
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
చర్యలకు ఇంకెంత సమయం కావాలన్న ధర్మాసనం
ఇప్పటికి ఏడాది అంటే...పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా? అన్న జస్టిస్ గవాయి
పదవీకాలం పూర్తయ్యేవరకు వేచి చూడటం రీజనబుల్ టైం అవుతుందా? అని ప్రశ్న
మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా? అని నిలదీత
కేసును ఆలస్యం చేసేందుకు డిలే టాక్టిక్స్ ఉపయోగించ వద్దని వ్యాఖ్య
అయినా తాము ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టీకరణ
స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చా? లేదా అనే అంశంపై మాత్రమే వాదనలు వింటున్నట్లు వెల్లడి
తదుపరి విచారణ ఏప్రిల్ 2కు వాయిదా.. అదేరోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి వాదనలు వింటామన్న ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫిరాయింపులపై చర్యలు తీసుకునేందుకు ఇంకెంత సమయం కావాలి? ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తి అయ్యేవరకు వేచి చూడటం రీజనబుల్ టైం (తగిన సమయం) అవుతుందా? న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ఒక గడువు అనేది ఉండాలి కదా? పార్టీ ఫిరాయింపులపై మొదటి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత సమయం అవుతోంది? ఏడాది అవుతోందని వార్షికోత్సవం జరుపుకుంటున్నారా?..’ అంటూ స్పీకర్ కార్యాలయాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా? అని ప్రశ్నిస్తూనే.. మరోపక్క ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చా లేదా? అనే అంశంపై మాత్రమే తాము వాదనలు వింటున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. అదేరోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శుల వాదనలను వింటామని తెలిపింది.
బీఆర్‌ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌ల పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ).. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాందీలపై బీఆర్‌ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మైస్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గిలు హాజరయ్యారు. ఎస్‌ఎల్పీపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు.
ఆ తీర్పుల ఆధారంగా చర్యలకు అవకాశం: ఆర్యమా సుందరం
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా గతేడాది మార్చి 15న తొలిసారి స్పీకర్‌కు తాము ఫిర్యాదు చేశామని ఆర్యమా సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించామని, జూన్‌లో రిట్ పిటిషన్ వేశామని చెప్పారు. దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్‌పై ఎంపీ ఎన్నికలకు పోటీ చేశారని, మరో ఎమ్మెల్యే తన కుమార్తె కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ప్రచారం చేశారని, తెల్లం వెంకట్రావ్ సైతం పార్టీ ఫిరాయించారని పేర్కొన్నారు.
ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని, కనీసం నోటీసులు ఇవ్వలేదని వివరించారు. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా ఈ వ్యవహారంపై విచారణ సమయాన్ని ఖరారు చేయాలన్న సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్ కు వెళ్లగా.. స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న గ్రౌండ్స్‌పై ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టిందని తెలిపారు.
కానీ ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పలేదన్నారు. స్పీకర్ తీసుకోవాల్సిన సమయంపై సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని విన్నవించారు.

స్పీకర్ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి
సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని ఆర్యమా సుందరం గుర్తు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకున్నారు. ‘ఇప్పటికి ఏడాది అంటే...పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా? వార్షికోత్సం జరుపుకుంటున్నారా?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. కేసు విషయంలో డిలే ట్యాక్టిక్స్ (ఆలస్యం చేసే చిట్కాలు) ఉపయోగించొద్దని అన్నారు. సుందరం తన వాదనలు కొనసాగిస్తూ.. ‘స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఉన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై కూడా ఉంది. ఒకవేళ అది జరగడం లేదు అని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఒక ట్రిబ్యునల్‌గా వ్యవహరించాలి. స్పీకర్ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవాలని కోరడం లేదు కానీ, రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే మేము కోరుతున్నాం’ అని అన్నారు.
ఆ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పలేదు: జస్టిస్ గవాయి
గతంలో ఇలాంటి కేసులు విచారించిన రాజ్యాంగ ధర్మాసనాలు స్పీకర్‌కు సమయంపై స్పష్టత ఇవ్వలేదని, ఉన్నత ధర్మాసనాల తీర్పులను తాము తిరిగి ఎలా రాయగలమని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. దీంతో ‘తగినంత సమయం’ అనే విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయని సుందరం చెప్పారు.
వారంలోపే హైకోర్టును ఆశ్రయించారు: సింఘ్వీ
ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే, 9వ తేదీ నాటికే హైకోర్టులో పిటిషన్ వేశారని సింఘ్వీ చెప్పారు. నారిమన్ కేసులో ఫిర్యాదుకు, పిటిషన్‌కు మధ్య నిర్దిష్ట గడువు ఉండాలని కోర్టు తీర్పునిచ్చిందని చెప్పారు. ఇక్కడ ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించి నోటీసులు ఇచ్చారని చెబుతుండగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకుని.. గత విచారణ సందర్భంగా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం గుర్తు చేశారు.
వారిపై చర్యలు తీసుకోండి: బీజేఎల్పీ నేత పిటిషన్
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది మిథున్ శశాంక్ జోక్యం చేసుకుని.. ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావించబోతుండగా.. జస్టిస్ గవాయి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తాము ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాం.
ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్‌కి ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు. కాగా ఈ వ్యవహారంలో తాము వాదనలు వినిపించేందుకు సుదీర్ఘ సమయం కావాలని రోహత్గి కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.