Sakshi Interview
-
లైఫ్‌కి బీమా తప్పనిసరి
జీవిత బీమా అవసరంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ ముందుకెళుతున్నామని, తక్కువ ప్రీమియంతోనైనా ప్రతి కుటుంబం ఎంతో కొంత బీమాను కలిగి ఉండాలన్నదే తమ ఉద్దేశమని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ, ఎండీ కాస్పరస్ జేహెచ్ క్రామ్హూట్ చెప్పారు. ఈ వైఖరి వల్లే వ్యాపార పరిమాణం పరంగా తాము దేశంలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ పాలసీదారుల సంఖ్యను బట్టి చూస్తే 7వ స్థానంలో ఉన్నామని స్పష్టంచేశారు.పాలసీదారుల అవసరాలు తెలుసుకోవటానికి, క్లెయిమ్‌ల పరిష్కారానికి టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటున్నామని, అందుకే తమ సంస్థ లాభదాయకతలోనూ ముందుందని వివరించారు. మంగళవారం ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ...(సాక్షి, బిజినెస్ ప్రతినిధి) కుటుంబంలో ఆర్జించే వ్యక్తికి బీమా ఇచ్చి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించటమే జీవిత బీమా లక్ష్యం. కానీ కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యమివ్వటం లేదు. మరి ఆశించిన లక్ష్యం నెరవేరుతోందా? నిజమే! దేశంలో 4 శాతం మందికే జీవిత బీమా కవరేజీ ఉందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్‌ను చాలామంది అవసరం లేనిదిగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. తెలంగాణలో లీడ్ ఇన్సూరర్‌గా ఉన్నాం కనక మేం రకరకాల అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెట్టాం. అందుకే 2025 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో బీమా పరిశ్రమ 24 శాతం పెరిగితే మేం 57 శాతం వృద్ధి సాధించాం. మా వ్యాపారంలో గ్రామీణుల వాటా 40 శాతానికిపైగా ఉండటమే మా నిబద్ధతకు నిదర్శనం. బీమా కంపెనీలు ‘టర్మ్’పై కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌తో ముడిపడిన ఎండోమెంట్, యులిప్ పాలసీలపై ఫోకస్ పెడుతున్నాయెందుకు? 30 ఏళ్ల వ్యక్తికీ 10 ఏళ్ల కాలపరిమితితో జీవితబీమా పాలసీ అమ్మటం మోసం కాదా? నిజమే! ఇలాంటి మిస్ సెల్లింగ్ జరగకూడదు. కాకపోతే తక్కువ ప్రీమియమే అయినా కొన్నేళ్ల పాటు కట్టి... చివరకు పాలసీ గడువు ముగిశాక ఏమీ తిరిగి రాని టర్మ్ పాలసీలపై కస్టమర్లు ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్లను ఆకర్షించటానికే కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు, రాబడులతో ముడిపడ్డ ఎండోమెంట్ పాలసీలను తెచ్చాయి. లాభదాయకత కూడా ముఖ్యమే కనక ఈ పాలసీలను విక్రయిస్తున్నాయి. మరి 30 ఏళ్ల వ్యక్తికి 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న జీవిత బీమా పాలసీ విక్రయిస్తే... గడువు తీరాక తనకు కవరేజీ ఉండదు కదా? లేటు వయసులో కవరేజీ కావాలంటే భారీ ప్రీమియం చెల్లించాలి కదా? నిజమే. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారే ప్యూర్ టర్మ్ పాలసీలు తీసుకుంటున్నారు. ఇది అట్టడుగు స్థాయికి వెళ్లటం లేదు. మున్ముందు ఈ పరిస్థితి మారుతుందన్న విశ్వాసం నాకుంది.మీరూ ఇదే దార్లో వెళుతున్నారా... లేక? అలాంటిదేమీ లేదు. మేం ప్రధానంగా ఏడాదికి 4–15 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారిని లక్ష్యంగా పెట్టుకున్నాం. వారికి ఎంతోకొంత కవరేజీ ఉండేలా పాలసీలను తెచ్చాం. కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98 శాతానికిపైనే ఉంది. పైపెచ్చు ఎక్కువ శాతం చిన్న పాలసీలే కనక... సెటిల్మెంట్కు డాక్యుమెంట్లన్నీ అందజేస్తే 24 నుంచి 48 గంటల్లో పరిష్కరిస్తున్నాం. దీనికి టెక్నాలజీని వాడుతున్నాం. మీ వ్యాపారంలో ఆన్లైన్ శాతమెంత? మాకు దేశవ్యాప్తంగా విస్తరించిన శ్రీరామ్ గ్రూప్ కంపెనీల ఔట్లెట్ల నుంచే 40 శాతం వరకూ వ్యాపారం వస్తోంది. ఏజెన్సీల నుంచి మరో 40 శాతం వస్తోంది. మిగిలినది ఆన్లైన్, పాత కస్టమర్ల రిఫరెన్సులు సహా ఇతర చానళ్ల ద్వారా వస్తోంది. ఆన్లైన్లో ఎంక్వయిరీలొచ్చినా అవి వాస్తవరూపం దాల్చటం తక్కువ. ఆన్లైన్ ప్రచారానికి ఖర్చు కూడా ఎక్కువే. మాకు అంతర్జాతీయ బీమా దిగ్గజం ‘సన్ లామ్’తో భాగస్వామ్యం ఉంది కనక ఎప్పటికఫ్పుడు కొత్త టెక్నాలజీలని అందుబాటులోకి తేగలుగుతున్నాం. విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయి కనక దేశంలోని 15 రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి అడుగులు వేస్తున్నాం. మీ భవిష్యత్తు లక్ష్యాలేంటి? వ్యాపార విలువ పరంగా ప్రస్తుతం దేశంలో 13వ స్థానంలో ఉన్నాం. వచ్చే ఏడాది నాటికి 12వ స్థానానికి... మూడేళ్లలో టాప్–1లోకి రావాలనేది లక్ష్యం. ఇక పాలసీదార్ల సంఖ్య పరంగా 7వ స్థానంలో ఉన్నాం. వచ్చే మూడేళ్లలో టాప్–3లోకి రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. -
బీచ్ శాండ్ పరిశ్రమలో అవకాశాలు అపారం
సాక్షి, విశాఖపట్నం: బీచ్ శాండ్ ఇండస్ట్రీలో అపారమైన అవకాశాలున్నాయని.. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మార్చేఖనిజాలు బీచ్ సొంతమని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, కేంద్ర పెట్రోలియం నేచురల్ గ్యాస్ మాజీ జాయింట్ సెక్రటరీ, ఆస్కీ చైర్మన్ పద్మభూషణ్ ప్రొ.పద్మనాభయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ తీరంలోనూ అపారమైన తీర ప్రాంత ఖనిజ సంపద ఉందని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు.అవసరమైన మేరకే ఖనిజాలు వెలికితీస్తే మంచిదని.. అదే సమయంలో అక్రమ మైనింగ్ నియంత్రించాలి్సన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. లేదంటే పర్యావరణ విఘాతం తప్పదని హెచ్చరించారు. కేంద్ర మైనింగ్ మంత్రిత్వ శాఖ, ఏపీ మినరల్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో కరెంట్ ట్రెండ్స్ ఇన్ మైనింగ్, బీచ్ శాండ్ ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలు అనే అంశంపై శుక్రవారం ఏయూలో జాతీయస్థాయి సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొ. పద్మనాభయ్య ‘సాక్షి’తో పలు అంశాలు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..దేశంలో 130 బీచ్ మైనింగ్ డిపాజిట్స్..దేశంలోని తీర ప్రాంతాల్లో 130 మైనింగ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఒడిశాలోని ఛత్రపూర్, తమిళనాడులోని మనవల్లకురిచి, కేరళలోని చేవరాలో మాత్రమే పనులు నడుస్తున్నాయి. అన్ని మైనింగ్ బ్లాక్స్‌ను ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుంది. నిజానికి.. బీచ్ శాండ్ మైనింగ్ ఇండస్ట్రీలో మేజర్ గ్లోబల్ ప్లేయర్‌గా భారత్ మారేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడాలేని అత్యంత విలువైన నాణ్యమైన అరుదైన ఖనిజ సంపద భారత సాగర తీరంలో ఉంది. అద్భుతమైన ఎలిమినైట్ ఖనిజం నిల్వలున్న దేశంగా మూడో స్థానంలో ఉంది. అదేవిధంగా.. మన దేశ తీర ప్రాంతంలో మోనోజైట్ ఖనిజం కూడా అత్యధికంగా లభ్యమవుతుంది. ఇవన్నీ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వెలికితీసే ప్రక్రియ ప్రారంభిస్తే.. భారత్ ప్రపంచంలోనే మంచి స్థానంలో ఉంటుంది. ప్రభుత్వాలే ఖనిజ సంపదను వెలికితీసే బాధ్యతని భుజానికెత్తుకోవాలి. ముఖ్యంగా పీపీపీ విధానాన్ని ఇందులో అవకాశాలు కల్పించాలి. అప్పుడే అక్రమ మైనింగ్‌ని నిరోధించవచ్చు. అలాగే, బీచ్ శాండ్ అక్రమ తవ్వకాలపై నమోదవుతున్న కేసుల విచారణ ఆలస్యమవుతుండటం విచారకరం. వీలైనంత త్వరగా.. ఈ తరహా అక్రమ కేసుల విచారణ వేగవంతమైతే వీటిని నియంత్రించే అవకాశం ఉంటుంది. -
Eesha Rebba: సొసైటీ... చట్టమూ మారాలి.. భయపెట్టేలా ఉండాలి
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం.... వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో... ఏం చేస్తే నేరాలు తగ్గుతాయి? ‘చట్టం మారాలి... అమ్మాయిలు నిర్భయంగా ఉండేలా సమాజం మారాలి’ అంటున్నారు ఈషా రెబ్బా. అంతేకాదు... నెగటివిటీని ఇంధనంలా చేసుకుని అమ్మాయిలు ముందుకు సాగాలని కూడా అంటున్నారు. ఇంకా ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను ఈ విధంగా పంచుకున్నారు. → రిపోర్ట్ చేయనివి ఎన్నో! హత్యాచారాలు జరిగినప్పుడు ర్యాలీలు, ధర్నాలు, కొవ్వొత్తులతో నిరసన... ఇలా చాలా చేస్తుంటాం. ఈ అన్యాయాలకు మన కోపాన్ని ఆ విధంగా ప్రదర్శిస్తాం. కానీ ఒకటి జరిగిన కొన్ని రోజుల్లోనే ఇంకోటి. ఈ మధ్యే కోల్‌కతాలో జరిగింది ఒక ఘటన. ఆ తర్వాతా కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఏం చేస్తే ఇవి ఆగుతాయి? ఆగడానికి పరిష్కారమే లేదా? అనే భయం ఉంది. ఇలాంటి వార్తలు విన్నా, చూసినా చాలా ఆవేదన. రేప్ అనేది చాలా పెద్ద క్రైమ్. మన దగ్గర రేప్ కేస్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇలాంటి దారుణాలు ఇంతకు ముందు కూడా జరిగాయి. సోషల్ మీడియా వల్ల మనకు తెలుస్తున్నాయి. ఇవన్నీ రిపోర్ట్ చేసిన కేస్లు... రిపోర్ట్ చేయనివి ఎన్నో! మన న్యాయ వ్యవస్థని మరింత కఠినంగా మార్చుకోవాలి. అలా ఉంటే అయినా ఇలాంటి ఘటనలు కాస్త తగ్గుతాయని నా అభి్రపాయం. → భయపెట్టాలి రేప్ జరగడానికి కారణాలు ఏమై ఉంటాయని మొన్న ఏదో సర్వే చేశారు. అందులో ఓ క్యాబ్ డ్రైవర్‌తో పాటు ఎక్కువ శాతం మంది చెప్పిన సమాధానం... అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవడం... ఇంకొంత మంది ఇంకేదో కారణం. వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉందో చూడండి. మన రాజకీయ నాయకులు కూడా కొందరు ఇంకా ఓల్డ్ స్కూల్ స్టయిల్లోనే ఆలోచిస్తున్నారు. వాళ్లు కూడా సమస్య బట్టల్లోనే ఉందంటారు. కొన్ని దేశాల్లో ఇన్వెస్టిగేషన్ చాలా త్వరగా అవుతుంది. వెంటనే ఉరి తీసే దేశాలు ఉన్నాయి. లా స్ట్రిక్ట్‌గా ఉండటం అంటే చంపేయమని కాదు. ఇన్వెస్టిగేషన్ త్వరగా, క్లియర్‌గా చేయడం. తప్పు చేశాడని రుజువు అయిన వెంటనే శిక్షించాలి. అమెరికాలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయాలంటేనే భయపడతారు. పాయింట్స్ తగ్గిపోతాయేమో అని. చిన్న చిన్న విషయాల్లో అంత కఠినంగా ఉన్నారంటే ఆలోచించండి. అనుకున్న వెంటనే చట్టం అయిపోదు. మన లా కూడా రేపిస్ట్‌ల మీద అంత కఠినంగా లేకపోవడం. ఇలాంటి తప్పు చేస్తే శిక్ష ఇంత భయంకరంగా ఉంటుందని తెలిసేలా చేయాలి. ఇలా చేస్తే ఆగిపోతాయని నేను అనను. అలా అయినా ఎంతో కొంత భయం కలుగుతుందేమో. ముందు భయపెట్టాలి. ఇంట్లోవాళ్లు హెల్మెట్ పెట్టుకో అంటున్నా పెట్టుకోరు చాలామంది. కానీ 2000 రూపాయలు జరిమానా విధిస్తారంటే ఆ భయంతో అయినా పెట్టుకుంటారు. → అమ్మాయిలకు బోలెడు ఆంక్షలు హీరోయిన్ అనే కాదు ఏ అమ్మాయి అయినా తన శరీరం... తన ఇష్టం. అబ్బాయిలు వాళ్లకు నచ్చినట్టు కూర్చుంటారు. నచ్చిన చోటుకి వెళ్తారు. నచ్చిన టైమ్‌లో వెళ్తారు. మాక్కూడా ఆ స్వాతంత్య్రం కావాలి. అమ్మాయిలకు బోలెడన్ని ఆంక్షలు.. ఇలా కూర్చోవాలి... అలా కూడదు. ఇలా మాట్లాడాలి... అలా కూడదు. చిన్నప్పటినుంచి ఇలా పరిమితులు పెట్టిన వాతావరణంలోనే దాదాపు అందరం పెరిగి ఉంటాం. అమ్మాయిలందరూ నిర్భయంగా ఉండే సమాజం ఏర్పాటు జరగాలి. భయం పెట్టాలి... → కంఫర్ట్ జోన్లో ఉండకూడదు నేను ఇంట్రావర్ట్‌ని. నాకు తెలిసిన అతి కొద్ది మంది దగ్గర మాత్రమే హైపర్ ఎనర్జీతో ఉండగలను. కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే రోజూ ఓ వంద మంది ఉంటారు సెట్లో. కానీ చేయాలి. మనల్ని మనం ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో పెట్టుకుని ఉండకూడదు. మనకున్న భయాలను ఫేస్ చేస్తూ ముందుకెళ్లడమే. ఉదాహరణకు నాకు నీళ్లంటే చాలా భయం. దాంతో నీళ్లల్లో దిగేదాన్ని కాదు. కానీ ఎన్నాళ్లని అలా దాటేస్తాను? ధైర్యం తెచ్చుకున్నాను. స్విమ్మింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ భయం పోగొట్టుకున్నాను. ప్రతి భయాన్ని అధిగమిస్తామో లేదో ఖచ్చితంగా చెప్పలేం. కానీ ప్రయత్నం మాత్రం చేయాలి. చిన్న చిన్న భయాల్ని అధిగమిస్తేనే జీవితంలో పెద్ద సవాళ్లని, సమస్యలను ఎదుర్కోవచ్చు. → లీవ్ ఇస్తే బెటరే ఆడవాళ్లకు గవర్నమెంట్ అధికారికంగా పీరియడ్ లీవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే మనమే సెలవు పెడతాం. అయితే గవర్నమెంట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. కొంత మంది తట్టుకోలేనంత నొప్పితో బాధపడుతుంటారు. కొంతమంది నడవలేరు కూడా. ఒకవేళ సెలవు పెడితే జీతం కట్ అవుతుంది లేదా ఆల్రెడీ ఆ నెలకు సరిపడా లీవ్స్ తీసేసుకోవడం వల్ల మళ్లీ లీవ్ అంటే ఆలోచించాలి. అందుకే ఆ ఇబ్బందిని భరిస్తూనే పనులకు వెళ్తుంటారు. ఆ మూడు రోజులు సెలవు రోజులుగా పరిగణిస్తే బాగుంటుందని నా అభి్రపాయం. → నిన్ను నువ్వు నమ్మాలి మన జీవితంలో ప్రతి స్టేజ్‌లో ఎవరో ఒకరు మనల్ని ‘నువ్వు చేయలేవు అనో, నీ వల్ల కాదు’ అనో అంటారు. వాళ్లకు పూర్తిగా తెలియదు కదా మన గురించి. అందుకే నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకెళ్లడమే. ఎందుకంటే అనేవాళ్లు ఎప్పుడూ అక్కడే ఆగిపోతారు. నిన్ను నువ్వు నమ్మాలి... కష్టపడాలి. నెగటివిటీని మనల్ని కిందకు తోసేలా కాకుండా పైకి తీసుకెళ్లే ఇంధనంలా వాడుకోవాలి. వెరీ హ్యాపీ కెరీర్ పరంగా నేను చాలా హ్యాపీ. మంచి కథలన్నీ వస్తున్నాయి. కోవిడ్, ఓటీటీ తర్వాత కథల్లో వైవిధ్యం పెరిగింది. రియలిస్టిక్‌గా ఉండే కథలు. అన్ని జానర్స్ కథలు చెప్పడానికి ఓటీటీ మాధ్యమాలు ఉన్నాయి. అన్ని రకాల పాత్రలు చేయడానికి యాక్టర్స్‌కి ఇది మంచి టైమ్ అని చెపొ్పచ్చు. కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత నాకు వచ్చే కథల్లో తేడా తెలుస్తోంది. సినిమాల్ని, కథల్ని చూడటంలో ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. సబ్ టైటిల్స్‌తో అన్ని భాషల్లో సినిమాలను చూస్తున్నారు కూడా. అన్ని సినిమాలు అన్ని భాషల్లో డబ్ చేస్తున్నారు. సో... సినిమా బాగుంటేనే థియేటర్స్‌కి వస్తున్నారు. అలా థియేటర్స్ రప్పించాలంటే కచ్చితంగా ఏదో ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అందించాలి.– డి.జి. భవాని -
‘హైడ్రా’ నోటీసులు ఇవ్వదా?
సాక్షి, హైదరాబాద్: భూకబ్జాదారుల గుండెల్లో హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గుబులు పుట్టిస్తోంది. హైడ్రా కమిషనర్ ఎ.వి రంగనాథ్ ‘సాక్షి’ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. హైడ్రాకు నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.‘‘హైడ్రాకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రాజకీయంగా ఎవరిపైనా కక్ష సాధించాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసినట్లు సమాచారం ఉంటే ఇవ్వండి. వాటిని కూడా కూల్చేస్తాం. హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణ వల్లే వరదలు. మూడు నాలుగేళ్లలో చెరువుల ఆక్రమణ భారీగా పెరిగింది.’’ అని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు.స్కూల్స్, కాలేజీల విషయంలో ఆక్రమణలు రుజువైతే చర్యలు ఎప్పుడు ఉంటాయి?. ఓవైసీ కాలేజీని కూల్చేస్తారా?. రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి ఉంది. నాగార్జున ఆక్రమణలు చేశారా? కూల్చివేతల అంశంలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారాయన. హైడ్రాపై పలు సందేహాలను రంగనాథ్ నివృత్తి చేశారు.హీరో నాగార్జున సినిమాలు చూస్తానన్న ఆయన.. ఇంకా ఏమన్నారో.. పూర్తి ఇంటర్వ్యూలో చూడొచ్చు.. -
వైద్యుల రక్షణ బాధ్యత రాష్ట్రాలదే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇటీవల వైద్యులపై జరిగిన దాడులు నన్ను కలిచివేశాయి. ఇలాంటి అమానవీయ ఘటనలు చూడాల్సి రావడం దురదృష్టకరం. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లకపోతే భవిష్యత్‌లో సామాన్య రోగులకు వైద్యం అందే పరిస్థితి ఉండదు. వైద్య వృత్తి భయంతో కాదు.. అంకితభావంతో చేసేది. వైద్యులకు ప్రశాంతత, స్వేచ్ఛ అవసరం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అన్నారు. సుదీర్ఘకాలం పాటు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుజాతారావు.. ఆరోగ్య రంగంలో తీసుకువచి్చన ఎన్నో సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యుల భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన పలు చర్యలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..ప్రత్యేక చట్టం తీసుకురావాలి.. వైద్యులపై దాడుల నియంత్రణ రాష్ట్రాల పరిధిలో ని సమస్య. దీనికీ, కేంద్ర ప్రభుత్వానికీ సంబంధం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి రక్షణ కల్పించాలి. ఈ విషయంలో పూర్తిగా రాష్ట్రాలదే బాధ్యత. రక్షణ కల్పించడమంటే ఆస్పత్రి దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు పోలీసులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఆస్పత్రుల్లో పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకు కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ప్రత్యేక వ్యవస్థ ఉంటే తప్ప దాడులను నియంత్రించడం సాధ్యపడదు. నేను పనిచేసిన సమయంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల పరిధిలోనే కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలను అదుపు చేసేవారు. భయంతో వైద్యం ఎలా చేస్తారు?కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన నన్ను కలిచివేసింది. మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామా అనిపించింది. నాకైతే దీని వెనుక కుట్రకోణం ఉందనిపించింది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలతో వైద్యుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. వైద్యులు కూడా మనుషులే కదా. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల కుటుంబసభ్యులు, బంధువుల పరిస్థితి వేరేరకంగా ఉంటుంది. తమ మనిషి పోతే వారికి చాలా బాధ ఉంటుంది. కానీ దానిని వైద్యులపై చూపించడం సరికాదు. భయంభయంగా ఎన్నిరోజులని వైద్యం చేయగలరు? రోగుల సహాయకులను నియంత్రించాలిప్రస్తుతం ప్రభుత్వాస్పత్రులకు ఒక విధానమంటూ లేదు. మెయిన్ గేట్ నుంచి ఎమర్జెన్సీ వార్డు వరకూ రోగుల బంధువులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇది సరికాదు. మెయిన్ గేటు నుంచే నియంత్రణ జరగాలి. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, ఐసీయూ తదితరాల చోట్ల ఒకరికి మించి ఎక్కువ మంది సహాయకులను అనుమతించకూడదు. వారిని నియంత్రించి.. సరైన విధానంలో కౌన్సెలింగ్ ఇవ్వడం అవసరం. ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి విధానాలు అమలు చేయకపోతే వైద్యులు పనిచేసే పరిస్థితి ఉండదు. -
‘మత్తు’ చిత్తుకు ద్విముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: యువత భవిష్యత్తును చిత్తు చేసే ‘మత్తు’మహమ్మారి కట్టడికి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల ముఠాల సప్లై చైన్ కట్టడి మరోవైపు మత్తు పదార్థాల వైపు యువత వెళ్లకుండా అవగాహన పెంచే వ్యూహంతో పనిచేస్తున్నామన్నారు. మత్తుదందాలో ఎంతటివారున్నా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా పౌరుల కష్టార్జితాన్ని దోచుకొనే సైబర్ ముఠాలను సమర్థంగా ఎదుర్కొంటున్నామని.. గత ఆరు నెలల్లోనే రూ. 150 కోట్లను బాధితులకు రీఫండ్ చేయించగలిగామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టామ న్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐదో డీజీపీగా జూలై 10న బాధ్యతలు స్వీకరించిన జితేందర్ శనివారంతో పదవీబాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విజన్‌ను ఆవిష్కరించారు. ప్రశ్న: పోలీస్ బాస్‌గా మీ నెల రోజుల పనితీరు ఎంతమేర సంతృప్తినిచి్చంది? జవాబు: డీజీపీగా ఈ నెల రోజుల పనితీరు ఎంతో సంతృప్తినిచి్చంది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా పూర్తి చేశాం. భారీ నేరాలేవీ జరగకుండా కట్టడి చేశాం. పోలీస్ కమిష నర్లు, జిల్లా ఎస్పీలతో ఓ రోజంతా సమావేశమై రాష్ట్రంలో పోలీసింగ్ తీరుతెన్నులు, దృష్టిపెట్టాల్సిన అంశాలు, మత్తుపదార్థాల రవాణా, సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్య లపై స్పష్టత ఇవ్వగలిగాం. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఫలితాలు మెరుగయ్యాయి. ప్రజలకు అత్యవసర సేవలందించే డయల్ 100 సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టా. డయల్ 100 రెస్పాన్స్ టైం గతంలో కంటే సరాసరిన 5నిమిషాలు తగ్గింది. ప్రశ్న: మీ ప్రధాన ఫోకస్ ఏ అంశాలపై ఉండనుంది? జవాబు: శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలను ఆర్థికంగా గుల్ల చేస్తున్న సైబర్ నేరాల కట్టడిపై, యువతను పెడదోవ పట్టించే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు ముఠాల అణచివేతపై ప్రధానంగా దృష్టి పెడుతున్నా. అదే సమయంలో మహిళలు, చిన్నారుల భద్రతలో రాజీ ఉండదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. ప్రశ్న: రాష్ట్రవ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? జవాబు: రాష్ట్రంలో గతంతో పోలిస్తే నేరాల సంఖ్యలో చెప్పదగ్గ స్థాయిలో పెరగలేదు. హత్యలు, అత్యాచారాలు పెరిగాయని కొన్ని రకాల దు్రష్పచారాలు జరుగుతున్నాయి. ఈ విషయాలపై గణాంకాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం అసెంబ్లీలో ఇటీవలే స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో ఎంతో కఠినంగా ఉన్నాం. విజుబుల్ పోలీసింగ్‌ను పెంచాం. ప్రశ్న: డ్రగ్స్ కేసుల్లో శిక్షలు అంతంతమాత్రమేనన్న విమర్శలపై ఏమంటారు? జవాబు: కొన్ని సాంకేతిక కారణాలతో గతంలో ఎన్డీపీఎస్ చట్టాల కింద కేసుల్లో శిక్షలు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీజీ యాంటీనార్కోటిక్స్ బ్యూరోతో కలిసి దాదాపు 18 వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పక్కాగా కేసుల నమోదు, దర్యాప్తుతో శిక్షలు పెరిగాయి. ఈ నెల రోజుల్లో నాలుగు ఎన్డీపీఎస్ కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఇందులో రెండు కేసుల్లో దోషులకు పదేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారైంది. కొందరు విదేశీయులు అక్రమంగా ఇక్కడే ఉంటూ ఇక్కడ డ్రగ్స్ దందాలో దిగుతున్నారు. అలాంటి వారిపై దృష్టిపెట్టాం. డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారిని స్వదేశాలకు పంపుతున్నాం. గత నెల రోజుల్లో ముగ్గురు విదేశీయులను వెనక్కి పంపాం. ప్రశ్న: దొంగతనం కేసులో ఇటీవల ఓ దళిత మహిళను పోలీసులు కొట్టడం వంటి ఘటనల్లో ఏం చర్యలు తీసుకుంటున్నారు? జవాబు: చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందిపైనా కఠినంగానే ఉంటాం. ఇందులో ఏ మినహాయింపు ఉండదు. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సిందే. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో సిబ్బందిని ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేస్తూనే ఉంటాం. ప్రశ్న: మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి? జవాబు: కేవలం మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతోనే మార్పు రాదు. దీనిపై తల్లిదండ్రులు సైతం ఆలోచించాలి. తమ పిల్లలే ప్రమాదాల బారిన పడతారన్న విషయాన్ని వారు గుర్తిస్తేనే దీనికి సరైన పరిష్కారం దొరుకుతుంది. రోడ్డు ప్రమాదాల నియ ంత్రణకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. ప్రశ్న: అతిపెద్ద ముప్పుగా మారిన సైబర్ నేరాలను ఎలా ఎదుర్కొంటున్నారు? జవాబు: సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేకంగా బ్యూరో ఏర్పాటు చేసిన ఏకైన రాష్ట్రం తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేర ముఠాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. గత ఆరు నెలల్లో సైబర్ బాధితులకు రూ. 150 కోట్లు రీఫండ్ చేయించడం గొప్ప ఏచీవ్మెంట్. ఒకవైపు సైబర్ కేసుల సత్వర దర్యాప్తు మరోవైపు మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. ప్రశ్న: డ్రగ్స్, గంజాయిని ఎంత మేర కట్టడి చేశామనుకుంటున్నారు? జవాబు: మత్తు పదార్థాలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పూర్తిస్వేచ్ఛ ఉండటంతో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోకి గంజాయి రవాణా కాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తనిఖీలు పెంచాం. ఫలితంగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. గతానికి భిన్నంగా పబ్బులు, క్లబ్బుల్లోనూ జాగిలాలతో తనిఖీలు చేస్తున్నాం. కేసుల నమోదు పెరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగానే గంజాయి కట్టడికి గంజాయి తాగిన వాళ్లను గుర్తించే కిట్లను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ వంటి కమిషనరేట్లతోపాటు అన్ని జిల్లాలకు పంపాం.సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలిసైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్‌లో డీజీపీ జితేందర్సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, యువత వారి ఆలోచన విధానాన్ని విస్తృతపర్చుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోకలిసి టీజీ సైబర్ సెక్యూరిటీ ‘ది గ్రేట్ యాప్‌సెక్ హ్యాకథాన్ 2024’ నిర్వహిస్తోంది. శుక్రవారం బంజారా హిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ హ్యాకథాన్ ప్రారంభ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, సామాజిక భద్రత విషయంలో సైబర్ భద్రత అత్యంత ప్రధానంగా మారిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ⇒ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ ౖఈ హ్యాకథాన్‌లో 20కి పైగా దేశాల నుంచి 10 వేల మంది పాల్గొంటున్నారని చెప్పారు. ఈనెల 22న ఈ హ్యాకథాన్ ఫలితాలు వెల్లడిస్తామని, తెలంగాణలో మొదటి ఐదుగురు, జాతీయస్థాయిలో తొలి ఐదుగురు, అంత ర్జాతీయ స్థాయిలో తొలి ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తామ న్నారు. వీరికి తెలంగాణ సైబర్‌సెక్యూరిటీ బ్యూరోతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ⇒ ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డిప్యూటీ సెక్రెటరీ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ గతేడాది సైబర్ క్రైమ్ కారణంగా రూ. 7,500 కోట్లు కోల్పోగా, ఆ సొమ్మును టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కాపాడారని చెప్పారు. దీనికి సంబంధించి రీఫండ్ ఆర్డర్లను బాధితులకు ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సెబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు దేవేందర్‌సింగ్, హర్షవర్ధన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటాంబంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజా పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీపీ జితేందర్ స్పందించారు. హైదరాబాద్‌లో ఉంటున్న బంగ్లా దేశీ యులపై నిఘా ఉంచామన్నారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారమే నడుచుకుంటామన్నారు. -
Vijay Devarakonda: మాది ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్
‘ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్’ నుంచి ఎయిర్ బస్ దాకా... ఆఫర్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న రోజుల నుంచి, ఫైవ్‌స్టార్ ఫుడ్ ఆర్డర్ చేసుకునే రోజుల దాకా... రెండు ఐదు రూ΄ాయల కాయిన్స్ కోసం వెతికిన రోజుల నుంచి కోట్లు లెక్క పెట్టుకునే రోజుల దాకా... ఇద్దరూ విజయప్రయాణాలు చేశారు. ఇండస్ట్రీలో నిలిచారు. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్... ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా వీరి స్నేహంలోని ముచ్చట్లను ‘సాక్షి’తో తరుణ్ భాస్కర్ ప్రత్యేకంగా పంచుకున్నారు.→ విజయ్‌తో మీ స్నేహం మొదలైన రోజులను షేర్ చేసుకుంటారా? తరుణ్ భాస్కర్: మహేశ్వరి చాంబర్స్‌లో నాకో ఆఫీస్ ఉండేది. వెడ్డింగ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్లం. 2011 అనుకుంటా. ఆ టైమ్‌లో థియేటర్ ఆర్టిస్ట్స్‌ని కలిసేవాడిని. అప్పుడే విజయ్‌ని కలిశా. పరిచయం బాగా పెరిగింది. ‘డబ్బులు ఉన్నా లేక΄ోయినా ఫర్వాలేదు... షార్ట్ ఫిల్మ్స్ చేసేద్దాంరా’ అని విజయ్ కాన్ఫిడెంట్‌గా అనేవాడు. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా అనుకున్నాం కానీ కుదరలేదు. ఫైనల్లీ ‘పెళ్ళి చూపులు’ సినిమా చేశాం. అప్పట్లో మాది ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్ (ఖాళీగా తిరిగేవాళ్లను అలా అంటుంటారు). ఇక ‘పెళ్ళి చూపులు’ని ఒక ΄్యాషన్‌తో చేశాం. నా వల్ల విజయ్‌కి హిట్ వచ్చింది.. విజయ్ వల్ల నాకు అనే ఫీలింగ్ లేదు. సాధించాం అనే ΄÷గరు లేదు. మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం. మా ΄్యాషన్కి దక్కిన సక్సెస్ అనుకుంటాను. → మీ జర్నీ ఇంతదాకా వచ్చిన విషయాన్ని అప్పుడప్పుడూ మాట్లాడుకుంటారా?కోవిడ్ టైమ్‌లో విజయ్ ఫోన్ చేసి, ‘అరేయ్... మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం... ఇంత దూరం వచ్చాం.. అస్సలు అనుకోలేదు కదరా... లైఫ్‌లో ఒక్కో ΄ాయింట్ ఎలా టర్న్ అయిందో కదా. దీన్నే డెస్టినీ అంటారు’ అని మాట్లాడుకున్నాం. → అప్పట్లో మీ ఇద్దరూ డబ్బులు లేక ఇబ్బంది పడేవారా? డబ్బులు ఇచ్చి పుచ్చుకునేవారా? డబ్బులంటే... ఒకరికొకరు ఇచ్చుకునే రేంజ్ ఎవరికీ ఉండేది కాదు. అయితే కలిసి బిజినెస్ చేద్దామని అనుకునేవాళ్లం. నాకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే... ఒకసారి ఏదో కొనడానికి విజయ్‌ని పది రూ΄ాయలు అడిగాను. అప్పుడు ‘పెళ్ళి చూపులు’ సినిమా ట్రైల్ జరుగుతోంది. కారులో రెండు ఐదు రూ΄ాయల బిళ్లల కోసం ఇద్దరం బాగా వెతికాం... దొరకలేదు (నవ్వుతూ). ఆ పరిస్థితి ఎప్పటికీ గుర్తుంటుంది. → మీ ఇద్దరి కుటుంబాల మధ్య అనుబంధం? మేమంతా ఒక ఫ్యామిలీ అని మా ఇద్దరి ఇంట్లోనూ అనుకుంటారు. విజయ్ నాన్న ఎలాంటి ఫిల్టర్ లేకుండా నాతో మాట్లాడతారు... టైమ్ వేస్ట్ చేస్తున్నావని తిడుతుంటారు. ఆ ప్రేమ నాకు నచ్చుతుంది. అలాగే మా అమ్మ చేసే బిర్యానీ విజయ్‌కి చాలా ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు డైట్ అంతా గడప దగ్గరే పెట్టి లోపలికి వస్తాడు. → మీరు, విజయ్ గొడవలు పడిన సందర్భాలు... ‘పెళ్ళి చూపులు’ అప్పుడు గొడవపడేవాళ్లం. నాకు ఎవరైనా సలహాలిస్తే నచ్చేది కాదు. ఇలా చేస్తే బాగుంటుందని క్రియేటివ్‌గా కొన్ని చెప్పేవాడు విజయ్. అక్కడ గొడవలు పడేవాళ్లం. ఫైనల్‌గా విజయ్ నాన్న సాల్వ్ చేశారు. రేయ్.. వాడు చెప్పిన మాట విను అని విజయ్‌తో వాళ్ల నాన్న అంటే, ఓకే డాడీ అన్నాడు. నీ డైరెక్షన్ నీది.. నా యాక్టింగ్ నాది అని ఫిక్స్ అయి, గొడవలు మానేశాం. ఇప్పుడు కూడా ఎలాంటి కథలతో సినిమాలు చేయాలి? కమర్షియల్‌గా ఎలా చేయాలి? అని చర్చించుకుంటాం. విజయ్ బాలీవుడ్ వరకూ వెళ్లాడు కాబట్టి తన ఫీడ్‌బ్యాక్ బాగుంటుంది. తనకు చాలా అవగాహన ఉంది. → ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం... బాధలో పెట్టుకున్నవి చాలా ఉన్నాయి. కానీ ‘పెళ్ళి చూపులు’ సక్సెస్‌కి ఎమోషనల్ అయ్యాం. అప్పుడు విజయ్‌ది, నాది బ్యాడ్ సిట్యువేషన్... నిరాశలో ఉన్నాం. మా ఇంట్లో పరిస్థితులు బాలేదు. మా నాన్న సంవత్సరీకం కూడా. ఆ టైమ్‌లో వచ్చినన్ని అప్స్ అండ్ డౌన్స్ మాకెప్పుడూ రాలేదు. ఆ పరిస్థితుల్లో చేసిన సినిమా హిట్ కావడంతో ఎమోషన్‌తో కన్నీళ్లు వచ్చాయి. → విజయ్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు? విజయ్ నా ట్రంప్ కార్డ్. గేమ్‌లో ఎప్పుడైనా కొంచెం అటూ ఇటూ అయితే ఆ ట్రంప్ కార్డ్ వాడుకుంటా. ఆ టైమ్ దగ్గరికొచ్చింది. నాక్కూడా ఎక్కువమంది ఆడియన్స్‌కి రీచ్ కావాలని ఉంది. మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. → విజయ్ లాంటి ఫ్రెండ్ ఉండటం గురించి? విజయ్ ప్రతి సక్సెస్‌లో నా విజయం ఒకటి కనబడుతుంటుంది. తను నా హోమ్ బాయ్... నా డార్లింగ్. విజయ్ అవుట్‌సైడర్‌గా ఇండస్ట్రీకి వచ్చి, ఆ స్టేటస్‌కి రావడమనేది చాలామందికి ఆదర్శంగా ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత కూడా ఆ అచీవ్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. విజయ్ జర్నీలో నేనో చిన్న ΄ార్ట్ అవడం గర్వంగా ఉంటుంది.మీ ఫస్ట్ సినిమాలో విజయ్‌ని ‘పెళ్ళి చూపులు’కి పంపించారు. మరి రియల్ లైఫ్‌లో విజయ్‌ని పెళ్లి కొడుకుగా చూడాలని లేదా? కచ్చితంగా ఉంది. మా మధ్య ఆ విషయం గురించి చర్చకు వస్తుంటుంది. కానీ అవి వ్యక్తిగతం కాబట్టి బయటకు చెప్పలేను. అయితే నాకు హండ్రెడ్ పర్సంట్ విజయ్‌ని ఫ్యామిలీ మేన్‌గా చూడాలని ఉంది. ఎందుకంటే తనలో మంచి ఫ్యామిలీ మేన్ ఉన్నాడు. మంచి భర్త, తండ్రి కాగలుగుతాడు. విజయ్ ఆ లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నా ఫ్రెండ్ పక్కా ‘జెంటిల్‌మేన్’.మీ బాయ్స్‌కి ‘అడ్డా’ ఉంటుంది కదా...అప్పట్లో మీ అడ్డా ఎక్కడ? నెక్లెస్ రోడ్, మహేశ్వరి చాంబర్స్ దగ్గర చాయ్ బండి, ఆ పక్కన చైనీస్ ఫుడ్ సెంటర్. అక్కడే ఏదొకటి తింటూ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ మధ్య అటువైపు వెళ్లినప్పుడు ఆ చాయ్ కేఫ్ దగ్గర థమ్సప్ లోగోలో విజయ్ థమ్సప్ తాగే ఫొటో కనిపించింది. అది ఫొటో తీసి, విజయ్‌కి పంపిస్తే ఎక్కడరా ఇది అని అడిగాడు. మనం ఒకప్పుడు కూర్చున్న కేఫ్ దగ్గర అన్నాను. మాకు అదో ఎమోషనల్ మూమెంట్. ఇక అప్పట్లో ఎక్కడ ఆఫర్లో ఫుడ్ ఉంటే అక్కడ తినేవాళ్లం (నవ్వుతూ). ఇప్పుడు ఆ ప్లేసెస్‌కి అంత ఫ్రీగా వెళ్లలేం. అందుకే ఇప్పుడు మాస్క్ లేకుండా సూపర్ మార్కెట్‌కి వెళ్లి ఓ ΄ాల ΄్యాకెట్ కొనుక్కురా దమ్ముంటే అని విజయ్‌తో అంటుంటాను. అది మాత్రం నా వల్ల కాదురా అంటాడు.మా కల ఒకటే– విజయ్ దేవరకొండమేం ఇద్దరం చిన్నప్పట్నుంచి కలిసి పెరిగినవాళ్లం కాదు... ఒకే స్కూల్లో చదువుకున్నవాళ్లమూ కాదు. నేను పుట్టపర్తిలో, తరుణ్ హైదరాబాద్‌లో చదువుకున్నాడు. ఎక్కడెక్కడో పెరిగినప్పటికీ మా ఇద్దరి కల (సినిమా) ఒకటే. నా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చూసి, తరుణ్ నాతో ‘పెళ్ళి చూపులు’ సినిమా చేద్దాం అనుకున్నాడు. అప్పుడప్పుడే మా పరిచయం బలపడుతోంది. జేబులో రూ΄ాయి లేక΄ోయినా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాళ్లం. ఎంతో నమ్మకంగా ‘పెళ్ళి చూపులు’ చేసి, సక్సెస్ అయ్యాం. ఆ సినిమా తర్వాత తరుణ్‌కి చాలా అవకాశాలు వచ్చినా, మళ్లీ కొత్తవాళ్లతోనే చేద్దాం అనుకున్నాడు. తన మీద, తన స్క్రిప్ట్ మీద తనకు చాలా నమ్మకం. తరుణ్‌లో ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది. ఏదైనా స్క్రిప్ట్‌తో నా దగ్గరకు రారా అంటుంటాను... వస్తా అంటాడు. ఎక్కడో స్టార్ట్ అయి, చాలా దూరం వచ్చిన మా ఈ జర్నీలో ఎన్నో కష్టాలు చూశాం... ధైర్యంగా ఎదుర్కొన్నాం. గొప్పగా ఏదో చేస్తాం అనే నమ్మకంతో ఉండేవాళ్లం. మాతో ΄ాటు మా ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతూ వచ్చింది. లైఫ్‌లో ఒక మంచి ఫ్రెండ్ ఉండటం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.– డి.జి. భవాని -
ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం: నటుడు ఆనంద చక్రపాణి
‘‘ఒక నటుడికి తాను సంపాదించే డబ్బు ముఖ్యం కాదు. జనాలు గుర్తుపట్టి పలకరించినప్పుడు, నటించిన సినిమాల్లోని పాత్రల పేరుతో పిలిచినప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం’’ అని నటుడు ఆనంద చక్రపాణి అన్నారు. ‘దాసి’ (1988) సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు ఆనంద చక్రపాణి. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి వ్యాపారం వైపు వెళ్లిన ఆయన ‘మల్లేశం’ (2019) సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని ్రపారంభించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆనంద చక్రపాణి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.⇒ నా తొలి చిత్రం ‘దాసి’. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. పైగా కొత్త అవకాశాలేవీ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. దీంతో ఇండస్ట్రీని వదిలి అడ్వర్టైజింగ్ ఫీల్డ్కి వెళ్లి, కొన్ని యాడ్ ఫిలింస్‌కి స్క్రిప్ట్ రాయడంతో పాటు దర్శకత్వం వహించాను. ‘మల్లేశం’ సినిమాకు ప్రోడక్షన్ డిజైనర్‌గా చేసిన లక్ష్మణ్ యేలేగారి ద్వారా ఆ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. అందులో హీరో ప్రియదర్శి తండ్రి పాత్ర చేశాను.నా పాత్రకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నా నటన సినీ ప్రముఖులను, సినీ విమర్శకులను, సాధారణ ప్రేక్షకుడిని సైతం భావోద్వేగానికి గురి చేసింది. నా కెరీర్‌కి ఆ మూవీ ఓ మలుపులా ఉపయోగపడింది. నా జీవితం ‘మల్లేశం’కు ముందు.. ‘మలేశం’కు తర్వాత అని చెప్పుకోవాలి. నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాత రాజ్ రాచకొండకు రుణపడి ఉంటా. ⇒‘మల్లేశం’ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్, అనగనగా ఓ అతిథి, విరాట పర్వం, లవ్ స్టోరీ, నాంది, వకీల్ సాబ్, టైగర్ నాగేశ్వరరావు... ఇలా దాదాపు 45 సినిమాల్లో నటించాను. ‘గెటప్’ శీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ చిత్రం మే 24న విడుదలైంది. ఈ సినిమాలో హీరో తండ్రిగా ట్యాక్సీ డ్రైవర్ రాములు పాత్ర చేశాను. ఇందులోని భావోద్వేగ సన్నివేశాల్లో నా నటన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. నా కెరీర్లో ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి, రాజు యాదవ్’ చిత్రాలు ఎంతో ప్రత్యేకం. ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి’ చిత్రాలకు మించిన గుర్తింపు ‘రాజు యాదవ్’తో వచ్చింది. ⇒ ఒకే తరహా పాత్రలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ‘ఆనంద చక్రపాణి మంచి నటుడు. ఏ పాత్రకి అయినా న్యాయం చేయగలడు’ అని ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్నాను. ‘షష్టి పూర్తి’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారి ఫ్రెండ్‌గా నటిస్తున్నాను. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభూ’తో పాటు ‘గాంధీ తాత చెట్టు, ఉరుకు పటేలా’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో నా పాత్రకి ఎంతో ్రపాధాన్యం ఉంటుంది. అదే విధంగా మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. -
మాది పేగు బంధం: ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్
కేసీఆర్ రాష్ట్ర సాధకుడు, ఒక చరిత్ర. తెలంగాణతో నాది పేగు బంధం. నాడు ఆశలు అడుగంటిన సమయంలో పట్టుమని పది మంది కూడా లేకున్నా తెలంగాణ పోరాటం మొదలుపెట్టా. అనేక కష్టనష్టాలకోర్చి రాష్ట్రాన్ని సాధించా. నా గుండె ధైర్యం ఎన్నడూ చెక్కు చెదరదు. కోడి రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్లు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభూత కల్పనలు సృష్టిస్తే.. మేం చేసింది కూడా చెప్పుకోలేక పోయాం. పదేళ్లు సీఎంగా నేను ఏం మాట్లాడానో, వాళ్లేం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెలంగాణలో ఓడిపోకపోతే మహారాష్ట్రలో 20, 30 ఎంపీ సీట్లు వచ్చేవి. ఏడాదిలోగా గ్రామస్థాయి మొదలుకుని మొత్తం బీఆర్ఎస్ కార్యవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తాం.(కల్వల మల్లికార్జున్‌రెడ్డి) కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు గుర్తించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి సీఎం రేవంత్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి రేవంత్ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు 12కుపైగా లోక్‌సభ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని, అందులో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణతో తమది పేగు బంధమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయారు కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలతో ప్రజలు ఆశకు పోయి మోసపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాలతో.. కాంగ్రెస్‌ను నమ్మి తినే అన్నంలో మన్నం పోసుకున్నామనే భావన జనంలో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మేం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. కేవలం 1.8శాతం ఓట్ల స్వల్ప తేడాతో అధికారం కోల్పోయాం. మాకు కొన్ని వర్గాలు దూరం అయ్యాయనేది ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి పుట్టిన విచిత్రమైన కథ. మాకు ఏ ఒక్క వర్గం కూడా దూరం కాలేదు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం మోదీ ఏమైనా మొనగాడా? రాహుల్ సిపాయా? ఎన్డీయే, ఇండియా కూటమి ఏదీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల తర్వాత మోదీ, ఎన్డీయే దుర్మార్గ పాలన అంతమవుతుంది. దక్షిణాదిలోని 139 సీట్లలో బీజేపీకి 9 కూడా రావు. అధికారం వచ్చే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. బలంగాఉన్న ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమికే వాళ్లు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరి మద్దతు తీసుకోవాలో అందరం కలసి నిర్ణయం తీసుకుంటాం. ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే బీఆర్ఎస్కు ఒకట్రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా వస్తాయి. మోదీ మేనియా అంతా గ్యాస్ ఎన్డీయే ట్రాష్,. మోదీ మేనియా గ్యాస్ అని తేలిపోయింది. ఆయన నినాదాలన్నీ డొల్ల, మోదీ పాలనలో ఒక్క రంగం కూడా బాగుపడలేదు. కార్పొరేట్లకు రుణమాఫీ చేశారు. ఎగవేతదారులను లండన్‌లో పెట్టి మేపుతున్నారు. మోదీ రాజకీయంగా అనేక దుర్మార్గాలు చేశారు. 700కుపైగా ఇత ర పార్టీల ప్రజాప్రతినిధులను చేర్చు కుని ప్రభుత్వాలను కూల్చివేశారు. గతంలో 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూశారు. అలాంటి పరిస్థితి రాకుండా.. మేం నైతిక పద్ధతుల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.పెట్రోల్ ‘చార్ సౌ’ దాటుతుంది కేంద్రంలో బీజేపీ, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. వారి సీట్లేమోగానీ పెట్రోల్ ‘చార్ సౌ’ దాటడం పక్కా. ప్రధాని మోదీ దుర్మార్గుడు. మత విద్వేషాలు మినహా దేశ ప్రగతి ఆయనకు పట్టదు. రాష్ట్రాలను మున్సిపాలిటీల కంటే అధ్వానంగా దిగజార్చారు. మోదీ మూలంగా మతపిచ్చి వాళ్ల దేశమనే ముద్ర పడుతోంది. కవిత, కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా, జర్మనీ వంటి ప్రజాస్వామ్య దేశాలు కూడా ప్రతిస్పందించాయి.రేవంత్ తప్పించుకోలేడుప్రధాని మోదీని రేవంత్ బడేభాయ్ అనడం వంటి వాటిపై కాంగ్రెస్‌లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్ ఒకవేళ బీజేపీలోకి వెళ్తే.. తాము 30 మందిమి రెడీగా ఉన్నామని, కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బీఆర్ఎస్ నేతలతో చెప్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్ దాన్నుంచి తప్పించుకోలేడు. ఆయన అరెస్టు అయితే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వస్తుందని అంతా అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్‌కు సంబంధమే లేదు. ఉద్యమకారుల మీదికి తుపాకీతో వచ్చిన ఆయన తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. గుజరాత్‌తో తెలంగాణకు ఫైనల్ మ్యాచ్ అనేది బుద్ధిలేని వాదన.బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం వల్లే కవిత అరెస్టు అవినీతికి పాల్పడాల్సిన అవసరం, ఖర్మ నా కూతురుకు లేవు. ఆమె నిర్దోíÙ, అమాయకురాలు. విచారణకు సహకరించినా అరెస్టు చేశారు. ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. రాజకీయ కక్ష సాధింపులకు బలి కాబోతున్నావు, నేరం చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండు అని కవితకు చెప్పా. బీజేపీ వాళ్లు దుర్మార్గాలకు పాల్పడుతారని వివరించా. నేను, కేజ్రీవాల్ ఇద్దరం బీజేపీకి వ్యతిరేకంగా బలంగా నిలబడటం వల్లే ఇది జరుగుతోంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకముంది. కవిత బెయిల్ కోసం నేను బీజేపీతో రాజీ పడ్డాననడం అర్థ రహితం.నిఘా నుంచి సమాచారం మాత్రమే కోరాం.. ఫోన్ ట్యాపింగ్ అంటూ.. బాకా, కాకా మీడియాలో వస్తున్న వార్తలన్నీ ట్రాష్. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వానికి గూఢచార వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎలా సమాచార సేకరణ జరిపిందనేది మాకు అనవసరం. సీఎం, మంత్రులకు అందులో ఏం పాత్ర ఉంటుంది. ఫోన్ ట్యాప్ చేయాలని ఏ సీఎం కూడా ఆదేశించరు. ప్రభుత్వ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిఘా వ్యవస్థల నుంచి సమాచారం మాత్రం అడుగుతాం.జగన్ మళ్లీ సీఎం అవుతారు వైఎస్ జగన్ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు.మోదీ ఉల్లంఘనలు కనిపించట్లేదా? ప్రధాని మోదీ ఏం మాట్లాడినా అడిగేవారు లేక ‘బారా ఖూన్ మాఫ్’ అన్నట్టుగా తయారైంది. మతం పేరిట ప్రధాని రెచ్చగొడుతున్నా చర్యలు లేవు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి శివ లింగం మీద నీళ్లు పోస్తూ ఓట్లు అడిగితే ఉల్లంఘన కాదా? ఎన్నికల సంఘం నాపై మాత్రం 48 గంటల నిషేధం విధించింది. అది బీజేపీ అనుబంధ సంస్థగా మారింది. ధరణి, ల్యాండ్ టైటిల్ వంటివి ఉత్తమ విధానాలు చాన్నాళ్లుగా భూములను చిక్కుల్లో పెట్టి, రైతులను రాచి రంపాన పెట్టి.. ఎవరి భూములు ఎవరివో తెలియకుండా కన్ఫ్యూజన్లో పెట్టి.. లక్షలు, కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎవరైనా సీఎం సాహసం చేసి దానిని సరిదిద్దాలని ప్రయత్నిస్తే.. కొన్ని ప్రతీపశక్తులు ప్రజల్లో భయాందోళన కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. ధరణితో తెలంగాణలో ప్రజలకు మేలు జరిగింది. ఏపీలో సీఎం జగన్ కూడా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేశారు. భూములను ఎవరూ లాక్కోకుండా ఉండేందుకే ధరణి, ల్యాండ్ టైటిల్ వంటి ఉత్తమ విధానాలు ఉపయోగపడతాయి. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఉత్తమ విధానాలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బద్నాం చేసే ఉన్మాదం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉన్మాదం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టుల్లో బాలారిష్టాలు సహజం. ఒక బ్యారేజీ పిల్లర్లలో వచ్చిన సమస్యను సాకుగా చూపి పంటలను ఎండబెట్టారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలోనూ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. తక్షణమే మరమ్మతులు చేపట్టి నీళ్లు వినియోగించుకోవాలని సూచించింది. జ్యుడీషియల్ కమిషన్‌కు ఇంజనీరింగ్ విధానాల గురించి ఏం తెలుసు? మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానించాలని 50 ఏళ్ల క్రితం అనుకున్నారు. మహానది విషయంలో ఒడిశా దుడ్డుకర్ర పట్టుకుంది. దాంతో గోదావరి నుంచి అనుసంధానం మొదలు పెడతామని మోదీ అంటున్నారు. గోదావరిలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా తేల్చిన తర్వాతే అనుసంధానం గురించి మాట్లాడాలి.ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజానికే మచ్చ కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా ఉండరనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి కొందరు విషం చిమ్మేవాళ్లు చేసే తప్పుడు ప్రచారం. రాధాకృష్ణ జర్నలిస్టేనా? ఆయన కక్కేది విషం. దానికి వలువలు, విలువలు లేవు. కొత్త పలుకుఅంటూ చెత్త రాస్తారు. ఆయన సొంత అభిప్రాయాలు, కోరికలను చెప్తూ.. ఎదుటి వాళ్ల మీద విషం కక్కుతుంటారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వంటివి జర్నలిజం పరువు తీసి బజారులో నిలబెట్టాయి. కాకా, బాకా ఊది గెలిపిస్తామని అనుకుంటున్న వీళ్లు.. గతంలో చంద్రబాబును ఏపీలో గెలిపించగలిగారా? రాధాకృష్ణ లాంటి వాళ్లు జర్నలిజానికి మచ్చ.పుస్తకాలు చదువుతున్నా.. పాటలు వింటున్నా సర్జరీ తర్వాత మెల్లగా కోలుకుంటున్నా. కొంత సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదువుతున్నా. కిషోర్‌కుమార్, లతా మంగేష్కర్, ముఖేశ్ పాటలు చాలా ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమయం దొరకదు. సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఎన్నికలు, పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే.. ప్రశాంతంగా ఉండలేకపోతున్నా.. -
బీజేపీ మళ్లీ వస్తే.. హైదరాబాద్ యూటీనే!
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ చిన్నాభిన్నం అవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 400 స్థానాలు వచ్చి అధికారం చేపట్టిన మరుక్షణమే హైదరాబాద్‌ను ఢిల్లీ నుంచి పాలించే కుట్రను అమలు చేస్తారని.. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా చేస్తారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉండటం లేదన్న మాజీ సీఎం కేసీఆర్.. ఒక్కసారి కరెంటు తీగలను పట్టుకుని చూస్తే కరెంటు ఉందో లేదో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఎవరు అసమర్థులో, దోపిడీదారులో ఓట్లు వేసేటప్పుడు ప్రజలు నిర్ధారిస్తారన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భట్టి విక్రమార్క బుధవారం ప్రజాభవన్‌లో ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే..‘‘ఐదు నెలలుగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటం సంతృప్తికరంగానే కాదు చాలెంజింగ్‌గా ఉంది. రాష్ట్ర ప్రజలకు రూ.500కే సిలిండర్, రూ.10లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షలు.. ఇలా సంక్షేమ కార్యక్రమాల అమలు సంతోషాన్నిస్తోంది. మరోవైపు అస్తవ్యస్తమైన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాల్సి రావడం, ఆదాయాన్ని సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఉండటం చాలెంజింగ్‌గా ఉన్నాయి.ప్రజాభవన్‌కు ఎప్పుడైనా రావొచ్చు..గతంలో ఉన్న ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చాం. వాస్తవానికి సీఎంకు కూడా ఇంత పెద్ద భవనం అవసరం లేదు. అందుకే ప్రజాభవన్ ద్వారాలు తెరిచిపెట్టాం. ప్రజలు ఎప్పుడైనా రావచ్చు. సమస్యలపై దరఖాస్తులు ఇవ్వొచ్చు. సీఎం, నేను ఇతర మంత్రివర్గ సహచరులమంతా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం. మా ప్రభుత్వ పాలనకు 100కు 100 మార్కులు వేయొచ్చు. ప్రతి మంత్రి కార్యాలయాల డోర్లు తెరిచే ఉంటున్నాయి. ప్రజలు ఎప్పుడైనా వెళ్లి కలవచ్చు.కేసీఆర్‌వన్నీ అబద్ధాలే..ఐదు నెలల్లో తెలంగాణ ఇంత ఆగమైతదా అని కేసీఆర్ అంటున్న మాటలు వింటే నవ్వు వస్తోంది. అబద్ధాల పునాదులపై ఆయన బీఆర్ఎస్ను నడుపుతున్నారు. వాళ్లే కట్క బంద్ చేసుకుని కరెంటు కట్ అయిందంటారు. ఆ పెద్దమనిషి అంతగా దిగజారిపోయాడు. కరెంటుకు ఏం మాయరోగం వచ్చిందని అంటున్న కేసీఆర్.. ఒక్కసారి కరెంటు తీగలను పట్టుకుని చూస్తే కరెంటు ఉందో లేదో అర్థమవుతుంది. వాస్తవానికి వెలుగును చూడలేని మాయరోగం కేసీఆర్‌కే వచ్చింది. ఆయన ఎక్కువగా చీకట్లో, ఒంటరిగా ఉంటూ.. ప్రజల సొమ్మును ఎలా దోచుకోవాలో ఆలోచిస్తుంటారు.చక్కదిద్దేందుకు పదేళ్లు పడుతుందితెలంగాణ ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల వలయంలోకి నెట్టారు. దీన్నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం ఒక్కరోజులోనో, ఒక్క ఏడాదిలోనో అయ్యేది కాదు. కనీసం పదేళ్లు పడుతుంది. తెచ్చిన అప్పులను కూడా నిరర్థక ఆస్తులపై పెట్టి.. అప్పు చేసి పప్పుకూడు అన్నట్టు వ్యవహరించారు. అప్పులు చేస్తే సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, జూరాల వంటి ప్రాజెక్టులు కట్టాలి. బీహెచ్ఈఎల్ లాంటి సంస్థలు ఏర్పాటు చేయాలి. ఓఆర్ఆర్, మెట్రోరైలు, అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి రవాణా వ్యవస్థలను నెలకొల్పాలి. కాళేశ్వరం లాంటి గుదిబండను కట్టడం కాదు.బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేయడం ఖాయం‘‘దేశంలో రిజర్వేషన్లను అమలు చేయడం బీజేపీకి ఇష్టం లేదు. అందుకే దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటూ రాహుల్ గాంధీ పదేళ్లుగా నినదిస్తున్నా పట్టించుకోవడం లేదు. బీసీలకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎగ్గొట్టడంతోపాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తివేయాలనేది బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కులగణన చేస్తాం. ఓబీసీలకు రాజ్యాంగపరంగా వాటా ఇస్తాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పార్టీ కార్యకర్తలు, అభిమానులు మాత్రమే ఓట్లేశారు. ఇప్పుడు మా గ్రాఫ్ పెరిగింది. గతంలో ఓటేయని వారు కూడా మాకు ఓటేస్తామంటున్నారు.’’ పద్ధతి ప్రకారమే టికెట్లు ఇచ్చాంబీజేపీ, బీఆర్ఎస్ల్లాగా నియంతృత్వ ధోరణుల్లో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఉండదు. పార్టీ రాజ్యంగంలోని అన్ని పద్ధతులను పాటించి అభ్యర్థులను ఖరారు చేశాం. అందుకే జాప్యం జరిగింది. పార్టీ అధిష్టానం అన్నీ ఆలోచించాకే టికెట్లు ఇస్తుంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారుబీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నాం, ఉండలేకపోతున్నామని అంటున్నారు. చాలా మంది నాతో మాట్లాడారు కూడా. అయితే ఎందరు చేరతారు, ఎప్పుడు చేరతారనేది బయటికి చెప్పలేం. బీఆర్ఎస్కు ప్రజాదరణ పెరుగుతుందని ఎవరైనా అంటే నవ్వు కోవాల్సిందే. అది అయిపోయిన పార్టీ. ఈ విషయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అర్థమై పోయింది. అందుకే బయటకు వచ్చేస్తున్నారు.కాంగ్రెస్‌కు పట్టం కట్టండిప్రజా ప్రభుత్వం మాది. ఇందిరమ్మ రాజ్యం మాది. ప్రజలకోసమే పనిచేస్తాం.. మతతత్వ, నియంతృత్వ ధోరణులతో కూడిన బీఆర్ఎస్, బీజేపీలను దూరంగా పెట్టి కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో పట్టం కట్టాలి..’’ అని భట్టి పేర్కొన్నారు.-(మేకల కల్యాణ్ చక్రవర్తి) -
అది ప్రాణాలు తీసేంత దాడే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి ప్రాణాలు తీసేంత తీవ్రమైనదేనని ప్రముఖ న్యూరో సర్జన్ డా. కేవీఆర్ శాస్త్రి అంటున్నారు. అదృష్టవశాత్తు ఎడమ కనుబొమ్మ పై భాగంలో తగలడంతో తీవ్రగాయంతో సరిపోయిందని, అదే ఎడమ కణతపై లేదా తల వెనుక భాగంలో తగిలితే కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోవడంతోపాటు ప్రాణాపాయం సంభవించేందుకు కూడా ఎక్కువగా అవకాశాలున్నాయని ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ – న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్– బెంగళూరు)లో న్యూరాలజీ విభాగాధిపతిగా చేసిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం తీవ్రతను పలు కోణాల్లో విశ్లేషించారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పదునైన ఆయుధంతో దాడి సీఎం వైఎస్ జగన్‌పై పదునైన రాయి లేదా ఇతర పదునైన వస్తువుతో బలంగా దాడి చేశారు. ఎడమ కనుబొమ్మ పై భాగంలో బలంగా తగలడంతో చర్మం ఛిద్రమై తీవ్ర గాయమైంది. దాంతోనే కుట్లు వేయాల్సి వచ్చింది. ఆయన కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. ప్రస్తుతం ఆయన ఒకట్రెండు రోజుల విశ్రాంతి తరువాత రోజువారి పనుల్లో నిమగ్నమైనప్పటికీ, వైద్యులు తరచూ పర్యవేక్షిస్తూ ఉండాలి. కణతపై తగిలి ఉంటే.. ఆ పదునైన రాయి లేదా వస్తువు కాస్త పక్కన ఎడమ కణతపై తగిలి ఉంటే పెనుముప్పు సంభవించేది. ఆ భాగంలో ఎముక సున్నితంగా ఉంటుంది. పదునైన రాయి బలంగా తగిలితే ఆ ఎముక విరిగి లోపలే ఉండిపోయేది. ఆ ఎముక లోపల మెదడు భాగానికి గుచ్చుకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. ఇక ఎడమ కణత భాగంలోనే పెద్ద రక్తనాళం ఉంటుంది. ఆ నాళం తెగి భారీగా రక్తస్రావం అయ్యేది. కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోయే ప్రమాదానికి దారి తీసి ఉండేంది. మెదడులోనే రక్తస్రావమైనా, మెదడుకు రక్త సరఫరాకు ఇబ్బంది కలిగి ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల వెనుకభాగంలో తగిలితే.. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుడివైపు ఉన్న ప్రజలను చూసి అభివాదం చేస్తూ ఉండటంతో ఎడమ వైపు నుంచి బలమైన రాయి లేదా మరో పదునైన వస్తువుతో దాడి చేశారు. ఆ సమయంలో ఆయన వెనక్కి తిరిగి ఉన్నారు. ఆ వస్తువు తల వెనుక కింద భాగంలో తగిలి ఉంటే మెదడుకు తీవ్ర గాయమయ్యేది. మెదడులో రక్తస్రావం అయి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. అదృష్టవశాత్తూ అది ఎడమ కనుబొమ్మ పై భాగంలో తగలడంతో తీవ్ర గాయంతో సరిపోయింది. అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైద్యులు కొన్నిరోజులపాటు పర్యవేక్షిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. న్యూరో సర్జన్ డా. కేవీఆర్ శాస్త్రి దోషుల్ని శిక్షించాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందడం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇటువంటి పనులు చేస్తున్నాయి. ఆయన్ని హత్యచేయాలనే ప్రణాళిక ప్రకారం దాడిచేశారు. ఇది ప్రతిపక్షాల కుట్రే. దీనివెనుక ఎంతటి పెద్దవారున్నా పూర్తిస్థాయిలో విచారించి దోషులను కఠినంగా శిక్షించాలి. – చిర్ల జగ్గిరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చంద్రబాబు చెప్పడంతోనే.. జగన్మోహన్రెడ్డిని రాళ్లతో కొట్టమని శనివారం మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు తన ప్రసంగంలో సూచించారు. ఆ వీడియోలు ఉన్నాయి. జగన్‌ను రాళ్లతో కొట్టండి, అతడు దుర్మార్గుడు, దున్నపోతు, సైకో రాళ్లతో దాడి చేయండి అని.. చంద్రబాబు చెబితే ఈ దుర్మార్గులు, పచ్చకుక్కలు, తెలుగుతమ్ముళ్లు, పిచ్చి పరాకాష్టకు చేరిన కులగజ్జి పట్టిన కుక్కలు సీఎం జగన్‌ను చంపడానికి కుట్ర పన్నారు. చంద్రబాబునాయుడు ప్రణాళికతో జగన్మోహన్రెడ్డి మీద గత ఎన్నికల ముందు, ఈ ఎన్నికల ముందు ఈ దారుణం చేయించారు. తక్షణమే ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోవాలి. – కొడాలి నాని, ఎమ్మెల్యే ఉసిగొల్పుతున్న చంద్రబాబు ఇటీవల ఎన్నికల ప్రచారసభల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి దురాగతాలకు ఉసిగొల్పుతున్నారు. చంద్రబాబు ప్రసంగాల వీడియో క్లిప్‌లు పరిశీలిస్తే వాస్తవం ఇట్టే అర్థమవుతుంది. జగన్‌పై హత్యాయత్నం ప్రతిపక్షాల కుట్రలో భాగమే. జగన్ ఇటువంటి వాటికి భయపడే వ్యక్తి కాదు. చంద్రబాబు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలి. – కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే జగన్‌ను చంపాలనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్యచేయాలనే ప్రయత్నించారు. రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి ముఖ్యమంత్రికి ఏమీకాలేదు. కుల ఆధిపత్యంతో, అసూయతో ఇలా చేశారు. ఈ కుట్రను ప్రధాని నరేంద్రమోదీ వెలికి తీయించాలి. పొత్తులతోను, డబ్బుతోను అధికారం చేజిక్కించుకోవాలనుకున్న చంద్రబాబు వ్యూహం ఫలించదని తెలియడంతో ఈ కుట్ర చేశారు. – రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ కుట్ర ముఖ్యమంత్రిపై హత్యాయత్నం వెనుక చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ కుట్ర ఉంది. వారిద్దరి దుర్మార్గపు ఆలోచనతోనే సీఎంపై హత్యాయత్నం జరిగింది. సీఎం జగన్‌పై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ దారుణానికి పాల్పడ్డారు. – సింహాద్రి రమేష్‌బాబు, ఎమ్మెల్యే నైతికంగా దెబ్బతీయాలని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజాభిమానం అధికంగా ఉండడం గమనించి, ఆయన్ని నైతికంగా దెబ్బతీయాలనే హత్యాయత్నం చేశారు. వైఎస్సార్సీపీకి గ్రాఫ్ పెరుగుతోందని గ్రహించి ఓర్వలేక ఈ దారుణానికి తెగబడ్డారు. గతంలో విజయవాడలో వంగవీటి మోహన రంగా హత్య వంటివి చూస్తే.. ఎదుటి వ్యక్తులను కుట్రలతో దెబ్బతీయడం టీడీపీకి అలవాటేనని అర్థమవుతోంది. – జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం నీరాజనం పడుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి దుర్ఘటలకు పాల్పడడం దారుణం. దాడిచేసిన వారిని గుర్తించి, అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు ప్రజానాయకుడిపై హత్యాయత్నం ప్రజాస్వామానికి గొడ్డలిపెట్టు. పేదల పెన్నిధి, విద్య, వైద్యం, సంక్షేమం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం దుర్మార్గం. గాయపడిన జగన్‌కు ప్రథమ చికిత్స చేశా. ఆయనలో ఎలాంటి భయం లేదు. – డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, వైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రిపై హత్యాయత్నం హేయం. ఈ సంఘటనపై లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇంటెలిజెన్స్‌పై చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేయడం తప్పు. దీన్లో పోలీస్, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇంటెలిజెన్స్ మీద చర్యలు తీసుకోవాలి. – వంగవీటి రాధా, మాజీ ఎమ్మెల్యే -
ఇంటింటా డాక్టర్
‘ప్రతి మనిషిలోనూ ఓ డాక్టర్ ఉంటారు. ప్రతి ఒక్కరిలో వైద్యం గురించి ్రపాథమిక అవగాహన ఉంటుంది’ అనే మౌలిక సూత్రాన్ని పట్టుకున్నారు డాక్టర్ సరళ. వైద్యరంగాన్ని అత్యంత సరళంగా వివరించి చెబుతున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లను, ముఖ్యంగా గృహిణులను హెల్త్ అడ్వయిజర్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఆహ్వానం పలికిన కాలనీలకు వెళ్లి హెల్త్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ‘‘ఇంటింటా ఓ డాక్టర్’ ఉండాలి. ఆ డాక్టర్ మహిళ అయితే ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన బంధువులు స్నేహితులకు నిస్వార్థమైన వైద్యసేవలందిస్తుంది. గ్రామాల్లో వైద్య సహాయం అందని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. నేను తయారు చేస్తున్న హెల్త్ అడ్వయిజర్ వ్యవస్థ ద్వారా ఆ లోటును భర్తీ చేయాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు డాక్టర్ సరళ. ఆమె సాక్షితో మాట్లాడుతూ ‘‘నేను డాక్టర్ కావాలనే ఆలోచన నాది కాదు, మా అమ్మ కోరిక. నిఫ్ట్‌లో కోర్సు చేసి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే నా ఆకాంక్ష నెరవేరలేదు. కానీ వైద్యరంగాన్ని సమాజానికి అవసరమైనట్లు రీ డిజైన్ చేస్తున్నా’’నని చె΄్పారు. ‘‘మాది కాకినాడ. నాన్న బిజినెస్ చేస్తారు. అమ్మ గవర్నమెంట్ ఉద్యోగంలో హెడ్ ఆఫ్ ది ఫార్మసీ డిపార్ట్మెంట్గా రిటైరయ్యారు. ఆడవాళ్లను చదువులో ్రపోత్సహించడం మా ఇంట్లోనే ఉంది. అమ్మకి పదవ తరగతి పూర్తయిన వెంటనే పెళ్లి చేశారు. మా నాన్నే అమ్మను చదివించారు. ఇక ముగ్గురు పిల్లల్లో నేను పెద్దదాన్ని కావడంతో అమ్మ కల నెరవేర్చే బాధ్యత నాదయింది. సాధారణంగా మెడిసిన్‌లో ఎంబీబీఎస్‌లో సీట్ రాని వాళ్లు హోమియో, ఆయుర్వేదం వంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు వెళ్తారనే అభి్రపాయం సమాజంలో స్థిరంగా ఉంది. కానీ హోమియో మీద ఇష్టంతో బీహెచ్ఎమ్ఎస్లో చేరాను. ఖాళీ సమయాల్లో కూడా మా ్ర΄÷ఫెసర్లకు సహాయం చేస్తూ సబ్జెక్టు లోతుగా తెలుసుకున్నాను. పెళ్లి అయి వైజాగ్ వెళ్లిన తర్వాత సీనియర్ దగ్గర ఏడాది పని చేయడం నన్ను పరిపూర్ణం చేసింది. ఈ రంగంలో సాధించే అనుభవం అంతా పేషెంట్‌తో ఎక్కువ సేపు మాట్లాడి, వ్యాధి లక్షణాలను, వారి జీవనశైలిని, మానసిక స్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకోవడంతోపాటు ఎక్కువమందికి వైద్యం అందించడమే. అప్పుడే సొంతంగా ్రపాక్టీస్ పెట్టగలిగిన ధైర్యం వస్తుంది. హైదరాబాద్‌లో సొంతంగా క్లినిక్ తెరవడం... నన్ను సమాజం కోసం పని చేయాలనే ఆలోచనకు బీజం వేసింది. పేషెంట్ల వల్లనే తెలిసింది! నేనిప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ప్యానల్ డాక్టర్‌గా సేవలందిస్తున్నాను. నెలకు కనీసం పదికి తక్కువ కాకుండా హెల్త్ అవేర్నెస్ ్రపోగ్రామ్స్ చేస్తున్నాను. హెల్త్ కేర్ అవేర్నెస్ ్రపోగ్రామ్ల అవసరం ఉందని గుర్తించడానికి కారణం నా దగ్గరకు వచ్చే పేషెంట్లే. డయాబెటిస్, హైపర్ టెన్షన్, స్ట్రోక్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం నా దగ్గరకు వచ్చే చాలామందిలో అప్పటికే వ్యాధి తీవ్రత పెరిగిపోయి చికిత్సకు స్పందించని స్థితికి చేరి ఉండేది. అల్లోపతిలో వైద్యం చేయించుకుని ఆరోగ్యం మెరుగైన వాళ్లు సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అక్కడ సాంత్వన లభించని వాళ్లు ఓ ప్రయత్నం అన్నట్లుగా హోమియో వంటి వైద్య ప్రక్రియల వైపు వస్తుంటారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. మూడు నెలల్లో పూర్తి స్థాయిలో చికిత్స చేయగలిగిన మందులు ఉండి కూడా చివరి దశ వరకు ఈ చికిత్సకు అందుబాటులోకి రాకపోవడం వల్ల ్రపాణాలు కోల్పోతున్న వాళ్లు ఎందరో. అలాంటి గ్యాప్‌కు 2015 నుంచి నేను బ్రిడ్జినవుతున్నాను. గతంలో కాలనీలకు వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేయాల్సి వచ్చేది. సమావేశం ఉందనే సమాచారం కాలనీలో అందరికీ చేర్చడం కూడా ప్రయాసతో కూడి ఉండేది. ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్‌లో ఒక్క మెసేజ్ పెడితే సమాచారం అందరికీ చేరుతుంది. ఆసక్తి ఉన్నవాళ్లు హాజరవుతున్నారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి మెన్స్ట్రువల్ హెల్త్, పీసీఓడీ వంటి సమస్యల మీద అవగాహన కల్పిస్తున్నాను. దీనికితోడుగా హెల్త్ అడ్వైజర్ అనే కాన్సెప్ట్‌కు కూడా శ్రీకారం చుట్టాను. వారం రోజుల శిక్షణ అనారోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, కానీ ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకీ బెంబేలు పడిపోయి హాస్పిటళ్లకు పరుగులు తీయాల్సిన పని ఉండదు. సాధారణ జలుబు, దగ్గు వంటి వాటికి ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు. మూడు రోజులు దాటినా తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లమని చెబుతాం. మొదటి మూడు రోజుల వైద్యం అందించగలిగేటట్లు హెల్త్ అడ్వైజర్లను తయారు చేస్తున్నాను. రోజుకో గంటసేపు వారం రోజులపాటు ఉంటుంది ఈ కోర్సు. మందులు కూడా హెల్త్ అడ్వైజర్లు పేషెంట్ లక్షణాలను బట్టి సులువుగా ఇవ్వగలిగేటట్లు తయారు చేశాను. మనకు స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లయినప్పటికీ దేశంలో ఇంకా డాక్టర్– పేషెంట్ల నిష్పత్తి సమతుల్యతలో పెద్ద అగాధమే ఉంది. వెయ్యి మంది పేషెంట్లకు ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలనే సదుద్దేశం నెరవేరడం లేదు. పట్టణాల్లో అవసరానికి మించినంత మంది వైద్యులున్నారు, గ్రామాల్లో వైద్యం కరువవుతోంది. గృహిణులకు హెల్త్ అడ్వైజర్లుగా శిక్షణ ఇవ్వడం వల్ల ఆ లోటు కొంత భర్తీ అవుతోంది. వైద్యం అంటే... సామాన్యులకు అర్థం కాని చదువు కాదు, అత్యంత సులువుగా అర్థం చేసుకోగలిగిన శాస్త్రం అని నిరూపించడం, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించడమే నా లక్ష్యం. కోర్సులో భాగంగా నేర్చుకున్న వైద్యాన్ని నా వంతుగా కొంత విస్తరించి 76 అనారోగ్యాలకు మందులు కనుక్కున్నాను. వాటికి ఆయుష్ నుంచి నిర్ధారిత గుర్తింపు కూడా వచ్చింది’’ అని వైద్యరంగాన్ని సరళతరం చేయడంలో తన వంతు భాగస్వామ్యాన్ని వివరించారు డాక్టర్ సరళ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
సమాజాన్ని అద్దంలో చూపించాను
‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ పేరుతో తన జర్నలిస్ట్ జీవితాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించారు అరుణా రవికుమార్. ముప్ఫై ఎనిమిదేళ్ల కిందట ‘అరుణా అశోకవర్ధన్’ పేరుతో తొలిసారి బైలైన్ చూసుకోవడం నుంచి నేటి వరకు సాగిన అక్షరయానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నేను మీడియా రంగంలోకి రావడమే ఒక ఆశ్చర్యం. నా చదువు ఇంగ్లిష్ మీడియంలో, గ్రాడ్యుయేషన్ సైన్స్‌లో సాగింది. అమ్మ రచయిత కావడంతో తెలుగు సాహిత్యం మీద అభిరుచి మెండుగా ఉండేది. నా లక్ష్యం సివిల్స్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ పరీక్షల నాటికి తాతగారు పోవడంతో రాయలేకపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఓ ఇంగ్లిష్ పత్రికలో జర్నలిస్టుగా చేరాను. నా తొలి రిపోర్టింగ్ జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ రిపోర్ట్ మీద. బై లైన్‌తో వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు, ప్రపంచ విజేతనైన భావన. అలా మొదలైన నా జర్నీ ఎలక్ట్రానిక్ మీడియాకు మారింది. తెలుగులో ప్రైవేట్ టీవీ రంగంలో రిపోర్టర్ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను. పెళ్లి చేసుకున్న తర్వాత విజయవాడకు బదిలీ కావడం కూడా చాలా కీలకమైన అనుభవాన్నిచ్చింది. అది 1988, మార్చి నెల పదవ తేదీ. విజయవాడ వెళ్లిన తొలి రోజు, దేవినేని మురళి హత్య. సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఓ కుర్రాడు పరుగున లోపలికి వచ్చి షట్టర్ వేసేశాడు. భయం కలిగినప్పటికీ నిబ్బరంగా ఉండిపోయాను. ఓ అరగంట తర్వాత షట్టర్ తీశారు. రోడ్డు మీదకు వస్తే... అంతకు ముందు ఏమీ జరగనట్లు తుపాను తర్వాత ప్రశాంతతలా ఉంది వాతావరణం. జర్నలిస్టుగా కొత్త ప్రపంచాన్ని చూశాను. చీరాలలో చేనేతకారుల ఆకలి చావులను రిపోర్ట్ చేయగలిగాను. సమాజంలో వేళ్లూనికొని ఉన్న ఆవేదనలు, ఆందోళనలకు అద్దం పట్టాను. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు సాంబశివుడి ఇంటర్వ్యూ చేశాను. ఎలిమినేటి మాధవరెడ్డి గారి హత్యకు కొద్దిగా ముందు ఆయనతోపాటు వారి వాహనంలోనే ప్రయాణించాను. అప్పటికే రెక్కీ నిర్వహించి హత్యకు ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆ తర్వాత నాకు తెలిసింది. బళ్లారిలో ఎన్నికలను కవర్ చేశాను. భ్రూణహత్యల మీద పరిశోధనాత్మక కథనాలకు యూనిసెఫ్ అవార్డు వచ్చింది. స్టూడియో లో ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలు ఎన్ని చేసినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనా కథనాలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి. ఫ్లోరోసిస్ బాధితుల కథనాలకు స్పందనగా ప్రభుత్వాలు నీటి సౌకర్యాన్ని కల్పించడం రిపోర్టర్‌గా నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భం. లంబాడా తండాల్లో ఆడపిల్లలను పుట్టగానే చంపేయడం, కుటుంబాన్ని పోషించడానికి ఓ మహిళ మూడుసార్లు సరోగసీ ద్వారా బిడ్డను కని అనారోగ్యం పాలు కావడం వంటి కథనాలెన్నింటికో నేను అక్షరసాక్షిని కావడం ద్వారా నాకు ఈ రంగం ఎంతో సంతృప్తినిచ్చింది. మా వారి బదిలీల రీత్యా, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ల చదువులు కీలక దశల్లో ఉన్నప్పుడు కెరీర్లో విరామాలు తీసుకుంటూ నా వృత్తిని కొనసాగిస్తున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ‘మరాడర్స్ ఆఫ్ హోప్’ నా తొలి రచన. ‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ నా రెండవ రచన. ఇండిపెండెంట్ జర్నలిస్టుగా హైదరాబాద్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికీ రోజూ చదువుతాను, రాస్తుంటాను. మహిళ ఎన్ని సాధించినప్పటికీ సమాజంలో సమానత్వం మాత్రం పూర్తిస్థాయిలో రాలేదనే చెప్పాలి. అయితే నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజంలో స్త్రీ–పురుషుల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంత తీవ్రంగా లేదు. కానీ సమానత్వం మాత్రం ఇంకా రాలేదు’’ అంటూ తన అక్షరయానం గురించి వివరించారు అరుణ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్‌కుమార్ మోర్ల -
International Womens Day 2024: ఆహారంలోనే ఆరోగ్యం.. మూడుతరాల కోడళ్ల ముచ్చట్లు
ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే. ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. పిల్లలు తింటేనే నాకు బలం నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం. – అంజనాదేవి మా కోడలు నన్ను మార్చేసింది గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్‌లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్. భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్స్టంట్ మిక్స్‌లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి. రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్ఫుడ్తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది. – సురేఖ అత్తమ్మ నా రోల్‌మోడల్ మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్‌లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్స్టంట్ ఫుడ్ పౌడర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్ప్రెన్యూర్లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. – ఉపాసన ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి -
Violinist Tadepalli Subbalakshmi: స్వరవీణ
ఇంట్లోకి అడుగుపెట్టగానే సోఫా కార్నర్లో త్యాగయ్య విగ్రహం అతిథులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది. అదే గదిలో మరోదిక్కున వీణాపాణిౖయెన సరస్వతీ మాత పాదాల చెంత తంబుర మీటుతున్న త్యాగరాజు, కామధేనువు నిత్యపూజలందుకుంటున్న దృశ్యం ఆకట్టుకుంటుంది.‘‘పుష్యమాసం బహుళ పంచమి త్యాగరాజు సిద్ధి పొందిన రోజు. తమిళనాడులో ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి’’ అంటూ సంతోషం నిండిన స్వరంతో తన సంగీత ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు తాడేపల్లి సుబ్బలక్ష్మి. ‘‘మాది విజయవాడ. మా పెదనాన్న కొమ్ము వెంకటాచల భాగవతార్ హరికథకులు. కళల నిలయమైన ఇంట్లో పుట్టాను. ఆరవ ఏటనే నా సంగీత సాధన మొదలైంది. ఆకెళ్ల మల్లికార్జున శర్మ, కోటిపల్లి ప్రకాశరావులు నా వయోలిన్ గురువులు. విజయవాడ సత్యనారాయణపురంలో ‘ప్రభుత్వ సంగీత కళాశాల’ పెట్టారు. పదేళ్లకు ఆ కాలేజ్‌లో చేరాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మా ప్రిన్సిపల్. ఆ తర్వాత నేదునూరి కృష్ణమూర్తిగారు కూడా. ఆరేళ్లపాటు సాధన చేసి వయోలిన్ లో సర్టిఫికేట్ కోర్సు, డిప్లమో చేశాను. ప్రైవేట్‌గా వోకల్ కోర్సు కూడా చేశాను. డిప్లమో అందుకోవడం ఆ వెంటనే పెళ్లి. అబ్బాయిని వెతుక్కోవాల్సిన పని పడలేదు. మా వారు ఉమాశంకర్ నా క్లాస్మేట్. జీవితాన్ని పంచుకున్నాం. సంగీత విద్వాంసులుగా వందలాది వేదికలను పంచుకున్నాం. సంగీతసాగరంలో మా జ్ఞానాన్వేషణ కొనసాగుతోంది. సంగీత గురువు సంగీత గురువుగా నా బాధ్యత 1985లో మొదలైంది. జవహర్ బాలభవన్‌లో వయోలిన్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేరాను. ఆ తర్వాత నేను చదివిన కాలేజ్‌లోనే ‘గాయక్ అసిస్టెంట్’గా చేరాను. వేదికల మీద గాత్ర సహకారం, వయోలిన్ సహకారం రెండూ చేయగలగడంతో అనేకమంది ప్రముఖులతో వేదిక పంచుకునే అవకాశం వచ్చింది. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి శోభానాయుడుకి గాత్ర సహకారం, ప్రముఖ గాయని శోభారాజ్కి వయోలిన్ సహకారం అందించాను. అలేఖ్య పుంజల, భాగవతుల సేతురామ్, ఆనంద్ శంకర్, మంజులా రామస్వామి, ఉమారామారావు, వాసిరెడ్డి కనకదుర్గ వంటి గొప్పవారితో నా సరిగమల, స్వర రాగాల ప్రయాణం సాగింది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత సంగీతసేవ విస్తృతంగా చేయడానికి నాకు అవకాశాలు వచ్చాయి. దూరదర్శన్, భక్తి చానెల్, ఎస్వీబీసీ – నాద నీరాజనంతోపాటు ఇతర దేవాలయాల్లో లెక్కకు మించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఐసీసీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్)నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సింగపూర్, టర్కీ, లెబనాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, అబూదాబి వంటి దేశాల్లో కచేరీలు చేయగలిగాను. ఎన్టీఆర్‌గారు కళలను అభిమానించేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ప్రారంభగీతం ఆలపించాను. గవర్నర్ రంగరాజన్‌గారి హయాంలో గవర్నర్ బంగ్లాలో అప్పటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్ గౌరవార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భక్తి సంగీతం ఆలపించడం వంటి ఎన్నో సంతోషాలను సంగీత సరస్వతి నాకిచ్చింది. నా వయసు 74. ఆరు దశాబ్దాలు దాటిన సంగీత సాధనను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే నాకు ముచ్చట గా అనిపించే సందర్భం జూనియర్ ఎన్టీఆర్ నాట్యప్రదర్శన. మద్రాసు (చెన్నై)లో జరిగిన ఆ కార్యక్రమానికి సంగీత సహకారం అందించాను. ఆ పిల్లవాడు చాలా మంచి డాన్సర్. నిరంతర గాన వాహిని నేను మ్యూజిక్ కాలేజ్ నుంచి రిటైర్ అయ్యేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగం నుంచి మా వారు కూడా రిటైర్ అయి ఉన్నారు. ఇద్దరం కలిసి ‘వాగ్దేవి సంగీత విద్యాలయం’ పేరుతో సంగీత పాఠశాలను స్థాపించాం. పూర్థిస్థాయి శిక్షణ ఇచ్చి డెబ్బైమందికి పైగా విద్యార్థులను పరీక్షలకు పంపించాం. నా స్టూడెంట్స్ కెనడా, యూఎస్, సింగపూర్లలో మ్యూజిక్ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. ఈ తరం బాల్యం చాలా చురుగ్గా ఉంటోంది. పిల్లల్లో గ్రహణ శక్తి చాలా మెండుగా ఉంది. త్వరగా నేర్చుకుంటున్నారు. అందుకు టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడుతోంది. అప్పట్లో మాకు గురువు పాడి వినిపించిన పాటను ఇంట్లో సాధన చేసేటప్పుడు ఏదైనా సందేహం వస్తే, మరునాడు క్లాస్‌లో నివృత్తి చేసుకోవాల్సిందే. ఇప్పుడలా కాదు, గురువు పాడేటప్పుడే రికార్డ్ చేసుకుని మళ్లీ మళ్లీ వింటూ నేర్చుకుంటున్నారు. కానీ సంగీతంలో కొనసాగేవాళ్లు తక్కువ. మూడేళ్లపాటు బాగా నేర్చుకున్న తర్వాత టెన్త్‌క్లాస్‌కు వచ్చారని, ఇంటర్మీడియట్ కూడా కీలకం కాబట్టి పూర్తి సమయం చదువుల కోసమే కేటాయించాలనే ఉద్దేశంతో సంగీతసాధనకు దూరమవుతున్నారు. మా రోజుల్లో సంగీతమే అసలు చదువుగా ఉండేది. నేను ప్రైవేట్‌గా మెట్రిక్యులేషన్ పూర్తి చేశాను. తమిళులు మాత్రం ఉన్నత చదువులు చదువుతూ సంగీతాన్ని కూడా కొనసాగిస్తుంటారు. మన తెలుగు వాళ్లలో ప్రతిభ ఉంది. అయితే అంకితభావమే తక్కువ. ఉపాధికి భరోసా ఉంటే ఈ కళను కెరీర్‌గా ఎంచుకునే వాళ్ల సంఖ్య పెరుగుతుంది. నాకనిపించేదేమిటంటే... పిల్లలకు స్కూల్ దశలోనే సంగీతం, నాట్యం వంటి కళల కోసం ఒక క్లాసు ఉంటే బాల్యంలోనే కళలు పరిచయమవుతాయి. కళాసాధనతో వచ్చే క్రమశిక్షణ వారిలో దుడుకుతనాన్ని తగ్గించి ఒద్దిక నేర్పుతుంది. పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి పరోక్షంగా దోహదం చేస్తుంది. కాబట్టి పాఠశాల విద్యలో సంగీత, నాట్యాలను సిలబస్‌గా పెట్టే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు తాడేపల్లి సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి మంచి టీచర్ ఇది నేను సంపాదించుకున్న బిరుదు. ఇప్పటికీ రోజుకు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని సాధన చేస్తాను, పిల్లల చేత సాధన చేయిస్తాను. ఇంట్లో సంగీతపాఠాలు చెప్పే టీచర్లు కొందరు పిల్లలను తాళం వేయమని చెప్పి తాము వంట చేసుకుంటూ ఒక చెవి ఒగ్గి గమనిస్తుంటారు. టీచర్ ఎదురుగా ఉంటేనే క్రమశిక్షణ అలవడుతుందని నా విశ్వాసం. సంగీతం అంటే సరిగమలు పలకడం మాత్రమే కాదు, ఆత్మతో మమేకం కావాలి. సంగీత సాధన పట్ల పిల్లల్లో ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించినప్పుడే గురువుగా మేము ఉత్తీర్ణత సాధించినట్లు. అలాగే కళ కోసం జీవించడంలో ఉండే సంతృప్తి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. నా యూట్యూబ్ చానెల్ ‘తిల్లానా’ కోసం పాటలు పాడి రికార్డ్ చేస్తున్నాను. భగవంతుడు ఒక నైపుణ్యాన్ని ఇస్తాడు, దానిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది. – తాడేపల్లి సుబ్బలక్ష్మి, గాయని, వయోలిన్ విద్వాంసురాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
‘‘ఆయన్ని నమ్మకద్రోహి, అవకాశవాది అనడం మేలు’’
ఈనాడు పత్రికాధిపతి రామోజీరావును కీర్తిస్తూ చాలామంది చాలా మాటలు అంటూంటారు. మీడియా మొఘల్ వంటి భుజకీర్తులు చాలానే తొడుగుతూంటారు. ఈ జాబితాలోకి నమ్మకద్రోహి, అవకాశవాదీ వంటివి కూడా చేరిస్తే బాగుంటుందేమో అంటున్నారు ఆయన తోడల్లుడు... డాల్ఫిన్ అప్పారావు! విజయవాడ బెంజ్ సర్కిల్లోని ఈనాడు కార్యాలయం డాల్ఫిన్ అప్పారావు, ఈయన మేనమామలదే. వ్యాపారం కోసమని 33 ఏళ్లపాటు వాడుకోమని లీజుకిస్తే రామోజీరావు మోసం చేశాడని, గడవు తీరిన తరువాత కూడా రకరకాల కారణాలు, పేచీలతో కోర్టుల చుట్టూ తిప్పుతూ స్థలం ఖాళీ చేయకుండా తనకు ద్రోహం తలపెట్టారని ఆయన ఈమధ్యే ‘సాక్షి’ టీవీతో తన గోడు వెళ్లబోసుకున్నారు. రామోజీరావు నమ్మిన వాళ్లను మోసం చేయడం ఇదే మొదటిసారి కాదులెండి. 1974లో విశాఖపట్నంలో ఈనాడు మొదలైనప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ ఉదంతాలకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని కథనాలు వార్తా పత్రికల్లోనూ అచ్చు అయ్యాయి. అక్కడేం జరిగింది? విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈనాడు తన మొట్టమొదటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం చాలామందికి తెలుసు. అయితే ఆ స్థలం ఎవరిదన్న విషయం తెలిసింది కొద్దిమందికే. ఈశ్వర కుమార్ వర్మ అనే వ్యక్తి ఈ స్థలాన్ని రామోజీరావుకు లీజుకిచ్చారు. దీర్ఘకాలిక లీజు. కచ్చితంగా చెప్పాలంటే 33 ఏళ్లు. హైదరాబాద్‌లోని సోమాజీగూడలో ఉన్న ఈనాడు ప్రధాన కార్యాలయం కూడా ఈ కుటుంబానిదేనని, రెండు చోట్లా లీజు గడువు ముగిసిన తరువాత కూడా స్థలం ఖాళీ చేసి యజమానులకు అప్పగించకుండా రామోజీ తన పేచీకోరు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని డాల్ఫిన్ అప్పారావు సాక్షి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదంత ఒక ఎత్తు అయితే లీజుకు తీసుకున్న స్థలం తన సొంతమైనట్లు రోడ్డు విస్తరణ కోసమని ప్రభుత్వానికి అప్పగించడం.. ప్రతిగా అందే పరిహారాన్ని కూడా తన ఖాతాల్లో, తనవారి ఖాతాల్లో వేయించుకోవడం ఇంకో ఎత్తు. విశాఖపట్నం స్థలం 2.70 ఎకరాల్లో సుమారు 517 చ.మీటర్ల స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి (రోడ్డు విస్తరణ కోసం) అప్పగించినందుకు గాను పరిహారంగా ఇచ్చిన 872 చ.మీటర్ల స్థలాన్ని రామోజీ తన పేరుతో రాయించుకున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. అందుకేనేమో.. డాల్ఫిన్ అప్పారావు కూడా రామోజీని ‘కఠిన దుర్మార్గుడు’ అని అభివర్ణించారు. ఈశ్వర కుమార్ వర్మ కుటుంబానికే చెందిన స్థలంలో హైదరాబాద్‌లోని ఈనాడు కేంద్ర కార్యాలయం నిర్మించారని చెప్పుకున్నాం కదా.. ఈ విషయంలోనూ రామోజీరావు ఆడిన డ్రామా అంత ఇంత కాదని డాల్ఫిన్ అప్పారావు చెబుతారు. లీజు ముగిసిన తరువాత స్థలాన్ని ఖాళీ చేయకపోగా...స్థలాన్ని తనకే అమ్మేయాలని డిమాండ్ చేయడం.. అది కూడా పావల అర్ధకు ఇచ్చేయాలని చెప్పడం రామోజీరావు నైజాన్ని బయటపెడుతుందన్న విమర్శలున్నాయి. ఆఖరుకు సుప్రీంకోర్టు జోక్యం తరువాత గతిలేని పరిస్థితుల్లో హైదరాబాద్ ఈనాడు ప్రధాన కార్యాలయం ఉన్న స్థలాన్ని ఆయన కొనుగోలు చేయాల్సి వచ్చింది! ఏతావాతా.. లీజు పేరుతో స్థలం తీసుకోవడం.. గడువు తీరినా ఖాళీ చేయకపోవడం.. పత్రికను అడ్డుపెట్టుకుని లీజుదారులను బెదిరించడం.. కోర్టుల చుట్టూ తిప్పడం ద్వారా అలసిపోయేలా చేసి రాజీకి ఒప్పించడం! ఇదీ రామోజీ మోడస్ ఆపరాండీ అంటారు డాల్ఫిన్ అప్పారావు. హైదరాబాద్, విజయవాడ స్థల వివాదాలను పరిశీలిస్తే ఇవన్నీ నిజమేనని అంగీకరించక తప్పదు! డాల్ఫిన్ అప్పారావు మాటల్లోనే చెప్పాలంటే న్యాయం జరగడంలో కొంత ఆలస్యమైతే కావచ్చు కానీ.. ఎప్పటికైనా సత్యం, ధర్మం గెలిచి తీరుతాయి! ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే! -
నాన్న ఎక్కుపెట్టిన గన్!
(బోణం గణేష్, సాక్షి ప్రతినిధి) : ఐదు కేజీల తుపాకీని చేత్తో పట్టుకుని.. 20 కేజీల బరువును ఒంటిపై మోస్తూ.. యాభై మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను గురి చూసి కొట్టడమంటే అంత తేలికైన విషయం కాదు. ఆ తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్‌కు ఉన్నంత పవర్ దానిని పట్టుకున్న వ్యక్తికీ ఉండాలి. అత్యంత ఏకాగ్రతతో కఠోర సాధన చేస్తే తప్ప ఇలాంటి అద్భుతాలు సాధ్యం కావు. షూటర్‌గా 15 ఏళ్ల వయసులోనే జాతీయ స్థాయిలో ఒకేసారి ఇరవై ఈవెంట్లలో పాల్గొని వరల్డ్ రికార్డు సృష్టించిన విజయవాడకు చెందిన మద్దినేని ఉమా మహేశ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. ఆయన మాటల్లోనే.. నాన్న ప్రోత్సాహంతో తొలి అడుగు ఆరేడేళ్ల వయసు నుంచే నాన్న రామకృష్ణ ప్రోత్సాహంతో క్రీడలను సీరియస్‌గా తీసుకున్నాను. తొలుత క్రికెట్, కరాటే, బాస్కెట్‌బాల్ నేర్చుకున్నాను. పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని.. విజేతగా కూడా నిలిచాను. మా నాన్న సూచనతో 2017 నుంచి షూటింగ్‌పై దృష్టి సారించాను. మొదట గుంటూరులో శిక్షణ తీసుకున్నాను. 2018లో ఢిల్లీ వెళ్లి దీపక్ దూబియా వద్ద శిక్షణ మొదలుపెట్టాను. అప్పటి నుంచి పలు పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచాను. జూనియర్ వరల్డ్‌కప్‌లో గోల్డ్ మెడల్.. ప్రముఖ షూటర్, ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ పూణేలో నిర్వహించే శిక్షణకు ఎంపికయ్యాను. దేశవ్యాప్తంగా కేవలం ఐదుగురినే ఆయన ఎంపిక చేసుకుంటారు. అప్పటి నుంచి నేహా దూబియా నాకు పర్సనల్ కోచ్‌గా ఉన్నారు. ఆమె శిక్షణలో 2022 షూటింగ్ జూనియర్ వరల్డ్‌కప్‌లో గోల్డ్‌మెడల్ సాధించాను. నాలుగు సార్లు ‘ఖేలో ఇండియా’లో పాల్గొన్నాను. యూనివర్సిటీలు, స్కూల్ నేషనల్స్‌లోనూ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 15 ఏళ్ల వయసులో భోపాల్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 20 ఈవెంట్స్‌లో పాల్గొని వరల్డ్ రికార్డ్ సాధించాను. వరల్డ్ చాంపియన్‌షిప్, ఏసియన్ చాంపియన్íÙప్లోనూ మెడల్స్ వచ్చాయి. షూటింగ్ క్రీడలో ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ఏపీ ఆటగాడిని నేనొక్కడినే. ఇంటి కష్టం కన్నా గన్ బరువే ఎక్కువని తెలుసు ఈ ఆట కోసం 25 కేజీల బరువును దాదాపు గంటన్నర పాటు మోయాలి. గన్ బరువే 5 కేజీలుంటుంది. నా ప్రతిభ వెనుక అమ్మ మంజుల, నాన్న రామకృష్ణ కష్టం చాలా ఉంది. చిన్న వ్యాపారం చేసుకునే మా నాన్నే దగ్గరుండి నాకు కావాల్సినవన్నీ చూసుకునేవారు. షూటింగ్‌కు ఏకాగ్రత చాలా ముఖ్యం. అది దెబ్బతినకూడదని ఇంటి ఇబ్బందులు, ఆరి్థక పరిస్థితి గురించి నాకు చెప్పేవారు కాదు. ఆటల్లో పడి చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చేస్తున్నాను. జర్మనీలో బొండెస్లేగా లీగ్‌లు జరుగుతుంటాయి. ఒక్కో క్లబ్ ఒక విదేశీ ఆటగాడిని ఎంపిక చేసుకుంటాయి. ఈ ఏడాది భారత్ నుంచి నన్ను ఒక్కడినే తీసుకున్నారు. ఐదు ఒలింపిక్స్ ఆడిన హంగేరీ కోచ్ పీటర్ సీడీ నన్ను అక్కడికి తీసుకువెళ్లారు. తమ దేశం తరఫున ఆడాలని జర్మనీ క్లబ్‌లు అడిగాయి. కానీ మన దేశం తరఫున ఆడి గెలవడమే నాకు ఇష్టం. ‘ఆడుదాం ఆంధ్రా’ గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా బాగుంది. ఈ కార్యక్రమం ద్వారా విజేతలకు భారీగా బహుమతులను అందించడం, క్రీడా సామగ్రిని సమకూర్చడం గొప్ప విషయం. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమలోని క్రీడా ప్రతిభను చాటి చెప్పాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడాకారుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆర్థిక చేయూతనిస్తే.. అద్భుత విజయాలు సాధిస్తా 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ శిక్షణకు రోజుకు కనీసం రూ.10 వేలు ఖర్చుయ్యేది. నాకు గన్ కూడా లేదు. కొత్తది కొనాలంటే రూ.15 లక్షల వరకు అవసరం. దీంతో పోటీలకు పది రోజుల ముందే వెళ్లి గన్ను అద్దెకు తీసుకుని ప్రాక్టీస్ చేసేవాడిని. ఓల్డర్ కంపెనీ గన్స్నే షూటర్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఆ కంపెనీ సీఈవో జర్మనీలో తమ సంస్థను సందర్శించేందుకు నన్ను ఆహ్వానించారు. ఆ కంపెనీ వాళ్లు నా కోసం ప్రత్యేకంగా గన్ను సిద్ధం చేశారు. కానీ దాన్ని కొనగలిగేంత ఆరి్థక స్థోమత మాకు లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరి్థకంగా చేయూతనిస్తే మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తాను. భారత్ తరపున ఒలింపిక్స్ ఆడి గెలవాలనేది నా లక్ష్యం. -
జేఎన్–1 అంత ప్రమాదకరం కాదు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా కొత్త వేరియంట్ జేఎన్–1 అంత ప్రమాదకరమేమీ కాదని.. దాని గురించి అతిగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. వారం, పది రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఎలా ఉంటుందనే దానిని బట్టి దీని తీవ్రత, చూపబోయే ప్రభావంపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియెంటే కాబట్టి ఎక్కువ మందికి సోకవచ్చన్నారు. అంతేతప్ప తీవ్ర లక్షణాలు ఉండటంగానీ, ప్రమాదకరంగా మారే అవకాశంగానీ తక్కువని స్పష్టం చేశారు. కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగు తున్న నేపథ్యంలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివిధ అంశాలపై స్పష్టతనిచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘నా అంచనా ప్రకారం.. ఇప్పటికే నమోదైన కేసుల పరిస్థితిని చూస్తే ఈ వైరస్ అంతగా ప్రమాద కారి కాదు. సాధారణ జలుబు, దగ్గు, సైనసైటిస్, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలు ఉంటాయి. అందరూ అన్నిచోట్లా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కేన్సర్, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్లినప్పుడు మాస్క్ ధరిస్తే చాలు. డబ్ల్యూహెచ్‌వో పరిశీలిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జేఎన్–1ను వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా ప్రకటించింది. అంటే వచ్చే 10– 15 రోజులు ఇది ఎంతగా విస్తరిస్తుంది, ఎంత వేగంగా వ్యాపిస్తుంది (ఇన్ఫెక్టి విటీ), సీరియస్ ఇన్ఫెక్షన్గా మారుతుందా (విరులెన్స్) అన్న అంశాలను పరిశీలిస్తారు. ఇప్పటివరకు ఉన్న డేటా మేరకు ఈ వైరస్‌కు విరులెన్స్ అంత ఎక్కువగా లేదు. వ్యాపించే సామర్థ్యం ఒమిక్రాన్ అంతలేదు.. కానీ డెల్టా కంటే ఎక్కువగా ఉంది. ఈ వేరియంట్‌కు సంబంధించి కేరళలో ఎక్కువగా, ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదవుతున్నాయి. సింగపూర్‌లో ఈ కేసులు అధికంగా వచ్చాయి. యూఎస్, యూరప్‌లోనూ నమో దవుతున్నాయి. రోగ నిరోధక శక్తి ముఖ్యం ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీముఖ్యం. ప్రస్తుతం మనలో ఎంత ఇమ్యూనిటీ ఉందనే దానిపై ఏఐజీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నాం. వారం, పదిరోజుల్లో ఇది పూర్తవుతుంది. బూస్టర్ డోస్ వేసుకోవాలా వద్దా అన్న దానిపై స్పష్టత వస్తుంది. ఇమ్యూనిటీ ఉన్నవారు బూస్టర్ డోస్‌ను వేసుకోవాల్సిన అవసరం లేదు. మన దేశ ప్రజల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది ‘‘మళ్లీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాలా వద్దా అని చాలా మంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అమెరికాలో అయితే 65ఏళ్లు దాటినవారు బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచిస్తున్నారు . అదే భారత్‌లో చాలా వరకు వ్యాక్సిన్ వేసుకోవడం, కరోనా సోకి ఉండటంతో ఏర్పడిన ‘హైబ్రిడ్ ఇమ్యూనిటీ’ ఉంది. ఒకవేళ వైరస్ సోకినా అది తీవ్ర వ్యాధిగా మారకుండా ఈ ఇమ్యూనిటీ ఉపయోగపడుతుంది. ఒమిక్రాన్ స్పైక్ ప్రొటీన్లలో మార్పులతో జేఎన్–1 వేరియంట్ ఏర్పడినందున గతంలో తీసుకున్న వ్యాక్సినేషన్, కోవిడ్ సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీని ఇది తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనితో జ్వరం, గొంతునొప్పి, గొంతులో గరగర, దగ్గు, తలనొప్పి వంటి స్వల్ప అస్వస్థతే కలుగుతోంది. వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. విదేశీ పర్యటనలు, దూరప్రాంతాలకు వెళ్లి వచ్చినవారికి లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకోవాలి. ’’ – డాక్టర్ గోపీచంద్ ఖిల్నానీ, డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ మెంబర్ -
ప్రజాస్వామ్య పద్ధతిలో సభ నిర్వహిస్తా
సాక్షి, హైదరాబాద్: పాలక, ప్రతిపక్ష సభ్యులను సమన్వయం చేసుకుంటూ శాసనసభ ఔ న్నత్యం ఇనుమడింపజేసేలా ప్రజాస్వామ్య ప ద్ధతిలో సభా కార్యక్రమాలు నిర్వహిస్తానని వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఎన్నికకానున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. స్పీకర్ పదవికి కాంగ్రెస్ తనను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని... దళితుడికి ఇంత పెద్ద హోదా కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్నారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... మంత్రి పదవి వస్తుందని అనుకున్నా... నాతో పాటు నియోజకవర్గ, జిల్లా ప్రజలు కూడా ఈసారి నాకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నాం. కానీ పార్టీ అధిష్టానం ఇంకా గొప్పగా ఆలోచించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద బాధ్యత అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తను నేను. పార్టీ ఏ పదవి ఇచ్చినా కాదనకుండా చేసుకుంటూపోతా. కాంగ్రెస్ పేరుకు దెబ్బ తగలకుండా ఇచ్చిన పదవికి గౌరవం తెచ్చేలా పనిచేస్తా. రెండు పర్యాయాలుస్పీకర్ నామమాత్ర పాత్రనే... గత రెండు పర్యాయాలు శాసనసభ కార్యక్రమాల నిర్వహణను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. నియంతృత్వ ధోరణిలో ప్రతిపక్షాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా సభానాయకుడే సభలో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితిని గమనించాం. స్పీకర్ పాత్ర నామమాత్రమైంది. నేను స్పీకర్‌గా ఎన్నికైతే ప్రజాస్వామ్య పద్ధతిలో, సభ గౌరవం తగ్గకుండా, స్పీకర్ విలువ పెంచేలా సభను నడిపిస్తా. మహామహులు సభలో ఉన్నా... సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ఇతర సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. పాలక, ప్రతిపక్షాల సభ్యులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతా. ఇప్పటి వరకు పాలక పక్షం చెప్పిందే వేదంగా సాగేది. సభలో ప్రతిపక్షాలకు కూడా తగిన సమయం ఇస్తా. అందరినీ కలుపుకొని ముందుకు వెళతా. మొదటి దళిత స్పీకర్‌ను నేనే అవుతా... నేను ఎన్నికైతే తెలంగాణ శాసనసభలో తొలి దళిత స్పీకర్‌గా నాదే రికార్డు అవుతుంది. ఉమ్మడి ఏపీలో ప్రతిభాభారతి తొలి దళిత స్పీకర్‌గా ఉండేవారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇంత పెద్ద పదవి దక్కింది కూడా నాకే. -
బార్ కౌన్సిల్‌కు సాయం అందించిన ఒకే ఒక్క సీఎం వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్: అనంత నరసింహారెడ్డి.. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. వరుసగా మూడు సార్లు రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఒక న్యాయవాది 17 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగి సేవలందించడం దేశంలోనే రికార్డు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర బార్ కౌన్సిల్ తొలి చైర్మన్‌గానూ ఆయనే ఎన్నికయ్యారు. ఐదుసార్లు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిసిప్లినరీ కమిటీ కో–ఆప్షన్ సభ్యుడిగానూ పనిచేశారు. బార్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు బార్ కౌన్సిల్‌కు నేరుగా సాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొంటున్న నరసింహారెడ్డి వివరాలు ఆయన మాటల్లోనే.. సేవా భావంతోనే బార్ కౌన్సిల్‌కు... జూనియర్ న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో సివిల్ కోర్టులో ఎక్కువగా కేసులు వాదించే వాడిని. అప్పటి నుంచే న్యాయవాదుల సంక్షేమానికి ఏదో చేయాలన్న తపన ఉండేది. దీంతో నన్ను బార్ కౌన్సిల్‌కు పోటీ చేయమని చాలా మంది న్యాయవాదులు ప్రోత్సహించారు. నాటి బార్ కౌన్సిల్ చైర్మన్ ఎల్లారెడ్డి కూడా ఆహ్వానించారు. అలా 1995లో తొలిసారి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యా. సమరసింహారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో మాట్లాడి న్యాయవాదులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. సహచరులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి(మాజీ ఏజీ), జస్టిస్ ఏ.గోపాల్‌రెడ్డి (జడ్జి)తో కలసి పలు కార్యక్రమాలు చేపట్టాం. మహానేత వైఎస్సార్‌తో అనుబంధం... 2006లో తొలిసారి బార్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టా. కొద్ది రోజుల తరువాత అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్‌ను కలిసే అవకాశం వచ్చింది. న్యాయవాదుల సంక్షేమం కోసం ఏం చేద్దాం అని ఆయన అడగడంతో కొన్ని వివరాలను చెప్పా. ఒక్కొక్కటిగా చేస్తూ పోదాం అంటూ న్యాయ శాఖ మంత్రిని పిలిచి వెంటనే రూ.1.65 కోట్లను మంజూరు చేశారు. అప్పటికే ఇతర రంగాలు సాంకేతిక వైపు పరుగులు ప్రారంభించడంతో నాటి సీజే జస్టిస్ మదన్‌లోకూర్ సూచన మేరకు బార్ అసోసియేషన్లలో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ ఏర్పాటు చేశాం. వాటి వినియోగంపై న్యాయవాదులకు శిక్షణనిచ్చాం. స్టైపెండ్ ఇవ్వాలని కోరుతున్నాం.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయవాదులు సంక్షేమం కోసం బార్ కౌన్సిల్‌కు రూ.100 కోట్లు కేటాయించి.. రూ.25 కోట్లు మంజూరు చేశారు. అక్కడ కొత్త న్యాయవాదులకు ఐదేళ్ల వరకు స్టైపెండ్ ఇస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ చేపట్టాలని కోరుతున్నా.. న్యాయవాదులు వినియోగించే స్టాంప్‌ల ద్వారా న్యాయవాదుల సంక్షేమ నిధికి కొంత మేర నిధులు చేకూరుతాయి. ప్రభుత్వ అధికారులు కూడా విధిగా ఈ స్టాంప్‌లు వినియోగించాలని చట్టం చెబుతున్నా వారు పాటించడంలేదు. అడ్వొకేట్ లా అకాడమీ ఏర్పాటు నా కల.. రాష్ట్రంలో లా అకాడమీ ఏర్పాటు చేయలన్నది నా కల. యువ న్యాయవాదులకు శిక్షణ ఇవ్వ డం, సీనియర్ న్యాయవాదులతో మార్గనిర్దేశం చేసే కార్యక్రమాలు చేయాలని భావించాం. కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా దీనిపై అడుగు ముందుకు పడటం లేదు. మీడియేషన్ చట్టబద్ధం కానుంది.. కోర్టుల్లో విపరీతంగా పెరిగిపోతున్న కేసులకు మీడియేషనే పరిష్కారం. న్యాయవాదులకు మీడియేషన్‌పై అవగాహన కల్పించాలి. ముందుగా ఏ కేసునైనా మీడియేషన్‌కు పంపిన తర్వాతే విచారణ చేపట్టాలి. ఆ దిశగా కేంద్ర చట్టం చేస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే అధికారికంగా మీడియేటర్లను నియమిస్తారు. వారిచ్చే ఉత్తర్వులు చట్టబద్ధం అవుతాయి. అలాగే, పాత కాలపు పద్ధతులకు స్వస్తి పలికే చర్యలు తీసుకున్నాం. కోర్టుల్లో యువరానర్, మైలార్డ్ పదాలు అవసరం లేదని సర్, మేడమ్ అంటే చాలని నిర్ణయం తీసుకున్నాం. న్యాయవాదులకు ఉజ్వల భవిష్యత్ ఉంది. -
ప్రజాగొంతుకనై ఉంటా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకం అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఐపీఎస్ అధికారిగా ఏడేళ్ల సర్విస్‌ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల గొంతుకగా మారిన తాను ఎన్నికల అనంతరం కూడా అదేవిధంగా ఉంటానని అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆయ న మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలోని 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు గట్టిపోటీ ఇస్తుందన్నారు. చాలా నియోజకవర్గాల్లో అనూహ్య విజయాలు సాధించబోతున్నామని చెప్పారు. అధికార బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీల ధనబలాన్ని తట్టుకొని బీఎస్పీ అభ్యర్థులు ధీటైన పోటీ ఇస్తున్నారని చెప్పారు. సిర్పూరులో తనతోపాటు చాలా జిల్లాల్లో బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన నిలిచిన బీఎస్పీకి రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు అండగా నిలిచారన్నారు. ఆదివాసీల పోడుభూముల కోసం పోరుబాట పట్టిన విషయాన్ని గుర్తుచేశారు. దళిత, గిరిజన, బీసీ వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల కోసం రెండేళ్లుగా రాజకీయ పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు అత్యధిక స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించి ఆదరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. గెలిచిన తరువాత ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేందుకు పోరాడతానని చెప్పారు. -
మూడోసారీ విజయం నాదే.. : వేముల ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, నిజామాబాద్: 'రెండుమార్లు బాల్కొండ నియోజకవర్గం ప్రజలు చూపిన ఆదరణతో, సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో రూ.వేల కోట్ల నిధులు బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధికి తెచ్చాను. ఆ అభివృద్ధి పనులే నా హ్యాట్రిక్ విజయానికి బాటలు వేస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో మూడోసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయనతో "సాక్షి" ఇంటర్వ్యూ.' – మోర్తాడ్(బాల్కొండ) ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? ► నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చేయాల్సిన పనులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేశాం. 2018 ముందస్తు ఎన్నికల్లో హామీ ఇవ్వని పనులు కూడా సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో పూర్తి చేశాం. ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా చేశాం. వారు ఆశించిన దానికంటే మరెన్నో పనులు పూర్తి చేసి సమస్యలే లేని నియోజకవర్గంగా బాల్కొండను తీర్చిదిద్దాం. బాల్కొండ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి..? ► తెలంగాణ ఆవిర్భావానికి ముందు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ విధమైన మార్పు వచ్చిందో ప్రజలకు స్పష్టంగా తెలుసు. నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు లేకుండా పెద్దవాగు, కప్పలవాగులో చెక్‌డ్యాంలను నిర్మించాం. తద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెంది సాగునీటి కష్టాలు లేకుండా పోయాయి. చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పూర్తయ్యాయి. చెరువులు, కుంటల్లో పూడిక తీయించి వర్షం నీరు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు సాగునీటి కష్టాలు, విద్యుత్ కష్టాలు అంటూ ఏమి లేకుండా చేశాం. వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువగా ఉన్న చోట గ్రామానికి ఒక విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశాం. మళ్లీ గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు..? ► నియోజకవర్గం ప్రజలకు వారు ఆశించినదానికంటే ఎక్కువ చేశాం. మూడోసారి ఎన్నికై తే వారి జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందేలా చేస్తాం. ఎవరికై నా పింఛన్లు రాకపోయినా, ఇంకా ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోయినా వాటిని పక్కాగా ఇప్పించి ప్రజలకు సమస్యలు లేకుండా చూస్తాం. మిషన్ భగీరథ వైస్ చైర్మన్, మంత్రిగా ఎలాంటి అనుభూతి పొందారు? ► బాల్కొండ ప్రజలకు కృతజ్ఞతలు. వారు ఆదరించడం వల్ల అసెంబ్లీలో అడుగుపెట్టాను. నా పనిత నం మెచ్చి సీఎం కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపికై న నాకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా పెద్ద బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీరందించే పథకం బాధ్యతలను నెరవేర్చినందుకు ఎంతో తృప్తిగా ఉంది. రెండోసారి ఎమ్మెల్యేగా ఎంపిక కాగానే రోడ్లు, భవనాలు, అసెంబ్లీ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖలతో మంత్రిని చేశారు. రెండు పర్యాయాలు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎంకు, అందుకు ఆదరించిన బాల్కొండ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ► నాకు గెలుపుపై పూర్తి ధీమా ఉంది. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో జరుగని అభివృద్ధి బాల్కొండ నియోజకవర్గంలో చేసి చూపించాం. గెలుపు విషయంలో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మెజార్టీ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో 32 వేల మెజార్టీ లభించింది. ఈసారి చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలతో మరింత మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉంది. బాల్కొండ ప్రజల ఆశీర్వాదంతో తప్పక మూడోసారి విజయం మాదే. ఇవి కూడా చదవండి: 'ఆకాంక్షలు నెరవేరుస్తాం!' : రాహుల్ గాంధీ -
అనుమానం లేదు అధికారంలోకి వస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ ఆ పార్టీ నేతలు ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని గట్టిగానే సౌండ్ వినిపిస్తున్నారు. నాటి దుబ్బాక ఎన్నికల్లో గెలుపు నుంచి మొన్నటి జీహెచ్‌ఎచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పొందిన సీట్లే ఇందుకు నిదర్శమని కాషాయనేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సాక్షితో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎలా, ఎందుకు అధికారంలోకి వస్తుందో చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు మద్దతిస్తారో క్లారిటీ ఇచ్చారు. జోడు పదవులకు న్యాయం జరుగుతుందా? నేను పదవిలోకి వచ్చి రెండు నెలలే అవుతోంది. ఈ సమయంలో పార్టీ కోసం, ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో నా అనుభవం పెట్టి పనిచేస్తున్నాను. బీజేపీ టెంపో డౌన్ అయ్యిందా? ఒక పథకం ప్రకారం కొన్ని శక్తులు ఇలాంటివి ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అలాంటి పరిస్థితి లేదు. సుమారు 100 స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు దీటుగానే బీజేపీ ఉంది. మాకొచ్చే ఫీడ్ బ్యాక్‌లో మేం బలంగా ఉన్నాం. కిషన్‌రెడ్డి వల్ల బీజేపీకి లాభమా?.. బీఆర్ఎస్కి లాభమా? రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో కొంత అసత్య ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది బీజేపీనే. నేను అధ్యక్షుడైన రెండు నెలల్లో పలుమార్లు కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాను. రెండుసార్లు నన్ను అరెస్ట్ కూడా చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై ఏనాడూ పోరాటం చేయలేదు. జైళ్లకు వెళ్లింది, కేసులు పెట్టించుకున్నది బీజేపీ నేతలే. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసిన విషయం ప్రజలకు తెలుసు. బీజేపీ ఎప్పటికీ కుటుంబ పార్టీలో కలవదు. బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటే. కానీ, మజ్లిస్ పార్టీతో బీజేపీ ఎన్నటికీ కలిసే ప్రసక్తే లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. మజ్లిస్‌తో బీజేపీ కలవదు అన్నది కూడా అంతే నిజం. తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్ ఉందా? కరా్టటక ఫలితాల తర్వాత తెలంగాణకు భారీ మొత్తంలో డబ్బు చేరుతోంది. అక్కడ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు. రూ.వేల కోట్లను మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియాకు వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు. అంబర్‌పేట నుంచి ఎందుకు పోటీలో లేరు? నేను పోటీ చేయాలనుకున్నాను. నా వ్యక్తిగత నిర్ణయం వేరు.. పార్టీ హైకమాండ్ నిర్ణయం వేరు. నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. బీసీని సీఎంను చేయాలని మా పార్టీ నిర్ణయించింది. ఈ సమయంలో నేను పోటీ చేస్లి గెలిచి.. ప్రజల్లో సీఎం అభ్యర్థిపై సందిగ్ధత ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను పోటీలో లేను. 4 శాతం రిజర్వేషన్ల తొలగింపు కరెక్టేనా? ఇది రాజకీయపరమైన అంశం. రాష్ట్ర హైకోర్టు నాలుగు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చింది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం. ఇప్పటికే ముస్లింలలో కొందరికి బీసీ–డీలో రిజర్వేషన్ దొరుకుతోంది. మేము ఈబీసీలో ఏదైతే 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామో అందులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. అందులో అందరికీ రిజర్వేషన్ ఉంటుంది. మతపరమైన రిజర్వేషన్లను బాబా సాహెబ్ అంబేడ్కర్ కూడా వ్యతిరేకించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరు.. మీ మద్దతు ఎవరికి ? నా మద్దతు పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది. పార్టీ అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకుంటాం.. ఢిల్లీలో పార్లమెంటరీ బోర్డు ఉంటుంది.. వాళ్ల అభిప్రాయాలు తీసుకుని, విశ్లేషించి, మిగతా ఎమ్మెల్యేల అందరితో మాట్లాడిన తర్వాతే సీఎంను ప్రకటిస్తాం. యూపీ ఎన్నికలప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్‌ను తర్వాతే ఎంపిక చేశాం. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రతీ విషయంలోనూ ముద్రవేశారు. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? అధికారంలోకి రావడానికి కావలసినన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది రాజకీయాల్లో అటు ఇటు అయితే ? ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఒకవేళ బీజేపీకి సరిపడా సీట్లు రాకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటుందా? బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాకు 100 సీట్లు వస్తాయని బీఆర్ఎస్ చెప్పింది. బీజేపీకి కేవలం రెండు మూడు సీట్లు వస్తాయని చెప్పింది. కానీ ఫలితాలు వెల్లడైన తర్వాత పరిస్థితి తారుమారైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందని భావిస్తున్నాం. దేని ఆధారంగా చెబుతున్నారు? తెలంగాణలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతలో బీజేపీ పట్ల అభిమానం ఉంది. ఒక ఇంట్లో తండ్రి బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చేమో కానీ వాళ్ల పిల్లలు బీజేపీ పట్ల.. నరేంద్ర మోదీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతోమంది యువత అభిమానులుగా ఉన్నారు. ఇదే మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా. బీఆర్ఎస్ లౌకిక రాజ్యం, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, మీరేమో రామరాజ్యం అంటున్నారు? హిందువుల గురించి మాట్లాడితే మతోన్మాద పార్టీనా? ఈ దేశ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను.. దేశంలో హిందూయిజం ఉన్నప్పుడే సెక్యులర్‌గా ఉంటుంది. హిందువులు మైనార్టీలోకి వెళ్లినప్పుడు దేశంలో సెక్యులరిజం ఉండదు. నేను రాసిస్తాను. మేము అన్ని మతాల గురించి మాట్లాడతాం. క్రిస్టియన్ల గురించి, ముస్లింల గురించి మాట్లాడతాం. మేం ముస్లింలను వ్యతిరేకించం, కేవలం మజ్లిస్ పార్టీ విధానాలతో వ్యతిరేకిస్తాం. హిందువుల గురించి కచ్చితంగా మాట్లాడతాం. హిందువులు దేశ పౌరులు కారా? వాళ్లకి ఇక్కడ హక్కులు లేవా?. వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తే అది మతోన్మాదం ఎలా అవుతుంది? నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను హిందూయిజం ఉన్నంతకాలమే దేశంలో సెక్యులరిజం ఉంటుంది. -
అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్రాన్ని దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చాలనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిన గడీలు గత తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్నిర్మాణమయ్యాయని ఆయన విమర్శించారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. అన్ని వర్గాలను కలుపుకుంటాం... పేదల రాజ్యాధికారంతోనే బాంచన్ సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీ ణ్‌కుమార్ స్పష్టం చేశా రు. స్పష్టమైన ప్రణాళిక తో అన్ని వర్గాలను కలుపుకొని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్‌లో గతంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన మధు కోడా ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. మాయావతి వల్లే యూపీలో బహుజనులకు రాజ్యాధికారం... దళితులు కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులైతే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సీఎం అయిన తర్వాతే బహుజనులకు రాజ్యాధికారం వచ్చిందన్నారు. మాయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, ఆమె ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల రెండు, మూడు తరాల బహుజనులు బాగుపడ్డారని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 10 లక్షల ఉద్యోగాలిస్తాం.. ముఖ్యమంత్రిని కలిసి తమ ఆలోచనలు పంచుకొనే అవకాశం రాష్ట్రంలో ఏ అధికారికీ లేదని ప్రవీణ్‌కుమార్ చెప్పా రు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు సైతం కానిస్టే బుల్ ఆపితే ప్రగతి భవన్ గేటు వద్ద నుంచే వెనక్కి వెళ్లిన సందర్భాలున్నాని పేర్కొన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే తాను దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 10 లక్షల ఉద్యోగా ల హామీ మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా మని ఆయన వివరణ ఇచ్చారు. ఇవేగాక మరిన్ని విషయా లను ప్రవీణ్‌కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు. -
బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే పోటీ
‘‘అధికార బీఆర్ఎస్పై ప్రజల ఆగ్రహ జ్వాలల అగ్నిపర్వతం నవంబర్ 30న బద్దలవుతుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చాలాచోట్ల డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. అసలు కొన్ని నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ అసలు పోటీలోనే లేదు. తెలంగాణలోని యువత మొత్తం భారతీయ జనతాపార్టీ వైపే ఉంది.’’ అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రస్తుత ఎన్నికల రాజకీయ పరిణామాలపై అంచనా వేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా విధ్వంసానికి గురికాగా.. ఒకవేళ కాంగ్రెస్ వస్తే రాజకీయ అస్థిరత ఏర్పడి ఉద్యోగులకు జీతాలివ్వలేక తిరుగుబాటు చేసే పరిస్థితులు వస్తాయి. అందుకే బీసీ సీఎం నినాదంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నాం.’ అని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో కిషన్‌రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు.. అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలు మేమంటే మేము అధికారంలోకి వస్తామంటున్నాయి కదా ? ఎన్నికల్లో మాకు, బీఆర్ఎస్కే ప్రధాన పోటీ. కొన్నిచోట్ల మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ముక్కోణపు పోటీ ఉంది. అనేక నియోజకవర్గాల్లో అసలు కాంగ్రెస్ పోటీలోనే లేదు. గ్యారంటీల పేరుతో హైప్ సృష్టించే ప్రయత్నంతోపాటు బీజేపీపై బురదచల్లి తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక అధికార బీఆర్ఎస్పై ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు అగ్నిపర్వతం బద్ధలవుతుందో తెలియదన్నట్టుగా పరిస్థితి ఉంది. వారు ఎంత ప్రచారం చేస్తే ఏమి లాభం, ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉంది కాబట్టి, నేతల బలాన్ని చూసి ఇప్పుడు బయటకు చెప్పకపోవచ్చు. కానీ బీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే హ్యాట్రిక్ కొడతామంటూ బీఆర్ఎస్ బింకాలు పోతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ఫ్రంట్ ఏర్పడితే అక్కడకు వెళ్లాలని కేసీఆర్ కలలు కంటున్నారు. ఆయన కుమారుడు కేటీఆర్ అప్పుడే సీఎం అయిపోయినట్టుగా ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు. మంత్రులను నియమించుకుంటున్నట్టు కేటీఆర్ వ్యవహరిస్తున్నాడు. కేవలం భ్రమల్లో బీఆర్ఎస్ నేతలు బతుకుతున్నారు. ఇక మా పార్టీకి ఊహించని విధంగా ప్రజల్లో మద్దతు పెరుగుతోంది. ఇది మామూలు పరిస్థితుల్లో రాదు. మాది యూత్‌ఫుల్ పార్టీ. ఎక్కడి చూసిన యువతే పార్టీని నడిపిస్తోంది. ప్రచారాన్ని ఎప్పుడు ముమ్మరం చేస్తారు ? నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక నాలుగైదు రోజుల్లో అన్ని పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చాక.. మొత్తంగా దీపావళి తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయబోతున్నాం. బీజేపీకి పోలింగ్‌బూత్ స్థాయి కమిటీలు, కార్యకర్తలు ఉన్నారు. సంస్థాగత నిర్మాణం ఉంది. ఎవరు అభ్యర్థులు ఐనా ఒరిజినల్‌గా ఉన్న ఆర్గనైజేషన్ నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. అభ్యర్థుల ఖరారులో ఆలస్యం వల్ల ప్రచారానికి ఇబ్బంది కాదా ? బీజేపీలో టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థుల ఖరారులో కొంత ఒత్తిడి ఏర్పడింది. అయితే ఆయా స్థానాలకు ఖరారు చేసిన వారు ఇప్పటికే మూడు, నాలుగేళ్లుగా పనిచేస్తున్న వాళ్లే. ప్రజలకు బాగా తెలిసినవారే. అందువల్ల పెద్ద ఇబ్బందేమి ఉండదు. రాబోయే ఇరవై రోజుల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. ఇలా హేమాహేమీల ప్రచారంతో హోరెత్తిస్తాం. పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తాం. పాత వారికి కాకుండా కొత్త వారికి ఎక్కువ సీట్లు ఇచ్చినట్టున్నారు ? మాది పెరుగుతున్న పార్టీ. బలపడుతున్న పార్టీ. అందువల్ల మిక్స్‌డ్‌గా ఆలోచించాలి. పాత–కొత్త కలయికగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్‌తో ప్రజల మద్దతు పొందాల్సి ఉంటుంది. పాత వారికే ఇస్తామని మడికట్టుకు ఉండలేం. పూర్తిగా కొత్తవారికీ ఇవ్వలేం. ఆ దిశలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేశాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ప్రయోగం చేసి మంచి ఫలితాలు సాధించాం. అదే ఎక్స్పర్మెంట్తో ఇప్పుడూ మంచి ఫలితాలు సాధిస్తాం. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ వస్తే పెనం నుంచి పొయ్యిలో పడుతుందని మీరు పదే పదే అంటున్నారు ? ఎందువల్ల ? కాంగ్రెస్ చరిత్ర ఏమిటి? పుట్టుక ఏమిటి? అవినీతి చరిత్ర ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది ? అని వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక అక్కడి దుస్థితి ఏమిటి? తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటకలో ఎలక్షన్ ట్యాక్స్ వేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అవినీతి పాలన గురించి ప్రజలకు వివరిస్తూనే...కాంగ్రెస్ తనకు తాను అధికారంలోకి వస్తామన్నట్టుగా అబద్ధపు ప్రచారంతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. దీంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడకూడదనే హెచ్చరికతో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ పార్టీల చరిత్రను వివరించి, అవి ఏరకంగానూ తెలంగాణను ఆదుకోలేవనే విషయాన్ని ఉదా«హరణలతో చెప్పి ప్రజలను చైతన్యపరుస్తున్నాం. వాటిని నమ్మి మరోసారి మోసపోవద్దని చెబుతున్నాం. ఇక్కడా యూపీ తరహా పాలన అంటున్నారు ? కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎంఐఎం వంతపాడుతూ వస్తోంది. పాతబస్తీలో మజ్లీస్ దౌర్జన్యమే నడుస్తోంది. కరెంట్ బిల్లు, ఇంటి పన్నులు వసూలు చేయలేకపోతున్నారు. 90 శాతం ఇళ్లు మున్సిపల్ అనుమతులు లేకుండానే కడతారు. అందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అండగా నిలవడమే కారణం. యూపీలో యోగి ఆదిత్యనాధ్ పాలనలో బుల్డోజర్ ప్రభుత్వంతో ఆ రాష్ల్ర ముఖచిత్రమే మారిపోయింది. తెలంగాణలోనూ అలాంటి బుల్డోజర్ ప్రభుత్వం తెస్తాం. మాఫియాపై, అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతాం. మజ్లిస్ పార్టీ కాదు వారి జేజమ్మలు వచ్చినా ఏమీ చేయలేరు. అక్రమాలు, దాడులకు, నేరాలకు పాల్పడే మజ్లిస్ నేతలు ఉండాల్సింది పాతబస్తీలో కాదు చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లల్లో.. .. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ పక్కన కూర్చుని చర్చలు జరుపుతున్నారు.