
అంతా ఒకేసారి చేయాలంటే వ్యవస్థ దెబ్బతింటుంది: సీఎం రేవంత్‌రెడ్డి
ఓ పక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరోపక్క ప్రతి హామీనీ అమలుచేస్తున్నా
తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోంది
కిషన్‌రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడరు.. బండి సంజయ్ ఒక నిస్సహాయ మంత్రి
హిందీని బలవంతంగా రుద్దడం సరికాదు
అసెంబ్లీ చర్చలో కూడా కేసీఆర్ పాల్గొనాలి కదా?
ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని తుప్పు పట్టించిందని, దానిని వదిలించే పనిలో తామున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో పట్టిన తుప్పును ఒకేసారి వదిలించాలంటే వ్యవస్థ దెబ్బతింటుందని, అందుకే నెమ్మది నెమ్మదిగా వదిలిస్తూ అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోందని, నిధుల సాధనలో ఇద్దరు కేంద్ర మంత్రులూ ఏమాత్రం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గురువారం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్ కొద్దిసేపు మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘ఏ ముఖ్యమంత్రికైనా అధికారం చేపట్టిన తర్వాత అన్నీ సర్దుకోవడానికి రెండేళ్లు సమయం పడుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇలా ఎవరి పాలనైనా చూడండి.. గత పాలకులు పరిపాలించిన దానిని చక్కదిద్దడానికే రెండేళ్లు సమయం పట్టింది. ఓ పక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరోపక్క ప్రతీ హామీని అమలుచేస్తూ ముందుకెళ్తున్నా’అని చెప్పారు.
కేంద్ర మంత్రి అయినందునే కిషన్‌రెడ్డి టార్గెట్
‘కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే వాళ్లు ఎవరైనా సొంత రాష్ట్రాల సమస్యలను లేవనెత్తుతారు. ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తారు. నిర్మలా సీతారామన్ అలాగే చెన్నై మెట్రోను సాకారం చేశారు. కానీ, మన కిషన్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అంశాలేవీ పట్టించుకోరు. నేను ముఖ్యమంత్రిని కాబట్టే కదా? అందరూ నన్ను టార్గెట్ చేస్తోంది.
కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి కాబట్టే ఆయనను టార్గెట్ చేస్తున్నాం. రాష్ట్రానికి ఏం తెచ్చారని అడిగితే తప్పేంటి? మూసీ, ట్రిపుల్ ఆర్, మెట్రో ఇలా ఎన్నో ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో ఆయన ఏమైనా మాట్లాడారా? ఆయన కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెప్పిస్తే పనులు మొదలుపెట్టొచ్చు. కిషన్‌రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడరు, మరో మంత్రి బండి సంజయ్ ఒక నిస్సహాయ మంత్రి ’అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
హిందీని రుద్దడం ఏంటి?
మూడు భాషల విధానాన్ని రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. ‘అసలు హిందీ జాతీయ భాష ఏంటి? మీరు అనుకుంటే సరిపోతుందా? హిందీ అనేది దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. ఆ తర్వాత అత్యధికమంది మాట్లాడే భాష తెలుగే. మూడో వరుసలో బెంగాల్ భాష ఉంటుంది. మీరు హిందీ మాట్లాడతారు కదా? అందరూ అదే మాట్లాడాలంటే ఎలా?’అని రేవంత్ అన్నారు. ‘గాంధీ కుటుంబంతో సీఎంకు సాన్నిహిత్యం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. గాంధీ కుటుంబంతో అందరూ అనుకునేదానికంటే ఎక్కువే సాన్నిహిత్యం ఉంది’ అని తెలిపారు.
ప్రజలకు చెప్పకపోతే ఎలా?
‘రూ.7 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే ఎలా? పదవుల విషయంలో నేను సమీకరణాలను చూడలేదు, కేవలం నేను ఇచ్చిన మాటనే చేశా. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ, వివిధ చైర్మన్ పదవులు అన్నీ కూడా పార్టీ కోసం కష్టపడిన వారికే ఇచ్చాను. విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేయనన్నారు, ఆమె పార్టీకోసం ఎంతో కాలం కష్టపడి పనిచేశారు అందుకే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు.
నేను ఇక్కడ కులగణన చేశాను మరి ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది అక్కడ ఎందుకు చేయడం లేదు? కేసీఆర్ అసెంబ్లీలో జరిగే చర్చలకు కూడా రావాలి. ఓన్‌ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. నేను 2029 ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రజలే ఈ విషయాలన్నీ గమనిస్తారు. చెప్పినవి చేస్తే వాళ్లే మనకు అండగా నిలుస్తారు’అని రేవంత్ చెప్పారు. వచ్చే మే నెలలో హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఆ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment