కుదిరితే సయోధ్య.. లేకుంటే ధర్మయుద్ధం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy at BC Garjana Sabha in Delhi | Sakshi
Sakshi News home page

కుదిరితే సయోధ్య.. లేకుంటే ధర్మయుద్ధం: సీఎం రేవంత్‌

Published Thu, Apr 3 2025 4:57 AM | Last Updated on Thu, Apr 3 2025 4:57 AM

CM Revanth Reddy at BC Garjana Sabha in Delhi

బీసీ పోరు గర్జన ధర్నాలో కల్లుకుండ, మోకుతో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మహేశ్‌కుమార్‌గౌడ్, భట్టి విక్రమార్క, జాజుల శ్రీనివాస్‌గౌడ్, పొన్నం ప్రభాకర్‌

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచితే మోదీకి ఏం నొప్పి?

ఢిల్లీలో బీసీ పోరు గర్జన ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి  

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకునేందుకే ఢిల్లీకి వచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రిజర్వేషన్లు పెంచని పక్షంలో కేంద్రంతో ధర్మయుద్ధం తప్పదని స్పష్టంచేశారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం జాప్యం చేస్తే ‘గద్దె దిగాల్సిందే.. లేకుంటే గ్రామాల్లో గద్దెలు కూలాల్సిందే’అని హెచ్చరించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన బీసీ పోరు గర్జన ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. 

బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం జాప్యం చేస్తోందని విమర్శించారు. ‘కురుక్షేత్ర యుద్ధానికి ముందు అయిననూ పోయి రావలె హస్తినకు అన్నారు. ధర్మ యుద్ధం కోసం ఢిల్లీకి వచ్చాం. సంధిలో భాగంగానే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాం. సయోధ్య కుదుర్చుకుందాం.. ఐదు గ్రామాలు ఇవ్వమన్నా నాడు దుర్యోధనుడు ఇవ్వలేదు. తర్వాత కురుక్షేత్రంలో ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటాం అని అడుగుతున్నాం. ఇకపై విజ్ఞప్తులు తీసుకొని ఢిల్లీకి రాం. గల్లీలకు వాళ్లు ఎట్లా వస్తారో చూస్తాం. ధర్మయుద్ధం ప్రకటించి మన సత్తా ఏంటో చూపుదాం’అని పిలుపునిచ్చారు.  

గద్దె దిగుడో.. గద్దెలు కూల్చుడో.. 
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుకుంటామని అడిగితే ప్రధాని మోదీకి వచ్చిన నొప్పేంటని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ కుర్చీ అడిగామా? లేక గుజరాత్‌లో అమలు చేయమన్నామా? అని నిలదీశారు. ‘బీజేపీకి హెచ్చరిక జారీ చేస్తున్నా. అయితే రిజర్వేషన్లు పెంచాలి. లేదంటే మీరు గద్దె దిగాల్సిందే.. గ్రామాల్లో గద్దెలు కూలాల్సిందే. ఇదే నినాదంతో ముందుకు పోతాం. 

ఇప్పుడు రాకుంటే రిజర్వేషన్లు ఎప్పుడూ రావు. మీకు సహకారం అందించే సీఎంగా నేనున్నా. రాహుల్‌గాంధీ మద్దతు ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాలను ఏకం చేసి రిజర్వేషన్లు పెంచే బాధ్యత రాహుల్‌గాంధీ తీసుకుంటారు. మీరంతా ఏకమై ధర్మయుద్ధం ప్రకటించండి. మీ బలమేంటో పరేడ్‌ గ్రౌండ్‌లో చూపెట్టండి. మున్ముందు ఎర్రకోటపై మనమే జెండా ఎగురవేస్తాం. అందరం కలిసి రిజర్వేషన్లను సాధించుకుందాం’అని పిలుపునిచ్చారు.  

నరేంద్రమోదీ కమండల్‌ యాత్ర ప్రతినిధి 
రాహుల్‌గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కులగణన చేపట్టామని, బీసీల రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ విధానపరంగా వ్యతిరేకమని విమర్శించారు. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం మండల్‌ కమిషన్‌ను నియమిస్తే, దానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్‌ యాత్ర మొదలుపెట్టిందని తెలిపారు. ఆ యాత్ర ప్రతినిధే నరేంద్ర మోదీ అని విమర్శించారు. 

బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందనే 2021లో చేయాల్సిన జనాభా లెక్కలను బీజేపీ ప్రభుత్వం వాయిదావేసిందని ఆరోపించారు. ‘బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేపట్టలేదు. మేము బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరడం లేదు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే 10 లక్షల మందితో సభ పెట్టి మోదీని సన్మానిస్తాం. 

అలా కాకుండా మాపై అధికారం చెలాయిస్తామంటే నాడు రజాకార్లకు పట్టిన గతే ఇప్పుడు బీజేపీకి పడుతుంది. జనగణనతోపాటు కులగణన నిర్వహించాల్సిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ బీసీల కోసం ప్రాణం ఇస్తామంటున్నారు. మాకు ప్రాణాలు అక్కర్లేదు. కేవలం రిజర్వేషన్లు పెంచితే చాలు’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు యువత పోరాడినా గత దుర్మార్గ పాలకులు పట్టించుకోలేదని బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు ఇవ్వనందుకే తండ్రీకొడుకుల ఉద్యోగాలను యువత ఊడగొట్టారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement