
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలతో సహా పలు కీలకాంశాలపై రాహుల్‌తో సుమారు 45 నిమిషాలపాటు చర్చించారు.
పీసీసీ నూతన కార్యవర్గం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు.. తదితర అంశాలతో వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే.. కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన నేపథ్యంలో వాటి గురించి రాహుల్‌కు సీఎం రేవంత్ వివరించినట్లు సమాచారం.
తెలంగాణలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దానికి ముఖ్యఅతిథిగా రావాలని రాహుల్‌ను రేవంత్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏఐసీసీ(AICC) అగ్రనేతలతో భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పొలిటికల్ మైలేజ్ వచ్చేలా.. సూర్యాపేటలో బీసీ కులగణన, మెదక్‌లో ఎస్సీ వర్గీకరణ భారీ సభలు నిర్వహించాలనుకుంటోంది.
ఇదిలా ఉంటే.. రేవంత్ విషయంలో అధిష్టానం అసంతృప్తిగా ఉందని, ఈ కారణం చేతనే రాహుల్ గాంధీతో ఆయనకు గ్యాప్ నెలకొందనే ప్రచారం నడిచింది. అయితే.. అదంతా ఉత్త ప్రచారమేనని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కొట్టిపారేయగా, తాజాగా రాహుల్‌తో భేటీ అనంతరం సీఎం రేవంత్ కూడా స్వయంగా ఖండించారు.