వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. యూఎస్‌ఏతో ఇవాళ (జూన్ 22) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆంధ్ర (విజయవాడ) క్రికెటర్ తేజ నిడమనురు బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (68 బంతుల్లో 58; 5 ఫోర్లు), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (60 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. షాయాన్ జహంగీర్ (71) అర్ధసెంచరీతో రాణించగా.. గజానంద్ సింగ్ (33), జెస్సీ సింగ్ (38) పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ర్యాన్ క్లీన్, బాస్ డి లీడ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. వాన్ బీక్, ఆర్యన్ దత్, క్లేటన్ ఫ్లాయిడ్, విక్రమ్‌జిత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
A fine half-century for Teja Nidamanuru ✨#CWC23 | 📝 #NEDvUSA: https://t.co/WIBObotfuN pic.twitter.com/WXYn5NaRwt
— ICC (@ICC) June 22, 2023
అనంతరం బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టీమ్.. 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. తేజ, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఆ జట్టును గెలిపించారు. మ్యాక్స్ ఓడౌడ్ (26), వెస్లీ బర్రెసీ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లలో జస్‌దీప్ సింగ్ 2, సౌరభ్ నేత్రావాల్కర్, అలీ ఖాన్, నోష్‌తుష్ కెంజిగే తలో వికెట్ పడగొట్టారు.
ఈ గెలుపుతో గ్రూప్-ఏలో నెదర్లాండ్స్ మూడో ప్లేస్‌కు (2 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, మరో ఓటమి) చేరగా.. 3 మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓటమిపాలైన యూఎస్‌ఏ టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లైంది. ఈ గ్రూప్ నుంచి ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన వెస్టిండీస్, జింబాబ్వే తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఇవాళ విండీస్ చేతిలో ఓడిన నేపాల్ నాలుగో స్థానంలో నిలిచింది.
గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఒమన్ (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) టాప్‌లో ఉండగా.. శ్రీలంక (2), స్కాట్లాండ్ (2), ఐర్లాండ్ (0), యూఏఈ (0) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరే రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment