U19 WC Vice-Captain Sheikh Rasheed Parents Get Emotional Wish Play For Team India - Sakshi
Sakshi News home page

U 19 WC- Shaik Rasheed: పాత మల్లాయపాలెం నుంచి ప్రపంచకప్‌ విజేత దాకా.. తన కోసం ఎన్ని తాగ్యాలకైనా మేము సిద్ధం: రషీద్‌ తల్లిదండ్రులు

Published Mon, Feb 7 2022 12:29 PM | Last Updated on Mon, Feb 7 2022 5:15 PM

U 19 WC: Shaik Rasheed Parents Gets Emotional Wish Play For Team India - Sakshi

U 19 World Cup- Shaik Rasheed Parents Comments: సత్తా ఉంటే సమస్యలు అడ్డంకిగా మారవని ... పట్టుదల ఉంటే పైపైకి దూసుకుపోవచ్చని షేక్‌ రషీద్‌ నిరూపించాడు. అండర్‌–19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన అతను ఫైనల్లోనూ కీలక అర్ధ సెంచరీతో జట్టును విజయం దిశగా నడిపించాడు.  

ఏసీఏ అండదండలతో... 
రషీద్‌ తండ్రి బాలీషా ప్రైవేట్‌ ఉద్యోగి. స్వస్థలం ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెం గ్రామం. చాలా ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఇంటర్‌ స్కూల్‌ టోర్నీల్లో ఆడుతూ వచ్చాడు. అయితే 2014లో కుటుంబం మళ్లీ గుంటూరుకు తిరిగొచ్చింది. ఇక్కడికి వచ్చాక రషీద్‌ ప్రతిభను ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) గుర్తించింది.

అతనికి క్రికెట్‌ పరంగా పూర్తి సౌకర్యాలు కల్పించడంతో పాటు చదువు బాధ్యత కూడా తీసుకొని మంగళగిరి అకాడమీలో తీసు కుంది. మరోవైపు తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... తండ్రిగా బాలీషా తన కొడుకుకు అండగా నిలవడంలో ఎక్కడా వెనుకాడలేదు. ఈ క్రమంలో ఆర్థికపరంగా ఆయన పలు సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే ఆటగాడిగా రషీద్‌ పురోగతి తల్లి దండ్రులకు సంతోషపెట్టింది.

అకాడమీలో ఏసీఏ కోచ్‌ కృష్ణారావు శిక్షణ, ఏసీఏ సభ్యుడు ఎన్‌.సీతాపతిరావు చూపించిన ప్రత్యేక శ్రద్ధ ఈ చిన్నోడికి కలిసొచ్చింది. ప్రతిభకు తోడు పట్టుదలతో తన ఆటకు అతను మరింత మెరుగులు దిద్దుకున్నాడు.  

ఒక్కో మెట్టే ఎక్కుతూ... 
అకాడమీలో శిక్షణ తీసుకుంటూ 11 ఏళ వయస్సు లోనే అండర్‌–14 జిల్లా జట్టుకు ఎంపికై చక్కని ఆటతీరును ప్రదర్శించడంతో రషీద్‌కు ఆంధ్ర జట్టులో స్థానం లభించింది. ఇక ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. నిలకడైన ప్రదర్శనతో వరుసగా అన్ని వయోవిభాగాల్లోనూ రషీద్‌ అవకాశాలు దక్కించుకున్నాడు. ఆటను మరింత మెరుగుపర్చు కుంటున్న దశలో ఏసీఏ ‘క్రికెట్‌ బియాండ్‌ బౌండరీస్‌’ కార్యక్రమం అతనికి ఎంతో మేలు చేసింది.

దీని ద్వారా రెండు నెలల పాటు ఇంగ్లండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకునే అవకాశం కలిగింది. ఆ తర్వాత అతను ఆటలో మరింత పదును పెరిగింది. ఈ ఏడాది వినూమన్కడ్‌ ట్రోఫీలో ఆంధ్ర కెప్టెన్‌గా ఆడి 376 పరుగులు చేయడం, ఆ తర్వాత చాలెంజర్‌ ట్రోఫీలోనూ సత్తా చాటడంతో ఆసియా కప్‌ టీమ్‌లోకి రషీద్‌ ఎంపికయ్యాడు. అదే జోరులో అతనికి భారత వైస్‌ కెప్టెన్‌గా ప్రపంచ కప్‌ ఆడే అవకాశం కూడా దక్కింది. ఇప్పుడు దానిని కూడా రెండు చేతులా పూర్తిగా అందిపుచ్చుకున్న రషీద్‌ భవిష్యత్తు తారగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

మా అబ్బాయి శ్రమ ఈ దేశానికి ఉపయోగపడాలి. భవిష్యత్‌లో అతను దేశం గర్వించదగ్గ గొప్ప క్రికెటర్‌ అవ్వాలి. దాని కోసం మేము ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం.  ఆర్థిక ఇబ్బందులతో రషీద్‌ కెరీర్‌పై ఆందోళన కలిగిన సమయంలో మాకు మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్‌ అకాడమీ అండగా నిలిచింది.  
–రషీద్‌ తల్లిదండ్రులు జ్యోతి, బాలీషా 

చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement