
బీఆర్‌ఎస్ సహా ప్రాంతీయ పార్టీ లు మరింత బలంగా ఎదుగుతాయి
మాకు ఎదురైంది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమే.. తిరిగి ప్రజాదరణ పొందుతాం
కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు..
తెలంగాణలో బీజేపీ, టీడీపీ, పవన్ కల్యాణ్ కలిసి వచ్చినా బీఆర్‌ఎస్‌దే గెలుపు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంతంగా ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాదు
కేంద్రంలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోంది..
కులాలు, మతాల ప్రాతిపదికగా పుట్టే పార్టీ లు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు
మరో 50 ఏళ్ల పాటు పార్టీ నిలిచేలా చేసే అద్భుతమైన నాయకత్వం మా సొంతం
పదేళ్లలో కేసీఆర్ సమగ్ర, సమతుల్య, సమీకృత అభివృద్ధి నమూనాను ఆవిష్కరించారు
మేం బ్యాగులు, చెప్పులు మోసే వాళ్లం కాదు.. రేవంత్ వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం..
శూన్యం నుంచి సునామీని సృష్టించి లక్ష్యాన్ని చేరుకున్న అసాధారణ నేత కేసీఆర్. ఆయన మార్గదర్శకత్వంలో పని చేయడం పూర్వజన్మ సుకృతం. బీఆర్‌ఎస్ మాత్రమే రాజీ పడకుండా కొట్లాడి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది కాబట్టి పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనే భావన ప్రజల్లో బలంగా ఉంది..
రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంత బలంతో ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాదని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. బీఆర్‌ఎస్‌తో పాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీ లు తమ సొంత రాష్ట్రాల్లో పుంజుకుని మరింత బలంగా ఎదుగుతాయని అన్నారు. దెబ్బతిన్నా తిరిగి నిల్చుంటామని స్పష్టం చేశారు. తమకు ఎదురైంది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనని, తిరిగి ప్రజాదరణ పొందుతామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని, తెలంగాణలో బీజేపీతో కలిసి టీడీపీ, పవన్ కల్యాణ్ వచ్చినా బీఆర్‌ఎస్ అఖండ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
‘‘కుల, మతాలు అనే తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడే పార్టీ లు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ యే రక్షణ కవచం. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా. బీఆర్‌ఎస్ ఎంత బలంగా ఉంటే తెలంగాణకు అంత లాభం.’’ఇక్కడి ప్రజలపై మాకు ఉన్న ప్రేమలో అణువంత కూడా ఢిల్లీ పార్టీలకు ఉండదు. అందుకే 25 ఏళ్లుగా తెలంగాణ ఇంటి పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌ను మరో 50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ప్రజలు కాపాడుకోవాలి..’అని కేటీఆర్ అన్నారు.
ఈ నెల 27న బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీగా అవతరించి బీఆర్‌ఎస్‌గా కొనసాగుతున్న పార్టీ 25 ఏళ్ల ప్రస్థానం, పదేళ్ల పాలన, రజతోత్సవాలు, వర్తమాన రాజకీయాలు, తదితర అంశాలపై ఆయన స్పందించారు.
సాక్షి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గాపార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని ఎలా చూస్తున్నారు?
కేటీఆర్: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ లు రజతోత్సవాలు నిర్వహించుకోవడం ఆషామాషీ కాదు. అధికారం కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు చాలా పార్టీ లు ఒక లక్ష్యం కోసం ప్రారంభమై గమ్యాన్ని చేరుకోక మునుపే మూత పడతాయి. ‘‘టీఆర్‌ఎస్ పిడికెడు మందితో ప్రారంభమై 60 లక్షల మంది సభ్యులు ఉన్న బీఆర్‌ఎస్‌గా ఎదిగింది.
ఉద్యమం, అధికారం, ప్రతిపక్షం..ఇలా ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా వారి గొంతుకగా నిలుస్తున్నాం. మరో 50 ఏళ్ల పాటు పార్టీ నిలిచేలా చేసే అద్భుతమైన నాయకత్వం మా పార్టీ సొంతం. 25 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ పేరు మాత్రమే మారింది. మా జెండా, ఎజెండా, గుర్తు, నాయకుడు, సిద్ధాంతం మారలేదు..’’ప్రజల బాగోగులు ఎజెండాగా పని చేయడమే మా పార్టీ భావజాలం
సాక్షి: ఉద్యమ సమయంలో సవాళ్ల నడుమసాగిన ప్రయాణం ఎలా అనిపించింది?
కేటీఆర్: మొండితనం, పట్టుదల, నమ్మిన సిద్ధాంతంపై రాజీ పడకపోవడం, నిజాయితీ.. ఇవే కేసీఆర్ ఆస్తులు. ధన, కుల, మీడియా బలం లేకున్నా పార్టీని ప్రారంభించి తెలంగాణ అస్తిత్వాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. అపజయాలు, ఎదురుదెబ్బలు, అవమానాలతో రాటుదేలిన కేసీఆర్‌కు ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకునే శక్తి ఉంది.
పార్టీని ప్రారంభించింది మొదలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటూ చరిత్ర మార్చిన నాయకుడు ఆయన. కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ సాధించిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. పదేళ్లు అధికారంలో ఉన్నదాని కంటే ఎక్కువ సంతృప్తినిచ్చింది.
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనంపై ఎందుకు వెనక్కి తగ్గారు?
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సోనియాఇంటికి వెళ్లి పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారు. సోనియా సూచన మేరకు దిగ్విజయ్ సింగ్‌తో విలీనంపై జరిపిన సంప్రదింపుల్లో కాంగ్రెస్‌నిజాయితీగా స్పందించలేదు. తనను నమ్ముకున్న వందలాది మందినాయకులు, వేలాది మంది కార్యకర్తల రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వకపోవడంతో విలీనం ప్రతిపాదనను కేసీఆర్ విరమించుకున్నారు. తమిళనాడులో డీఎంకే తరహాలో తెలంగాణకు ఒకగొంతు ఉండాలని పౌర సమాజం నుంచి ఒత్తిడి కూడా రావడంతో స్వతంత్రంగా ఉండేందుకే కేసీఆర్ ఇష్టపడ్డారు.
సాక్షి: కొత్త రాష్ట్రంలో ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారు?
కేటీఆర్: జమిలి ఎన్నికల పేరిట రెండు జాతీయ పార్టీ లు నాటకం ఆడుతున్న సమయంలో తెలంగాణను దేశం ముందు ఆవిష్కరించేందుకు 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాం. ఆరు నెలల పదవీ కాలాన్ని పక్కన పెట్టి ఎన్నికలకు వెళితే 88 సీట్లతో అసాధారణ గెలుపు నమోదు చేశాం. ఇది కేసీఆర్ సమర్థతకు ప్రజలు ఇచ్చిన సరి్టఫికెట్. రెండో టర్మ్‌లో పెద్ద నోట్ల రద్దు, కరోనాతో ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.
అయినా సమర్థవంతమైన నాయకత్వం అందించాం. మూడోసారి కాంగ్రెస్ హామీలు, గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అయినా మేము తుడిచి పెట్టుకుపోలేదు. కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
పదేళ్ల పాలనలో కేసీఆర్ మోడల్ సాధించిందేమిటి?
2014లో తెలంగాణలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించి విద్యుత్, సాగునీరు, తాగునీరు సహా అనేక అంశాల్లో తన దూరదృష్టితో కేసీఆర్ సమగ్ర, సమతుల్య, సమీకృత అభివృద్ధి నమూనాను ఆవిష్కరించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలను కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వినతులు మేరకే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా విస్తరించాలనే ఆలోచన వచ్చింది. భవిష్యత్తులోనూ జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ తన వంతు పాత్ర పోషిస్తుంది.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకున్నారా?
పదేళ్ల పాలనలో మేము చేసిన మంచి పనులను సరిగా ప్రచారం చేసుకోలేక పోయాం. విప్లవాత్మక పథకాలు అమలు చేసినా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాం. నాతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఓటమికి కారణం. మరోవైపు కాంగ్రెస్ ఉన్నది లేనట్లుగా చిత్రీకరించడంతో ప్రజలు మోసపోయారు.
మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం తదితరాలు ప్రభావం చూపాయి. రాజకీయ పునరేకీకరణతో బహుళ నాయకత్వ సమస్యతో ఓటమి చెందామనే వాదన కూడా సరికాదు. ఇది తాత్కాలికమైన చిన్న ఎదురుదెబ్బ మాత్రమే. శాశ్వతంగా ఇదే పరిస్థితి కొనసాగదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజాదరణ రుజువు చేసుకుంటాం.
ఫామ్‌హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ అనే విమర్శలను ఎలా చూస్తారు?
అధికారం చేతిలో పెట్టినా రాష్ట్రాన్ని నడపలేక చేసే విమర్శలు అవి. కేసీఆర్ ఆయన నియోజకవర్గంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా మమ్మల్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్‌లో ఇటీవల ఫామ్‌హౌస్ పాలన కావాలా, కాంగ్రెస్ పాలన కావాలా అని పోల్ పెడితే ప్రజలు ఫామ్‌హౌస్ వైపు మొగ్గు చూపారు. ఇక సీఎం రేవంత్ కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం.
పార్టీ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరం ఎందుకు వచ్చింది?
తెలంగాణ బిడ్డగా కేసీఆర్ స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చా. ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌పై పనిభారం తగ్గించేందుకు 2018 డిసెంబర్‌లో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆరున్నరేళ్లలో 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, 60 లక్షల సభ్యత్వం, అనేక ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాం. అధికారం కోల్పోయినా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నా. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, కేసీఆర్‌కు అనారోగ్యం వంటి సమస్యలు ఎదురైనా కేడర్‌లో విశ్వాసం కల్పించాం. పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధించేలా పనిచేస్తా.
పార్టీ రజతోత్సవంసందర్భంగా మీ సందేశం
తెలంగాణ ఇంటి పార్టీ మాది.రాబోయే రోజుల్లో విద్యార్థి, యువజన, మహిళా విభాగాలను బలోపేతం చేసి సంస్థాగతంగా బలోపేతం చేస్తాం.కేసీఆర్‌ను తిరిగి సీఎం చేసేంత వరకు ఒక కార్యకర్తగా పనిచేస్తా.నాతో కలిసి వచ్చే పార్టీ శ్రేణులనుకంటికి రెప్పలా కాపాడుకుంటా.
బీజేపీ నుంచి కొత్త పోటీఎదురవుతోందా?
కేసీఆర్ స్థాయి రాష్ట్ర రాజకీయాల్లో ఏ ఇతర నేతకూ లేదు. మేం బ్యాగులు, చెప్పులు మోసే నాయకులం కాదు. ఎవరికీ తలవంచకుండా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ దశాబ్దాల కల నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణలో జరిగిన మూడు ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటలేదు. మోదీకి ఆదరణ క్రమంగాతగ్గుతున్న తరుణంలో ఆ పార్టీని పోటీగా భావించడం లేదు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్‌ఎస్ అఖండ మెజారిటీ సాధిస్తుంది. మరోవైపు రేవంత్.. సొంతూరుకు చెందిన మాజీ సర్పంచ్ మొదలుకుని రాష్ట్రమాజీ ముఖ్యమంత్రిపైనా ఆరోపణలతో అక్రమ కేసులు పెడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు.ప్రజల దృష్టిలో కాంగ్రెస్, బీజేపీ పలుచన అవుతున్నాయి.
−కల్వల మల్లికార్జున్‌రెడ్డి