కార్పొరేట్‌తో పాటు న్యాయ, రాజకీయ వ్యవస్థల్లోనూ ఉంది
కులగణన సంప్రదింపుల సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
కుల వివక్ష దేశ ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తోంది.. భారత రాజ్యాంగానికి, జాతికీ ముప్పులా పరిణమించింది
దేశ వాస్తవ పరిస్థితిని ప్రజల ముందుంచాల్సిందే..
కుల వివక్షను నిర్మూలిస్తానని ప్రధాని మోదీ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్న
కులగణన 100 శాతం పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘భారత సమాజంలో కుల వివక్ష అన్నిచోట్లా లోతుగా, బలంగా ఉంది. అణువణువునా దేశంలో కుల వివక్ష ఉందన్న వాస్తవాన్ని అందరం అంగీకరించాల్సిందే. ఈ వివక్ష కేవలం దేశ ప్రజల జీవితాలను విధ్వంసం చేయడమే కాదు.. భారత రాజ్యాంగానికి, జాతికి సైతం ముప్పులా పరిణమించింది..’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలు, న్యాయ వ్యవస్థ, రాజకీయ రంగం.. ఇలా ప్రతిచోటా ఉన్న ఈ వివక్ష దేశ ప్రజల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని, దేశంపై వారి నమ్మకాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.
తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదని, కులవివక్షను అందరూ అంగీకరించి దేశ వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. కులంతో కూడిన అసమానత చాలా దారుణమని, దళితులను ముట్టుకోని పరిస్థితులు ప్రపంచంలో మరెక్కడా ఉండవని చెప్పారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన మంగళవారం బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణనపై రాష్ట్రస్థాయి సంప్రదింపుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాహుల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఇది ఒక ఎక్స్‌రే లాంటిది
‘కుల వివక్ష ఎంత తీవ్రస్థాయిలో ఉందో దేశ ప్రజల ముందు ఉంచుదాం. ఇది కూడా ఎక్స్‌రే లాంటిదే. కుల వివక్షపై మాట్లాడితే దేశాన్ని నేను విభజించేందుకు ప్రయత్నిస్తున్నానని బీజేపీ నేతలు, దేశ ప్రధాని మోదీ విమర్శిస్తున్నారు. దేశ వాస్తవ పరిస్థితిని బయటపెడితే అది విభజించడమా? దేశంలో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు, ఇతర కులాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. ఆ తర్వాత సంపద ఎలా పంపిణీ చేయాలో నిర్ణయించుకోవాలి. కార్పొరేట్ కంపెనీలు, న్యాయవ్యవస్థ, సైన్యంలో ఎంతమంది ఏ వర్గాల వారున్నారో అడగాలి.
ఈ ప్రశ్నలను అడిగేందుకు ఎందుకు భయపడుతున్నారు? నిజాన్ని తొక్కిపెట్టాలనుకునే వారు, దీని గురించి దేశం తెలుసుకోకూడదని అనుకుంటున్నవారే ఈ ప్రశ్నలను అడ్డుకుంటున్నారు. వీరంతా కుల వివక్ష కారణంగా లబ్ధి పొందినవారే. దేశంలో కుల వివక్షను నిర్మూలిస్తానని ప్రధాని మోదీ బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేశంలోని కార్పొరేట్ కంపెనీల్లో ఎంతమంది దళితులు, న్యాయవ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు, మీడియాలో ఎంతమంది ఆదివాసీలు పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు మోదీ ఎందుకు ఇష్టపడడం లేదో చెప్పాలి..’ అని రాహుల్ డిమాండ్ చేశారు.
కులగణనకు మోడల్‌గా తెలంగాణ
‘కులగణనకు తెలంగాణ మోడల్ అవుతుంది. ఈ అంశంలో తెలంగాణ నాయకత్వం చాలా బాగా పనిచేసింది. అయితే బ్యూరోక్రాటిక్ కులగణన వద్దు. ఈ కులగణనలో అడిగే ప్రశ్నలు అధికారులు ఎక్కడో కూర్చుని రాసేవి కాకూడదు. అదే జరిగితే ప్రజలను అవమానించడమే అవుతుంది. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలో దేశ ప్రజలే చెప్పాలి. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మహిళల నుంచి ఈ ప్రశ్నలు రావాలి.
అప్పుడే దీని ఫలితం ఉంటుంది. కేవలం కులగణన జరగడమే కాకుండా దేశానికి అభివృద్ధి పరంగా, రాజకీయంగా ఓ అ్రస్తాన్ని ఇస్తుంది. తెలంగాణలో కేవలం కులగణన మాత్రమే జరగడం లేదు. దేశ భవిష్యత్తు కోసం ఓ పాలనా వ్యవస్థను డిజైన్ చేస్తున్నాం. తెలంగాణ నుంచే కార్యాచరణ చేపడుతున్నందుకు గర్వంగా ఉంది..’ అని రాహుల్ అన్నారు.
ఉత్తమ్‌రెడ్డి.. ఎక్సెలెంట్ ప్రెజెంటేషన్
తెలంగాణలో కులగణన చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రసంగాన్ని చక్కగా అనువదించారని, ‘ఎక్స్‌లెంట్ ప్రెజెంటేషన్’ అంటూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. సదస్సులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, ప్రొఫెసర్లు సింహాద్రి, కంచె ఐలయ్య, భూక్యా నాయక్, సూరేపల్లి సుజాత తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వందన సమర్పణ చేశారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయంలో రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీపీసీసీ నేతలు స్వాగతం పలికారు. సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.
కులగణనకు ధైర్యం కావాలి: సీఎం రేవంత్
రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు, తెలంగాణ పౌర సమాజానికి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కులగణనను ఎలాంటి న్యాయ వివాదాలు, విమర్శలకు తావివ్వకుండా 100 శాతం పూర్తి చేసి ఓబీసీల జనాభా లెక్కలను దేశానికి అందిస్తామని తెలిపారు. కులగణన నిర్ణయం తీసుకునేందుకు గుండె ధైర్యం కావాలని, సామాజిక బాధ్యతతో పాటు సమాన అవకాశాలుండాలనే పట్టుదల ఉండాలని రేవంత్ అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలని, ఆ ఆలోచనతోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలున్నా కులగణన సమావేశానికి రాహుల్ వచ్చారని చెప్పారు. రాహుల్ బాటలో తాము ఆయన సైనికులుగా ముందుకు వెళుతున్నామని అన్నారు.
రాహుల్.. టైటానిక్ కథ
‘1912లో ఓ పడవ యూకే నుంచి అమెరికాకు బయలుదేరింది. దాని పేరు టైటానిక్. అది ఎప్పటికీ మునిగిపోదని తయారు చేసిన వాళ్లు అనుకున్నారు. కానీ సముద్రంలోని ఒక మంచు కొండను ఢీకొట్టి 20 నిమిషాల్లో ఆ పడవ మునిగిపోయింది. సముద్రం అడుగున ఉన్న ఆ కొండ కేవలం 10 శాతం మాత్రమే కనిపించడంతో ప్రమాదం జరిగింది. ఇలా దేశంలో కనిపించకుండా ఉన్న కుల వివక్ష అనే వ్యాధి చాలా ప్రమాదకరమైనది. దీని గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంటున్నాం. ఇందులో కులగణన అత్యంత కీలకం..’ అని రాహుల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment