మనమే చాంపియన్స్‌ | India beat New Zealand by 4 wickets in Champions Trophy final | Sakshi
Sakshi News home page

మనమే చాంపియన్స్‌

Published Mon, Mar 10 2025 4:00 AM | Last Updated on Mon, Mar 10 2025 6:39 AM

India beat New Zealand by 4 wickets in Champions Trophy final

చాంపియన్స్‌ ట్రోఫీ విజేత భారత్‌

మూడోసారి టైటిల్‌ గెలిచిన టీమిండియా

ఫైనల్లో న్యూజిలాండ్‌పై 4 వికెట్లతో విజయం

రోహిత్‌ శర్మ అర్ధ సెంచరీ

రాణించిన నలుగురు స్పిన్నర్లు వరుణ్, జడేజా, కుల్దీప్, అక్షర్‌  

భారత జట్టు మరోసారి తమ చాంపియన్‌ ఆటను ప్రదర్శించింది. తొలి మ్యాచ్‌ నుంచి అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన జట్టు అజేయంగా విజయప్రస్థానాన్ని ముగించింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సమష్టి ఆటతో ఒక్కో ప్రత్యర్థిని పడగొడుతూ వచ్చిన జట్టు తమ స్థాయికి తగ్గ విజయాన్ని అందుకుంది. ఏడాది వ్యవధిలో మరో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టైటిల్‌ను సొంతం చేసుకొని ప్రపంచ క్రికెట్‌పై తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమిని పూర్తిగా మరచిపోయేలా కాకపోయినా... ఈ ఫార్మాట్‌లో మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకొని అభిమానులకు ఆనందాన్ని పంచింది. 2013లాగే ఒక్క ఓటమి కూడా లేకుండా టీమిండియా ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. 

ఫైనల్లో టాస్‌ ఓడినా న్యూజిలాండ్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేయడంతోనే భారత్‌కు గెలుపు దారులు తెరుచుకున్నాయి. మన స్పిన్‌ చతుష్టయాన్ని ఎదుర్కోవడంలో మళ్లీ తడబడిన కివీస్‌ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఛేదనలో రోహిత్‌ శర్మ దూకుడైన ఆరంభం లక్ష్యాన్ని అందుకునేందుకు తగిన పునాది వేసింది. మధ్యలో కొద్దిసేపు కివీస్‌ స్పిన్నర్లూ ప్రభావం చూపడంతో 17 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో సమర్థమైన బ్యాటింగ్‌ లైనప్‌ తడబడకుండా టీమ్‌ను విజయతీరం చేర్చింది. క్రికెట్‌లో ‘మంచి బాలురు’వంటి న్యూజిలాండ్‌ టీమ్‌ మరోసారి ‘పోరాడి ఓడిన’ ముద్రతోనే నిరాశగా నిష్క్రమించింది.

దుబాయ్‌: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ–2025ను భారత్‌ సొంతం చేసుకుంది. లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్, ఫైనల్‌ కలిపి ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా జట్టు టైటిల్‌ గెలుచుకుంది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 4 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్‌ న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. గతంలో భారత్‌ 2002, 2013లలో కూడా చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను గెల్చుకుంది. 

ఫైనల్లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డరైల్‌ మిచెల్‌ (101 బంతుల్లో 63; 3 ఫోర్లు), మైకేల్‌ బ్రేస్‌వెల్‌ (40 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు సాధించి గెలిచింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (83 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగగా... శ్రేయస్‌ అయ్యర్‌ (62 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. టోర్నీ మొత్తంలో 263 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ ప్లేయర్‌ రచిన్‌ రవీంద్ర ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు గెల్చుకున్నాడు.  

మిచెల్‌ హాఫ్‌ సెంచరీ... 
కివీస్‌ ఇన్నింగ్స్‌ను రచిన్‌ రవీంద్ర (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా మొదలు పెట్టాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతను షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్‌ స్పిన్నర్‌ వరుణ్‌ను బౌలింగ్‌కు దింపింది. విల్‌ యంగ్‌ (23 బంతుల్లో 15; 2 ఫోర్లు)ను అవుట్‌ చేసి అతను ఓపెనింగ్‌ జోడీని విడదీశాడు. 10 ఓవర్లలో కివీస్‌ స్కోరు 69 పరుగులకు చేరింది. తన తొలి బంతికే రచిన్‌ను బౌల్డ్‌ చేసిన కుల్దీప్, తన రెండో ఓవర్లో విలియమ్సన్‌ (14 బంతుల్లో 11; 1 ఫోర్‌)ను పెవిలియన్‌ పంపించి ప్రత్య ర్థిని దెబ్బ కొట్టాడు.

లాథమ్‌ (30 బంతుల్లో 14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో మిచెల్, గ్లెన్‌ ఫిలిప్స్‌ (52 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడటంతో పరుగులు నెమ్మదిగా వచ్చాయి. వరుసగా 81 బంతుల పాటు బౌండరీనే రాలేదు. ఎట్టకేలకు 91 బంతుల్లో మిచెల్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. 

ఒక వైపు తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయినా... ఆఖర్లో బ్రేస్‌వెల్‌ వేగంగా ఆడటంతో జట్టు స్కోరు 250 పరుగులు దాటింది. చివరి 10 ఓవర్లలో కివీస్‌ 79 పరుగులు చేసింది. నలుగురు భారత స్పిన్నర్లు కలిపి 38 ఓవర్లలో 144 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా... ఇద్దరు పేసర్లు 12 ఓవర్లలో 104 పరుగులిచ్చి ఒకే వికెట్‌ తీయడం మన స్పిన్నర్ల ప్రభావాన్ని చూపించింది.  

రాణించిన అయ్యర్‌... 
ఇన్నింగ్స్‌ రెండో బంతికే సిక్స్‌తో మొదలు పెట్టిన రోహిత్‌ తన ఇన్నింగ్స్‌ ఆసాంతం దూకుడుగా ఆడాడు. నాథన్‌ స్మిత్‌ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 31; 1 సిక్స్‌) పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. 10 ఓవర్లలో స్కోరు 64 పరుగులు కాగా, 41 బంతుల్లోనే రోహిత్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఎట్టకేలకు శతక భాగస్వామ్యం తర్వాత గిల్‌ అవుట్‌ కావడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 

ఆపై మరో 17 పరుగుల తేడాతో రెండు కీలక వికెట్లు తీసి కివీస్‌ పైచేయి సాధించింది. బ్రేస్‌వెల్‌ తొలి బంతికి కోహ్లి (1) వికెట్ల ముందు దొరికిపోగా, రోహిత్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. ఈ దశలో అయ్యర్, అక్షర్‌ పటేల్‌ (40 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌) కలిసి చక్కటి సమన్వయంతో జాగ్రత్తగా ఆడుతూ మళ్లీ ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలో వెనక్కి పంపడంతో కివీస్‌ బృందంలో ఆశలు రేగాయి. 

అయితే కేఎల్‌ రాహుల్‌ (33 బంతుల్లో 34 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) ముందుండి నడిపిస్తూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. 68 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన రాహుల్‌కు హార్దిక్‌ పాండ్యా (18 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) సహకరించాడు. 49వ ఓవర్‌ చివరి బంతిని జడేజా (6 బంతుల్లో 9 నాటౌట్‌; 1 ఫోర్‌) డీప్‌స్క్వేర్‌ లెగ్‌ దిశగా ఫోర్‌ కొట్టడంతో భారత్‌ విజయాన్ని పూర్తి చేసుకుంది. 

స్కోరు వివరాలు  
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: యంగ్‌ (ఎల్బీ) (బి) వరుణ్‌ 15; రచిన్‌ (బి) కుల్దీప్‌ 37; విలియమ్సన్‌ (సి అండ్‌ బి) కుల్దీప్‌ 11; మిచెల్‌ (సి) రోహిత్‌ (బి) షమీ 63; లాథమ్‌ (ఎల్బీ) (బి) జడేజా 14; ఫిలిప్స్‌ (బి) వరుణ్‌ 34; బ్రేస్‌వెల్‌ (నాటౌట్‌) 53; సాంట్నర్‌ (రనౌట్‌) 8; స్మిత్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–57, 2–69, 3–75, 4–108, 5–165, 6–211, 7–239. బౌలింగ్‌: షమీ 9–0–74–1, పాండ్యా 3–0–30–0, వరుణ్‌ చక్రవర్తి 10–0–45–2, కుల్దీప్‌ యాదవ్‌ 10–0–40–2, అక్షర్‌ పటేల్‌ 8–0–29–0, రవీంద్ర జడేజా 10–0–30–1.  
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (స్టంప్డ్‌) లాథమ్‌ (బి) రచిన్‌ 76; శుబ్‌మన్‌ గిల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) సాంట్నర్‌ 31; కోహ్లి (ఎల్బీ) (బి) బ్రేస్‌వెల్‌ 1; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) రచిన్‌ (బి) సాంట్నర్‌ 48; అక్షర్‌ పటేల్‌ (సి) రూర్కే (బి) బ్రేస్‌వెల్‌ 29; కేఎల్‌ రాహుల్‌ (నాటౌట్‌) 34; హార్దిక్‌ పాండ్యా (సి అండ్‌ బి) జేమీసన్‌ 18; జడేజా (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–105, 2–106, 3–122, 4–183, 5–203, 6–241. బౌలింగ్‌: జేమీసన్‌ 5–0–24–1, రూర్కే 7–0–56–0, స్మిత్‌ 2–0–22–0, సాంట్నర్‌ 10–0–46–2, రచిన్‌ 10–1–47–1, బ్రేస్‌వెల్‌ 10–1–28–2, ఫిలిప్స్‌ 5–0–31–0.  

ఫిలిప్స్‌ అసాధారణం
ఫీల్డింగ్‌ అత్యుత్తమ ప్రమాణాలు చూపిస్తూ తన స్థాయిని పెంచుకున్న ఫిలిప్స్‌ ఆదివారం మరోసారి దానిని ప్రదర్శించాడు. షార్ట్‌ కవర్‌ వైపు గిల్‌ షాట్‌ ఆడగా అసాధారణంగా గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో ఫిలిప్స్‌ అందుకోవడం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఈ టోర్నీలో అతను ఇప్పటికే కోహ్లి, రిజ్వాన్‌ క్యాచ్‌లను కూడా ఇదే తరహాలో అందుకున్నాడు.  

క్యాచ్‌లు వదిలేశారు...
భారత జట్టు ఫీల్డింగ్‌లో పలు అవకాశాలు చేజార్చింది. కష్టసాధ్యమే అయినా ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసింది. అయితే లైఫ్‌ లభించిన ఆటగాళ్లెవరూ దానిని పెద్దగా సది్వనియోగం చేసుకోలేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. రచిన్‌ రవీంద్ర స్కోరు 29 వద్ద ఉన్నప్పుడు రెండుసార్లు బతికిపోయాడు. షమీ రిటర్న్‌ క్యాచ్‌ వదిలేయగా, అయ్యర్‌ మరో క్యాచ్‌ వదిలేశాడు. 

మిచెల్‌ స్కోరు 38 వద్ద రోహిత్‌ క్యాచ్‌ వదిలేయగా, ఫిలిప్స్‌ స్కోరు 27 వద్ద గిల్‌ క్యాచ్‌ వదిలేసి అవకాశమిచ్చాడు. ఆ తర్వాత కివీస్‌ కూడా గ్రౌండ్‌ ఫీల్డింగ్‌ అద్భుతంగా చేసినా... రెండు క్యాచ్‌లు వదిలేసింది. గిల్‌ 1 పరుగు వద్ద మిచెల్‌ క్యాచ్‌ వదిలేయగా, అయ్యర్‌ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు జేమీసన్‌ అతి సులువైన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. 

12 రోహిత్‌ శర్మ వరుసగా 12వసారి టాస్‌ ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా (12) రికార్డును సమం చేశాడు. అయితే మ్యాచ్‌లు గెలుస్తూ ఐసీసీ టైటిల్‌ సాధించిన వేళ ఇలాంటి టాస్‌లు ఎన్ని ఓడిపోయినా రోహిత్‌కు లెక్క లేదు!   

‘నేను రిటైర్‌ కావడం లేదు’ 
చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్‌ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం.  రాహుల్‌ మానసికంగా దృఢంగా ఉంటాడు. సరైన షాట్‌లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. 

అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్‌ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్‌ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. 

దూకుడుగా బ్యాటింగ్‌ చేసేందుకు నన్ను కోచ్‌ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్‌ కావడం లేదు. ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను    –రోహిత్, భారత కెప్టెన్ 

గొప్పగా అనిపిస్తోంది. ఆ్రస్టేలియాతో సిరీస్‌ తర్వాత సరైన రీతిలో పునరాగమనం చేయాలని భావించాం. కుర్రాళ్ళతో కలిసి ఆడటం ఎంతో బాగుంది. వారు సరైన సమయంలో స్పందిస్తూ జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. ఇన్నేళ్లుగా ఆడుతున్న తర్వాత ఒత్తిడి కొత్త కాదు. టైటిల్‌ గెలవాలంటే ఆటగాళ్లంతా రాణించాల్సి ఉంటుంది. అందరూ సమష్టిగా సత్తా చాటడంతోనే ఇది సాధ్యమైంది. సరైన, తగిన సమయం సమయం చూసి తప్పుకోవడం ముఖ్యం (రిటైర్మెంట్‌పై).    –విరాట్‌ కోహ్లి    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement