ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి ఆటలను విపరీతంగా ఇష్టపడ్డాడు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆటగాడిగా మారాలనే కోరిక కూడా పెరుగుతూ వచ్చింది. సొంత ఊరు వదిలినా, దేశాలు మారినా ఆ ఆలోచన మనసులోంచి పోలేదు. అన్ని రకాల క్రీడలూ ప్రయత్నించిన తర్వాత క్రికెట్ వద్ద అతను ఆగాడు. అందులోనే అగ్ర స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆపై దానిని చేరుకునేందుకు అన్ని రకాలుగా శ్రమించాడు. ఆ క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదురైనా ఎక్కడా ఆశ కోల్పోలేదు. చివరకు తాను పుట్టిన, పెరిగిన దేశం కాకుండా ఉపాధి కోసం వెళ్లిన మూడో దేశం తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ముద్ర వేయించుకొని సగర్వంగా నిలిచాడు. అతని పేరే అనిల్ తేజ నిడమనూరు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగి ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టుకు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహిస్తున్న తేజపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
అంతర్జాతీయ క్రికెటర్ కావాలనే ఏకైక లక్ష్యంతో అన్ని ప్రయత్నాలూ చేశాను. ఇందు కోసం చాలా కష్టపడ్డా. ఏదీ సునాయాసంగా దక్కలేదు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా పట్టుదలగా నిలబడ్డా. న్యూజిలాండ్‌లో నా 16 ఏళ్ల వయసులోనే అమ్మానాన్న భారత్‌కు వెనక్కి వచ్చేశారు. నేను కూడా రావాల్సి ఉండగా, కెరీర్‌ను నిర్మించుకుంటున్న దశలో రాలేనని చెప్పా. అప్పటి నుంచి అన్నీ నేనే సొంతంగా చేసుకున్నా.
పార్ట్‌టైమ్ జాబ్‌లు చేస్తూ క్రికెట్‌ను మాత్రం వదల్లేదు. ఎవరి అండ లేకపోయినా, డచ్ భాష రాకపోయినా మొండిగా నెదర్లాండ్స్‌లో అడుగు పెట్టా. ఇదంతా నా స్వయంకృషి. ఈ ఏడాది జూన్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో రాణించి మా జట్టు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తే భారత్‌లో ఆడే అవకాశం వస్తుంది. అదే జరిగితే నా కెరీర్‌లో గొప్ప క్షణం అవుతుంది. అందు కోసం ఎదురు చూస్తున్నా. –‘సాక్షి’తో తేజ నిడమనూరు
సాక్షి, హైదరాబాద్: నెదర్లాండ్స్ క్రికెట్ టీమ్‌లో ఇప్పుడు తేజ నిడమనూరు కీలక సభ్యుడు. గత వారం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో అజేయ సెంచరీలతో అతను జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది మేలో తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతను ఇప్పటి వరకు 11 వన్డేలు, 6 టి20లు ఆడాడు.
దక్షిణాఫ్రికాతో శుక్ర, ఆదివారాల్లో జరిగే వన్డే మ్యాచ్‌లకు తేజ ప్రస్తుతం సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తేజ తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. క్రికెటర్‌గా ప్రాథమికాంశాలు నేర్చుకోవడం మొదలు అవకాశాల కోసం యూరోప్ దేశం చేరడం వరకు అతని ప్రస్థానంలో అనేక మలుపులున్నాయి.
అలా మొదలైంది...
తేజ స్వస్థలం విజయవాడ. తేజ తల్లిదండ్రులు పాండురంగారావు, పద్మావతి మెరుగైన ఉపాధి అవకాశాల కోసం న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. దాంతో 2001లో ఏడేళ్ల వయసులో తేజ కొత్త జీవితం కూడా అక్కడే ప్రారంభమైంది. పాఠశాలలో చదువుతున్న సమయంలోనే భిన్నమైన ఆటల్లో తేజ రాణించాడు. ముఖ్యంగా కివీస్ అభిమాన క్రీడ రగ్బీలో కూడా అతను పట్టు సంపాదించాడు.
అయితే అనుకోకుండా క్రికెట్‌పై కలిగిన ఆసక్తి పూర్తిగా ఈ క్రీడ వైపు మళ్లేలా చేసింది. ఆక్లాండ్‌లో తల్లి పని చేస్తున్న సంస్థ పక్కనే ప్రఖ్యాత ‘కార్న్‌వాల్ క్రికెట్ క్లబ్’ ఉంది. న్యూజిలాండ్‌లో అతి పెద్ద క్లబ్‌లలో ఒకటైన ఇక్కడే పలువురు దిగ్గజ క్రికెటర్లు మార్టిన్ క్రో, గ్రేట్‌బ్యాచ్, ఆడమ్ పరోరె తమ ఆటను మొదలు పెట్టారు. ఈ క్లబ్‌లో రోజూ క్రికెట్ చూస్తూ తేజ కూడా ఆకర్షితుడయ్యాడు. దాంతో తల్లిదండ్రులు అతడిని ఇందులో చేర్పించారు. ఆపై అతని క్రికెట్ సాధన మొదలైంది. చురుకైన ఆటతో వేగంగా పట్టు పెంచుకున్న తేజ స్థానిక లీగ్‌లలో సత్తా చాటడంతో వరుస అవకాశాలు వచ్చాయి.
ఇదే క్రమంలో ఆక్లాండ్ ‘ఎ’ టీమ్‌లో అతను చోటు దక్కించుకున్నాడు. అక్కడా స్థానం లభించడంతో ఆక్లాండ్ సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ‘క్రికెట్‌ను ఎంచుకున్న తర్వాత ఎక్కడా నేను ఉదాసీనతకు చోటు ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని గట్టిగా నిర్ణయించుకొని సుదీర్ఘ సమయాల పాటు ప్రాక్టీస్ చేస్తూ ఒకే లక్ష్యంతో సాగాను. నా ప్రదర్శనపై ప్రశంసలు రావడం, పలువురు ప్రోత్సహించడంతో భవిష్యత్తుపై స్పష్టత వచ్చింది’ అని తేజ చెప్పాడు.
అవకాశాలు దక్కకపోవడంతో...
అయితే ఆటలో ఎదుగుతున్న కొద్దీ తేజకు ఊహించని పరిణామాలు ఆక్లాండ్‌లో ఎదురయ్యాయి. కేవలం అంకెలు, రికార్డులు మాత్రమే మెరుగైన అవకాశాలు కలి్పంచలేవని అతనికి అర్థమైంది. సీని యర్లు టీమ్‌లో పాతుకుపోవడం, వేర్వేరు కారణాల వల్ల అతనికి పూర్తి స్థాయిలో తన సత్తా చాటే అవకాశం రాలేదు. అయితే ఆటకు విరామం మాత్రం ఇవ్వరాదని పట్టుదలగా భావించడంతో మరో ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చింది.
ముందుగా ఇంగ్లండ్ కౌంటీ డర్హమ్ మైనర్ లీగ్‌లలో అడుగు పెట్టిన తేజ ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో లీగ్‌లు ఆడేందుకు ఆరు నెలల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఒప్పందం ప్రకారం నిర్ణీత సమయం ముగిసిన తర్వాత మళ్లీ కివీస్‌కు వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలోనూ క్రికెట్‌ను వదలకూడదనుకున్నాడు.
సరైన దిశలో...
నెదర్లాండ్స్‌లో గతంలో ఆడిన అనుభవం సరైన సమయంలో తేజకు పనికొచ్చింది. అక్కడే ఉండి పూర్తి స్థాయిలో క్రికెట్ ఆడితే భవిష్యత్తులో పైకి ఎదగవచ్చని అర్థమైంది. అయితే అలా చేయాలంటే ముందు అక్కడ ఒక ఉద్యోగంలో చేరాలి. దాంతో తాను చేసిన స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ డిగ్రీతో ఉద్యోగ ప్రయత్నం చేశాడు. అయితే అతని అర్హత ప్రకారం కాకుండా మరో రూపంలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ‘స్టార్ట్‌ఎక్స్’ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
2019 మే నెలలో తేజ నెదర్లాండ్స్ గడ్డపై చేరాడు. నిబంధన ప్రకారం జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపిక కావాలంటే కనీసం మూడేళ్లు నివాసం ఉండాలి. అయితే కొద్ది రోజులకే ‘కరోనా’ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆటను తీసి కొంత కాలం గట్టున పెట్టాల్సి వచ్చింది! ఇలాంటి స్థితిలో మరోసారి క్రికెట్ కెరీర్ సందేహంలో పడింది. అయినా సరే, తేజ వెనక్కి తగ్గలేదు. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు క్రికెట్ ఆడుతూ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకున్నాడు.
సెలక్షన్ టోర్నీల్లో సత్తా చాటి ఎట్టకేలకు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 2022 ఏప్రిల్‌లో మూడేళ్లు ముగియగా, మే 31న ఆమ్‌స్టెల్‌వీన్‌లో వెస్టిండీస్‌తో తొలి వన్డే ఆడటంతో అతని స్వప్నం సాకారమైంది. 51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 58 పరుగులు చేసిన తేజ అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా మొదలు పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment