ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు ఇంకా ఆగడం లేదు. దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏ మూహుర్తనా మొదలెట్టాడో ఆది నుంచి విమర్శల పాలవుతోంది. టీజర్ మొదలు సినిమా రిలీజ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగ్స్, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు మాజీ నటులు మేకర్స్‌పై మండిపడ్డారు. ఆ తర్వాత ఆదిపురుష్ టీం తమ తప్పులను అంగీకరించిన సినిమాలో మార్పులు కూడా చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి: ఆయనతో డేటింగ్.. నా జీవితమే నాశనమైంది: టాప్ హీరోయిన్)
అయితే తాజాగా మరో నటుడు ఆదిపురుష్ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ విందు ధారా సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా హనుమంతుని పాత్రను వక్రీకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. విందు ధారా సింగ్ చాలాసార్లు హనుమంతుడి పాత్రను తెరపై పోషించాడు. అంతే కాకుండా అతని తండ్రి, దివంగత నటుడు ధారా సింగ్, రామానంద్ సాగర్ టీవీ షో రామాయణంలో హనుమంతుడి పాత్రను కూడా పోషించాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విందు ధారా సింగ్.. ఆదిపురుష్ నిర్మాతల తీరును ఎండగట్టారు. హనుమంతుడిగా నటించిన దేవదత్తా నాగేపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. హనుమంతుడు పవర్‌ఫుల్‌గా, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఆ పాత్రలో నటించిన దేవదత్తా నాగే హిందీలో కూడా సరిగ్గా మాట్లాడలేడు. అతడికి ఇచ్చిన డైలాగ్‌లతో ఆ పాత్రను మరోవిధంగా చూపారు. ఈ విషయంలో నిర్మాతలు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. హనుమంతుడి పాత్రలో తన తండ్రి ధారా సింగ్ చరిత్ర సృష్టించాడని.. ఆయన నటనకు మీరు దరిదాపుల్లోకి కూడా రాలేరని అన్నారు.
విందు ధారా సింగ్ మాట్లాడుతూ.. 'వీళ్లు చేసిన పని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. మందు తాగి వచ్చారో కానీ.. వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో కూడా వాళ్లకు తెలియదు. ఇంత భారీ బడ్జెట్‌తో అద్భుతమైన సినిమా తీసే గోల్డెన్ ఛాన్స్ నాశనం చేశారు. వారు తమాషా చేస్తూ కథతో ఆడుకున్నారు. అందుకే ఆదిపురుష్ తీవ్రంగా నిరాశపరిచింది.' అన్నారాయన.
ఆదిపురుష్ వివాదం
ఆదిపురుష్ చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముంబై పోలీసులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
అంతే కాకుండా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సెన్సార్ బోర్డు, చిత్ర నిర్మాతలపై తీవ్ర స్థాయిలో మడిపడింది. సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది? మీరు భవిష్యత్ తరాలకు ఏం నేర్పాలనుకుంటున్నారు?" అని కోర్టు ప్రశ్నించింది. డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment