- మూడు రోజుల్లో మేయర్ అభ్యర్థి ఎంపిక
- పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకే ప్రాధాన్యం
- పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను వెల్లడి
సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌సీపీ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా పార్టీ పాలకమండలి సభ్యురాలు తాతినేని పద్మావతి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆదివారం ప్రకటించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్య నేతలతో కలసి ఆయన మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న పద్మావతిని అందరి ఆమోదంతో ఎంపిక చేశామని వివరించారు.
జిల్లాలోని 49 మండలాల నేతలు, 13 మంది సమన్వయకర్తలతో చర్చించి అందరి అభిప్రాయంతో పద్మావతిని జెడ్పీ ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థిగా నిలిపామని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు నెలకు సగటున 26 రోజులు ప్రజల మధ్యే ఉంటూ పర్యటనలు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజావిశ్వాసం పొందిన తమ పార్టీ అన్ని ఎన్నికల్లో పోటీచేస్తుందని, జిల్లాలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతున్నామని వివరించారు.
అన్ని ఎన్నికల్లో అత్యధిక స్థానాలు...
జిల్లాలోని 8 మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలకసంస్థ, 49 మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని భాను స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని ఆయన విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరో తేలక ఆ పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గన్నవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఎంపీ, బందరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలనే డైలమా ఆ పార్టీలో ఉందని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఖాళీ అవుతోందని చెప్పారు. అనంతపురంలో పరిటాల సునీత, విశాఖలో అయ్యన్నపాత్రుడు, గుంటూరులో కోడెల వంటి నేతలు చంద్రబాబుపై విశ్వాసం కోల్పోయి అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు.
పార్టీ కోసం కట్టుబడినవారికే ప్రాధాన్యం...
మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలోకి వస్తున్నారని భాను చెప్పారు. ‘మా పార్టీ ప్రజావిశ్వాసం కోల్పోయింది.. మీ పార్టీలో మాకు చోటు కల్పించండి’ అంటూ పెద్దసంఖ్యలో ఇతర పార్టీల నేతలు వస్తున్నా పార్టీ కోసం కట్టుబడి పనిచేసినవారికే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
అసమర్థ ప్రభుత్వ వల్లే ఆలస్యంగా స్థానిక ఎన్నికలు...
పార్టీ జిల్లా పరిశీలకుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అసమర్థ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు. దీనివల్ల వేలకోట్ల కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్రం కోల్పోయిందని చెప్పారు. రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో జెడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన తాతినేని పద్మావతి దివంగత వైఎస్సార్‌పై అభిమానంతో ఏడాది పదవీకాలాన్ని వదులుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి నిబద్ధతతో పనిచేశారని చెప్పారు. మరో మూడు రోజుల్లో విజయవాడ నగర మేయర్ అభ్యర్థిని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. నేతలతో చర్చించి ఖరారు చేసుకుని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అనుమతితో అభ్యర్థిని ప్రకటిస్తామని వివరించారు.
ఒంటరిగానే పోటీ...
తమ పార్టీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఉమ్మారెడ్డి చెప్పారు. పొత్తులు పెట్టుకొని పోటీ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోనేరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పెనమలూరులో ఎంపీటీసీగా, జెడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన విశేష అనుభవం ఉన్న పద్మావతిని చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయటం మంచి పరిణామన్నారు.
పార్టీలో ఒక సామాజిక వర్గానికే పెద్దపీట అని కొందరు విమర్శించటం అర్థరహితమన్నారు. తనను సమన్వయకర్తగా నియమించారని, కొద్దిరోజుల్లోనే అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కుక్కల విద్యాసాగర్ మాట్లాడుతూ నిజాయతీ, విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని కొనియాడారు.
ఇచ్చిన హామీని తూచ తప్పకుండా అమలుచేస్తూ కార్యకర్తలకు న్యాయం చేస్తోందన్నారు. పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ మొదటినుంచీ పార్టీలోనే ఉండి నిబద్ధత కలిగిన పద్మావతిని ఎంపిక చేయటం హర్షణీయమని చెప్పారు. జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు.
నాడు వైఎస్సార్.. నేడు జగన్...
చైర్మన్ అభ్యర్థి తాతినేని పద్మావతి మాట్లాడుతూ నాడు జెడ్పీ వైస్‌చైర్మన్‌గా తనను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీర్వదిస్తే.. నేడు వైఎస్ జగన్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి ఆశీర్వదించారని చెప్పారు. 16 మంది కన్వీనర్లు, 49 మంది మండల అధ్యక్షుల ఏకగ్రీవ ఆమోదంతో తనను ఎంపిక చేశారని వివరించారు. సామాజిక న్యాయం చేయగలిగిన ఏకైక పార్టీ తమదేనని చెప్పారు. విలేకర్ల సమావేశంలో పార్టీ సమన్వయకర్తలు రక్షణనిధి (తిరువూరు), పడమట సురేష్‌బాబు (పెనమలూరు), ఎం.జగన్మోహనరావు (నందిగామ), నేతలు రమేష్, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి తదితరలు పాల్గొన్నారు.
తాతినేని ఎంపిక అభినందనీయం : పేర్ని నాని
వైఎస్సార్‌సీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తాతినేని పద్మావతిని ఎంపిక చేయటం అభినందనీయమని ఆ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని కొనియాడారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్న ఆమెకు సముచిత స్థానం కల్పించారని చెప్పారు. జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిగా మహిళను ప్రకటించటం మంచి పరిణామమన్నారు.