Director Om Raut About Prabhas Adipurush Movie, Full Details Here - Sakshi
Sakshi News home page

Prabhas Adipurush Movie: ప్రభాస్‌ ‘నో’ చెప్పి ఉంటే ఆదిపురుష్‌ ఉండేది కాదు

Published Sun, Apr 10 2022 4:39 AM | Last Updated on Sun, Apr 10 2022 9:15 AM

Director Om Raut About Prabhas Adipurush Movie  - Sakshi

‘‘మీ మనసు స్వచ్ఛంగా ఉంటే మీరు ప్రతి విషయాన్ని స్వచ్ఛంగా చూస్తారు. నా మనసు, ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు తప్పులు చేస్తామనే భయం ఉండదు. అందుకే రామాయణం లాంటి చరిత్రను భయం లేకుండా ‘ఆదిపురుష్‌’గా తెరకెక్కించాను’’ అన్నారు దర్శకుడు ఓం రౌత్‌. రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్, ఇతర పాత్రల్లో పేరున్న నటీనటులతో ఓం రౌత్‌ తెరకెక్కించిన భారీ పాన్‌ ఇండియన్‌ చిత్రం ‘ఆదిపురుష్‌’. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘రాముడి జీవితం నాకు ఆదర్శం’’ అన్నారు ఓం రౌత్‌. శ్రీరామ నవమి సందర్భంగా ‘సాక్షి’తో  ఓం రౌత్‌ ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు ఈ విధంగా...

► రాముడి గురించి రెండున్నర గంటల్లో చెప్పడం సాధ్యమా?
ఓం రౌత్‌: కచ్చితంగా సాధ్యం కాదు. జీవితంలో ఎలా నడుచుకోవాలనేది చెప్పడానికి రాముడు మంచి ఉదాహరణ. ఆయన్ను ‘మర్యాద పురుషోత్తమ్‌’ అంటారు. మంచి లక్షణాలున్న రఘురాముడి గురించి చెప్పడానికి ఒక్క సినిమా సరిపోదు. అందుకే రాముడి జీవితంలోని ఒక అధ్యాయాన్ని తీసుకుని, ‘ఆదిపురుష్‌’ చేశాను.

► మీరు ‘ఆదిపురుష్‌’ తీయడానికి 30 ఏళ్ల క్రితం రామానంద్‌ తీసిన ‘రామాయణ్‌’ సీరియల్‌ ఆదర్శం అనుకోవచ్చా?
రాముడిని అర్థం చేసుకునే ప్రాసెస్‌ నా చిన్నప్పుడే మొదలైంది. నా గ్రాండ్‌ పేరెంట్స్‌ ద్వారా రామాయణం విన్నాను. అలాగే రామానంద్‌ సాగర్‌ ‘రామాయణ్‌’ కొన్ని విశేషాలు తెలియజేసింది. రాముడి గురించి మాట్లాడిన ప్రతిసారీ నాకు కొత్త విషయం తెలుస్తుంది. రామాయణం ఆధారంగా జపనీస్‌ డైరెక్టర్‌ యుగో సాకో తీసిన జపనీస్‌ సినిమా చూశాక నాకూ సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. అది యానిమేషన్‌ మూవీ. 2000లో ఓ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆ సినిమా చూశాను. రాముడి గురించి విదేశీయులు అంత ఆకట్టుకునేలా తీస్తే భారతీయులమైన మనం ఎందుకు తీయకూడదనిపించింది. కరోనా లాక్‌డౌన్‌లో ‘ఆదిపురుష్‌’ స్క్రిప్ట్‌ రాయడం మొదలుపెట్టాను.

► 40ఏళ్ల వయసులో... అది కూడా దర్శకుడిగా తక్కువ సినిమాల అనుభవం ఉన్న మీకు రామాయణం లాంటి పెద్ద సబ్జెక్ట్‌ని హ్యాండిల్‌ చేయడం అంటే చిన్న విషయం కాదేమో?
నా చిన్నప్పుడే రఘురాముడికి ఇన్‌స్పైర్‌ అయ్యాను. రాముడి జీవన విధానాన్ని ప్రపంచం మొత్తం ఆచరిస్తే బాగుంటుందనే ఆలోచన నా చిన్నప్పుడే నాకు కలిగింది. రాముడి క్వాలిటీస్‌ నన్ను అంతగా ఆకట్టుకున్నాయి. చిన్నప్పటినుంచీ రాముడంటే ఆరాధనాభావం ఉంది. అయినప్పటికీ రాముడి సినిమా అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ పాత్ర మీద పెంచుకున్న మమకారం ‘ఆదిపురుష్‌’ తీసేలా చేసింది. నేటి తరానికి రాముడి గురించి తెలియాలి.

► ‘యంగ్‌ రెబల్‌ స్టార్‌’ ఇమేజ్‌ ఉన్న ప్రభాస్‌ని సాత్వికంగా కనిపించే రాముడి పాత్రకు తీసుకోవాలని ఎందుకనిపించింది?
తీక్షణంగా ఉండే ప్రభాస్‌ కళ్లు, తన ఫిజిక్‌ రాముడి పాత్రకు సూటబుల్‌. మన కళ్లు మన హృదయానికి ప్రతిబింబాలు అంటారు. మనసులో ఉన్న భావాలను కళ్లు పలికిస్తాయి.
అలా ప్రభాస్‌ తన కళ్లల్లో కరుణ రసాన్ని చూపించగలుగుతారని పూర్తిగా నమ్మి, తనే ఈ పాత్ర చేయాలనుకున్నాను. అలాగే రాముడిలో ఉండే లక్షణాల్లో ‘పరాక్రమ వీర’ ఒకటి. రెబల్‌ ఇమేజ్‌తో ప్రభాస్‌ ఆ వీరత్వాన్ని చూపించగలరని నమ్మాను. ఈ క్యారెక్టర్‌ గురించి చెప్పి, ‘వి’ షేప్‌ బాడీ బాగుంటుందన్నాను. ఫిజిక్‌ని అలానే మలచుకున్నారు. అలాగే హిందీ భాష మీద కూడా ప్రభాస్‌ పట్టు సాధించారు.

► ఒకవేళ ప్రభాస్‌ ఈ సినిమా ఒప్పుకోకపోయి ఉంటే..
ఈ సబ్జెక్ట్‌ గురించి ప్రభాస్‌కి చెప్పడానికి వెళ్లే ముందు కాదనరనే నమ్మకంతో వెళ్లాను. సినిమా గురించి చెప్పగానే ‘ఓకే.. చేస్తాను’ అన్నారు. ఒకవేళ ప్రభాస్‌ ఒప్పుకోకపోయి ఉంటే ‘ఆదిపురుష్‌’ ఉండేది కాదు... తీసేవాడిని కాదు. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ చేయడానికి నన్ను ఆ ‘ఆల్‌మైటీ’ (దేవుడు)యే ఎన్నుకున్నాడని నా నమ్మకం. నన్నే కాదు.. నటీనటులు, టెక్నికల్‌ టీమ్‌ అందర్నీ ఆ దేవుడే ఎంపిక చేసి, ఈ ప్రాజెక్ట్‌ చేయించాడని నమ్ముతున్నాను.

► మూడు సీన్లు విని, ప్రభాస్‌ ఈ సినిమా చేస్తానని అన్నారట..
అవును.. నిజమే. ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు ప్రభాస్‌తో నాకంతగా పరిచయం లేదు. కథ చెప్పడానికి ఫోన్‌ చేశాను. మూడు సీన్లు విని, ప్రభాస్‌ ఇంప్రెస్‌ అయ్యారు. ఆ తర్వాత నేను ముంబై నుంచి హైదరాబాద్‌ వచ్చి పూర్తి కథ చెప్పాను.

► ‘ఆదిపురుష్‌’ని దేవుడే తీయించాడని చెప్పారు. మీకు భక్తి ఎక్కువ అని తెలుస్తోంది.. మీరు సెంటిమెంట్స్‌ని నమ్మితే ఈ సినిమా షూటింగ్‌ మొదటి రోజే ‘ఫైర్‌ యాక్సిడెంట్‌’ జరిగినందుకు అప్‌సెట్‌ అయ్యారా? భయపడ్డారా?
ఏమాత్రం భయపడలేదు.. అప్‌సెట్‌ అవ్వలేదు. నిజానికి పెద్ద ఘటనే జరిగింది. నా టీమ్‌ చేసిన హార్డ్‌వర్క్‌ (సెట్‌ వర్క్‌) వృథా అయిందని బాధపడ్డాను. అయితే ఆ దేవుడు మా పక్షాన ఉన్నాడు. చాలా త్వరగానే సెట్‌ పూర్తి చేసి, షూటింగ్‌ పూర్తి చేసేలా చేశాడు. జీవితంలో కష్టాలు వస్తాయి... పోతాయి. వాటిని తట్టుకుని ముందుకు సాగిపోవాలి. ఇంకో విషయం ఏంటంటే... సెట్‌ మాత్రమే పాడయింది తప్ప, మా టీమ్‌లో ఉన్న ఎవరికీ ఏమీ కాలేదు. అందుకే దేవుడు మా పక్షాన ఉన్నాడని అంటున్నాను.

► ప్రభాస్‌ మంచి భోజనప్రియుడు.. తన టీమ్‌కి విందులు ఇవ్వడం ఆయన అలవాటు.. మరి మీ టీమ్‌కి?
ప్రభాస్‌తో వర్క్‌ చేయడం నాకో మంచి అనుభూతి.  ఇంటి ఫుడ్‌ తెప్పించి, అందరికీ ఇచ్చేవారు. షూటింగ్‌ సమయంలో టేస్టీ ఫుడ్స్‌ చాలానే లాగించాం (నవ్వుతూ). ఇంకో విషయం ఏంటంటే.. షాట్‌ గ్యాప్‌లో కూడా ఫుడ్‌ గురించి మాట్లాడుకునేవాళ్లం. రేపు ఏం తిందాం అని కూడా ముందు రోజు చర్చించుకునేవాళ్లం.

► ఫైనల్లీ.. మీ జీవితంపై రాముడి ప్రభావం?
అది చెప్పడానికి మాటలు చాలవు. మనందరం ఉదయం నిద్ర లేచేటప్పుడు ‘మంచి జరగాలి’ అనుకుంటాం. ఆ మంచి ఎక్కడ్నుంచి వస్తుంది? మన నమ్మకంలోంచి పుట్టుకొస్తుంది. ఆ నమ్మకం ఎక్కడ నుంచి వస్తుంది? మనం నమ్మిన రఘురాముడి నుంచి వస్తుంది. రాముడి నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి.

‘ఆదిపురుష్‌’తో ప్రేక్షకులను వేల ఏళ్లు వెనక్కి తీసుకెళుతున్నా అన్నారు.. మీరు చేసిన రీసెర్చ్‌ గురించి?
నిజానికి రామాయణం గురించి ప్రపంచం చాలానే రాసింది. మన కళ్ల ముందు బోలెడంత మెటీరియల్‌ ఉంది. ఎక్కువ టైమ్‌ కేటాయించి, అవి స్టడీ చేస్తే చాలు. నేను ఎక్కువ టైమ్‌ కేటాయించి, అన్నీ స్టడీ చేశాను. ముఖ్యంగా ఆర్కిటెక్చర్‌ బుక్స్‌ చదివాను. అప్పటి కట్టడాలు ఎలా ఉండేవి? డిజైన్లు ఎలా ఉండేవి? అనే విషయాల మీద అవగాహన పెంచుకున్నాను. వేల ఏళ్ల క్రితం నాటి కథను మోడ్రన్‌ టెక్నాలజీతో చూపిస్తున్నాను. నేను నమ్మిన కథను నిజాయితీగా తెర మీద చూపించే ప్రయత్నం చేశాను. ఒక బలమైన కథకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఓ సాధనంలా ఉపయోగపడతాయి తప్ప కేవలం వాటితోనే సినిమాని నడిపించాలనుకోకూడదని నా అభిప్రాయం. అందుకే కథ బాగా రాసుకుని, దాన్ని స్క్రీన్‌కి ట్రాన్స్‌ఫార్మ్‌ చేశాను. ఆ కథ ఎలివేట్‌ కావడా నికి వీఎఫ్‌ఎక్స్‌ వాడాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement