సౌతాఫ్రికా క్రికెట్‌ టీమ్‌కు అభిమానిగా ఉండటం చాలా కష్టం..! | U19 Womens T20 WC 2025 Final: Constant Heartbreaks For South Africa, Their Fourth Loss In An ICC Final In Less Than Two Years | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా క్రికెట్‌ టీమ్‌కు అభిమానిగా ఉండటం చాలా కష్టం..!

Published Sun, Feb 2 2025 6:29 PM | Last Updated on Sun, Feb 2 2025 7:15 PM

der 19 Womens T20 World Cup 2025 Final: Constant Heartbreaks For South Africa, Their Fourth Loss In An ICC Final In Less Than Two Years

టన్నుల కొద్ది టాలెంట్‌ ఉన్నా గ్రాము అదృష్టం కూడా లేని క్రికెట్‌ జట్టు ఏదైనా ఉందా అంటే అది దక్షిణాఫ్రికా (South Africa) జట్టే అని చెప్పాలి. ఇటీవలికాలంలో ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే ఇది వందకు వంద శాతం నిజం అనిపిస్తుంది. జెండర్‌తో, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆ జట్టు ఇటీవలికాలంలో వరుసగా మెగా టోర్నీల ఫైనల్స్‌లో ఓడుతుంది. రెండేళ్ల వ్యవధిలో సౌతాఫ్రికా పురుషుల, మహిళల జట్లు నాలుగు టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో ఓడాయి. 

2023 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ (T20 World Cup) ఫైనల్స్‌లో తొలిసారి ఓడిన సౌతాఫ్రికా... ఆ మరుసటి ఏడాది పురుషులు, మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ ఓటమి చవిచూసింది. తాజాగా ఆ దేశ మహిళల అండర్‌-19 జట్టు.. టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో భారత్‌ (Team India) చేతిలో పరాజయంపాలైంది.

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్‌ జట్లపై సానుభూతి వెల్లువెత్తుతుంది. నెటిజన్లు సౌతాఫ్రికా క్రికెట్‌ టీమ్‌లపై తెగ జాలి చూపుతున్నారు. ఏ జట్టుకైనా అభిమానిగా ఉండవచ్చు కానీ.. వరుస ఫైనల్స్‌లో ఓడుతున్న సౌతాఫ్రికా క్రికెట్‌ టీమ్‌లకు అభిమానిగా ఉండటం మాత్రం చాలా కష్టమని అంటున్నారు. 

సౌతాఫ్రికా క్రికెట్‌ జట్లకు గతంలో సెమీఫైనల్‌ ఫోబియా ఉండేది. ప్రస్తుతం అది పోయి ఫైనల్‌ ఫోబియా పట్టుకున్నట్లుంది. సౌతాఫ్రికా పురుషుల క్రికెట్‌ జట్టు త్వరలో మరో మెగా ఈవెంట్‌ ఫైనల్స్‌లో (వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్స్‌లో) ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈసారైనా సౌతాఫ్రికా ఫైనల్‌ ఫోబియాను అధిగమించి టైటిల్‌ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా, 2023 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సౌతాఫ్రికా.. ఆ మరుసటి ఏడాది జరిగిన పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో భారత్‌ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. అదే ఏడాది జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైన పొట్రిస్‌ జట్టు.. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన 2025 అండర్‌ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో యంగ్‌ ఇండియా చేతిలో చావుదెబ్బతింది.

ఇదిలా ఉంటే, మలేసియాలో జరిగిన ఐసీసీ అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ విజేతగా నిలిచింది. ఇవాళ జరిగిన ఫైనల్లో యంగ్‌ ఇండియా సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీ ఇనాగురల్‌ ఎడిషన్‌లోనూ (2023) భారత్‌ విజేతగా నిలిచింది. 

ఫైనల్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) 3, పరునిక సిసోడియా, ఆయూశి శుక్లా, వైష్ణవి శర్మ తలో 2, షబ్నమ్‌ షకీల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మికీ వాన్‌ వూర్స్ట్‌ (23) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. జెమ్మా బోథా (16), కరాబో మెసో (10), ఫే కౌలింగ్‌ (15) రెండంకెల స్కోర్లు చేశారు.

83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. 11.2 ఓవర్లలో (వికెట్‌ కోల్పోయి) ఆడుతూపాడుతూ విజయం సాధించింది. బంతితో మెరిసిన త్రిష బ్యాటింగ్‌లోనూ చెలరేగి 33 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ సనికా ఛల్కే 22 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసింది. ఈ టోర్నీ మొత్తంలో భారత్‌ అజేయంగా నిలిచింది. టోర్నీ ఆధ్యాంతం బ్యాట్‌తో, బంతితో రాణించిన త్రిషకు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డుతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement