Netherlands Cricket Team
-
T20 WC: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు
వెస్టిండీస్, అమెరికా వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ సారథ్యం వహించనున్నాడు. అయితే ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసిన డచ్ జట్టులో స్టార్ ప్లేయర్లు రోలోఫ్ వాన్ డెర్ మెర్వే కోలిన్ అకెర్మాన్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ జట్టులో టిమ్ ప్రింగిల్,కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్ వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కింది.డచ్ యువ సంచలనం లెవిట్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నమీబియాపై 62 బంతుల్లో 11 ఫోర్లు మరియు 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు చోటిచ్చారు. అదేవిధంగా తెలుగు కుర్రాడు తేజా నిడమనూరుకు సైతం వరల్డ్‌కప్‌లో జట్టులో ఛాన్స్ లభించింది. ఇక ఈ మెగా టోర్నీ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది.నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ జట్టు: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, డేనియల్ డోరమ్, ఫ్రెడ్ క్లాసెన్, లోగాన్ వాన్ బీక్, మాక్స్ ఓ'డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, ప్రింగ్లె , విక్రమ్ సింగ్, వివ్ కింగ్మా, వెస్లీ బరేసి.ట్రావెలింగ్ రిజర్వ్: కైల్ క్లైన్. -
టీమిండియా ఆఖరి ప్రాక్టీస్ మ్యాచ్.. వరుణుడు కరుణించేనా?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్-2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో ప్రధాన టోర్నీ ఆరంభానికి ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు పోరుకు ముందు టీమిండియా తమ చివరి సన్నహాక మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. తిరువనంతపురం వేదికగా మంగళవారం పసికూన నెదర్లాండ్స్‌తో భారత జట్టు తలపడనుంది. కాగా గౌహుతి వేదికగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయిపోయింది. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్‌లో తమ బలాబాలను పరీక్షించుకోవాలని భారత్ భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ సత్తా చాటేందుకు భారత జట్టుకు ఇదొక మంచి అవకాశం. మరోవైపు నెదర్లాండ్స్ కూడా తమ సత్తాచాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఆసీస్‌తో తొలి వార్మప్ మ్యాచ్ రద్దు అయినప్పటికీ.. నెదర్లాండ్స్ మాత్రం తమ బౌలింగ్‌తో అకట్టుకోంది. భారత్‌తో మ్యాచ్‌ను అన్ని రకాలుగా వినియోగించుకోవాలని డచ్ జట్టు భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. చదవండి: వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని: పాక్ స్టార్ ఆటగాడు -
నెదర్లాండ్స్‌ను గెలిపించిన ఆంధ్ర క్రికెటర్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. యూఎస్ఏతో ఇవాళ (జూన్ 22) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆంధ్ర (విజయవాడ) క్రికెటర్ తేజ నిడమనురు బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (68 బంతుల్లో 58; 5 ఫోర్లు), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (60 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. షాయాన్ జహంగీర్ (71) అర్ధసెంచరీతో రాణించగా.. గజానంద్ సింగ్ (33), జెస్సీ సింగ్ (38) పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ర్యాన్ క్లీన్, బాస్ డి లీడ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. వాన్ బీక్, ఆర్యన్ దత్, క్లేటన్ ఫ్లాయిడ్, విక్రమ్‌జిత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. A fine half-century for Teja Nidamanuru ✨#CWC23 | 📝 #NEDvUSA: https://t.co/WIBObotfuN pic.twitter.com/WXYn5NaRwt — ICC (@ICC) June 22, 2023 అనంతరం బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టీమ్.. 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. తేజ, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఆ జట్టును గెలిపించారు. మ్యాక్స్ ఓడౌడ్ (26), వెస్లీ బర్రెసీ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. యూఎస్ఏ బౌలర్లలో జస్దీప్ సింగ్ 2, సౌరభ్ నేత్రావాల్కర్, అలీ ఖాన్, నోష్తుష్ కెంజిగే తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గ్రూప్-ఏలో నెదర్లాండ్స్ మూడో ప్లేస్‌కు (2 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, మరో ఓటమి) చేరగా.. 3 మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓటమిపాలైన యూఎస్ఏ టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లైంది. ఈ గ్రూప్ నుంచి ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన వెస్టిండీస్, జింబాబ్వే తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఇవాళ విండీస్ చేతిలో ఓడిన నేపాల్ నాలుగో స్థానంలో నిలిచింది. గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఒమన్ (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) టాప్‌లో ఉండగా.. శ్రీలంక (2), స్కాట్లాండ్ (2), ఐర్లాండ్ (0), యూఏఈ (0) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరే రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. -
ఆంధ్ర టు డచ్ వయా ఆక్లాండ్...
ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి ఆటలను విపరీతంగా ఇష్టపడ్డాడు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆటగాడిగా మారాలనే కోరిక కూడా పెరుగుతూ వచ్చింది. సొంత ఊరు వదిలినా, దేశాలు మారినా ఆ ఆలోచన మనసులోంచి పోలేదు. అన్ని రకాల క్రీడలూ ప్రయత్నించిన తర్వాత క్రికెట్ వద్ద అతను ఆగాడు. అందులోనే అగ్ర స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆపై దానిని చేరుకునేందుకు అన్ని రకాలుగా శ్రమించాడు. ఆ క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదురైనా ఎక్కడా ఆశ కోల్పోలేదు. చివరకు తాను పుట్టిన, పెరిగిన దేశం కాకుండా ఉపాధి కోసం వెళ్లిన మూడో దేశం తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ముద్ర వేయించుకొని సగర్వంగా నిలిచాడు. అతని పేరే అనిల్ తేజ నిడమనూరు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగి ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టుకు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహిస్తున్న తేజపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అంతర్జాతీయ క్రికెటర్ కావాలనే ఏకైక లక్ష్యంతో అన్ని ప్రయత్నాలూ చేశాను. ఇందు కోసం చాలా కష్టపడ్డా. ఏదీ సునాయాసంగా దక్కలేదు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా పట్టుదలగా నిలబడ్డా. న్యూజిలాండ్‌లో నా 16 ఏళ్ల వయసులోనే అమ్మానాన్న భారత్‌కు వెనక్కి వచ్చేశారు. నేను కూడా రావాల్సి ఉండగా, కెరీర్‌ను నిర్మించుకుంటున్న దశలో రాలేనని చెప్పా. అప్పటి నుంచి అన్నీ నేనే సొంతంగా చేసుకున్నా. పార్ట్‌టైమ్ జాబ్‌లు చేస్తూ క్రికెట్‌ను మాత్రం వదల్లేదు. ఎవరి అండ లేకపోయినా, డచ్ భాష రాకపోయినా మొండిగా నెదర్లాండ్స్‌లో అడుగు పెట్టా. ఇదంతా నా స్వయంకృషి. ఈ ఏడాది జూన్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో రాణించి మా జట్టు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తే భారత్‌లో ఆడే అవకాశం వస్తుంది. అదే జరిగితే నా కెరీర్లో గొప్ప క్షణం అవుతుంది. అందు కోసం ఎదురు చూస్తున్నా. –‘సాక్షి’తో తేజ నిడమనూరు సాక్షి, హైదరాబాద్: నెదర్లాండ్స్ క్రికెట్ టీమ్‌లో ఇప్పుడు తేజ నిడమనూరు కీలక సభ్యుడు. గత వారం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో అజేయ సెంచరీలతో అతను జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది మేలో తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతను ఇప్పటి వరకు 11 వన్డేలు, 6 టి20లు ఆడాడు. దక్షిణాఫ్రికాతో శుక్ర, ఆదివారాల్లో జరిగే వన్డే మ్యాచ్‌లకు తేజ ప్రస్తుతం సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తేజ తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. క్రికెటర్‌గా ప్రాథమికాంశాలు నేర్చుకోవడం మొదలు అవకాశాల కోసం యూరోప్ దేశం చేరడం వరకు అతని ప్రస్థానంలో అనేక మలుపులున్నాయి. అలా మొదలైంది... తేజ స్వస్థలం విజయవాడ. తేజ తల్లిదండ్రులు పాండురంగారావు, పద్మావతి మెరుగైన ఉపాధి అవకాశాల కోసం న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. దాంతో 2001లో ఏడేళ్ల వయసులో తేజ కొత్త జీవితం కూడా అక్కడే ప్రారంభమైంది. పాఠశాలలో చదువుతున్న సమయంలోనే భిన్నమైన ఆటల్లో తేజ రాణించాడు. ముఖ్యంగా కివీస్ అభిమాన క్రీడ రగ్బీలో కూడా అతను పట్టు సంపాదించాడు. అయితే అనుకోకుండా క్రికెట్‌పై కలిగిన ఆసక్తి పూర్తిగా ఈ క్రీడ వైపు మళ్లేలా చేసింది. ఆక్లాండ్‌లో తల్లి పని చేస్తున్న సంస్థ పక్కనే ప్రఖ్యాత ‘కార్న్‌వాల్ క్రికెట్ క్లబ్’ ఉంది. న్యూజిలాండ్‌లో అతి పెద్ద క్లబ్‌లలో ఒకటైన ఇక్కడే పలువురు దిగ్గజ క్రికెటర్లు మార్టిన్ క్రో, గ్రేట్‌బ్యాచ్, ఆడమ్ పరోరె తమ ఆటను మొదలు పెట్టారు. ఈ క్లబ్లో రోజూ క్రికెట్ చూస్తూ తేజ కూడా ఆకర్షితుడయ్యాడు. దాంతో తల్లిదండ్రులు అతడిని ఇందులో చేర్పించారు. ఆపై అతని క్రికెట్ సాధన మొదలైంది. చురుకైన ఆటతో వేగంగా పట్టు పెంచుకున్న తేజ స్థానిక లీగ్‌లలో సత్తా చాటడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఇదే క్రమంలో ఆక్లాండ్ ‘ఎ’ టీమ్‌లో అతను చోటు దక్కించుకున్నాడు. అక్కడా స్థానం లభించడంతో ఆక్లాండ్ సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ‘క్రికెట్‌ను ఎంచుకున్న తర్వాత ఎక్కడా నేను ఉదాసీనతకు చోటు ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని గట్టిగా నిర్ణయించుకొని సుదీర్ఘ సమయాల పాటు ప్రాక్టీస్ చేస్తూ ఒకే లక్ష్యంతో సాగాను. నా ప్రదర్శనపై ప్రశంసలు రావడం, పలువురు ప్రోత్సహించడంతో భవిష్యత్తుపై స్పష్టత వచ్చింది’ అని తేజ చెప్పాడు. అవకాశాలు దక్కకపోవడంతో... అయితే ఆటలో ఎదుగుతున్న కొద్దీ తేజకు ఊహించని పరిణామాలు ఆక్లాండ్‌లో ఎదురయ్యాయి. కేవలం అంకెలు, రికార్డులు మాత్రమే మెరుగైన అవకాశాలు కలి్పంచలేవని అతనికి అర్థమైంది. సీని యర్లు టీమ్‌లో పాతుకుపోవడం, వేర్వేరు కారణాల వల్ల అతనికి పూర్తి స్థాయిలో తన సత్తా చాటే అవకాశం రాలేదు. అయితే ఆటకు విరామం మాత్రం ఇవ్వరాదని పట్టుదలగా భావించడంతో మరో ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చింది. ముందుగా ఇంగ్లండ్ కౌంటీ డర్హమ్ మైనర్ లీగ్‌లలో అడుగు పెట్టిన తేజ ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో లీగ్‌లు ఆడేందుకు ఆరు నెలల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఒప్పందం ప్రకారం నిర్ణీత సమయం ముగిసిన తర్వాత మళ్లీ కివీస్‌కు వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలోనూ క్రికెట్‌ను వదలకూడదనుకున్నాడు. సరైన దిశలో... నెదర్లాండ్స్‌లో గతంలో ఆడిన అనుభవం సరైన సమయంలో తేజకు పనికొచ్చింది. అక్కడే ఉండి పూర్తి స్థాయిలో క్రికెట్ ఆడితే భవిష్యత్తులో పైకి ఎదగవచ్చని అర్థమైంది. అయితే అలా చేయాలంటే ముందు అక్కడ ఒక ఉద్యోగంలో చేరాలి. దాంతో తాను చేసిన స్పోర్ట్స్ మేనేజ్మెంట్ డిగ్రీతో ఉద్యోగ ప్రయత్నం చేశాడు. అయితే అతని అర్హత ప్రకారం కాకుండా మరో రూపంలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ‘స్టార్ట్‌ఎక్స్’ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 2019 మే నెలలో తేజ నెదర్లాండ్స్ గడ్డపై చేరాడు. నిబంధన ప్రకారం జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపిక కావాలంటే కనీసం మూడేళ్లు నివాసం ఉండాలి. అయితే కొద్ది రోజులకే ‘కరోనా’ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆటను తీసి కొంత కాలం గట్టున పెట్టాల్సి వచ్చింది! ఇలాంటి స్థితిలో మరోసారి క్రికెట్ కెరీర్ సందేహంలో పడింది. అయినా సరే, తేజ వెనక్కి తగ్గలేదు. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు క్రికెట్ ఆడుతూ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకున్నాడు. సెలక్షన్ టోర్నీల్లో సత్తా చాటి ఎట్టకేలకు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 2022 ఏప్రిల్‌లో మూడేళ్లు ముగియగా, మే 31న ఆమ్స్టెల్వీన్లో వెస్టిండీస్‌తో తొలి వన్డే ఆడటంతో అతని స్వప్నం సాకారమైంది. 51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 58 పరుగులు చేసిన తేజ అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా మొదలు పెట్టాడు. -
క్రికెట్ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు
క్రికెట్‌ను విపరీతంగా ఆదరించే టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో పుట్టిన ఆటగాళ్లకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ టోర్నీలో అవకాశాలు రాకపోయినప్పటికి దేశవాలీ టోర్నీలు వారి ఆకలి బాధలు తీర్చడంతో పాటు డబ్బుల సంపాదన కూడా బాగానే ఉంటుంది. ఐపీఎల్ పుణ్యమా అని భారత్‌లో అంతగా పాపులర్ కానీ క్రికెటర్లు కూడా కోటీశ్వరులుగా మారిపోతున్నారు. కానీ నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్లకు ఆ అవకాశం ఉండదు. ఐసీసీ లాంటి మేజర్ టోర్నీలు తప్ప వారికి పెద్దగా మ్యాచ్‌లు ఉండవు. ఇలాంటి మేజర్ టోర్నీల్లో క్వాలిఫయింగ్ అయితే ఇంకా గొప్ప. నెదర్లాండ్స్ మాత్రమే కాదు.. స్కాట్లాండ్, నమీబియా, యూఏఈ లాంటి దేశాల్లో క్రికెట్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు. అయినా క్రికెట్‌పై ఉండే ఇష్టంతో ఆ దేశాలకు చెందిన వారు క్రికెటర్లుగా మారి ఆడుతున్నారు. అయితే క్రికెటర్‌గా మారిన ప్రతీ వ్యక్తి జీవితం ఒకేలా ఉండదు. కొందరు క్రికెట్ ఆడకపోయినా వేరే వ్యాపారాలు.. లేదంటే ఎక్కడైనా వర్క్ చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటారు. కొందరు మాత్రం క్రికెట్‌పైనే ప్రాణం పెట్టుకుంటారు. ఆ కొందరిలో ఒకడు నెదర్లాండ్స్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్. ఈ పేరు పెద్దగా ఎవరికి పరిచయం లేకపోవచ్చు. కానీ గురువారం టీమిండియాతో ఆడిన మ్యాచ్‌లో ఈ నెదర్లాండ్స్ బౌలర్ కేఎల్ రాహుల్ వికెట్ దక్కించుకొని గుర్తింపు పొందాడు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు నుంచి చూస్తే మీకెరెన్ జీవితం బయటపడుతుంది.క్రికెట్‌ను అమితంగా ప్రేమించే పాల్ వాన్ మీకెరెన్ ఆట ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు ఉండాల్సిందే. ఆటపై పెంచుకున్న ఇష్టంతో 2013లో నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు పాల్ వాన్ మీకెరెన్. మేటి క్రికెటర్‌గా రాణించాలని కలలు గన్న మీకెరెన్ జీవితాన్ని కరోనా అతలాకుతలం చేసింది. కరోనా దెబ్బకు మ్యాచ్‌లు లేకపోవడంతో పాల్ కుటుంబం రోడ్డుపై పడింది. ఒకపూట తిండి తినడానికి కష్టంగా మారడంతో క్రికెట్ బ్యాట్‌ను వదిలి ఆటో డ్రైవర్‌గా మారాడు. తన కుటుంబాన్ని పోషించడం కోసం ఉబెర్ ఈట్స్ ఫుడ్ డెలివరీ డ్రైవర్‌గా ఉద్యోగం చేశాడు. అయితే కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత తనకు ఇష్టం లేని పనిని వదిలేసి ఎంత కష్టమైనా సరే కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అలా కౌంటీ క్రికెట్లో మెరిసిన మీకెరెన్ తనను తాను నిరూపించుకున్నాడు. అటుపై కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన తొలి డచ్ క్రికెటర్‌గా పాల్ వాన్ మీకెరెన్ పేరు పొందాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ పూర్తయ్యాకా తన జట్టుతో కలిసిన మీకెరెన్ టి20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. నెదర్లాండ్స్ ఇవాళ సూపర్-12 చేరడంలో మీకెరెన్ కీలకపాత్ర పోషించాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసిన పాల్ వాన్ మీకెరెన్‌కు.. భారత్‌తో మ్యాచ్ ఆడడం ఒక కల. అదృష్టవశాత్తూ అతనికి టీమిండియాతో మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. మ్యాచ్ ఓడిపోయినప్పటికి కేఎల్ రాహుల్ వికెట్ తీసిన పాల్ వాన్ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. క్రికెట్‌ను అమితంగా ప్రేమించే ఇండియా లాంటి దేశంతో క్రికెట్ ఆడడం జీవితంలో మరిచిపోలేని అనుభుతి అని పాల్ వాన్ మీకెరెన్ చెప్పుకొచ్చాడు. Dishing the dirt on the #Netherlands team! Paul van Meekeren reveals all about the characters in the Netherlands #T20WorldCup squad. pic.twitter.com/ysowRdzx0S — ICC (@ICC) October 22, 2021 Edged and gone! We can reveal that this wicket from Paul van Meekeren is one of the moments that could be featured in your @0xFanCraze Crictos of the Game packs from Namibia vs Netherlands. Grab your pack from https://t.co/8TpUHbQikC to own iconic moments from every game. pic.twitter.com/UjWVRiEmao — ICC (@ICC) October 18, 2022 చదవండి: పాక్ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించాడు! ఈసారైనా మోసం చేయకండి! ఈ మిస్టర్ బీన్ గోలేంటి? -
'కోహ్లి మమ్మల్ని కరుణిస్తాడనుకుంటున్నా'
టి20 ప్రపంచకప్‌ను టీమిండియా సూపర్‌గా మొదలుపెట్టింది. అక్టోబర్ 23న(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. టీమిండియా స్టార్ కింగ్ కోహ్లి వన్‌మ్యాన్ షో(53 బంతుల్లో 82 నాటౌట్) తన టి20 కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో హైడ్రామా నెలకొన్నప్పటికి తను అనుభవంతో మ్యాచ్‌ను టీమిండియా వైపుకు లాగాడు. దీంతో కోహ్లిపై క్రికెట్ దిగ్గజాలు సహా టీమిండియా ఫ్యాన్స్, విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఇక టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను గురువారం నెదర్లాండ్స్‌తో ఆడనుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికి అందరి కళ్లు మరోసారి కోహ్లిపైనే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియాతో మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా కోహ్లి బ్యాటింగ్‌ను మీరెలా అడ్డుకోబోతున్నారంటూ ఎడ్వర్డ్స్‌కు ప్రశ్నించారు. దీనికి ఎడ్వర్డ్స్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ''మాతో మ్యాచ్‌లో కోహ్లి మాపై కరుణ చూపిస్తాడని భావిస్తున్నా. పాక్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లి అదే బ్యాటింగ్‌ను మాతో రిపీట్ చేయడనే అనుకుంటున్నాం.'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ''సూపర్-12లో ఆడడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక పెద్ద జట్టుతో మ్యాచ్ ఆడుతున్నామంటే ఒత్తిడి సహజం.. కానీ అది ఉండేది చాలా తక్కువ. మాకు అవకాశాలు చాలా తక్కువ. వచ్చినవాటిని మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేము. టీమిండియా ముందు మేం నిలవలేమని తెలుసు.. కానీ గెలవాలనే ప్రయత్నం చేస్తే తప్పు లేదుగా. అలాగే వరల్డ్‌కప్ లాంటి మేజర్ టోర్నీలో అగ్రజట్టుతో ఆడడం గౌరవంగా భావిస్తాం. ఇక వన్డే సూపర్ లీగ్‌లో మేం లేకపోవడం దురదృష్టకరం. అయితే డచ్‌లో క్రికెట్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం'' అంటూ ముగించాడు. చదవండి: మ్యాచ్ గెలవలేదు లేదంటే ఆ గుర్తులపై పెద్ద చర్చ జరిగేది! 2011లో ఇలాగే.. నమ్మలేం కానీ నిజమైతే బాగుండు! -
చిన్న జట్టంటే అంత చులకన.. ఏ దేశంతో ఆడుతున్నారో తెలియదా!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారు. కనీసం ఏ జట్టుతో ఆడుతున్నామనే విషయాన్ని కూడా మరిచిపోతే ఎలా అని.. చిన్న జట్టంటే అంత చులకన.. అంటూ ఫ్యాన్స్ ఏకిపారేశారు. విషయంలోకి వెళితే.. పాకిస్తాన్, నెదర్లాండ్స్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను పాకిస్తాన్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో పాకిస్తాన్ తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 49.2 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో 9 పరుగుల తేడాతో గెలిచి పాక్ ఊపిరి పీల్చుకుంది. ఈ సంగతి పక్కనబెడితే.. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ బాబర్ ఆజం.. మాటల మధ్యలో తాము ఆడుతున్నది నెదర్లాండ్స్‌తో అన్న సంగతి మరిచిపోయి ''స్కాట్లాండ్'' అని పలికాడు. ''మమ్మల్ని కట్టడి చేసిన స్కాట్లాండ్ బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే'' అంటూ కామెంట్ చేశాడు. అంతే పాకిస్తాన్ సిరీస్ గెలిచిందన్న విషయం మరిచిపోయి మరీ బాబర్ ఆజంను ట్రోల్ చేశారు క్రికెట్ అభిమానులు. ''బాబర్ ఆజం.. స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఓమన్, యూఏఈ, జింబాబ్వే వంటి అసోసియేట్ దేశాలపై క్రికెట్ ఆడుతూ రికార్డులు నమోదు చేస్తున్నాడు. నెదర్లాండ్స్‌కి బదులుగా స్కాట్లాండ్ అనడంలో తప్పు లేదని.. ఏ ఆస్ట్రేలియాతో ఆడుతూనో, ఇంగ్లండ్ బౌలర్లనో అని ఉంటే ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోవాల్సి వచ్చేదని కామెంట్ చేశారు. బాబర్ ఆజంకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Context 😭😭pic.twitter.com/ylLz5NBKOK — Fakhruu :^) 🏏 (@BajwaKehtaHaii) August 22, 2022 -
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్!
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు స్కాట్ ఎడ్వర్డ్స్ నాయకత్వం వహించనున్నాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ టోర్నీలు ది హండ్రెడ్, రాయల్ వన్డే కప్‌లో భాగమైన ఏడుగురు నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమయ్యారు. వారిలో కోలిన్ అకెర్మాన్, ఫ్రెడ్ క్లాసెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, షేన్ స్నేటర్, బ్రాండన్ గ్లోవర్, పాల్ వాన్ మీకెరెన్ ఉన్నారు. మరోవైపు వెటరన్ ఆల్ రౌండర్ వెస్లీ బరేసి ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. అదే విధంగా యువ ఆటగాడు ఆర్నవ్ జైన్ నెదర్లాండ్స్ తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఇక నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్ మూడు వన్డేలు ఆడనుంది. రోటర్డ్యామ్ వేదికగా ఆగష్టు 16న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్కోసం పాకిస్తాన్ తమ జట్టును ప్రకటిచింది. నెదర్లాండ్స్ జట్టు: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓ డౌడ్, విక్రమ్ సింగ్, మూసా నదీమ్ అహ్మద్, టామ్ కూపర్, బాస్ డి లీడే, వెస్లీ బరేసి, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వివియన్ కింగ్మా, షరీజ్ అహ్మద్, అర్నవ్ జైన్ పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సల్మాన్ అలీ అఘా షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, జాహిద్ మహమూద్ చదవండి: డకౌట్ అయ్యానని ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ నా చెంపపై కొట్టాడు: టేలర్ -
ఆసియా కప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. స్పీడ్ స్టార్ ఎంట్రీ!
ఆసియా కప్, నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్లను బుధవారం ప్రకటించింది. నెదర్లాండ్స్ సిరీస్‌తో పాటు ఆసియాకప్‌లో కూడా పాక్ జట్టుకు రెగ్యూలర్ కెప్టెన్ బాబర్ ఆజాం సారథ్యం వహించనున్నాడు. నెదర్లాండ్స్, ఆసియా కప్‌లకు రెండు వేర్వేరు జట్లను పాక్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక ఆ జట్టు యువ పేసర్ నసీమ్ షా పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ రెండు జట్లలో అతడికి చోటు దక్కింది. ఇప్పటి వరకు కేవలం టెస్టుల్లో మాత్రమే పాక్‌కు ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల నసీమ్ షా.. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. తన అరంగేట్ర టెస్టులోనే ఆస్ట్రేలియా బ్యాటర్లకు నసీమ్ చుక్కలు చూపించాడు. ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు. కాగా నెదర్లాండ్ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ తలపడనుంది. రోటర్డ్యామ్ వేదికగా ఆగస్టు 16న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక నెదర్లాండ్తో వన్డే సిరీస్ అనంతరం ఆసియా కప్‌లో పాకిస్తాన్ పాల్గొనుంది. ఆసియా కప్‌లో భాగంగా పాక్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28 టీమిండియాతో తలపనుంది. ఇక ఆసియా కప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. The wait is finally over as the battle for Asian supremacy commences on 27th August with the all-important final on 11th September. The 15th edition of the Asia Cup will serve as ideal preparation ahead of the ICC T20 World Cup. pic.twitter.com/QfTskWX6RD — Jay Shah (@JayShah) August 2, 2022 నెదర్లాండ్స్‌తో వన్డేలకు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, జాహిద్ మెహమూద్ ఆసియా కప్‌కు పాక్ జట్టు బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ ,ఉస్మాన్ ఖదీర్ చదవండి: Asia Cup 2022 Schedule: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..? 🇵🇰✈️ 🚨 Pakistan's squads for Netherlands ODIs and ACC T20 Asia Cup 🚨 Read more: https://t.co/CsUoxtXc1H#NEDvPAK | #AsiaCup2022 pic.twitter.com/4be4emR8Sy — Pakistan Cricket (@TheRealPCB) August 3, 2022 -
సెంచరీలతో చెలరేగిన విండీస్ బ్యాటర్లు.. సిరీస్ క్లీన్‌స్వీప్
ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన చివరి వన్డేలో నెదర్లాండ్స్‌పై 20 పరుగుల తేడాతో నెగ్గిన విండీస్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో వెస్టిండీస్ ఐసీసీ పురుషుల వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో 80 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. క్లీన్‌స్వీప్ అయిన నెదర్లాండ్స్ 25 పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. కైల్ మేయర్స్(106 బంతుల్లో 120, 8 ఫోర్లు, 7 సిక్సర్లు), షమ్రా బ్రూక్స్ (115 బంతుల్లో 101 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో మెరవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.5 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌట్ అయింది. మాక్స్ డౌడ్ 89, విక్రమ్‌జిత్ సింగ్ 54, ముసా అహ్మద్ 42 పరుగులు చేశారు. చదవండి: Ben Stokes Over Throw Controversy: మళ్లీ అదే స్టోక్స్.. 2019 వరల్డ్‌కప్ వివాదం గుర్తుకుతెచ్చేలా 3-0! A thrilling finish to the series! 💥 Well played boys!👏🏿 #NEDvWI pic.twitter.com/n87EwYLCBX — Windies Cricket (@windiescricket) June 4, 2022 -
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం..!
ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్, ప్రస్తుత నెదర్లాండ్స్ హెడ్ కోచ్ ర్యాన్ క్యాంప్‌బెల్ (50)కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని లండన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ర్యాన్ పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ర్యాన్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దిగ్గజ వికట్కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సమకాలికుడైన ర్యాన్ క్యాంప్‌బెల్ 2002 సంవత్సరంలో ఆస్ట్రేలియా తరఫున రెండు వన్డేలు ఆడాడు. ఆస్ట్రేలియా జట్టులో గిల్‌క్రిస్ట్ పాతుకుపోవడంతో ర్యాన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో అతను హాంగ్‌కాంగ్ జట్టుకు వలన వెళ్లాడు. హాంగ్‌కాంగ్ జట్టు తరఫున మూడు టీ20లు ఆడాడు. అనంతరం 2017లో నెదర్లాండ్స్ హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు. చదవండి: ఢిల్లీ జట్టులో కరోనా కలకలం.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌పై బిగ్ అప్డేట్ -
29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్రికెటర్
నెదర్లాండ్స్ స్టార్ క్రికెటర్ బెన్ కూపర్ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. నెదర్లాండ్స్‌కు దాదాపు పదేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన బెన్ కూపర్.. ఆ జట్టులో స్టార్ ఆటగాడిగా వెలుగొందాడు. 2013 ఆగస్టులో కెనడాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా బెన్ కూపర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.ఆ తర్వాత మూడు నెలలకు అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా టి20ల్లో అరంగేట్రం చేశాడు. 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కూపర్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. చదవండి: ICC Cricket World Cup: 11 మంది ప్లేయర్లు లేక టోర్నీ మధ్యలోనే నిష్క్రమణ ''కొన్నిరోజుల్లో నేను 30లోకి అడుగుపెట్టబోతున్నా. పదేళ్ల పాటు డచ్ క్రికెట్‌కు నా సేవలందించా. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు మాకు పెద్దగా అవకాశాలు రావు. ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీల్లో మాత్రమే ఎక్కువ మ్యాచ్‌లు ఆడే వీలుంటుంది. వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్ జరగనుంది. కానీ నేను తప్పుకుంటేనే కొత్త ఆటగాళ్లకు చాన్స్ వస్తుంది. విధి లేకనే ఆటకు గుడ్‌బై చెబుతున్నా. దానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా.'' అంటూ పేర్కొన్నాడు. గతేడాది జూన్‌లో శ్రీలంకతో చివరి వన్డే ఆడిన బెన్ కూపర్.. మళ్లీ అదే శ్రీలంకతో ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్ అతనికి ఆఖరి టి20 . ఇక నెదర్లాండ్స్ తరపున టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన బెన్ కూపర్ మొత్తంగా 58 టి20 మ్యాచ్‌ల్లో 1239 పరుగులు సాధించాడు. ఇక 13 వన్డేల్లో 187 పరుగులు చేశాడు. ఇక దేశవాలీ క్రికెట్ విషయానికి వస్తే.. 29 ఏళ్ల బెన్ కూపర్ నాలుగు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 451 పరుగులు.. 55 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 994 పరుగులు సాధించాడు. చదవండి: Rafael Nadal: రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే -
బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన బౌలర్..
నెదర్లాండ్ ఫాస్ట్ బౌలర్ వివియన్ కింగ్మా బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో కింగ్మా బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 3ని ఉల్లంఘించినందుకు కింగ్మాపై నాలుగు మ్యాచ్‌ల నిషేదాన్ని ఐసీసీ విధించింది. అంతేకాకుండా క్రమశిక్షణా రికార్డులో ఐదు డీమెరిట్ పాయింట్లు కూడా వచ్చి చేరాయి. ఏం జరిగిందంటే.. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 31వ ఓవర్ బౌలింగ్ వేసిన కింగ్మా తన చేతి గోళ్లతో బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడు. కింగ్మా తన నేరాన్ని అంగీకరించడంతో నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని మ్యాచ్ రిఫరీ విధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో పది ఓవర్లు బౌలింగ్ వేసిన కింగ్మా ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నెదర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ విజయంలో బ్యాటర్లు రియాజ్ హుసాన్(50 పరుగులు), నజీబుల్లా(71 పరుగులు) అర్ధ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. చదవండి: హార్ధిక్ పాండ్యా నాన్నమ్మనూ వదలని "పుష్ప" ఫోబియా.. తగ్గేదేలే అంటున్న బామ్మ -
దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా కేశవ్ మహారాజ్
Keshav Maharaj To Lead South Africa For ODI Series Against Netherlands: ఈనెల(నవంబర్) 26 నుంచి స్వదేశంలో నెదర్లాండ్స్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్టులో భారీ మార్పులు జరిగాయి. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా, సీనియర్లు ఎయిడెన్ మార్క్రమ్, క్వింటన్ డికాక్, వాన్ డర్ డస్సెన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జేలకు విశ్రాంతి కల్పించిన క్రికెట్ సౌతాఫ్రికా.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, వైస్ కెప్టెన్ కేశవ్ మహారాజ్‌కు పగ్గాలు అప్పజెప్పింది. వర్క్ లోడ్, కఠిన బయోబబుల్ నిబంధనల కారణంగా సీనియర్లకు విశ్రాంతి కల్పిస్తున్నట్లు సీఎస్ఏ పేర్కొంది. సీనియర్లంతా డిసెంబర్లో టీమిండియాతో ప్రారంభమయే సిరీస్‌కు అందుబాటులో ఉంటారని బోర్డు తెలిపింది. వెటరన్ ఆటగాడు వేన్ పార్నెల్ సుదీర్ఘకాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా జట్టు: కేశవ్ మహారాజ్(కెప్టెన్), డారిన్ డుపావిల్లోన్, జేబేర్ హమ్జా, రీజా హెండ్రిక్స్, సిసండా మగాల, జన్నెమాన్ మలాన్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వేన్ పార్నెల్, అండైల్ ఫెలుక్వాయో, డ్వెయిన్ ప్రిటోరియస్, రియాన్ రికెల్టంన్, తబ్రేజ్ షంషి, కైల్ వెర్రిన్(వికెట్‌కీపర్), లిజాడ్ విలియమ్స్, ఖాయా జోండో చదవండి: టోక్యో ఒలింపిక్స్ పతక విజేతకు షాక్.. కోర్టుకు వెళ్లిన తోటి బాక్సర్ -
టి20 క్రికెట్లో సరికొత్త రికార్డు.. చరిత్రలో తొలి బౌలర్‌గా
ముర్షియా: మహిళల అంతర్జాతీయ టి20ల్లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రెడరిక్ ఒవర్డిక్...ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టింది. తద్వారా అంతర్జాతీయ టి20 ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా గుర్తింపు పొందింది. పురుషుల విభాగంలోనూ ఇప్పటి వరకు ఎవరూ 7 వికెట్లు తీయలేదు. ప్రపంచకప్ యూరోప్ రీజియన్ క్వాలిఫయర్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రెడరిక్ దెబ్బకు ఫ్రాన్స్ 33 పరుగులకే కుప్పకూలింది. అనంతరం నెదర్లాండ్స్ 9 వికెట్లతో ఘన విజయాన్ని అందుకుంది. చదవండి: లైంగిక వేధింపుల కేసు.. స్టార్ ఫుట్‌బాలర్‌పై వేటు -
ఈ క్రికెటర్ ఎవరో గుర్తు పట్టారా?
అండర్‌వేర్‌లా కనిపిస్తున్నదానిని మొహంపై ధరించిన ఓ ప్రముఖ క్రికెటర్ ఫోటోను, ఐసీసీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అతనెవరో గుర్తుపట్టారా అంటూ సరదాగా ప్రశ్నించింది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో అతను తన దేశం తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్. వన్డే మ్యాచ్‌లలో 50 వికెట్లు కూడా పడగొట్టాడు అంటూ కొన్ని హింట్లను కూడా ఇచ్చింది. ఇప్పటికీ ఈ క్రికెటర్ ఎవరో గుర్తుపట్ట లేదా.. అంటూ మరిన్ని హింట్లను కూడా ఇచ్చింది. 2011లో ఇంగ్లాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేశాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో అత్యధిక సగటు(వేయి పరుగుల వరకు మాత్రమే) నమోదు చేసింది కూడా ఇతనే అంటూ మరిన్ని హింట్లను ఇచ్చింది. అతనెవరో కాదు ర్యాన్ టెన్ డోస్చేట్. నెదర్లాండ్ తరపును అత్యధిక పరుగులు(2074) సాధించిన క్రికెటర్. ఇక బౌలింగ్‌లోనూ సత్తాచాటి 55 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో కేవలం 32 మ్యాచ్‌లు ఆడి, 67 సగటుతో 1541 పరుగు చేశాడు. 5 సెంచరీలు చేయగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇంగ్లాండ్‌తో 2011 జరిగిన మ్యాచ్‌లో(119) నమోదు చేశాడు. 🔸 I am the highest run-scorer in international cricket for my country 💪 🔸 I've also picked up over 50 ODI wickets ☝️ Who am I? pic.twitter.com/ye7FUF98lQ — ICC (@ICC) May 18, 2020 -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మరో నాలుగు దేశాలు
దుబాయ్ : అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ జాబితాలోకి మరో నాలుగు జట్లు వచ్చి చేరాయి. పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో ఇప్పటి వరకు 12 జట్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా నేపాల్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యూఏఈ జట్లను పాయింట్ల పట్టికలో చేర్చినట్లు ఐసీసీ శుక్రవారం తెలిపింది. రేటింగ్ పాయింట్లను లెక్కించే ముందు కొత్త జట్లు ఆడిన అన్ని ద్వైపాక్షిక సిరీస్‌ల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. వన్డే హోదా సాధించిన వాటిలో స్కాట్లాండ్ (28 పాయింట్లు) 13వ ర్యాంక్.. యూఏఈ(18పాయింట్లు) 14వ ర్యాంక్ సాధించింది. నేపాల్, నెదర్లాండ్స్ జట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన తరువాత పాయింట్ల పట్టికలో పూర్తిస్థాయి ర్యాంకులను పొందనున్నాయి. ఈ నాలుగు జట్లు వన్డే రేటింగ్ కలిగిన జట్లతో ఆడిన ప్రతి మ్యాచ్‌కు పాయింట్స్ కేటాయించారు. మే1,2015 నుంచి ఏప్రిల్ 30, 2017 వరుకు జరిగిన మ్యాచ్ 50 శాతం వెయిటేజ్ ఇవ్వగా.. మే 1,2017 అనంతరం జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం వెయిటేజ్ ఇచ్చారు. ఈ జట్లతో ఇప్పటికే తొలి 12 స్థానాల్లో ఉన్న జట్ల ర్యాంకుల్లో ఎలాంటి మార్పు ఉండదని ఐసీసీ పేర్కొంది. గతేడాది నెదర్లాండ్స్ వన్డే హోదాను సాధించగా.. ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన స్కాట్లాండ్, యూఏఈలు తమ అంతర్జాతీయ వన్డే హోదాను కాపాడుకోగలిగాయి. క్వాలిఫయర్స్‌లో నేపాల్, పపువా న్యూగినియాపై గెలిచి అంతర్జాతీయ వన్డే జట్టు హోదాను సొంతం చేసుకుంది. -
దక్షిణాఫ్రికాను వణికించిన నెదర్లాండ్
చిట్టగాంగ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారమిక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్ పోరాడి ఓడింది. ఒకదశలో సఫారీలకు వణుకు పుట్టించిన డచ్ టీమ్ చివరకు 6 పరుగులతో ఓటమి పాలయింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్ 18.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటయింది. మిబర్గ్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. 28 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. అయితే మిగతా ఆటగాళ్లు రాణించకపోవడంతో నెదర్లాండ్ పరాజయం పాలయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తహీర్ 4, స్టెయిన్ 2 వికెట్లు పడగొట్టారు. మిగతా బౌలర్లు తలో వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవరల్లో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.