ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం | Telangana Legislative Assembly Approves Sc Classification Bill | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం

Published Tue, Mar 18 2025 5:05 PM | Last Updated on Tue, Mar 18 2025 5:21 PM

Telangana Legislative Assembly Approves Sc Classification Bill

సాక్షి,హైదరాబాద్‌ : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. 

సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది.దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 

దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. పంజాబ్ కేసు సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా కొనసాగింది. మేం అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయనిపుణులను సంప్రదించి వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశాం

వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచాం.ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది.  వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారు

2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. రిజర్వేషన్లు  పెంచడం వాటిని సహేతుకంగా పంచడం మా బాధ్యత. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా… ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం’అని అన్నారు. 

బీసీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
అంతకుముందు..కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి. నేను మీకు మద్దతుగా నిలబడతా.రాహుల్ గాంధీకి పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్‌లో కృతజ్ఞత సభ పెట్టండి’అంటూ బీసీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ కులగణన సర్వేపై రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం .దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి..తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే. కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. 

ఈ అభినందనలు నాకు కాదు ఈ అభినందనలు అందించాల్సింది రాహుల్ గాంధీని. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించాం.

50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలి.ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి.. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుంది. అందుకే రాష్ట్రంలో బీసీ కులసర్వే నిర్వహించుకున్నాం. అసెంబ్లీలో ఫిబ్రవరి 4కు ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నాం.

పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, అ తరువాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్‌లో కులసర్వే పూర్తి చేశాం. మొదటి విడతలో కులగణన సర్వేలో పాల్గొనని వారికోసం రెండో విడతలో అవకాశం కల్పించాం.పూర్తి పారదర్శకంగా కులగణన సర్వేను పూర్తి చేశాం. ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్న మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన. ఈ కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం.

దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి.. దీన్ని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే.కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నాం. జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదు… జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుంది. మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చింది.కానీ మేం కులసర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేల్చాం

లెక్కతేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంది.పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది బీసీలే.ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. ఈ కులగణన పునాది లాంటిది.. ముందు అమలు చేసుకుని తరువాత అవసరాన్నిబట్టి సవరణలు చేసుకోవచ్చు.

కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్‌లో పడకండి. ఈ సర్వేను తప్పుపడితే నష్టపోయేది మీరే. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్నవారవుతారు. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి నేను మీకు మద్దతుగా నిలబడతా. రాహుల్ గాంధీకి పది లక్షల మందితో కృతజ్ఞత సభ పెట్టండి. పరేడ్ గ్రౌండ్‌లో ఈ సభ ఏర్పాటు చేయండి’అని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement