‌లో ఓడుతుంది. రెండేళ్ల వ్యవధిలో సౌతాఫ్రికా పురుషుల, మహిళల జట్లు నాలుగు టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఓడాయి. 2023 మహిళల టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ఫైనల్స్‌లో తొలిసారి ఓడిన సౌతాఫ్రికా... ఆ మరుసటి ఏడాది పురుషులు, మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్ ఓటమి చవిచూసింది. తాజాగా ఆ దేశ మహిళల అండర్-19 జట్టు.. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్ (Team India) చేతిలో పరాజయంపాలైంది.టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ జట్లపై సానుభూతి వెల్లువెత్తుతుంది. నెటిజన్లు సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లపై తెగ జాలి చూపుతున్నారు. ఏ జట్టుకైనా అభిమానిగా ఉండవచ్చు కానీ.. వరుస ఫైనల్స్‌లో ఓడుతున్న సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లకు అభిమానిగా ఉండటం మాత్రం చాలా కష్టమని అంటున్నారు. సౌతాఫ్రికా క్రికెట్ జట్లకు గతంలో సెమీఫైనల్ ఫోబియా ఉండేది. ప్రస్తుతం అది పోయి ఫైనల్ ఫోబియా పట్టుకున్నట్లుంది. సౌతాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు త్వరలో మరో మెగా ఈవెంట్ ఫైనల్స్‌లో (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్స్‌లో) ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈసారైనా సౌతాఫ్రికా ఫైనల్ ఫోబియాను అధిగమించి టైటిల్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.కాగా, 2023 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సౌతాఫ్రికా.. ఆ మరుసటి ఏడాది జరిగిన పురుషుల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. అదే ఏడాది జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పొట్రిస్ జట్టు.. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన 2025 అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో యంగ్ ఇండియా చేతిలో చావుదెబ్బతింది.ఇదిలా ఉంటే, మలేసియాలో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఇవాళ జరిగిన ఫైనల్లో యంగ్ ఇండియా సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీ ఇనాగురల్ ఎడిషన్‌లోనూ (2023) భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) 3, పరునిక సిసోడియా, ఆయూశి శుక్లా, వైష్ణవి శర్మ తలో 2, షబ్నమ్ షకీల్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మికీ వాన్ వూర్స్ట్ (23) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జెమ్మా బోథా (16), కరాబో మెసో (10), ఫే కౌలింగ్ (15) రెండంకెల స్కోర్లు చేశారు.83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 11.2 ఓవర్లలో (వికెట్ కోల్పోయి) ఆడుతూపాడుతూ విజయం సాధించింది. బంతితో మెరిసిన త్రిష బ్యాటింగ్‌లోనూ చెలరేగి 33 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 22 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసింది. ఈ టోర్నీ మొత్తంలో భారత్ అజేయంగా నిలిచింది. టోర్నీ ఆధ్యాంతం బ్యాట్‌తో, బంతితో రాణించిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా ఫైనల్.. తుది జట్లు ఇవే
మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు.. దక్షిణాఫ్రికాపై అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. భారత్ మాదిరిగానే ఓటమి లేకుండా ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న తెలుగు అమ్మాయి గొంగడి త్రిషపై భారత్ మరోసారి ఆధారపడనుంది. ఈ వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగుల బ్యాటర్‌గా త్రిష (265 పరుగులు)నే కొనసాగుతోంది.తుది జట్లుదక్షిణాఫ్రికా మహిళల U19 జట్టు: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్), కరాబో మెసో(వికెట్ కీపర్), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నినిభారత మహిళల U19 జట్టు: కమలిని(వికెట్ కీపర్), గొంగడి త్రిష, సానికా చల్కే, నికి ప్రసాద్(కెప్టెన్), ఈశ్వరి అవ్సరే, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత షబ్నం షకీల్, పరుణికా సిసోడియా, వైష్ణవి శర్మచదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో ఐదో టీ20.. భారత జట్టులో కీలక మార్పులు! వారికి ఛాన్స్? -
మిథాలీ అడుగు జాడల్లోనే...
కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష... తన ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ ప్రభావం ఉందని వెల్లడించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా స్కాట్లాండ్తో ‘సూపర్ సిక్స్’ పోరులో 59 బంతులాడి అజేయంగా 110 పరుగులు చేసిన త్రిష... ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో హైదరాబాదీ స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్‌ను చూసి నేర్చుకున్నానని వెల్లడించింది. 2023 మహిళల అండర్–19 ప్రపంచకప్‌తో పాటు, గతేడాది అండర్–19 ఆసియాకప్‌లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన త్రిష... తాజా సెంచరీని తండ్రి రామిరెడ్డికి అంకితమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘మిథాలీ రాజ్‌ను చూస్తూ పెరిగాను. ఆమె ఇన్నింగ్స్‌ను నిర్మించే తీరు నాకెంతో ఇష్టం. నేను కూడా అలాగే చేయాలని ఎప్పటి నుంచో అనుకునే దాన్ని. నా ఆదర్శ క్రికెటర్ మిథాలీ. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే భారీ ఇన్నింగ్స్ ఆడాలనుకున్నా. మొత్తానికి అది స్కాట్లాండ్పై సాధ్యపడింది. తొలుత బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా. అప్పుడే మొత్తం 20 ఓవర్లు ఆడి భారీ స్కోరు చేసేందుకు వీలుంటుంది. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడంతో ఆ అవకాశం దక్కింది. క్రీజులో ఉన్నప్పుడు వ్యక్తిగత స్కోరును పట్టించుకోను. సహచరులు సంబరాలు చేసుకునేంత వరకు సెంచరీ పూర్తి చేసుకున్నానని గుర్తించలేదు.చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈ సెంచరీని ఆయనకే అంకితమిస్తున్నా. అమ్మానాన్న సహకారం లేకుంటే ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు’అని త్రిష వెల్లడించింది. తాజా ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న త్రిష... వరుసగా రెండో సారి కప్పు ముద్దాడడమే తమ లక్ష్యమని పేర్కొంది. -
సెంచరీతో రికార్డ్ సాధించిన భద్రాచలం యువతి త్రిష
-
T20 World Cup 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్-205లో భారత్ మరో విజయం సాధించింది. గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన టీమిండియా సూపర్-6లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (జనవరి 26) జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ సుమయ్యా అక్తెర్ 21 నాటౌట్, జన్నతుల్ మౌకా 14 పరుగులు చేశారు. భారత బౌలర్లందరూ చాలా పొదుపుగా బౌల్ చేశారు. వైష్ణవీ శర్మ 3, షబ్నమ్ షకీల్, విజే జోషిత్, గొంగడి త్రిష తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ గొంగడి త్రిష (31 బంతుల్లో 40; 8 సిక్సర్లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపుకు గట్టి పునాది వేసింది. జి కమలిని 3, సనికా ఛల్కే 11 (నాటౌట్), కెప్టెన్ నికీ ప్రసాద్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అనిస అక్తెర్ శోభా, హబిబా ఇస్లాం పింకీ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ సిక్స్‌లో భారత్ తదుపరి స్కాట్లాండ్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ జనవరి 28న జరుగనుంది. కాగా, సూపర్ సిక్స్‌లో భారత్ గ్రూప్ 1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండిటిలోనూ విజయాలు సాధించింది. గ్రూప్-1లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి.ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, నైజీరియా, యూఎస్ఏ, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో సౌతాఫ్రికా టాపర్‌గా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, గ్రూప్-1లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ (శ్రీలంక, స్కాట్లాండ్) జరగాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దైంది. -
T20 World Cup 2025: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్‌లోకి ఎంట్రీ
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 23) జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేసింది. త్రిషతో పాటు భారత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నికీ ప్రసాద్ (11), మిథిలా వినోద్ (16), వీజే జోషిత (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జి కమలిని 5, సినిక ఛల్కే 0, భవిక అహిరే 7, ఆయుషి శుక్లా 5, పరునిక సిసోడియా ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. షబ్నమ్ షకీల్ (2), వైష్ణవి శర్మ (1) అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో ప్రముది మెత్సర, లిమాంస తిలకరత్న, అసెని తలగుణే తలో 2 వికెట్లు పడగొట్టగా... రష్మిక సేవండి, చమోది ప్రభోద, కెప్టెన్ మనుడి ననయక్కార తలో వికెట్ దక్కించుకున్నారు.119 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వైష్ణవి శర్మ (4-1-3-1), షబ్నమ్ షకీల్ (4-1-9-2), పరునిక సిసోడియా (4-0-7-2), విజే జోషిత (3-0-17-2), ఆయుషి శుక్లా (4-0-13-1) ధాటికి శ్రీలంక నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైష్ణవి శర్మ సంధించిన బంతులను ఎదుర్కోలేక లంక బ్యాటర్లు నానా అవస్థలు పడ్డారు. లంక ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (రష్మిక (15)) రెండంకెల స్కోర్ చేశారు. మిగతా 10 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కాగా, ఈ టోర్నీలో భారత్.. వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లపై ఘన విజయాలు సాధించి సూపర్-6లోకి ప్రవేశించింది. గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, వెస్టిండీస్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగతా గ్రూప్‌ల విషయానికొస్తే.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, యూఎస్ఏ, ఐర్లాండ్.. గ్రూప్-సిలో సౌతాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్.. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
9 నెలల వ్యవధిలో భారత క్రికెట్ అభిమానులకు మూడోసారి గుండెకోత
తొమ్మిది నెలల వ్యవధిలో టీమిండియా అభిమానుల గుండె మూడోసారి కోతకు గురైంది. ఇటీవలికాలంలో జరిగిన అన్ని మేజర్ ఈవెంట్ల ఫైనల్స్‌లో టీమిండియా వరుస పరాభవాలను ఎదుర్కొంది. భారత్‌కు ఓటములు ఎదురైన మూడు సందర్భాల్లో ప్రత్యర్ధి ఆస్ట్రేలియానే కావడం విశేషం. తొలుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా టీమిండియాను చిత్తు చేసింది. ఆతర్వాత గతేడాది చివర్లో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో, తాజాగా అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత క్రికెట్ జట్టు ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. సీనియర్ల బాటలోనే జూనియర్లు.. భారత క్రికెట్ జట్టును వరల్డ్‌కప్ ఫైనల్ ఫోబియా వదలట్లేదు. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత సీనియర్లు ఇదే ఆసీస్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కోగా.. తాజాగా జూనియర్లు సీనియర్ల బాటలోనే నడుస్తూ అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో కుర్ర ఆసీస్ జట్టు చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్ సీనియన్ టీమిండియాలాగే తుది సమరంలో బొక్కబోర్లా పడి భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చింది. ఇదిలా ఉంటే, అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో కుర్ర ఆస్ట్రేలియా జట్టు యంగ్ ఇండియాను 79 పరుగుల తేడాతో ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యంగ్ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు గుండెకోతను మిగిల్చింది. -
ప్రపంచ క్రికెట్‌పై కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఆధిపత్యం
ప్రపంచ క్రికెట్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ జట్టు ఫార్మాట్లకతీతంగా వరుస టైటిల్స్ సాధిస్తూ ప్రపంచ క్రికెట్‌ను శాశిస్తుంది. ఇటీవలికాలంలో జరిగిన అన్ని మెగా ఈవెంట్ల ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా హవా పురుషుల క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. మహిళ క్రికెట్లోనూ ఈ జట్టు డామినేషనే నడుస్తుంది. తాజాగా ఆస్ట్రేలియన్లు జూనియర్ విభాగంలోనూ సత్తా చాటారు. ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో యువ ఆసీస్ జట్టు యంగ్ ఇండియాను చిత్తు చేసి ఈ విభాగంలో నాలుగోసారి జగజ్జేతగా అవతరించింది. అండర్ 19 టైటిల్‌తో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో (పురుషులు, మహిళలు, జూనియర్ లెవెల్) వరల్డ్ ఛాంపియన్‌గా (వన్డే ఫార్మాట్లో) అవతరించింది. వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా అండర్ 19 వరల్డ్‌కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా మహిళల వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా మహిళల టీ20 ఛాంపియన్-ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్-ఆస్ట్రేలియా ఇదిలా ఉంటే, అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో కుర్ర ఆస్ట్రేలియా జట్టు యంగ్ ఇండియాను 79 పరుగుల తేడాతో ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యంగ్ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు గుండెకోతను మిగిల్చింది. -
సీనియర్ల బాటలోనే జూనియర్లు.. వరల్డ్‌కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్ ఇండియాతో ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన ఫైనల్లో యువ ఆసీస్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి జగజ్జేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ సింగ్ (47), తెలుగు ఆటగాడు మురుగన్ అభిషేక్ (42), ముషీర్ ఖాన్ (22), నమన్ తివారి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు బియర్డ్మ్యాన్ (3/15), రాఫ్ మెక్‌మిలన్ (3/43), కల్లమ్ విడ్లర్ (2/35), ఆండర్సన్ (1/42) టీమిండియా పతనాన్ని శాశించారు. సీనియర్ల బాటలోనే జూనియర్లు.. భారత క్రికెట్ జట్టును వరల్డ్‌కప్ ఫైనల్ ఫోబియా వదలట్లేదు. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత సీనియర్లు ఇదే ఆసీస్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొనగా.. తాజాగా జూనియర్లు సీనియర్ల బాటలోనే నడుస్తూ అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో కుర్ర ఆసీస్ జట్టు చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్ రోహిత్ సేనలాగే తుది సమరంలో బొక్కబోర్లా పడి భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చింది. చదవండి: World Cup Final: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు.. వైరల్ వీడియో -
World Cup Final: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు.. వైరల్ వీడియో
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణ ప్రాంత ఆటగాళ్లు అవనీశ్ రావు, అభిషేక్ మురుగన్ తెలుగులో మాట్లాడుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో వికెట్‌కీపర్ అవనీశ్ రావు, స్పిన్ బౌలర్ అభిషేక్ మురుగన్‌తో హైదరాబాద్ యాసలో సంభాషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. విదేశీ గడ్డపై వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్ ఫైనల్లో ఇద్దరు తెలుగు వాళ్లు మాట్లాడుకుంటుంటే వినసొంపుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ.!! 🤩 మరి ఈరోజు U19 ఫైనల్స్ లో అదే జరిగింది 😃 మరి మీరు కూడా చూసేయండి.!! చూడండి ICC U19 World Cup Final#INDU19vAUSU19 లైవ్ మీ #StarSportsTelugu & Disney + Hotstar లో#U19WorldCupOnStar pic.twitter.com/UPX0xz7zCd — StarSportsTelugu (@StarSportsTel) February 11, 2024 ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. ఆసీస్ నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ చేతులెత్తేసింది. 36 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 136/8గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే ఇంకా 118 పరుగులు చేయాలి చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఏదైన మహాద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కలేదు. మురుగన్ అభిషేక్ (23), నమన్ తివారి (2) క్రీజ్‌లో ఉన్నారు. భారత స్టార్ త్రయం ముషీర్ ఖాన్ (22), ఉదయ్ సహారన్ (8), సచిన్ దాస్ (9) డు ఆర్ డై మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47) కొద్దో గొప్పో ఆడేందుకు ప్రయత్నించాడు. ఆర్శిన్ కులకర్ణి 3, ప్రియాన్షు మోలియా 9, అవనీశ్ 0, రాజ్ లింబాని 0 పరుగులకు ఔటయ్యారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
ఆస్ట్రేలియాతో ఫైనల్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సామ్ కాంస్టాస్ 0, ర్యాన్ హిక్స్ 20, రాఫ్ మెక్‌మిలన్ 2, చార్లీ ఆండర్సన్ 13 పరగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3 వికెట్లతో చెలరేగగా.. నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్ కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత బ్యాటింగ్ త్రయం ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఈ ముగ్గురు రాణిస్తే టీమిండియా గెలుపు నల్లేరుపైనడక అవుతుంది. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లో భారత్ అజేయ జట్టుగా ఉంది. ఈసారి యువ భారత్ టైటిల్‌ను గెలిస్తే ఆరో సారి జగజ్జేతగా అవతరిస్తుంది. ఆస్ట్రేలియా సైతం మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. టీమిండియా ఈసారి కూడా టైటిల్ గెలవాలని ఆశిద్దాం. -
టీమిండియా అభిమానుల్లో కలవరం
అండర్-19 వరల్డ్‌కప్ 2024లో యువ భారత్ జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న జరిగే ఫైనల్లో టీమిండియా.. పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మెగా ఫైనల్‌కు ముందు భారత క్రికెట్ అభిమానులకు ఓ విషయం తెగ కలవరపెడుతుంది. అదేంటంటే.. వరల్డ్‌కప్ ఫైనల్ ఆస్ట్రేలియా ఫోబియా. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అచ్చం ప్రస్తుత అండర్ 19 వరల్డ్‌కప్‌లో యువ భారత్‌లాగే 2023 వరల్డ్‌కప్‌లో భారత జట్టు కూడా ఫైనల్ వరకు అజేయంగా నిలిచింది. ఈ క్రమమే ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల కలవరానికి కారణంగా మారింది. సీనియర్ జట్టు లాగే జూనియర్లు కూడా ఫైనల్ వరకు అజేయంగా నిలిచి, తుది సమరంలో చేతులెత్తేస్తారేమోనని భారత అభిమానులు బెంగ పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ నాటి వరల్డ్‌కప్ ఫైనల్ బరిలోకి దిగిన టీమిండియా.. తుది సమరంలో తడబడి ఆసీస్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడటం ఇది కొత్తేమీ కాదు. 2003 ఎడిషన్‌లోనూ టీమిండియా ఇలానే ఫైనల్లో ఆసీస్ చేతిలో చిత్తైంది. అయితే ఆ ఎడిషన్‌లో ఇప్పటిలా భారత్ అజేయ జట్టు మాత్రం కాదు. లీగ్ దశలో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. ఈ సెంటిమెంట్లను పక్కన పెడితే పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవన్న గ్రహించాలి. గత వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆసీస్ చేతిలో ఓడిన భారత జట్ల పరిస్థితి.. ప్రస్తుత యువ భారత జట్టు పరిస్థితి వేర్వేరుగా ఉన్నాయి. ప్రస్తుత యువ భారత్ జట్టు అంత ఈజీగా ఓటమి ఒప్పుకునే పరిస్థితి లేదు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 249 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ను కెప్టెన్ ఉదయ్ సహారన్ (81), సచిన్ దాస్ (96) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. ప్రస్తుత యువ భారత జట్టు ఎంతటి ఒత్తిడినైనా అధిగమించి, సత్ఫలితాలు రాబట్లగల సమర్ధమైన జట్టు. ఫైనల్లో యంగ్ ఇండియా ఆసీస్‌ను మట్టికరిపించి, సీనియర్లకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని అశిద్దాం. ఈ వరల్డ్‌కప్ గెలిస్తే యువ భారత్ ఐదో సారి జగజ్జేతగా నిలుస్తుంది. ఫైనల్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. -
యువ భారత్ సంచలన విజయం.. వరల్డ్‌కప్ ఫైనల్లోకి ప్రవేశం
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్‌కప్‌లో యువ భారత్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సౌతాఫ్రికాతో ఇవాళ (ఫిబ్రవరి 6) జరిగిన తొలి సెమీఫైనల్లో ఉదయ్ సహారన్ సేన సంచలన విజయం సాధించి, ఆతిథ్య జట్టుకు గుండెకోతను మిగిల్చింది. 245 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ను సచిన్ దాస్ (95), కెప్టెన్ ఉదయ్ సహారన్ (81) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. వీరు ఐదో వికెట్‌కు 171 పరుగులు జోడించి సౌతాఫ్రికా చేతల నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (76), రిచర్డ్ సెలెట్స్వేన్ (64) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఆఖర్లో ట్రిస్టన్ లూస్ (23 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. కెప్టెన్ జుయాన్ జేమ్స్ (24) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలరల్లో రాజ్ లింబాని 3, ముషీర్ ఖాన్ 2, నమన్ తివారి, సౌమీ పాండే తలో వికెట్ పడగొట్టారు. 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. సౌతాఫ్రికా సంచలన పేసర్ మపాకా ఆదర్శ్ సింగ్‌ను తొలి బంతికే ఔట్ చేశాడు. ఆతర్వాత నాలుగో ఓవర్లో టీమిండియాకు అతి భారీ షాక్ తగిలింది. భీకర ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్‌ను (4) ట్రిస్టన్ లూస్ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత భారత్ 10, 12 ఓవర్లలో అర్షిన్ కులకర్ణి (12), ప్రియాన్షు మోలియా (5) వికెట్లు కోల్పోయింది. ట్రిస్టన్ లూసే వీరిద్దరి వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో జతకట్టిన ఉదయ్ సహారన్, సచిన్ దాస్ జోడీ సౌతాఫ్రికా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని వారి నుంచి మ్యాచ్ లాగేసుకుంది. చివర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడికి లోనైనప్పటికీ.. రాజ్ లింబానీ (13 నాటౌట్) బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్లోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 8న జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. -
ఉత్కంఠ పోరులో విజయం.. సెమీ ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్
అండర్ 19 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బెనోని వేదికగా బంగ్లాదేశ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించిన పాక్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 35.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. పాక్ విజయంలో పేసర్ ఉబైడ్ షా కీలక పాత్ర పోషించాడు. ఉబైడ్ షా 5 వికెట్లు పడగొట్టి పాక్‌ను సెమీస్‌కు చేర్చాడు. ఉబైడ్ షాతో పాటు అలీ రజా 3 వికెట్లు, జీషన్ ఒక్క వికెట్ సాధించాడు. బంగ్లా బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(26) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కూడా 40.4 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ అరాఫత్ మిన్హాస్(34) రాణించడంతో నామమాత్రపు స్కోరైనా పాక్ సాధించగల్గింది. బంగ్లా బౌలర్లలో షేక్ పావెజ్ జిబోన్, రోహనత్ డౌల్లా బోర్సన్ తలా 4 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. అదే విధంగా తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, భారత్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. -
సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్.. సెమీస్ బెర్త్ ఖారారు
బ్లూమ్‌ఫోంటీన్ (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచ కప్‌లో యువ భారత్ అజేయంగా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన గ్రూప్–1 సూపర్ సిక్స్ పోరులో భారత్ 132 పరుగుల భారీ తేడాతో నేపాల్‌పై జయభేరి మోగించడంతో సెమీస్ స్థానం ఖాయమైంది. మొదట భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ ఉదయ్ సహరన్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సచిన్ దాస్ (101 బంతుల్లో 116; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 215 పరుగులు జోడించడం విశేషం. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన నేపాల్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేసింది. కెప్టెన్ దేవ్ ఖానల్ (53 బంతుల్లో 33; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IND vs ENG: ఒకే ఒక్కడు.. భారీ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కుర్ర బౌలర్
అండర్-19 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా యువ పేసర్ క్వేనా మపాకా సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. శ్రీలంకతో ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన మ్యాచ్‌లో ఈ కుర్ర బౌలర్ మరో ఐదు వికెట్ల ప్రదర్శనతో (8.2-1-21-6) విజృంభించాడు. మపాకాకు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇది మూడో ఐదు వికెట్ల ప్రదర్శన. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ సింగిల్ ఎడిషన్‌లో మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయలేదు. Kwena Maphaka put up another impressive performance, registering figures of 6/21 to claim the @aramco POTM 🌟 Catch his Highlights 📽#U19WorldCup pic.twitter.com/h6GTvg9TLY — ICC (@ICC) February 2, 2024 ప్రస్తుత ఎడిషన్‌లో మపాకా ఈ మ్యాచ్‌కు ముందు జింబాబ్వే (10-1-34-5), వెస్టిండీస్‌లపై (9.1-1-38-5) ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన మపాకా 18 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 17 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన మపాకా బుల్లెట్ వేగంతో నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లను నిశ్రేష్ఠులను చేస్తున్నాడు. మపాకా సంధించే బంతులకు బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. మపాకా ప్రదర్శనల కారణంగా ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా సెమీస్ రేసులో ముందుంది. ఈ కుర్ర బౌలర్ ఇటీవలే టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు కూడా సవాలు విసిరాడు. బుమ్రా కంటే వేగంగా యార్కర్లు సంధిస్తానని ఛాలెంజ్ చేశాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో మ్యాచ్‌లో మపాకా ఆరేయడంతో దక్షిణాఫ్రికా 119 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (71), రిలే నార్టన్ (41 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో విశ్వ లహీరు, తరుపతి, వడుగే తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక మపాకా ధాటికి 113 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది. లంక ఇన్నింగ్స్‌లో షరుజన్ షణ్ముకనాథన్ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మపాకాతో పాటు రిలే నార్టన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. -
సెంచరీల మోత మోగించిన టీమిండియా ఆటగాళ్లు
అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయ జట్టుగా కొనసాగుతున్న భారత్.. నేపాల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 2) జరుగుతున్న సూపర్ సిక్స్ మ్యాచ్‌లోనూ చెలరేగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ ఉదయ్ సహారన్ (100), సచిన్ దాస్ (116) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ సింగ్ 21, అర్షిన్ కులకర్ణి 18, ప్రియాన్షు మోలియా 19 పరుగులు చేసి ఔట్ కాగా.. ఈ టోర్నీలో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్న చిచ్చరపిడుగు ముషీర్ ఖాన్ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో గుల్షన్ షా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ చాంద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే యువ భారత్ దర్జాగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఇవాళే జరుగుతున్న మరో రెండు సూపర్ సిక్స్ మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా-శ్రీలంక, ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (71), రీలే నార్టన్ (41 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో విశ్వ లహిరు, తరుపతి, వడుగే తలో రెండు వికెట్లు పడగొట్టారు. విండీస్‌తో జరుగుతున్న మరో సూపర్ సిక్స్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్ (108) సెంచరీతో కదంతొక్కాడు. విండీస్ బౌలర్లలో ఎడ్వర్డ్స్ 3, థోర్న్ 2 వికెట్లు పడగొట్టారు. -
Viral Video: ఆ ముగ్గురి షాట్లను ఎంత చక్కగా ఆడాడో చూడండి..!
గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న పేరు ముషీర్ ఖాన్. ఈ 18 ఏళ్ల ముంబై కుర్రాడు అండర్-19 ప్రపంచకప్‌లో వరుస సెంచరీలతో విరుచుకుపడుతూ టాక్ ఆఫ్ ద కంట్రీగా మారాడు. క్రికెట్‌కు సంబంధించి ఏ ఇద్దరు ముగ్గురి మధ్య డిస్కషన్ జరిగినా ముషీర్ ఖాన్ పేరు వినిపిస్తుంది. అంతలా ముషీర్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. అయితే, ముషీర్ ఇంత హైప్ ఊరికే రాలేదు. వరల్డ్‌కప్ అతను పారించిన పరుగుల వరద, అతను ఆడిన షాట్లు, దూకుడు, టెక్నిక్.. ఇలా ఎన్నో కారణాల వల్ల అతనికి ఈ స్థాయి క్రేజ్ వచ్చింది. తాజాగా ఓ అభిమాని వరల్డ్‌కప్‌లో ముషీర్ ఆడిన కొన్ని షాట్లను ఎడిట్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. అంతలా ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. Musheer khan channels his inner Ms Dhoni, Sachin Tendulkar, Suryakumar yadav #U19WorldCup2024 #IndianCricket pic.twitter.com/WJJLoyy4RU — Sahil (@Vijayfans45) January 31, 2024 నిలకడ, దూకుడు, వైవిధ్యంతో పాటు బలమైన టెక్నిక్ కలిగిన ముషీర్.. తనలో భారత క్రికెట్ దిగ్గజాల టాలెంట్ అంతా కలగలుపుకుని ఉన్నాడు. కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్న ముషీర్ ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తాను ఆడిన ప్రతి షాట్‌ను ఎంతో కాన్ఫిడెంట్‌గా ఆడాడు. ముషీర్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే.. అతను అచ్చుగుద్దినట్లు సచిన్, ధోని, సూర్యకుమార్ యాదవ్ ట్రేడ్‌మార్క్ షాట్లను ఆడాడు. ముషీర్ ఈ షాట్లు ఆడిన విధానం చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఈ కుర్రాడు దిగ్గజాలు ఆడిన షాట్లను ఎంత చక్కగా ఇమిటేట్ చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్‌లో ముషీర్‌తో పాటు అతని అన్న సర్ఫరాజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తుంది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి, అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడిన సర్ఫరాజ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా చోటు దక్కించుకున్నాడు. సర్ఫరాజ్ ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్‌లో అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తుంది. సర్ఫరాజ్, ముషీర్ల పేర్లు ఒకేసారి దేశం మొత్తం మార్మోగుతుండటంతో వీరి తండ్రి ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోతున్నాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు (ఐర్లాండ్‌పై 106 బంతుల్లో 118 పరుగులు, యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు), ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ముషీర్ అన్న సర్ఫరాజ్ సైతం 2016 అండర్-19 వరల్డ్‌కప్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుత అండర్-19 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత్.. అనధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యంగ్ ఇండియా తమ తదుపరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో (ఫిబ్రవరి 2) నేపాల్‌ను ఢీకొంటుంది. -
టీమిండియా ప్రపంచ రికార్డు
భారత యువ జట్టు అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో ఏ జట్టు సాధ్యం కాని ఓ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మెగా టోర్నీ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 200 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయాలు సాధించిన తొలి జట్టుగా యువ భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎడిషన్‌లో యంగ్ ఇండియా తొలుత గ్రూప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 201 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అనంతరం గ్రూప్ మ్యాచెస్‌లో భాగంగానే యూఎస్ఏను సైతం అదే 201 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీని తర్వాత సూపర్ సిక్స్ దశ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 214 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 200 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలుపొందిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత్.. అనధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. యంగ్ ఇండియా తమ తదుపరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో (ఫిబ్రవరి 2) నేపాల్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే భారత్ అధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. కాగా, ఈ టోర్నీలో యువ భారత్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో ముషీర్ ఖాన్ (సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు) లీడింగ్ రన్ స్కోరర్‌గా (4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 325 పరుగులు) కొనసాగుతుండగా.. బౌలింగ్ విభాగంలో సౌమీ పాండే లీడింగ్ వికెట్ టేకర్‌గా (4 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు) కొనసాగుతున్నాడు. -
అత్యంత అరుదైన ఘనత సాధించిన టీమిండియా బ్యాటర్
అండర్-19 వరల్డ్‌కప్‌లో సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తూ, పరుగుల వరద పారిస్తున్న యంగ్ ఇండియా బ్యాటర్ ముషీర్ ఖాన్.. న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్‌లో ఇప్పటికే ఓ సెంచరీతో (ఐర్లాండ్‌పై 106 బంతుల్లో 118 పరుగులు) చెలరేగిన ముషీర్.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీతో (126 బంతుల్లో 131 పరుగులు) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో ముషీర్ సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఒకటికంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ముషీర్‌కు ముందు టీమిండియా తరఫున సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ మాత్రమే సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేశాడు. తాజా ప్రదర్శనతో ముషీర్.. శిఖర్ సరసన నిలిచాడు. న్యూజిలాండ్‌పై సెంచరీతో ముషీర్ మరో ఘనతను కూడా సాధించాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా అవతరించాడు. ముషీర్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేశాడు. అన్న అడుగుజాడల్లో.. ఇటీవలే టీమిండియాకు ఎంపికైన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు సొంత తమ్ముడైన ముషీర్ అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు. 2016 అండర్-19 వరల్డ్‌కప్‌లో సర్ఫరాజ్ కూడా లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్న ముషీర్.. తర్వలో టీమిండియా తలుపులు కూడా తట్టే అవకాశం ఉంది. తాజా ప్రదర్శనలతో ముషీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని సైతం ఆకర్శించాడు. 2024 సీజన్ వేలంలో అన్ సోల్డ్‌గా మిగిలిపోయిన ముషీర్‌ను అవకాశం ఉంటే పంచన చేర్చుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన 18 ఏళ్ల ముషీర్.. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన ముషీర్.. ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 96 పరుగలు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన గ్రూప్-1 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో యువ భారత్ 214 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 2న ఆడనుంది. ఆ మ్యాచ్‌లో భారత్.. నేపాల్‌తో తలపడుతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న భారత్.. సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
‘బుమ్రా గొప్పొడే కానీ...’
సొంత గడ్డపై జరుగుతున్న అండర్-19 వరల్డ్‌కప్-2024లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ప్రోటీస్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో సఫారీ స్పీడ్‌స్టర్ క్వేనా మఫాకా ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 9.1 ఓవర్లు బౌలింగ్ చేసిన మఫాకా 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తన అద్బుత ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు 17 ఏళ్ల మఫాకాకు వరించింది. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మఫాకా మాట్లాడుతూ.. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో మఫాకా వికెట్ పడగొట్టిన ప్రతీసారి బుమ్రా స్టైల్లోనే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. వికెట్ తీసినప్పుడు ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుపుకోవాలో ప్రపంచ కప్‌కు ముందు నా సోదరుడిని అడిగాను. అతడు నాకు తెలియదు అని సమాధనమిచ్చాడు. అందుకు బదులుగా వెంటనే నేను 'ఐ డోంట్ నో' సెలబ్రేషన్స్ జరుపుకుంటానని నవ్వుతూ అన్నాను. అందుకే బుమ్రా సెలబ్రేషన్స్‌ను అనుకరించాలని నిర్ణయించుకున్నాను. బమ్రా కూడా వికెట్ పడగొట్టిన పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోడు. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడు. అయితే బుమ్రా కంటే నేను బెటర్ అనుకుంటున్నా అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాకా పేర్కొన్నాడు. చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు! -
న్యూజిలాండ్ తరఫున సెంచరీ బాదిన విజయవాడ కుర్రాడు
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్‌లో తెలుగు కుర్రాడు స్నేహిత్ రెడ్డి సెంచరీ బాదాడు. నేపాల్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో స్నేహిత్ 125 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేశాడు. పేరు, విజయవాడను చూసి స్నేహిత్ భారత్ తరఫున సెంచరీ బాదాడని అనుకుంటే పొరబడినట్టే. స్నేహిత్ సెంచరీ చేసింది న్యూజిలాండ్ తరఫున. 17 ఏళ్ల స్నేహిత్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టినప్పటికీ.. అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్‌కు వలస వెళ్లడంతో ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. స్నేహిత్లా న్యూజిలాండ్‌కు వలస వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు ఆడిన క్రికెటర్లు చాలామంది ఉన్నారు. భారత్ వేదికగా ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ తరఫున సంచలన ప్రదర్శనలు చేసిన రచిన్ రవీంద్ర తల్లిదండ్రులది కూడా ఇండియానే. ప్రస్తుత న్యూజిలాండ్ జట్టులో స్నేహిత్‌తో పాటు భారతీయ మూలాలు ఉన్న మరో ఆటగాడు కూడా ఉన్నాడు. 18 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఒలివర్ తెవాతియా న్యూఢిల్లీలో పుట్టి, ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్నేహిత్ విషయానికొస్తే.. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. స్నేహిత్ విద్యాభ్యాసం, క్రికెట్ సాధన అంతా న్యూజిలాండ్‌లో జరిగింది. కుడి చేతి బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన స్నేహిత్ న్యూజిలాండ్ మాజీ ఆటగాళ్లు బీజే వాట్లింగ్, క్రెయిగ్ కుగ్గెలిన్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. అండర్ 15, అండర్ 17 టోర్నీల్లో పరుగుల వరద పారించిన స్నేహిత్ పేరు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో సెన్సేషన్‌గా మారింది. స్నేహిత్ ప్రస్తుత న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్‌లను అమితంగా ఇష్టపడతాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అండర్ 19 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ నేపాల్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. స్నేహిత్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్నేహిత్‌తో పాటు కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ (75) రాణించాడు. భారత్‌లో పుట్టిన మరో కివీస్ క్రికెటర్ తెవాతియా డకౌటయ్యాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్.. 6 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. -
సౌతాఫ్రికా సిరీస్, 2024 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన
సౌతాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది (2024) జరిగే అండర్ 19 వరల్డ్‌కప్ కోసంభారత యువ జట్టును ఇవాళ (డిసెంబర్ 12) ప్రకటించారు. వరల్డ్‌కప్‌తో పాటు దానికి ముందు సౌతాఫ్రికాలోనే జరిగే ట్రై సిరీస్‌కు కూడా సెలెక్టర్లు ఇవాళే ఉమ్మడి జట్టును ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్‌గా ఉదయ్ సహరన్, వైస్ కెప్టెన్‌గా సౌమీ కుమార్ పాండేను ఎంపిక చేశారు. రెగ్యులర్ జట్టుతో పాటు ట్రావెలింగ్ స్టాండ్ బైలు, బ్యాకప్ ప్లేయర్లను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. మొత్తంగా 22 మంది సభ్యుల జంబో బృందాన్ని భారత సెలెక్టర్లు ఇవాళ ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 మధ్య జరిగే వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జనవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. భ్లోంఫాంటీన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో యంగ్ ఇండియా.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అనంతరం భారత్.. జనవరి 25, 28 తేదీల్లో ఐర్లాండ్, యూఎస్ఏలతో తమ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడనుంది. మెగా టోర్నీకి ముందు యంగ్ ఇండియా.. ఇంగ్లండ్, సౌతాఫ్రికాలతో కలిసి ట్రై సిరీస్ ఆడుతుంది. ఈ టోర్నీ డిసెంబర్ 29న మొదలై వచ్చే ఏడాది జనవరి 10 వరకు సాగుతుంది. ట్రయాంగులర్ సిరీస్, అండర్ 19 వరల్డ్‌కప్ 2024 కోసం భారత జట్టు.. ఉదయ్ సహరన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అరవెల్లి అవినాశ్ రావ్ (వికెట్‌కీపర్), ఇన్నేశ్ మహాజన్ (వికెట్‌కీపర్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ ధాస్, ప్రియాన్షు మోలియా, ముషీర్ ఖాన్, మురుగన్ అభిషేక్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారి ట్రై సిరీస్‌కు ట్రావెలింగ్ స్టాండ్ బై ప్లేయర్స్.. ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయ్, మొహమ్మద్ అమాన్ బ్యాకప్ ప్లేయర్స్.. దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి విజ్ఞేశ్, కిరణ్ చోర్మలే -
అండర్ 19 వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల
సౌతాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్ 2024 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (డిసెంబర్ 11) విడుదల చేసింది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జనవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. భ్లోంఫాంటీన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో యంగ్ ఇండియా.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అనంతరం భారత్.. జనవరి 25, 28 తేదీల్లో ఐర్లాండ్, యూఎస్ఏలతో తమ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 19న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఐర్లాండ్, యూఎస్ఏ జట్లు తలపడనున్నాయి. 16 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించడిన ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఎస్ఏ జట్లు ఉండగా.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు.. గ్రూప్-సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా జట్లు.. గ్రూప్-డిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్ జట్లు పోటీపడనున్నాయి. కాగా, తొలుత ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ భావించింది. అయితే ఆ దేశ క్రికెట్ బోర్డులో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఐసీసీ వేదికను దక్షిణాఫ్రికాకు మార్చింది.