ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శల దాడిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే సినిమాలోని పలు అంశాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. డైలాగ్స్, పాత్రల వేషధారణపై పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచి సినిమా విడుదలైన తర్వాత కూడా ఆదిపురుష్‌పై విమర్శల దాడి ఆగడం లేదు. అసలు మీరు రామాయణమే కాదంటూ నెటిజన్స్‌తో పాటు కొందరు నటీనటులు సైతం విమర్శిస్తున్నారు.
(ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు )
ఇవన్నీ పక్కనబెడితే దర్శకుడు ఓం రౌత్ చేసిన పొరపాట్లు ఏంటి? అసలు ఎక్కడ ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు ఓం రౌత్ విఫలమయ్యారు. రామాయణంలో పాత్రలకు ఆధునిక సాంకేతికతను జోడించడం సినిమాను దెబ్బతీసిందా? లేక పాత్రలను తీర్చిదిద్దడంలో.. వాస్తవాన్ని చూపించడంలో విఫలమయ్యారా? అనేది ఓ సారి పరిశీలిద్దాం. ఆదిపురుష్‌పై ఇంతలా విమర్శలు రావడానికి ప్రధాన కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ జూన్ 16న సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత తీవ్రస్థాయిలో విమర్శలకు గురైంది.
విమర్శలకు దారితీసిన ప్రధాన తప్పిదాలివే!
1. రావణుడికి ఉన్న పది తలలపై ప్రేక్షకులు తీవ్రంగా ఎగతాళి చేశారు. అంతే కాకుండా రావణుడి కేశాలంకరణ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలి ఉందని కామెంట్స్ చేశారు.
2. సినిమాలోని హనుమంతునిపై రాసిన డైలాగులు ప్రేక్షకులను, విమర్శకులను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే డైలాగ్స్‌ను మారుస్తామని నిర్మాతలు ప్రకటించారు.
3.పుష్పక విమానంలో రావణుడు సీతను అపహరిస్తాడు. కానీ.. ఆదిపురుష్‌లో మాత్రం నల్లటి గబ్బిలం లాంటి పక్షిపై రావణుడు కనిపించాడు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది.
4. సీత పాత్రలో కృతి సనన్ పలు రకాల రంగుల దుస్తులు ధరించింది. కానీ ఇతిహాసమైన రామాయణంలో రాముడు, సీత అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఆ సమయంలో కేవలం కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరించారు.
5. డైలాగ్స్ పక్కన పెడితే చిత్రనిర్మాతలు రాఘవ అని కూడా పిలువబడే రాముడిని కోపంగా, మరింత దూకుడుగా ఉండే వ్యక్తిగా ఆదిపురుష్‌లో చూపించారు. ఇది కూడా సినిమాకు ఓ పెద్ద మైనస్ అనే చెప్పాలి.
6. పురాణాల ప్రకారం రావణుడి లంక బంగారు వర్ణంతో నిండి ఉంది. అయితే ఓం రౌత్ లంకను ఈ చిత్రంలో నలుపు, తెలుపులో చిత్రీకరించినందుకు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు.
7. ఇంద్రజిత్ పాత్రలో మేఘనాథ్‌కు చాలా టాటూలు వేయించుకున్నట్లు చూపించారు. దీంతో నెట్టిజన్స్ మీమ్స్ చేస్తూ ట్రోల్ చేశారు.
(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!)
ఇలాంటి పొరపాట్లతో ఆదిపురుష్ టీం ఇప్పటికే అపఖ్యాతిని మూటగట్టుకుంది. వాస్తవానికి భిన్నంగా పాత్రలను చూపించిన ఓం రౌత్ తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఏదేమైనా పురాణ ఇతిహాసాలను తెరపై చూపించాలంటే వాస్తవాలను మరో కోణంలో చూపిస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని తెలుస్తోంది. రామాయణం ఆధారంగా రాబోయే సినిమాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడతారని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment