సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్‌లో తెలుగు కుర్రాడు స్నేహిత్ రెడ్డి సెంచరీ బాదాడు. నేపాల్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో స్నేహిత్ 125 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేశాడు. పేరు, విజయవాడను చూసి స్నేహిత్ భారత్ తరఫున సెంచరీ బాదాడని అనుకుంటే పొరబడినట్టే. స్నేహిత్ సెంచరీ చేసింది న్యూజిలాండ్ తరఫున.
17 ఏళ్ల స్నేహిత్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టినప్పటికీ.. అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్‌కు వలస వెళ్లడంతో ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. స్నేహిత్‌లా న్యూజిలాండ్‌కు వలస వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు ఆడిన క్రికెటర్లు చాలామంది ఉన్నారు. భారత్ వేదికగా ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ తరఫున సంచలన ప్రదర్శనలు చేసిన రచిన్ రవీంద్ర తల్లిదండ్రులది కూడా ఇండియానే.
ప్రస్తుత న్యూజిలాండ్ జట్టులో స్నేహిత్‌తో పాటు భారతీయ మూలాలు ఉన్న మరో ఆటగాడు కూడా ఉన్నాడు. 18 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఒలివర్ తెవాతియా న్యూఢిల్లీలో పుట్టి, ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
స్నేహిత్ విషయానికొస్తే.. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. స్నేహిత్ విద్యాభ్యాసం, క్రికెట్ సాధన అంతా న్యూజిలాండ్‌లో జరిగింది. కుడి చేతి బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన స్నేహిత్ న్యూజిలాండ్ మాజీ ఆటగాళ్లు బీజే వాట్లింగ్, క్రెయిగ్ కుగ్గెలిన్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. అండర్ 15, అండర్ 17 టోర్నీల్లో పరుగుల వరద పారించిన స్నేహిత్ పేరు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో సెన్సేషన్‌గా మారింది. స్నేహిత్ ప్రస్తుత న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్‌లను అమితంగా ఇష్టపడతాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అండర్ 19 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ నేపాల్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. స్నేహిత్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్నేహిత్‌తో పాటు కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ (75) రాణించాడు. భారత్‌లో పుట్టిన మరో కివీస్ క్రికెటర్ తెవాతియా డకౌటయ్యాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్.. 6 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment