సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్‌లో విద్యాశాఖకు అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామన్న సీఎం.. అన్ని వర్సీటీలకు వీసీలను నియమించామని చెప్పారు. రూ. 650 కోట్లతో పాఠశాలలను బాగు చేస్తున్నామని, పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో గురువారం బాలల దినోత్సవం సందరర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్ధులే బాగస్వాములు. కలుషితమైన ఆహారం వల్ల విద్యార్ధులు అస్వస్థతకు గురవుతున్నారు. కలుషితమైన ఆహారం పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నాసిరకం భోజనం పెట్టిన వారితో ఊచలు లెక్కపెట్టిస్తాం. నాణ్యమైన బోజనాన్ని విద్యార్థులకు అందించాలి.
సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. మసాయిపేటలో రైలు ఢీకొన్న ఘటనలో 30 మంది పిల్లలు చనిపోతే కనీసం పరామర్శించలేదు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. గత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గత పదేళ్లలో 5 వేలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయి. పాఠశాలల మూసివేతతో విద్యకు పేదలు దూరమయ్యారు.
చదవండి: అసెంబ్లీకి పోటీ.. అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలి: సీఎం రేవంత్
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కుల గణన జరగాలి. కేంద్రం మెడలు వంచి కుల గణన జరిపి రిజర్వేషన్తు తీసుకొస్తాం. కుల గణనతో ఎవరి రిజర్వేషన్లు తొలగించం. కులగణనతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పథకాలు తీసేయడానికి సర్వే చేయడం లేదు. కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిది. కుల గణన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పెంచడం కోసమే. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావాలంటే కులగణన జరగాలి
కొందరు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాను. కులగణను అడ్డువచ్చే ద్రోహులను సమాజంలోకి రానివ్వొద్దు. పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగాలు రావు.. స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. చదువులోనే కాదు.. క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలి.’ అని సీఎం రేవంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment