U 19 WC- India Shaik Rasheed: పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించాడు తెలుగు కుర్రాడు షేక్ రషీద్. క్రికెట్‌పై మమకారాన్ని పెంచుకున్న అతడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ... తన కలను నెరవేర్చుకున్నాడు. అండర్-19 భారత జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగి సత్తా చాటాడు. ఆసియా వన్డే కప్‌ను యువ భారత్ సొంతం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు వరల్డ్‌కప్‌లోనూ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే పిచ్చి...
షేక్ రషీద్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. తల్లిదండ్రులు షేక్ బాలీషా, జ్యోతి. రషీద్‌కు అన్నయ్య రియాజ్ ఉన్నాడు. రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. రషీద్‌కు క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ. అందుకే ఎండైనా.. వానైనా .. ఏదీ లెక్కచేసేవాడు కాదు. ప్రాక్టీసుకు వెళ్లాలంటే వెళ్లాల్సిందే! అతడికి తండ్రి షేక్ బాలీషా ప్రోత్సాహం లభించింది.
ప్రైవేటు ఉద్యోగి అయిన బాలీషా మధ్య తరగతి కష్టాలు దాటుకుంటూనే... కుమారుడి అభీష్టాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగారు. రషీద్‌లోని ప్రతిభను గుర్తించిన బాలీషా స్నేహితుడు... తనను ప్రోత్సాహిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పిన మాటలు విని సంతోషించారు. కానీ.. అందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో మనసు చిన్నబుచ్చుకున్నారు. ఇంటి అద్దె కట్టడమే కష్టమైన సమయంలో క్రికెట్ ట్రెయినింగ్‌కు పంపడం అంటే మాటలా మరి! అయినా.. ఆయన ధైర్యం చేశారు. కొడుకు కోసం గుంటూరుకు మకాం మార్చారు.
తన లోకమే క్రికెట్..
అక్కడికి వెళ్లాక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అలాంటి సమయంలో.. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీ గురించి తెలుసుకున్న బాలీషా... కొడుకును అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి రషీద్ జీవితం మలుపు తిరిగింది. ఈ విషయాల గురించి జాతీయ మీడియాతో మాట్లాడిన బాలీషా.. ‘‘మూవీ లేదంటే పార్కుకు తీసుకువెళ్లమని తను ఎప్పుడూ నన్ను అడుగలేదు. ఏదైనా బొమ్మ లేదంటే గాడ్జెట్ కావాలని కోరలేదు. ఎప్పుడూ క్రికెటే తన లోకం. నా స్థాయికి తగ్గట్లు నేను ఏం చేయగలనో అది చేశాను’’ అని ఉద్వేగానికి లోనయ్యారు.
సూపర్ హిట్టు ఇన్నింగ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
ఇటీవలే అండర్ 19 భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు షేక్ రషీద్. ఆసియా వన్డే కప్‌లో బ్యాటర్‌గా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. 188 పరుగులతో రాణించాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 90 పరగులు సాధించి ఇండియాను ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లోనూ ఇదే తరహాలో రాణించాడు. 108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 94 పరుగులు సాధించాడు.
సెంచరీ చేజారిందన్న లోటే కానీ... కెప్టెన్ యశ్ ధుల్‌తో కలిసి జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లడంలో రషీద్ పాత్ర మరువలేనిది. ఇక క్వార్టర్ ఫైనల్‌కు ముందు కరోనా బారిన పడ్డాడు రషీద్. ఒకానొక సందర్భంలో టోర్నీలో ముందుకు సాగుతానా లేదోనన్న సందేహాలతో సతమతమైన అతడు.. త్వరగానే కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఫైనల్‌లో భారత్‌ను విజేతగా నిలపడం కోసం తన వంతు కృషి చేస్తానంటున్నాడు.
అద్భుతంగా అనిపిస్తోంది...
‘‘నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నా కుటుంబానికి ఎటువంటి క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయినా, మా అమ్మానాన్న, అన్నయ్య నన్ను ప్రోత్సహిస్తున్నారు. సెమీ ఫైనల్‌లో మా కెప్టెన్ కొన్ని సూచనలు చేశాడు. సలహాలు ఇచ్చాడు. మా బౌలర్లు టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నారు. భారత జట్టుకు ఆడటం అత్యద్భుతంగా అనిపిస్తోంది. అవును.. మేం ఫైనల్‌కు చేరుకున్నాం. నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్లకు ధన్యవాదాలు. నేను వరల్డ్‌కప్‌లో ఆడటం పట్ల నా శ్రేయోభిలాషులు ఎంతో సంతోషంగా ఉన్నారు. నన్ను టీవీలో చూసి వారు ఆనందిస్తూ ఉంటారు’’ అని రషీద్ భావోద్వేగానికి గురయ్యాడు. సెమీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత నియాల్ ఒ బ్రియెన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: Dewald Brevis- Shikhar Dhawan: సంచలన ఇన్నింగ్స్.. ఒకే ఒక్క పరుగు.. ధావన్ రికార్డు బద్దలు.. ప్రొటిస్ యువ కెరటం ఏబీడీ 2.0 ఘనత
Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా!
9⃣4⃣ Runs
— BCCI (@BCCI) February 2, 2022
1⃣0⃣8⃣ Balls
8⃣ Fours
1⃣ Six
SK Rasheed narrowly misses out on a ton but what a fine knock that was from the India U19 vice-captain!👏 👏 #BoysInBlue #INDvAUS #U19CWC
Follow the match ➡️ https://t.co/tpXk8p6Uw6 pic.twitter.com/6p1GvQKBaH
Shaik Rasheed, India vice-captain and one of the stars of the #INDvAUS semi-final, talks to Niall O’Brien on what it means to represent his country at the #U19CWC 2022 ✨ pic.twitter.com/CbSKRM8JKw
— ICC (@ICC) February 4, 2022
Comments
Please login to add a commentAdd a comment