సీఎల్పీ.. వెంటనే ఢిల్లీకి | Key developments in Telangana Congress High command calls key leaders | Sakshi
Sakshi News home page

సీఎల్పీ.. వెంటనే ఢిల్లీకి

Published Thu, Feb 6 2025 2:15 AM | Last Updated on Thu, Feb 6 2025 8:30 AM

Key developments in Telangana Congress High command calls key leaders

రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు.. ముఖ్య నేతలకు అధిష్టానం పిలుపు

జిల్లాల వారీగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో భేటీకి తొలుత నిర్ణయం 

ఇటీవలి ఎమ్మెల్యేల డిన్నర్‌ భేటీ, అసంతృప్తులపై చర్చించి, మార్గనిర్దేశం చేయాలనే యోచన 

ఢిల్లీ పిలుపు నేపథ్యంలో ఈ భేటీ సీఎల్పీ సమావేశంగా మార్పు 

ఎంసీఆర్‌హెచ్చార్డీలో 11 గంటలకు సీఎం నేతృత్వంలో భేటీ

ఏడాది కాలంలో ఎమ్మెల్యేల పనితీరును వివరించనున్న రేవంత్‌ 

కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చ.. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం 

ఆ వెంటనే ఢిల్లీ వెళ్లనున్న సీఎం, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మున్షీ, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్,  

పార్టీ అంతర్గత వ్యవహారాలు, పీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ల చైర్మన్‌ పోస్టులపై చర్చకు చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయం రసకందాయంలో పడింది. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు, ఎమ్మెల్యేల అసంతృప్తితోపాటు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు, కార్పొరేషన్ల చైర్మన్‌ పోస్టుల భర్తీ తదితర అంశాలను కొలిక్కి తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి, వారి పనితీరు, స్థానిక సంస్థల ఎన్నికలు, కుల గణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ శాసనసభ పక్షం గురువారం భేటీకానుంది. 

ఈ భేటీ తర్వాత రాష్ట్ర నాయకత్వం వెంటనే ఢిల్లీ వెళ్లనుంది. వాస్తవానికి తొలుత జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీకి రాష్ట్ర నాయకత్వం సిద్ధమవగా.. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ భేటీని సీఎల్పీ సమావేశంగా మార్చారు. అది ముగియగానే ఢిల్లీకి బయలుదేరనున్నారు. 

ఇక్కడ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం  
సీఎల్పీ భేటీలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. గత ఏడాదికాలంలో వారి పనితీరుకు సంబంధించిన నివేదికలోని అంశాలను వివరించనున్నట్టు తెలిసింది. పార్టీలో ఇటీవలి అంతర్గత పరిణామాలు, ఎమ్మెల్యేల డిన్నర్‌ పే చర్చ వ్యవహారం గురించి కూడా సీఎం ప్రస్తావించనున్నట్టు సమాచారం. 

పాలనలో భాగంగా ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అంశాలు, పెండింగ్‌ బిల్లుల మంజూరు, ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులతో ఎమ్మెల్యేలకు సమన్వయం, ఇన్‌చార్జి మంత్రుల పెత్తనం తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో సీఎం రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పాల్గొననున్నారు. 

ఈ అంశాలు ప్రజల్లోకి వెళ్లడం లేదా? 
రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారంటీల అమలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాల విషయంలో ప్రభుత్వం దూకుడుగా వెళుతున్నా.. ప్రజల్లో అంత దూకుడుగా చర్చ జరగడం లేదని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. దీనితో ఈ అంశంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌తోపాటు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేయనున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు పోషించాల్సిన పాత్రను వివరించనున్నట్టు సమాచారం. 

కులగణన, ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలకు వివరించడం, ప్రతిపక్షాలు చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టడంపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 80శాతానికి పైగా గెలుచుకోవాలన్న దిశగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం.

 

ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో భేటీ.. 
రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇటీవలి పరిణామాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. డిన్నర్‌ పేరుతో కొందరు ఎమ్మెల్యేలు సమావేశమై తమ అసంతృప్తిని వెళ్లగక్కడం, పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వంటివి ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లాయి. వీటితోపాటు చాలాకాలంగా మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ల చైర్మన్‌ పోస్టుల భర్తీ పెండింగ్‌లో ఉన్నాయి. పీసీసీ కొత్త కార్యవర్గం కూర్పు విషయం కూడా ఇంకా తేలలేదు. వీటన్నింటిపైనా చర్చించి మార్గనిర్దేశం చేసేందుకు సీఎం రేవంత్‌ బృందాన్ని ఢిల్లీకి రమ్మని అధిష్టానం నుంచి పిలుపు అందింది. దీనితో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కార్యక్రమంలో మార్పు జరిగింది. 

సీఎల్పీ సమావేశం ముగియగానే మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మున్షీ, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన జరిగిన తీరును అధిష్టానం పెద్దలకు రాష్ట్ర నేతలు వివరించనున్నారు. ఢిల్లీలో పార్టీ నాయకత్వం చర్చల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు? మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్‌ పదవుల భర్తీకి మార్గం సుగమం అవుతుందా అని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement