local body elections
-
‘స్థానిక’ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశమున్నా, ఎన్నికల పనుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. శనివారం జిల్లాలు, మండల స్థాయిలో పోలింగ్ కేంద్రాలను గుర్తించి దానికి సంబంధించిన జాబితాలను జిల్లా, మండల కేంద్రాల్లో ప్రచురించారు. రాష్ట్రవ్యాప్తంగా 570 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు ఓటర్ల జాబితాకు సంబంధించిన కసరత్తు సాగుతోంది.ఎన్నికలు వాయిదా పడుతున్నాయనే భావనలో ఉండొద్దని, ఆయా పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే ఉండాలని అధికారులు, సిబ్బందికి పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బందికి శిక్షణ తదితరాలన్నీ పూర్తిచేసి, ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా వెంటనే ఎన్నికల విధుల్లో దిగేందుకు సిద్ధంగా ఉండాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు, గూగుల్‌మీట్‌లు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎస్ఈసీ ఆదేశాలకు అనుగుణంగా... ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పీఆర్ శాఖ ద్వారా పోలింగ్ కేంద్రాల జాబితా, ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. పైగా సిబ్బందికి కూడా దీనికి సంబంధించిన శిక్షణను కూడా పూర్తి చేసింది. శనివారం పోలింగ్ స్టేషన్లు ఖరారు కావడంతో టీ–పోల్ యాప్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా 500 నుంచి 700 ఓటర్లను మ్యాపింగ్ చేసి ఆయా కేంద్రాలకు కేటాయించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టులోనూ కేసు విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. కోర్టుకు ఆయా విషయాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా నుంచి గ్రామస్థాయి వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పీఆర్ శాఖ ఆదేశించింది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏవి ముందు నిర్వహించాల్సి వచ్చినా, అందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉండాలని సూచించింది. కులగుణనలో రెండోవిడతలో వివరాల సేక రణ, పరిశీలన, ఆపై కేబినెట్ భేటీలో సమగ్ర నివేదిక ఆమోదం, ఆపై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టబద్ధత కల్పించేలా బిల్లు పెట్టి కేంద్రానికి, పార్లమెంట్‌కు పంపించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు మరికొన్ని నెలల సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘స్థానికం’.. ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందని, బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడమే తరువాయి అన్నంతగా నెలకొన్న ఉత్కంఠ ఒక్కసారిగా చల్లారిపోయింది. రాష్ట్రంలో మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయించడం, బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని భావించడమే దీనికి కారణం. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సమయం పట్టే అవకాశం ఉందని, దీనితో మే లేదా జూన్ నాటికి ‘స్థానిక’ఎన్నికలు జరగవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో విడత కులగణన సర్వే.. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని 3.1 శాతం (దాదాపు 16 లక్షల మంది) వివరాల నమోదు కోసం మరో విడత సర్వే నిర్వహించాలని నిర్ణయించామని సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు. ఆ సర్వే తర్వాత బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధిస్తామని తెలిపారు. తద్వారా ‘స్థానిక’ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు పరోక్షంగానే బయటపెట్టారనే చర్చ జరుగుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించి పార్లమెంట్‌కు పంపడం, అక్కడ ఆమోదం పొందడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో.. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు కాక స్థానిక ఎన్నికలు మరికొన్ని నెలలు వాయిదా పడవచ్చని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, మే లేదా జూన్‌లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వడివడిగా అడుగులు వేసినా.. బీసీ డెడికేటెడ్ కమిషన్ వేగంగా అధ్యయనం పూర్తి చేసి సర్కారుకు నివేదిక అందజేయడం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక అందడం, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అసెంబ్లీలో చర్చ వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈనెల 15వ తేదీలోగా వస్తుందని కొందరు మంత్రులు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలు కసరత్తు చేపట్టాయి. సిబ్బందికి శిక్షణ, జిల్లా కలెక్టర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి.. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోగా మండల, జిల్లా పరిషత్, ఆ తర్వాత వారం రోజుల వ్యవధి ఇచ్చి పంచాయతీ ఎన్నికలు నిర్వహించవచ్చని ప్రచారం జరిగింది. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పేపర్లపై ‘నోటా’ గుర్తు చేర్పు అంశంపై రాజకీయ పారీ్టల ప్రతినిధులతో సమావేశం కూడా జరిగింది. ఎన్నికలపై భిన్నాభిప్రాయాల మధ్య స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలా, వద్దా అన్న అంశంపై బుధవారం సీఎం ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందని తెలిసింది. తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని కొందరు మంత్రులు ప్రతిపాదించగా.. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తదితరులు రిజర్వేషన్లపై బీసీలకు ఇచి్చన మాట నిలబెట్టుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించే దిశగా ముందుకెళ్లాలని వారు స్పష్టం చేశారని సమాచారం. స్థానిక సంస్థలకే కాకుండా విద్య, ఉద్యోగపరంగా కూడా బీసీలకు తగిన రిజర్వేషన్లను కల్పించాలని వారు అభిప్రాయపడ్డారని తెలిసింది. మరోవైపు వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి అందాల్సిన విధులు రావని.. వీలైనంత త్వరగా నిర్వహించాలని కొందరు మంత్రులు సూచించారని సమాచారం. అయితే ఈ అంశం చాలా సున్నితమైనదని.. బీసీల రిజర్వేషన్లు కీలకమని, ఈ విషయంలో విధుల కంటే కాంగ్రెస్ పారీ్టకి ఉన్న నిబద్ధత ముఖ్యమని సీఎం రేవంత్‌తోపాటు మరికొందరు అభిప్రాయపడ్డారని తెలిసింది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో ఈ అంశాన్ని పొందుపరచాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారని సమాచారం. -
TG: స్థానిక సంస్థల్లో అభ్యర్థిగా ‘నోటా’!
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’ బటన్ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇవాళ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం. దీంతో ఏకగ్రీవాలు ఉంటాయా? ఉండవా? అనే దానిపై ఇవాళ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉండనుంది. ట్రయల్ ప్రతిపాదికన పంచాయితీ ఎన్నికల్లో ‘నోటా’ను నామమాత్రపు అభ్యర్థిగా ఈసీ పెట్టాలనుకుంటోంది. అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడితే.. ఆ స్థానంలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే ఈ పద్ధతిని పలు రాష్ట్రాలు పాటిస్తున్నాయి. తాజా నిర్ణయం అమలైతే.. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితుల్లో అక్కడ నోటా కూడా ఉంటుంది. అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే.. ఓటర్లు నోటా బటన్ నొక్కొచ్చు. అంతే తప్ప ఏకగ్రీవాలు ఉండకూడదనే అంశంపై ఇవాళ్టి సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో రాజకీయ పార్టీల నుంచి స్పందన ఎలా ఉండనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా.. పంచాయితీ ఎన్నికల్లో వార్డుమెంబర్లు, సర్పంచ్ పదవులు చాలా చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటాయి. ఇవన్నీ వేలంపాట తరహాలోనే ఉంటున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలోనే.. ఇప్పుడీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇక.. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల తుదిజాబితా ఖరారుపై ఈసీ ఇవాళ్టి సమావేశంలో చర్చించనుంది. మరోవైపు ఎన్నికల సంఘంతో పాటు ఇటు ప్రభుత్వం కూడా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. న్యాయ పరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది. మరో నాలుగు రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. -
‘స్థానిక’ తేదీలపై నేడు స్పష్టత!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల ఖరారుపైనా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ఆయా శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొననున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదికను సమర్పించిన నేపథ్యంలో, నివేదికపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, అదే జరిగితే అయిదారు రోజుల్లోనే అంటే ఈ నెల 17 లోగానే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) విడుదల చేయవచ్చని చెబుతున్నారు. అలాగే ముందుగా ఏ ఎన్నికలు జరపాలి?, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలా..?, లేక గ్రామపంచాయతీ ఎన్నికలా?.. ఏయే తేదీల్లో వీటిని నిర్వహించాలి? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.వారం తేడాతోనే రెండు ఎన్నికలు!ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించినా లేదా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించినా, వారం రోజుల తేడాతోనే రెండు ఎన్నికలూ నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది. షెడ్యూల్‌ను ప్రకటించాక 21 రోజుల్లోనే ఆ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా ముగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి వీలుగా వారం రోజుల్లో సీఎస్, డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించవచ్చని తెలిసింది.తదనుగుణంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లేదా ప్రత్యక్షంగా ఎస్ఈసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను మండలాలు, జిల్లా పరిషత్‌లలో ప్రదర్శించారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ కూడా మొదలైంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ ఈ నెల 15 కల్లా పూర్తవుతాయని, షెడ్యూల్ వెలువడిన వెంటనే సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కార్యరంగంలోకి దిగుతారని పంచాతీరాజ్, ఎస్ఈసీ అధికారులు చెబుతున్నారు.తొలుత ఎంపీటీసీ ఎన్నికలే..?పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరంగా క్షేత్రస్థాయిలో చేస్తున్న ఏర్పాట్లు, అధికారులు, సిబ్బంది పరంగా నిర్వహిస్తున్న సమీక్షలను బట్టి చూస్తే మాత్రం ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే జరిగే సూచనలున్నాయి. బుధవారం ఉదయం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా), అదనపు కలెక్టర్లు (స్థానికసంస్థలు), ఆర్డీవోలు, సీఈవోలకు పంచాయతీరాజ్ శాఖ శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు కమిషనరేట్ కార్యాలయం నుంచి లేఖ పంపించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కోటా ఖరారు చేయగానే.. వచ్చే 3,4 రోజుల్లోనే పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌ల స్థాయిల్లో (స్థానికంగా జీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు) జనాభాకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పీఆర్ శాఖ నిర్ణయించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా కాకుండా...స్థానికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా ప్రకారం హెచ్చుతగ్గుల్లో ఉంటాయని అధికార వర్గాల సమాచారం. -
మిగిలింది రిజర్వేషన్ల లెక్కే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల్లో అమలు చేసే రిజర్వేషన్ల లెక్క తేలడమే మిగిలింది. బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ బీసీ కమిషన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. సోమవారం ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరగనుంది. కమిషన్ నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే నిబంధన ఉండటంతో.. ఆ మేరకు రిజర్వేషన్లకు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,848 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలు 5,817, ఎంపీపీలు 570, జెడ్పీటీసీ స్థానాలు 570 ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. మిగతా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సైతం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసుకుంది.బీసీ రిజర్వేషన్లు 23శాతంలోపే..!రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రకారం.. రాష్ట్ర జనాభాలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) 17.43 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 10.45 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, అదే సమయంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదు. దీనితో ఎస్సీలకు 17.43 శాతం, ఎస్టీలకు 10.45 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. వీటిని మినహాయిస్తే.. బీసీలకు 22.12 శాతమే రిజర్వేషన్లు అందుతాయి. ఇందులో డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇచ్చే నివేదికకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వస్తోంది.రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధంస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. ఈ నెల 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో పరిశీలన కోసం ప్రదర్శించాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ రాణీ కుముదిని ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాల వారీగా విభజించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై 11న జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా కొనసాగుతోంది. ఈనెల 15న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాలను ప్రచురించనున్నారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. -
సీఎల్పీ.. వెంటనే ఢిల్లీకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం రసకందాయంలో పడింది. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు, ఎమ్మెల్యేల అసంతృప్తితోపాటు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ తదితర అంశాలను కొలిక్కి తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి, వారి పనితీరు, స్థానిక సంస్థల ఎన్నికలు, కుల గణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభ పక్షం గురువారం భేటీకానుంది. ఈ భేటీ తర్వాత రాష్ట్ర నాయకత్వం వెంటనే ఢిల్లీ వెళ్లనుంది. వాస్తవానికి తొలుత జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీకి రాష్ట్ర నాయకత్వం సిద్ధమవగా.. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ భేటీని సీఎల్పీ సమావేశంగా మార్చారు. అది ముగియగానే ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం సీఎల్పీ భేటీలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. గత ఏడాదికాలంలో వారి పనితీరుకు సంబంధించిన నివేదికలోని అంశాలను వివరించనున్నట్టు తెలిసింది. పార్టీలో ఇటీవలి అంతర్గత పరిణామాలు, ఎమ్మెల్యేల డిన్నర్ పే చర్చ వ్యవహారం గురించి కూడా సీఎం ప్రస్తావించనున్నట్టు సమాచారం. పాలనలో భాగంగా ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అంశాలు, పెండింగ్ బిల్లుల మంజూరు, ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులతో ఎమ్మెల్యేలకు సమన్వయం, ఇన్చార్జి మంత్రుల పెత్తనం తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో సీఎం రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పాల్గొననున్నారు. ఈ అంశాలు ప్రజల్లోకి వెళ్లడం లేదా? రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారంటీల అమలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాల విషయంలో ప్రభుత్వం దూకుడుగా వెళుతున్నా.. ప్రజల్లో అంత దూకుడుగా చర్చ జరగడం లేదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. దీనితో ఈ అంశంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌తోపాటు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు పోషించాల్సిన పాత్రను వివరించనున్నట్టు సమాచారం. కులగణన, ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలకు వివరించడం, ప్రతిపక్షాలు చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టడంపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 80శాతానికి పైగా గెలుచుకోవాలన్న దిశగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో భేటీ.. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇటీవలి పరిణామాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. డిన్నర్ పేరుతో కొందరు ఎమ్మెల్యేలు సమావేశమై తమ అసంతృప్తిని వెళ్లగక్కడం, పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వంటివి ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లాయి. వీటితోపాటు చాలాకాలంగా మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ పెండింగ్‌లో ఉన్నాయి. పీసీసీ కొత్త కార్యవర్గం కూర్పు విషయం కూడా ఇంకా తేలలేదు. వీటన్నింటిపైనా చర్చించి మార్గనిర్దేశం చేసేందుకు సీఎం రేవంత్ బృందాన్ని ఢిల్లీకి రమ్మని అధిష్టానం నుంచి పిలుపు అందింది. దీనితో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కార్యక్రమంలో మార్పు జరిగింది. సీఎల్పీ సమావేశం ముగియగానే మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన జరిగిన తీరును అధిష్టానం పెద్దలకు రాష్ట్ర నేతలు వివరించనున్నారు. ఢిల్లీలో పార్టీ నాయకత్వం చర్చల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు? మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీకి మార్గం సుగమం అవుతుందా అని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. -
కూటమి కాలకేయుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి, సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఆదిమ తెగల్లోనూ కానరాని అకృత్యాలు టీడీపీ కూటమి సర్కారు పాలనలో ఆవిష్కృతమయ్యాయి! పట్టపగలు.. తిరుపతి నడి రోడ్డుపై పోలీసులు, జనం సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. తాలిబన్లు.. ఐసిస్.. హమాస్ ఉగ్రమూకలను తలదన్నే రీతిలో మునిసిపల్ ఉప ఎన్నికల్లో పచ్చ ముఠాలు దాడులకు తెగబడి విధ్వంసం, భయోత్పాతం సృష్టించాయి! పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. అసలు ఒక్క సీటు కూడా గెలవని చోట్ల.. తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేని చోట్ల భయపెట్టి నెగ్గేందుకు కూటమి పార్టీలు కుతంత్రాలకు దిగాయి. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి బరి తెగించాయి. బల ప్రయోగం, అక్రమాలు, అరాచకాలు, ప్రలోభాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరించాయి. మునిసిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ గుర్తులతో జరిగాయి. అలాంటిది.. ఒక పార్టీ గుర్తుపై నెగ్గిన వారిని భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ఇంత దారుణంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంటే.. అసలు ఇక ఎన్నికలు ఎందుకు? పార్టీ గుర్తులు ఎందుకు? అని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరికత, ఆధునిక పోకడలు ఏమాత్రం ఎరుగని ఆటవిక జాతులు.. ప్రజాస్వామ్యం అంటే పరిచయం లేని దేశాల్లో మాత్రమే కనిపించే ఘటనలు ఏడుకొండలవాడి సాక్షిగా చోటు చేసుకోవడం నివ్వెరపరుస్తోందని పేర్కొంటున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో నెగ్గేందుకు కూటమి పార్టీల గూండాలు అరాచకం సృష్టించారు. ఉప ఎన్నికలో పాల్గొనేందుకు వాహనంలో వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సు ఆపి రాడ్లతో అద్దాలు పగలగొట్టి లోపలకు చొరబడి దాడులకు తెగబడ్డారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లపై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మహిళా కార్పొరేటర్ల ఆర్తనాదాలు ఖాకీల చెవికెక్కలేదు. కార్పొరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న కూటమి గూండాల వాహనాలకు పోలీసులు దగ్గరుండి దారిచ్చి సాగనంపడం నివ్వెరపరుస్తోంది. పోలీసుల సాక్షిగా కూటమి గూండాలు చిత్తూరు, తిరుపతిలో సృష్టించిన అరాచకం ఇదీ!! రాష్ట్రంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేదని అధికార మదంతో టీడీపీ నేతలు సవాల్ విసరడంపై ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు నగర కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులతో ఐదు చోట్ల ఎన్నికలు వాయిదా పడటం గమనార్హం.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకుంటున్న టీడీపీ నాయకుడు అన్నా రామచంద్రయ్య, గూండాలు అర్ధరాత్రి నుంచి అరాచకం..మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు. గత ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాలులో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు. వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్‌లో చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. గదుల్లో ఉన్న మహిళలు, చిన్నారులు ఆందోళనతో భూమన అభినయరెడ్డికి సమాచారం ఇవ్వడంతో పార్టీ శ్రేణులతో కలసి అక్కడకు చేరుకున్నారు. టీడీపీ మూకలు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్పొరేటర్లంతా సోమవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తిరుపతిలోని భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. బస్సుని అడ్డుకుని.. అద్దాలు ధ్వంసం చేసిడిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కోసం సోమవారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లంతా భూమన నివాసం నుంచి ప్రత్యేక బస్సులో ఎస్వీ యూనివర్సిటీలోని సెనెట్ హాలు వద్దకు బయలు దేరారు. దాదాపు 25 మంది కార్పొరేటర్లు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం అందులో ఉండగా వర్సిటీ సమీపంలో వారి బస్సును కూటమి గూండాలు అడ్డుకున్నారు. సుమారు 500 మంది ఒకేసారి బస్సుపైకి దూసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే రాడ్లతో అద్దాలను పగులగొట్టారు. లోపలకు చొరబడి బస్సు తలుపు తెరిచారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లు అమరనాథరెడ్డి, అనీష్‌రాయల్, మోహన్‌కృష్ణ యాదవ్, బోగం అనిల్, వెంకటేష్‌పై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో కార్పొరేటర్లను బలవంతంగా ఎక్కించారు. బస్సులో ముందు వైపు కూర్చున్న మహిళా కార్పొరేటర్లను నెట్టుకుంటూ లోపలకు చొరబడడంతో భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. కార్పొరేటర్లను కాపాడకపోగా మిగిలిన వారిపై దౌర్జన్యానికి దిగారు.ఎంపీ, సాక్షి ప్రతినిధులపై దాడికార్పొరేటర్లతో పాటు బస్సులో ఉన్న ఎంపీ గురుమూర్తిపై కూడా కూటమి గూండాలు దాడికి యత్నించారు. ఈ అరాచకాలను చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధి, ఫోటోగ్రాఫర్పై దాడి చేశారు. ఎమ్మెల్యే కుమారుడు మదన్, సునీల్ చక్రవర్తి ఫోటోగ్రాఫర్ చేతిలోని రూ.రెండు లక్షలు విలువచేసే కెమెరాను ధ్వంసం చేశారు. సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధిపై కూడా దాడికి తెగబడ్డారు. ఉదయం 10.15 గంటల నుంచి 10.45 వరకు యధేచ్ఛగా సాగిన విధ్వంసంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కోరం లేదని డూప్లికేట్ కార్పొరేటర్లతో..నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తే గెలుపు తమదేనని ధీమాతో ఉన్న కూటమి నేతలకు వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. కిడ్నాప్‌నకు గురైన కార్పొరేటర్లను ప్రవేశపెట్టే వరకు తాము ఉప ఎన్నికలో పాల్గొనబోమని మిగతావారు వర్సిటీ సెనెట్ హాలు బయటే ఆగిపోయారు. ఉప ఎన్నిక జరగాలంటే కోరం ఉండాలి. అంటే.. 50 మంది కార్పొరేటర్లలో సగం మందైనా ఉంటేగానీ ఉప ఎన్నిక ప్రారంభం కాదు. దీంతో కూటమి నేతలు మరో ఎత్తుగడ వేశారు. నలుగురు జనసేన మహిళలకు మాస్క్‌లు అమర్చి సెనెట్ హాలు లోపలకు పంపేందుకు యత్నించారు. ఈ కుట్రలను పసిగట్టిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం హాలు వద్దకు చేరుకోవడంతో ఆ యత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఉప ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి శుభం బన్సల్ ప్రకటించారు. నలుగురితో బలవంతంగా వీడియో...డిప్యూటీ మేయర్ పదవిని కైవశం చేసుకునేందుకు టీడీపీ మూకలు కిడ్నాప్ చేసిన నలుగురు కార్పొరేటర్ల చేత బలవంతంగా మాట్లాడించి ఓ వీడియోను విడుదల చేశారు. గొడవల కారణంగా తాము సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామంటూ ఒకే డైలాగ్ నలుగురితో చెప్పించి వీడియో తీశారు. అది ఒకే ప్రాంతంలో చేసినట్లు తెలుస్తోంది. పక్కన ఎవరో బలవంతంగా చెప్పిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నలుగురి వీడియోలను టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ తన ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం గమనార్హం. కాగా భూమన అభినయ్‌పై అక్రమ కేసు బనాయించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.అడ్డదారిలో స్టాండింగ్ కమిటీ కైవశంగుంటూరు స్టాండింగ్ కమిటీని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. 56 మంది సభ్యులకుగానూ కేవలం 11 మంది బలం మాత్రమే ఉన్న కూటమి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకుంది. స్వయంగా ఎమ్మెల్యేలను కార్పొరేటర్ల ఇళ్లకు పంపి పచ్చ కండువా కప్పారు. సోమవారం స్టాండింగ్ కమిటీ ఎన్నిక సందర్భంగా బ్యాలెట్ పేపర్‌పై సీరియల్ నంబర్లు వేసి బెదిరింపులకు దిగి గెలుపొందారు. కాగా కార్యాలయం బయట కూటమి సభ్యులు డబ్బులు పంచుకుంటూ మీడియాకు చిక్కారు.సగం చోట్ల వాయిదా...పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ⇒ టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ⇒ కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు. ⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు.డిప్యూటీ మేయర్ ఎన్నిక నిష్పాక్షికంగా జరిగేలా చూడండి సాక్షి, అమరావతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో జిల్లా ఎస్పీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక నిష్పాక్షికంగా, ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నిక జరిగే ఎస్వీ యూనివర్సిటీ, సెనెట్ హాల్ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ, పాలకొండపై కాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని భర్తీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నాదెండ్ల హారిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖాళీగా ఉన్న 19 వార్డుకు ముందు ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎం.స్వర్ణకుమారి దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
ముందు పరిషత్.. తర్వాత పంచాయతీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే మండల పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) ఎన్నికలను తొలుత నిర్వహించాలని.. అనంతరం పార్టీల గుర్తులు లేకుండా జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు ఈ రెండింటినీ కొన్నిరోజుల అంతరంతో జరపాలనే ప్రతిపాదనతోపాటు.. వీలైతే సమాంతరంగా ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన కూడా ఉ న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రాకున్నా.. తొలుత పరిషత్‌లకు, తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశమే ఎక్కువని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఉదయం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీ, తర్వాత నిర్వహించే శాసనసభ ప్రత్యేక సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్పష్టత వస్తుందని వివరిస్తున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. సమగ్ర కుటుంబ సర్వే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు (ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 42 శాతానికి), ఎస్సీ వర్గీకరణ నివేదిక తదితర అంశాలపై మంగళవారం కేబినెట్లో భేటీలో చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి తీర్మానం చేస్తారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 50శాతానికి మించకూడదు. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులు, కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికల ఆధారంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదం కోసం పార్లమెంటుకు పంపే అవకాశం ఉంది. అందులోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పంచాయతీలు, మండలాలు, జిల్లాల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15లోగా షెడ్యూల్! స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 15వ తేదీలోగా షెడ్యూల్ విడుదల కానున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు.. తర్వాత వారం గడువిచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయవచ్చని అంటున్నాయి. వచ్చే నెల మొదట్లో ఇంటర్ పరీక్షలు, 21 నుంచి టెన్త్ పరీక్షలు ఉన్నందున.. టెన్త్ పరీక్షలు మొదలయ్యేలోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రాజకీయ పార్టీల గుర్తులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, వాటిని ఒక విడతలో ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, అభ్యర్థులంతా స్వతంత్రులుగానే పోటీ చేసే విధానంలో జరుగుతాయి కాబట్టి.. వాటిని విడిగా నిర్వహించనున్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలను గతంలో మాదిరిగా మూడు విడతల్లో నిర్వహించి.. ఏ విడతకు ఆ విడతలో పోలింగ్ ముగిశాక సాయంత్రమే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. 2018లో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా బ్యాలెట్ పేపర్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పేర్కొన్న నేపథ్యంలో.. దీనివైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై సమీక్ష రాష్ట్రంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ ఆర్డీ) అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా చూడటం, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసిన నేపథ్యంలో మార్పులు చేర్పులు, కొత్తగా ఏర్పడిన 34 మండలాల్లో ఎంపీటీసీ సీట్ల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై సోమవారం కసరత్తు పూర్తి చేశారు. జిల్లాల వారీగా పునర్విభజన (కార్వింగ్) చేసిన ఎంపీటీసీ స్థానాల వివరాలతో మండల పరిషత్ కార్యాలయాల్లో తుది జాబితాలను ప్రచురించారు. ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరుపై అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు (ఏసీఎల్బీ), ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్, గూగుల్ మీట్లు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడం, గ్రామ పంచాయతీల మ్యాపింగ్, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల లెక్కలు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికలు జరిపేందుకు అందుబాటులో ఉన్న సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర రవాణా ఏర్పాట్లు, రిటర్నింగ్ అధికారుల (ఆర్వోల) నియామకం, ఆర్వోలు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై సమీక్షించారు. -
Telangana: స్థానిక పోరుకు రెఢీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులోగా లేదా మార్చి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి మొదటివారంలో ఇంటర్ పరీక్షలు, మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీనితో వచ్చే నెల చివర్లోగానీ, ఆ రెండు పరీక్షల మధ్య సమయంలో (మార్చి 17, 18 నాటికి)గానీ ఎన్నికల ప్రక్రియ ముగించవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 5న కేబినెట్ భేటీ ఉంటుందని, స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కూడా తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మొదలైన నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చా అన్న సందేహాలున్నా.. ఆ కోడ్ స్థానిక ఎన్నికలకు అడ్డుకాబోదని ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఒకరు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. స్థానిక ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగానే సమగ్ర కుల సర్వే నివేదిక ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉప సంఘానికి చేరనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఉప సంఘం ఆ నివేదికపై చర్చించి తగిన ప్రాధాన్యతాంశాలతో మంత్రివర్గానికి నివేదిక అందిస్తుందని వెల్లడించాయి. ఫిబ్రవరి 5న జరిగే కేబినెట్ భేటీలో ఉప సంఘం నివేదిక, బీసీ రిజర్వేషన్ల పెంపు, డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సులపై చర్చించనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 6 లేదా 7వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించనున్నట్టు సమాచారం. ఎంపీటీసీ స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు మొదలుపెట్టాయి. రెవెన్యూ మండలాల పరిధి, స్థాయికి తగినట్టుగా మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల పునర్విభజన చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు గురువారం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో ఎంపీటీసీ స్థానంలో 3వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండేలా రూపకల్పన (కార్వింగ్) చేయాలని సూచించారు. 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ‘కార్వింగ్’ చేయాలని ఆదేశించారు. శుక్రవారం వరకు ఎంపీటీసీ స్థానాల ముసాయిదా ప్రచురించి.. శుక్ర, శనివారాల్లో అభ్యంతరాలకు గడువు ఇవ్వాలని.. శని, ఆదివారాల్లో వాటిని పరిష్కరించి 3వ తేదీన తుది ప్రచురణ చేయాలని సూచించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీటీసీలు, రెవెన్యూ మండలాలకు తగ్గట్టుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ఉండాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం వల్ల ఎంపీటీసీ స్థానాలు ప్రభావితమైన చోట, నిర్ణీత జనాభాకు మించి, లేదా తక్కువగా ఉన్నచోట పక్కనే ఉన్న స్థానాలతో సర్దుబాటు చేయడం, లేక కొత్త స్థానాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లలో ఎస్ఈసీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎదురుచూస్తోంది. తేదీలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి... రెండు, మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలపెట్టినట్టు సమాచారం. ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్‌కు ఏర్పాట్లతోపాటు సర్పంచ్ పదవికి 30దాకా, వార్డు మెంబర్లకు 20 దాకా వివిధ ఫ్రీసింబల్స్ (ఎన్నికల చిహ్నాలను) సిద్ధం చేసినట్టు జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వివిధ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకం, బ్యాలెట్ బాక్స్‌లను సైతం సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైనట్టు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పెంపు సాధ్యమేనా? బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు చర్యలు చేపట్టింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50శాతం మించరాదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేరుగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం కాకుండా... ఎక్కడికక్కడ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌ల పరిధిలోని జనాభా ప్రామాణికంగా వేర్వేరుగా రిజర్వేషన్లు అమలు చేసే యోచన కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంటే ఎస్సీ, ఎస్టీల జనాభా అధికంగా ఉన్నచోట బీసీలకు తక్కువగా, బీసీల జనాభా ఎక్కువగా ఉన్నచోట 42 శాతం దాకా రిజర్వేషన్లు ఇచ్చేలా ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. కానీ ఇది ఆచరణ సాధ్యమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీపరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం నుంచి 50 శాతం దాకా టికెట్లు ఇవ్వవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదకొండేళ్లుగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేసిందని, ఈ దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా ఉండే కులసంఘాలు, ఇతర సంస్థలతో కలసి పనిచేస్తామన్నారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించే అవకాశముందని వస్తున్న వార్తలపై స్పందించాలని విలేకరులు కోరినపుడు.. కేంద్ర మంత్రిగా ప్రజలకు, తన శాఖలో పనిచేస్తున్న వారికి సేవ చేయాలని అనుకుంటున్నానని ఆయన బదులిచ్చారు. తన బొగ్గు, గనుల శాఖ పరిధిలో 6 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి రూ.కోటి బీమా పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించే అవకాశం ఉందనే ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిస్తూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యే వారికి ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలని నిబంధన లేదు. బీజేపీ అధ్యక్ష పదవికి రెండు సార్లు క్రియాశీల సభ్యుడు అయి ఉండాలి. అయితే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు. ఆ నిబంధన ఆయనకు వర్తించదు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ను నేతల ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తారు. నామినేషన్ పద్ధతిలో వారం తర్వాత కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు’అని తెలిపారు. మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరగనున్న ఎన్నికల్లో అన్నింటిలోనూ గెలుస్తామనే నమ్మకం తమకుందన్నారు. ‘రాష్ట్రంలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు కదా’అన్న ప్రశ్నకు.. ఎన్నికలు ఉంటాయంటున్న కేటీఆర్, సుప్రీంకోర్టు జడ్జి కూడా అయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. సినీహీరో చిరంజీవి బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నకు.. ‘నా ఆహ్వానం మేరకు ఇటీవల ఆయన ఢిల్లీకి వచ్చారు, అనేక మంది సినీ ప్రముఖులకు బీజేపీతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. కొందరు పార్టీలో చేరారు. మంత్రులు అయ్యారు. కొందరు పార్టీకి ప్రచారం చేశారు. ఇకపై ఏవైనా ఫంక్షన్లకు నేను పిలిస్తే వస్తారంటే నాగార్జున, వెంకటేశ్, ఇతర హీరోలను కూడా పిలుస్తాను’అని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ఉచితాలు వద్దని ఎక్కడా చెప్పలేదు.. ‘బీజేపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, ఉచితాల (ఫ్రీ బీస్)కు వ్యతిరేకం కాదు. ఉచితాలు వద్దు అని బీజేపీ ఎక్కడా చెప్పలేదు. రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని హామీలివ్వాలి’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించాం. తెలంగాణలో టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, రీజినల్ రింగ్ రోడ్ నేనే తెచ్చా. ప్రధానిని ఒప్పించి మహబూబ్‌నగర్ సభలో పసుపు బోర్డు ప్రకటన నేనే చేయించా. మూసీ సుందరీకరణకు కేంద్రం నిధులను నిబంధనల మేరకు కచ్చితంగా ఇస్తాం. హైదరాబాద్ మెట్రోకి రూ.1,250 కోట్లు కేంద్రం ఇచ్చింది. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు కచ్చితంగా సహకరిస్తాం. రీజినల్ రింగ్ రైల్ సర్వేకు కేంద్రం డబ్బులు ఇచ్చింది. అలైన్మెంట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’అని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘తెలంగాణలో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎంఐఎం సహకరిస్తోంది. బీజేపీపై విషం చిమ్మడమే ఎంఐఎం నేతలు పనిగా పెట్టుకున్నారు. దేశంలో ముస్లింనేతగా ఎదగాలన్న ఆశతో ఆ పార్టీనేత అసదుద్దీన్ ఒవైసీ పిట్టల దొరగా మారారు’అని విమర్శించారు. -
మార్చిలోగా పూర్తి చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ‘మార్చిలోగా జీహెచ్ఎంసీ సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి. ఆ ఎన్నికల్లో సత్తా చాటేలా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలను అప్రమత్తం చేయాలి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలను తొలుత నిర్వహించాలి. తర్వాత మిగతా ఎన్నికలను నిర్వహించేలా కార్యాచరణ తీసుకోవాలి. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న దృష్ట్యా కనీసం 80 శాతం విజయాలు నమోదు చేయాలి. రాష్ట్ర మంత్రులు ఎంతమాత్రం ఉదాసీనంగా ఉండొద్దు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలి. ముఖ్య నేతలు కూడా స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..’ అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో ఫలితాల ఆధారంగానే రాబోయే రోజుల్లో నేతలకు పదవుల పంపకాలు ఉంటాయని స్పష్టం చేసింది. ‘స్థానిక’ సంసిద్ధతపై ఆరా రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరితోనే ముగిసింది. మండల, జిల్లా పరిషత్‌ల పదవీకాలం గత జూలైతో పూర్తయ్యింది. ఇక ఈ నెల 26వ తేదీకి ఒకటీ రెండు మినహా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం కూడా ముగియనున్న నేపథ్యంలో ఏఐసీసీ వాటి ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీ సంసిద్ధతపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో కేసీ పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఆ సమావేశానికి కొనసాగింపుగా ఢిల్లీ వేదికగా ఈ కీలక భేటీని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కొండ సురేఖ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, పార్టీ పనితీరు, స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణం, రాహుల్‌గాంధీ సభ తదితర అంశాలపై సుమారు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. బీసీ కుల గణనపై కూడా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలు వివరించిన నేతలు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను కేసీ వేణుగోపాల్‌కు రాష్ట్ర నేతలు వివరించారు. రైతు కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం అందజేయనుండటం, కొత్త రేషన్ కార్డుల జారీ, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తదితరాలపై తాజా వివరాలు అందజేశారు. ఈ నేపథ్యంలో కేసీ మాట్లాడారు. కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలన్న కేసీ మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు అందుతున్నాయని, ఇన్చార్జి మంత్రులు తమ తమ జిల్లాల కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేలా బాధ్యత తీసుకోవాలని కేసీ వేణుగోపాల్ సూచించారు. జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్థత, ఆయా ఎన్నికల్లో విజయడంకా మోగించడంపై దిశానిర్దేశం చేశారు. పీసీసీకి సంబంధించి సంస్థాగత పునర్నిర్మాణంతో పాటు జిల్లాల్లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మిగిలిపోయిన నామినేటెట్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలో నిర్వహించనున్న రాహుల్‌గాంధీ సభ విజయవంతం చేసేలా రూపొందించిన ప్రణాళికలపై చర్చించారు. కష్టపడి పనిచేస్తున్న వారికే పదవులు: మహేశ్‌గౌడ్ ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ పదవులు, పెండింగ్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పదవులు దక్కుతాయని చెప్పారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు, పీసీసీ కూర్పు ఇతర అంశాలపై చర్చించామని తెలిపారు. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్‌గాంధీ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం, పార్టీ పనితీరు భేషుగ్గా ఉందని కేసీ వేణుగోపాల్ ప్రశంసించారన్నారు. కేబినెట్ విస్తరణపై సీఎం, అధిష్టానం పెద్దలు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
ఎంత మంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు
సాక్షి, అమరావతి: ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు రాష్ట్ర శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు మరో నాలుగు బిల్లులను కూడా ఆమోదించింది. ఒక బిల్లు వాయిదా పడింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లు 2024 బిల్లును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. గతంలో జరిగిన చట్ట సవరణల ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చెప్పారు. అయితే, గత మూడు దశాబ్దాలలో జనాభా నియంత్రణ చర్యలతో సంతానోత్పత్తి సామర్ధ్యం రేటు బాగా తగ్గిపోయిందన్నారు. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జనాభాను పెంపొందించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే చట్టంలో సవరణలు చేసినట్లు వివరించారు. గతంలో ఆ చట్టాల్లో చేసిన సవరణలకు సంబంధించిన సెక్షన్లను తొలగిస్తూ చేసిన చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.జనాభా పెరగదుఈ బిల్లుపై అధికార కూటమి శాసన సభ్యులే పలువురు పెదవి విరిచారు. చట్ట సవరణ చేసినప్పటికీ, ప్రస్తుత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా సంతానోత్పత్తి పెరగకపోవచ్చునని, పైగా సంక్షేమ పథకాలు ఆ కుటుంబాలకు అందవని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ పరంగా ఆలోచిస్తే ఈ సవరణ సంతానోత్పత్తి రేటు వృద్ధికి దోహద పడదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. జననీ సురక్ష పథకం ఒక్కరికే వర్తిస్తుందని, ఇద్దరు పుడితే ఆ పథకం వర్తించదని చెప్పారు. ఇటువంటి నిబంధనలు ఉన్నన్ని రోజులూ సంతానోత్పత్తి రేటు పెరగదని స్పష్టం చేశారు. కుటుంబాలను ఆదుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలైన రోజే సంతానోత్పత్తి రేటు పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో యువత పెరగడానికి ఈ సవరణ తోడ్పడుతుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి అన్నారు.మరి కొన్ని బిల్లులకూ ఆమోదంవైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన మూడు బిల్లులను శాసన సభ ఆమోదించింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సిఫార్సు మేరకు మూగ, చెవిటి, కుష్టు పదాలను తొలగిస్తూ ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు–2024ను సభ ఆమోదించింది. ఆయా సమస్యలున్న వారికి విశ్వవిద్యాలయం ఈసీ సభ్యులుగా అవకాశం కల్పించేలా చట్ట సవరణ చేసినట్లు మంత్రి చెప్పారు. అదే విధంగా ఈ మూడు పదాలను తొలగిస్తూ ఏపీ ఆయుష్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లులనూ సభ ఆమోదించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు –2024కు కూడా సభ ఆమోదం తెలిపింది. రెవెన్యూ శాఖ మంత్రి అభ్యర్థన మేరకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ బిల్–2024ను మరో రోజుకు వాయిదా వేసినట్టు స్పీకర్ ప్రకటించారు. -
‘లోకల్’లో కారు దూసుకెళ్లేలా!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని భావిస్తోంది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా.. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపాలనే గట్టి పట్టుదల బీఆర్ఎస్లో కనిపిస్తోంది. ఆ మేరకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను పెంచడం, నాయకులు, కేడర్ నడుమ సమన్వయం సాధించడం లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, వ్యూహానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పదును పెడుతున్నారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించాలనే యోచనలో ఉన్న కేసీఆర్ ఈ భేటీలోనే ఎన్నికల సన్నద్ధత దిశగా కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఉమ్మడి జిల్లాల వారీగా పలువురు మాజీ మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. దసరా లోపే పార్టీ ప్లీనరీ! స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా భారీ సభలు నిర్వహించాలా లేక ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున బహిరంగ సభలు ఏర్పాటు చేయాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారం తరహాలో బస్సుయాత్ర చేపట్టే అంశంపైనా కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సిన పార్టీ ప్లీనరీ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. దసరా లోపు పార్టీ ప్లీనరీని రెండు రోజుల పాటు నిర్వహించే అవకాశముంది. అయితే ఈ ప్లీనరీని హైదరాబాద్ బయట నిర్వహించాలనే సూచనలు కేసీఆర్‌కు అందుతున్నాయి. వరంగల్‌లో పార్టీ ప్లీనరీ జరిగే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆ సెగ్మెంట్లలో ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై కేసీఆర్ దృష్టి సారించారు. బాన్సువాడ, జగిత్యాల, పటాన్చెరు, చేవెళ్ల, గద్వాల సిర్పూరు, నిర్మల్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇన్చార్జీలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సిర్పూరులో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎల్.రమణ ఇప్పటికే కేడర్‌ను సమన్వయం చేస్తున్నారు. రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా రాష్ట్రంలో రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాతో పాటు దళితబంధు, ఆసరా పింఛన్ల మొత్తం పెంపు తదితరాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తోంది. -
బలం లేకున్నా టీడీపీ ఎందుకు పోటీ చేస్తోంది?: బొత్స
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టుగా భావించాలని వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 580కి పైగా ఓట్ల బలం ఉందన్నారు. వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. ఎవరో బిజినెస్‌మేన్‌ను తెచ్చి టీడీపీ పోటీ చేయిస్తుందని ప్రచారం జరుగుతోందని, రాజకీయాలంటే ఆ పార్టీకి వ్యాపారంలా ఉందని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. 300 ఓట్లకు పైగా తేడా ఉన్న సమయంలోనూ పోటీకి దిగడాన్ని ఎలా చూడాలని బొత్స ప్రశ్నించారు. కూటమి గెలుస్తుందని చెప్పేవారు ఈ నెల 14 తర్వాత మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో అరకు ఎంపీ తనుజారాణి, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, కేకే రాజు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీకి పూర్తి బలం : సుబ్బారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు పూర్తి స్థాయి బలం ఉందని.. అయినా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుందో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
స్థానిక సమరానికి సై
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ‘లోకల్ బాడీ’ఎలక్షన్స్ టార్గెట్‌గా పెట్టుకుంది, గ్రామస్థాయిలో సంస్థాగతంగా బలపడేందుకు కమలదళం సన్నద్ధమవుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్ని కల నాటికి గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల వ్యవస్థ పటిష్టానికి అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలు నిరాశ పరిచినా, లోక్‌సభ ఫలితాలు బీజేపీకి కొంతమేర ఊపునిచ్చాయి. గ్రామస్థాయిలో బీజేపీ అంత పటిష్టంగా లేదు. ఈసారి జరగబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. శుక్రవారం జరిగిన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలోనూ 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి తీరాలని.. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ తీర్మానించింది, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓటింగ్ రాగా, లోక్‌సభ ఎన్నికల నాటికి 35 శాతానికి ఓటింగ్ పెరిగింది. త్వరలో జరగబోయే లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈ ఓటింగ్‌ను నిలుపుకునేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన కేంద్రమంత్రులు, ముఖ్యనేతలు, ఎంపీలు స్థానిక ఎన్నికల్లో అన్నిస్థాయిల్లోని పార్టీ కేడర్‌కు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇంతకాలం ఎంపీలు, ఎమ్మెల్యేల విజయానికి కృషి చేసిన కార్యకర్తలను గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ప్రకటించారు. స్థానికం.. సన్నద్ధం: పార్టీపరంగా స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన కార్యాచరణ, వ్యూహాలు సిద్ధం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ప్రత్యేకంగా 32 జిల్లాస్థాయి, మండలాల నుంచి, గ్రామ పంచాయతీల దాకా స్థానిక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు సామాజిక సమతూకం పాటిస్తూ.. ఓ ఓసీ, ఓ ఎస్సీ, ఓ బీసీ, ఓ మహిళ ఉండేలా కమిటీల కూర్పు ఉండనుంది. ఈ కమిటీలన్ని జిల్లా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ వరకు పర్యటించి వార్డుసభ్యులు మొదలు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులను గుర్తిస్తారు. పోటీచేసే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు కూడా ఈ కమిటీలకే అప్పగించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. -
కావాల్సిన సింబల్‌ను కోరలేరు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రాతినిధ్య చట్టం – 1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తే కావాలని ఎవరూ కోరలేరని హైకోర్టులో ఎన్నికల కమిషన్ వాదనలు వినిపించింది. దీంతో ‘చపాతీ రోలర్’గుర్తును ఎంపిక జాబితాలో చేర్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను పిటిషనర్ ఉపసంహరించుకున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల ఉండటంతో ఎన్నికల గుర్తు జాబితాలో ‘చపాతీ రోలర్’ను చేర్చాలని కోరుతూ హైకోర్టులో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫారమ్స్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదన లు వినిపిస్తూ...గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్ని కల్లో పిటిషనర్ పార్టీ అభ్యర్థులు ‘చపాతీ రోలర్’ గుర్తుపై పోటీ చేశారన్నారు. మండల పరిషత్ ప్రాదే శిక నియోజకవర్గం, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియో జకవర్గం, పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అదే గుర్తు కేటాయించేలా ఈసీకి ఆదేశాలి వ్వాలని కోరారు.ఈసీ తరఫు న్యాయవాది జి. విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం అలాంటి వెసులుబాటు లేనందున ఉన్న జాబితా నుంచే ఏదో ఒక గుర్తు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. -
Mexico 2024 elections: మెక్సికో పీఠంపై తొలిసారి మహిళ!
మెక్సికో. లాటిన్ అమెరికాలో రెండో అతి పెద్ద దేశం. పురుషాధిపత్య భావజాలానికి పెట్టింది పేరు. మహిళలపై హింస, హత్య, యాసిడ్ దాడులు నిత్యకృత్యం. మెక్సికోలో ఇదే అతి పెద్ద సమస్య కూడా. అలాంటి దేశంలో తొలిసారి ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు! ఆదివారం జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవితో పాటు 128 మంది సెనేటర్, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు దాదాపు 20 వేల స్థానిక సంస్థల స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పాలక, ప్రధాన సంకీర్ణాలు రెండింటి నుంచీ మహిళలే బరిలో ఉండటం విశేషం. పాలక ‘మోరెనా’ సంకీర్ణం తరఫున పోటీ చేస్తున్న క్లాడియా షేన్‌బామ్ గెలుపు ఖాయమేనని పరిశీలకులు చెబుతున్నారు. నేషనల్ యాక్షన్ పార్టీ సారథ్యంలోని విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్పై ఆమె కనీసం 20 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు అన్ని సర్వేల్లోనూ తేలింది. మహిళలపై మితిమీరిన హింసకు పెట్టింది పేరైన ఆ దేశంలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కూడా నానాటికీ బాగా పెరుగుతుండటం విశేషం. దిగువ సభ (కాంగ్రెస్)లో అన్ని పారీ్టలూ మహిళలకు కనీసం 50 శాతం టికెట్లివ్వడాన్ని ఇప్పటికే తప్పనిసరి చేశారు. ఫలితంగా కాంగ్రెస్‌లో సగం మంది సభ్యులు మహిళలే ఉన్నారు. మెM్సకో జనాభా 13 కోట్లు కాగా దాదాపు 10 కోట్ల మంది ఓటర్లున్నారు. ఆదివారం పోలింగ్ ముగిశాక రాత్రికల్లా ఫలితాలు వెలవడే అవకాశముంది.సోచిల్ గాల్వెజ్61 ఏళ్ల గాల్వెజ్ సెనేట్ సభ్యురాలు. పారిశ్రామికవేత్త. ఎన్ఏపీ, పీఆర్ఐ, పీఏఎన్, ఆర్పీడీ సహా పలు పారీ్టలతో కూడిన విపక్ష కూటమి తరఫున బరిలో ఉన్నారు. లోపెజ్ ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం వంటివాటిని తాను కూడా కొనసాగిస్తానని చెబుతూ పలు వర్గాలను ఆకట్టుకున్నారు. దాంతోపాటు మధ్య, దిగువ తరగతి ప్రజల కోసం సార్వత్రిక సామాజిక రక్షణ వ్యవస్థ తెస్తానంటున్నారు. పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచి నేరాలపై ఉక్కుపాదం మోపుతానని చెబుతున్నారు.క్లాడియా షేన్‌బామ్ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త. 2007లో నోబెల్ గ్రహీత. మెక్సికో సిటీ మాజీ మేయర్. గెలిస్తే తొలి అధ్యక్షురాలిగానే గాక యూదు మూలాలున్న తొలి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించే అవకాశముంది. అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్కున్న విశేషమైన జనాదరణ ఉన్నా రెండోసారి పదవి చేపట్టేందుకు మెక్సికో రాజ్యాంగ ప్రకారం అనుమతించని కారణంగా పాలక సంకీర్ణ అభ్యరి్థగా షేన్‌బామ్ బరిలో దిగారు. కనీస వేతనాలను రెట్టింపు చేయడం, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల పెంపు, రైతులకు సబ్సిడీ, వర్సిటీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, నిరుద్యోగులకు భృతి వంటివి నేరుగా నగదు రూపంలో చెల్లించడం, సీనియర్ సిటిజన్లకు సార్వత్రిక పెన్షన్ సదుపాయం వంటివాటితో లోపెజ్ తన ఆరేళ్ల పదవీకాలంలో అందరి మన్ననలు పొందారు. ఇదంతా 61 ఏళ్ల షేన్‌బామ్‌కు బాగా కలిసి రానుంది. డ్రగ్ మాఫియా, వ్యవస్థీకృత నేరాలు మెక్సికో ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనవి. వీటి కట్టడికి లోపెజ్ పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. తాను వాటిపైనా ప్రధానంగా దృష్టి సారిస్తానని ఆమె చెబుతున్నారు. లోపెజ్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆయన ప్రభావానికి అతీతంగా పాలిస్తానంటున్నారు.జార్జే అల్వారిజ్ మైనేజ్ రాజకీయాలకు కొత్త ముఖం. స్మాల్ సిటిజన్ మూవ్మెంట్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చారు. డ్రగ్స్‌ను నిర్మూలించడం అసాధ్యమని, వాటిని బాగా కట్టడి చేస్తానని చెబుతున్నారు. 38 ఏళ్ల మైనేజ్ ప్రతిపాదించిన పలు ఆర్థిక సంస్కరణలపై ప్రజల నుంచి మంచి స్పందన రావడం విశేషం. ఈసారి గెలవకపోయినా మున్ముందు మెక్సికో రాజకీయాల్లో ఆయన ప్రబల శక్తిగా ఎదగడం ఖాయమంటున్నారు. -
ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై సందిగ్థత నెలకొంది. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక.. జూన్‌లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వపరంగా అడుగులు ముందుకు పడడం లేదనే చెప్పాలి. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జనగణన చేపట్టినా.. స్థానికంగా (క్షేత్రస్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ఇప్పట్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవనే ఊహాగానాలు సాగుతున్నాయి. జూన్ 6వ తేదీ వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండడంతో ప్రభుత్వం లేదా బీసీ కమిషన్ పరంగా... స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ముందస్తు కార్యాచరణ చేపట్టేందుకు వీలు లేదు. గ్రామపంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ముగిసి ఈ నెలాఖరుకు నాలుగు నెలలు పూర్తికానుండగా... జూలై 4 నాటికి జిల్లా, మండల ప్రజా పరిషత్ పాలకమండళ్ల కాలపరిమితి కూడా ముగియనుంది. అదేవిధంగా వచ్చే ఏడాది మొదట్లో వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం చర్చనీయాంశమవుతోంది. బీసీలకు 42% స్థానిక రిజర్వేషన్లపై హామీఅసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని చెప్పడంతో పాటు ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచి్చంది. ఈ మేరకు బీసీ కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకుంటామని ప్రకటించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’ పేరిట మార్గదర్శకాలు నిర్దేశించింది. మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి) 50 శాతానికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఏయే నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని సుప్రీం పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ విచారణ జరిపి తుది నివేదిక ఇస్తే దాని ఆధారంగానే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశముంది. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తిచేసినట్టు తెలుస్తోంది. కొత్త ఓటర్ల జాబితా (లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన జాబితా) ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా నియమించి.. ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓటర్ల వివరాలను సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు కమిషన్ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు ఓటర్ల లిస్ట్‌కు అనుగుణంగానా? లేక క్షేత్రస్ధాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై స్పష్టత కొరవడినట్టు సమాచారం. ఈ కసరత్తు జరిగితే...ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఎన్నికలు? ఓటర్ల జాబితాకు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చవచ్చునని, సామాజిక, ఆర్థిక కుల సర్వే అయితే ఇంకా సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చుననే సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్ ద్వారా వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ ఆలోచనకు ప్రభుత్వపెద్దలు ఓకే చెబితే రిజర్వేషన్ల ఖరారు పూర్తిచేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు పంపిస్తే ఆగస్ చివర్లో లేదా సెప్టెంబర్‌లో ముందుగా గ్రామపంచాయతీ ఆ తర్వాత జిల్లా, మండలపరిషత్ ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించుకోవచ్చుపనని అభిప్రాయపడుతున్నారు. కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారా? ఈ ఆగస్టుతో బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ పరిస్థితుల్లో పాత కమిషన్ ఆధ్వర్యంలోనే బీసీ జనగణన కసరత్తును పూర్తిచేసి ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళుతుందా ? లేక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసుకునే బీసీ కమిషన్ ద్వారానే ఈ కార్యాచరణను నిర్వహిస్తారా అన్నది కూడా అధికారవర్గాల్లో చర్చకు వస్తోంది. ఆగస్ట్‌లో కొత్తగా బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాక... బీసీ జనగణనకు సంబంధించిన కార్యక్రమం చేపట్టాలని భావిస్తే మాత్రం ఈ ఎన్నికల నిర్వహణ ఇంకా ఆలస్యం కావొచ్చునని భావిస్తున్నారు. దీనిని బట్టి ఈ ఎన్నికలు ఏడాది చివరి వరకు వెళ్లొచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. దీంతో ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి ? ముందుగా జీపీ ఎన్నికలుంటాయా లేక జడ్పీటీసీ, ఎంపీటసీ ఎలక్షన్లు మొదట నిర్వహిస్తారా? లేక ఈ ఏడాది చివర్లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి తర్వాత మరొకటి వరుసగా నిర్వహిస్తారా అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే... తొలుత జీపీ ఆ తర్వాత 10, 15 రోజులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ఊహించని ఎదురుదెబ్బ!
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. స్థానిక ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఎదురైంది. గత 40 ఏళ్ల చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఇంతలా ఓటమి చెందడం ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. బ్రిటన్‌లో ఈ ఏడాది చివర్లలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఫలితాలు రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. కాగా, బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా కన్జర్వేటివ్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో, ప్రధాని రిష్ సునాక్‌పై ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. అలాగే, ఈ ఫలితాలు ప్రధాని పీఠంపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, బ్రిటన్‌లో 107 కౌన్సిల్స్‌కు ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ముందంజలో కొననసాగుతోంది. Disaster for Tories. Love to see it. Now @RishiSunak call for general elections. pic.twitter.com/6Bj1ARAUbh— OppaGaymer 🇵🇸 (@RafLee84) May 3, 2024 కాగా, బ్లాక్పూల్ సౌత్‌లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డేవిడ్ జోన్స్‌పై లేబర్ పార్టీ అభ్యర్థి క్రిస్ వెబ్ ఘన విజయం సాధించారు. టోరీల నుంచి లేబర్ పార్టీకి 26 శాతం ఓటు స్వింగ్ అయింది. 1945 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. గత 40 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే దారుణ ఫలితమని, కన్జర్వేటివ్ ప్రభుత్వ పనితీరును అంతా గమనిస్తున్నారని ప్రొఫెసర్ జాన్ కర్టీస్ తెలిపారు. Local elections in England and Wales have delivered a blow to Prime Minister Rishi Sunak and his governing Conservative Party. The opposition Labour Party is on track to win the next general election which takes place later this year pic.twitter.com/iiHfbaqqUZ— TRT World (@trtworld) May 3, 2024 మరోవైపు.. బ్లాక్పూల్ సౌత్ ఉపఎన్నికలో టోరీ మెజారిటీ తారుమారైంది. ఇక్కడ ప్రతిపక్ష లేబర్ పార్టీ గణనీయ విజయాలను సాధించింది. బ్లాక్పూల్ సౌత్ ఉప ఎన్నికల్లో 26 శాతంతో తమ పార్టీ విజయం సాధిచడం కీలక పరిణామం అని లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ అన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఫలితాలు టోరీలు కౌన్సిల్ సీట్లలో సగం కోల్పోవచ్చని అంచనాలు వస్తున్నాయని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఈ వారాంతంలో లండన్ మేయర్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో లేబర్ పార్టీ లండన్ మేయర్ అభ్యర్థి సాదిక్ ఖాన్ మూడోసారి తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక, ప్రచారంలో తనకు సహకరించిన ప్రజలకు, తనను ఆదరించిన ఓటర్లకు ఆయన ప్రత్యర్థి బ్రిటీష్ భారతీయ వ్యాపారవేత్త తరుణ్ గులాటి కృతజ్ఞతలు తెలిపారు. తనకు భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోందని గులాటి వ్యాఖ్యలు చేశారు. -
జూన్‌లో లోకల్ వార్.. తెలంగాణ రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ జూన్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బుధవారం జరిగిన భువనగిరి లోక్‌సభ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. మధ్య మధ్యలో ఎన్నికలతో ఇబ్బంది.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పాలకవర్గాల పదవీకాలం జనవరి నెలాఖరులోనే పూర్తికాగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జూలైలో గడువు ముగియనుంది. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. జూలై తొలివారం నాటికి కొత్తగా మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. దీంతో జూన్ రెండో వారం నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, ఒకే దఫాలో పూర్తిచేయాలని సీఎం రేవంత్ యోచిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని, స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా పూర్తిచేయడం ద్వారా గ్రామ స్థాయిలోనూ రాజకీయంగా పట్టు సాధించడానికి, అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ నేతలతో సీఎం పేర్కొన్నట్టు సమాచారం. మధ్యమధ్యలో ఎన్నికలు వస్తూ ఉంటే ఇబ్బందులు వస్తుంటాయని చెప్పినట్టు తెలిసింది. రేవంత్ ఇచ్చిన సంకేతాల ప్రకారం.. జూన్ చివరి వారంలో లేదా జూలై తొలివారంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పనితీరు ఆధారంగా చాన్స్ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీపరంగా చూపిన పనితీరు ప్రాతిపదికనే.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అభ్యరి్థత్వాలతోపాటు ఇందిరమ్మ కమిటీల్లో సభ్యుల నియామకం చేపడతామని పార్టీ నేతలతో సీఎం రేవంత్ పేర్కొన్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని.. ఇప్పటికే నామినేటెడ్ పదవుల నియామకాలు జరుగుతున్నాయని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా స్థానిక నేతలకు ఎన్నికల్లో పోటీ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. వలంటీర్ల వ్యవస్థను తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా భువనగిరి సమీక్ష సందర్భంగా ఈ కోణంలో చర్చ జరిగినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని.. ఈ కమిటీల నుంచి చురుగ్గా ఉన్న ఒక కార్యకర్తను వలంటీర్‌గా ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలు క్రియాశీల పాత్ర పోషించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. వలంటీర్ల ద్వారా పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరువ చేయవచ్చనే ఆలోచనతో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. -
ఎన్నికలు ఏవైనా.. ఎప్పుడైనా గెలుపు వైఎస్సార్సీపీదే
-
పూర్వ పశ్చిమ గోదావరి జెడ్పీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు
-
ఎస్పీకి ఎసరుపెడుతూ.. మజ్లిస్ పార్టీ హవా!
తెలంగాణలో, అదీ హైదరాబాద్‌లో అధిక ప్రభావం చూపే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM).. వడివడిగా మిగతా రాష్ట్రాల్లోనూ అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బొటాబొటీ ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న పార్టీ.. తాజాగా యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిన హవాపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. ఏకంగా పదవులను చేపట్టే స్థాయికి చేరుకోగా.. మరోవైపు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఒకే ఒక్క సీటు.. 0.49 శాతం ఓట్లు.. కిందటి ఏడాది జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం రాబట్టిన ఫలితం ఇది. థర్డ్ ఫ్రంట్ ‘భగీదారి పరివర్తన్ మోర్చా’ పేరుతో ఎన్నికల్లో దిగినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది మజ్లిస్ పార్టీ. అయితే.. యూపీ నగర పాలికా పరిషత్‌లో ఐదుగురు మజ్లిస్ అభ్యర్థులు చైర్మన్లుగా, మరో 75 మంది కౌన్సిలర్లుగా ఎన్నికైనట్టు ఒవైసీ తెలిపారు. మీరట్‌లో 11 మంది కౌన్సిలర్ స్థానాలను దక్కిం చుకొని మజ్లిస్ డిప్యూటీ చైర్మన్ పదవిని చేపట్టబోతున్నారు. మీరట్‌లో అయితే ఏకంగా మేయర్ అభ్యర్థిత్వానికి జరిగిన పోటీలో బీజేపీ నామిని తర్వాత రెండో స్థానంలో నిలిచారు ఎంఐఎం అభ్యర్థి. అయితే.. ఈ మొత్తంలో నష్టపోయింది ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీనే!. ముస్లిం ఓటు బ్యాంకును ఇంతకాలం మెయింటెన్ చేస్తూ వస్తున్న ఎస్పీకి ఇది ఊహించిన షాక్ అనే చెప్పాలి. అదీగాక.. ఇంతకాలం బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలకే పరిమితమైన స్థానిక సంస్థల్లో మజ్లిస్ పాగా వేయడం ఓ మైలురాయిగా చెప్పొచ్చు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లిం ఓట్ బ్యాంకు అంతా దాదాపుగా సమాజ్‌వాదీ పార్టీ వైపే వెళ్లింది. మిత్రపక్షాలతో కలిసి 34 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపి.. విజయం సాధించింది ఎస్పీ. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంఐఏం చేజిక్కించున్న నగర పాలిక పరిషత్‌లలో ఎస్పీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండు చోట్ల చివరాఖరి స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. అన్నింటికి మించి.. మీరట్ ఫలితం మజ్లిస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. 2.35 లక్షల ఓట్లతో(41 శాతం) బీజేపీ అభ్యర్థి హిరాకాంత్ అహ్లువాలియా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాతి ప్లేస్‌లో 1.28 లక్షల ఓట్లతో(22.37 శాతం) ఎంఐఎం అభ్యర్థి అనస్ రెండో స్థానంలో నిలిచారు. ఇక.. మూడో స్థానంలో ఎస్పీ ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ భార్య సీమా ప్రధాన్ నిలిచారు. 17 మేయర్ సీట్లకుగానూ 10 చోట్ల, అలాగే.. 52 నగర పాలిక పరిషత్ చైర్పరిషత్ అభ్యర్థులను, 63 మంది నగర పంచాయితీ చైర్పర్సన్ అభ్యర్థులను, 653 వార్డ్ మెంబర్.. పరిషత్ మెంబర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో దింపింది ఎంఐఎం. మొత్తంగా అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో 83 వార్డులు గెల్చుకున్నట్లు ప్రకటించుకుంది ఆ పార్టీ. మజ్లిస్ పార్టీ సాధించిన ఈ ఫలితం కంటే సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం అనే కోణంలోనే చర్చ నడుస్తోంది అక్కడ. ఇప్పటికిప్పుడు అది జరగకపోయినా.. ఎస్పీ ఓటు బ్యాంకుకు ఎంఐఎం దెబ్బ తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే యూపీ, బీహార్, మహారాష్ట్రలలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ మెంట్ అయ్యింది మజ్లిస్ పార్టీ. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ క్రమంలో ముస్లిం ఓట్లతో పాటు దళిత ఓట్లను సైతం ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం యూపీ థర్డ్‌ఫ్రంట్‌లోకి మాయావతి బీఎస్పీకి సైతం ఆహ్వానం పంపింది. అటు నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఎంఐఎం భావిస్తోంది కూడా. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీజేపీ పసమందా ముస్లిం(వెనుకబడిన ముస్లింలు)లను ఆకర్షించేలా స్వయంగా ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో పది నుంచి పదిహేను స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోందట. ఈ విషయాన్ని ఎంఐఎం జనరల్ సెక్రటరీ పవన్ రావ్ అంబేద్కర్ ప్రకటించారు. -
ఈ ప్రజలకు ఏమైంది.. వాళ్లనే ఎన్నుకుంటారు!
రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ ప్రతినిధుల ఎన్నిక ఇటీవల ముగిసింది. ఇందులో సింహభాగం అధికార పక్షం బిజూ జనతాదళ్ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో 90శాతం మంది ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయితే అరకొర విద్యార్హతతో పాటు నేర చరితులు, కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థలు వెల్లడించిన విశ్లేషణాత్మక వివరాల నివేదికలో ఈ వివరాలు బయటపడ్డాయి. భువనేశ్వర్: రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 851మంది జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో 125 మంది విజేతలు అఫిడవిట్ వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు. ఈ నేపథ్యంలో 726 మంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వివరాలను ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ ఏడీఆర్ సంస్థలు విశ్లేషణాత్మకంగా వివరించాయి. దాఖలైన పూర్తి వివరాలు ప్రకారం 726 మంది జిల్లా పరిషత్ విజేత అభ్యర్థుల్లో 385 మంది మహిళలు ఉన్నారు. అలాగే నేర చరితుల వర్గంలో అగ్రస్థానంలో నిలిచిన బీజేడీ.. కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానం చేజిక్కించుకోవడం ప్రత్యేకం. 726మంది జిల్లా పరిషత్ సభ్యుల్లో 113మంది నేర చరితులు. 15 మందిపై హత్యాయత్నం ఆరోపణలతో ఐపీసీ 307 సెక్షన్ కింద కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 12మంది విజేత అభ్యర్థులు మహిళల పట్ల అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కలంకితులు.. పంచాయతీ ఎన్నికల్లో విజయ శంఖారావం చేసిన బీజేడీ అభ్యర్థుల్లో అత్యధికంగా 66 మందిపై నేరారోపణలు ఉన్నాయి. 53మంది తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 37మంది బీజేపీ జెడ్పీటీసీలు, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఏడుగురు, ఝార్కండ్ ముక్తి మోర్చా(జేఏఎంఎం), భారతీయ కమ్యునిస్ట్ పార్టీ(సీపీఐ), స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్కరి చొప్పున నేరచరితులు ఉన్నారు. బీజేపీకి చెందిన జెడ్పీ సభ్యుల్లో నలుగురిపై తీవ్ర నేరారోపణలు, కాంగ్రెస్ నుంచి ఆరుగురిలో, జేఏఎంఎం, స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్క అభ్యర్థికి వ్యతిరేకంగా నమోదైన కేసులు వివిధ కోర్టుల్లో కొనసాగుతున్నాయి. సగటు ఆస్తుల విలువ.. కొత్తగా ఏర్పాటైన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో సమగ్రంగా 95 మంది(13 శాతం) కోటీశ్వరులు ఉన్నారు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.56 లక్షల 60 వేలు. వీరిలో బీజేడీకి చెందిన జిల్లా పరిషత్ అభ్యర్థుల్లో అత్యధికంగా 90 మంది(14 శాతం) కోటీశ్వరులు కాగా.. బీజేపీ నుంచి ముగ్గురు(8శాతం), కాంగ్రెస్‌లో ఇద్దురు(9శాతం) కోటీశ్వరులు ఎన్నికయ్యారు. విద్యాధికులు అంతంతమాత్రమే.. తాజా ఎన్నికల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికైన వారిలో విద్యాధికులు అంతంత మాత్రమే. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థ విశ్లేషణాత్మక వివరాలను బహిరంగం చేసింది. కొత్తగా ఎన్నికైన వారిలో 451 మంది(62శాతం) 5వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య విద్యార్హతలు కలిగి ఉన్నారు. 256 మంది(35 శాతం) పట్టభద్రులు, ఆరుగురు డిప్లొమా విద్యార్హత కలిగి ఉన్నారు. ఏడుగురు అభ్యర్థులు నామమాత్రపు అక్షరాశ్యులు. 50 ఏళ్లు పైబడిన అభ్యర్థులు అత్యధికంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. 51 ఏళ్ల నుంచి 70 ఏళ్లు పైబడిన వారు 88 మంది ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన 373మంది అభ్యర్థులు వయస్సు సంబంధిత వివరాలు దాఖలు చేయలేదని నివేదికలే తేలింది. చదవండి: క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే! -
తమిళనాడును తాకిన హిజాబ్ సెగ.. రియాక్షన్ ఇది
Hijab Row In Tamil Nadu: దాదాపు పదేళ్ల తర్వాత విరామం తర్వాత తమిళనాట స్థానిక సంస్థల హడావుడి నెలకొంది. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 640 స్థానాలకు.. 12, 800 పోస్టులకు శనివారం పోలింగ్ జరుగుతోంది. చాలాకాలం తర్వాత జరుగుతుండడంతో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మంది పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో హిజాబ్ సెగ తమిళనాడుకు పాకింది. కర్ణాటకను కుదిపేస్తున్న ‘హిజాబ్’ పరిణామం.. దేశంలో పలుచోట్ల రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మధురైలో హిజాబ్ ధరించిన ఓ మహిళను బీజేపీ బూత్ ఏజెంట్ అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఆమెతో హిజాబ్ తొలగించి.. ఓటు వేయడానికి అనుమతించాలంటూ ఆ బూత్ ఏజెంట్ వీరంగం సృష్టించాడు. అయితే అతన్ని నిలువరించాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే సభ్యలు కోరగా.. పోలీసుల జోక్యంతో అతను బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయ్‌నిధి స్టాలిన్ స్పందించాడు. #TamilNadu Urban Local Body Poll |A BJP booth committee member objected to a woman voter who arrived at a polling booth in Madurai while wearing a hijab;he asked her to take it off. DMK, AIADMK members objected to him following which Police intervened. He was asked to leave booth pic.twitter.com/UEDAG5J0eH — ANI (@ANI) February 19, 2022 బీజేపీ చేష్టలను తమిళనాడు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోరని స్పష్టం చేశాడు. ‘‘బీజేపీ ఎప్పుడూ ఇలాగే చేస్తుంటుంది. అలాంటి వాటికి మేం వ్యతిరేకం. ఎవరిని ఎంచుకోవాలో, ఎవరిని పక్కన పెట్టాలో, ఎవరికి గౌరవం ఇవ్వాలో.. ఇక్కడి జనాలకు బాగా తెలుసు. తమిళనాడు ఎట్టిపరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలను అంగీకరించబోదు’’ అంటూ ఉదయ్‌నిధి స్టాలిన్ వ్యాఖ్యానించాడు. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘మతం పేరిట మనుషుల్ని తిరస్కరించడం బాధాకరం. ఎలాంటి బట్టలు వేసుకోవాలో అనేది వ్యక్తిగత విషయం, హక్కు కూడా. అది ఎక్కువా.. తక్కువా అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని నా అభిప్రాయం’’ అని వ్యాఖ్యానించారామె. தமிழகத்தில் இன்று நடைபெறும் நகர்ப்புற உள்ளாட்சித் தேர்தலை முன்னிட்டு சென்னை,சாலிகிராமத்தில் உள்ள வாக்குச்சாவடியில் எனது வாக்கினை செலுத்தி ஜனநாயக கடமையாற்றினேன். #LocalBodyElection pic.twitter.com/v4ItGVnkdn — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 19, 2022 ఇక తమిళనాట పదకొండేళ్ల తర్వాత అర్బన్ లోకల్ బాడీ పోల్స్ జరుగుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే తమ మధ్య పోటీ ఉండాలనే ఉద్దేశంతో.. బీజేపీని ప్రచారంలో ఏకీపడేశాయి. ఉదయం ఏడు గంటలకే మొదలైన పోలింగ్.. చాలా చోట్ల ప్రశాంతంగానే కొనసాగుతోంది. కాకపోతే లాంగ్ క్యూలతో జనం విసిగిపోయి.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 31, 180 పోలింగ్ స్టేషన్లలో సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించింది పోలీస్ శాఖ. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు కమల్ హాసన్ తెయ్‌నామ్‌పేట్‌లో, తెలంగాణ గవర్నర్ తమిళసై, తమిళ స్టార్ హీరో విజయ్ నీలాన్‌గరైలో, పలువురు సెలబ్రిటీలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగిల్ ఫేజ్‌లో ముగియనున్న ఈ ఎన్నికల కౌంటింగ్ ఫిబ్రవరి 22న జరగనుంది. అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు. సంబంధిత వార్త: హిజాబ్ వివాదం.. విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు