
హిందీ చిత్ర పరిశ్రమ గురించి బాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అంటే బాలీవుడ్‌కు భయం అని ఆయన అన్నారు. అందుకే ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సాహసం చేయరని ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరైన తెగించి విమర్శలు చేస్తే.. దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభద్రతాభావం బాలీవుడ్ హీరోలలో ఉందని అభిప్రాయపడ్డారు. ఈడీ, సీబీఐ దాడుల భయమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా నిరోధిస్తుందని ఆయన అన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్‌తో జరిగిన చర్చ సందర్భంగా జావేద్ అఖ్తర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'బాలీవుడ్ తారలు గొప్ప పేరు ప్రఖ్యాతులతో విలాసవంతమైన జీవితాల్ని గడుపుతారు. కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయాల్లో వారు కూడా సామాన్యుల తరహాలోనే ఆలోచిస్తారు. ఈ బడా హీరోలను వెనక నుంచి నడిపించేది మొత్తం పారిశ్రామికవేత్తలే. ఎట్టిపరిస్థితిల్లోనూ వారితో పోరాడేంత పెద్దవారు కాదు ఈ సినీ తారలు. ఈ క్రమంలోనే వారి వైఖరిపై పలుమార్లు విమర్శలు వచ్చాయి. అదే హాలీవుడ్ నటులు అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా తమ భావాల్ని వ్యక్తం చేస్తారు.
తాజాగా అమెరికన్ నటి మెర్లీ స్ట్రీప్ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించినా ఆమెకు ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదు. అలాంటి వ్యాఖ్యలు ఇక్కడి ప్రభుత్వంపై చేస్తే ఈడీ, సీబీఐ దాడుల పేరుతో రంగంలోకి దిగుతారు. ఆ భయంతోనే బాలీవుడ్ చిత్రపరిశ్రమ ప్రభుత్వాన్ని ప్రశ్నించదు.' అని ఆయన జావేద్ అఖ్తర్ వ్యాఖ్యనించారు. అయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తాను నిరంతరం సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నానని జావేద్ అన్నారు. ఓ పౌరుడిగా సమస్యలపై స్పందించడం తన ధర్మమని ఆయన పేర్కొన్నారు.
జావేద్ అఖ్తర్ ప్రతిభా వంతమయిన కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత. సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రకటిస్తున్న సామాజిక గొంతుక ఆయనది. ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన స్వతంత్ర లౌకిక స్వరం, జావేద్ అఖ్తర్. భావుకుడు, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించారు. తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రాశారు. జాతీయ సమైక్యత, స్త్రీల హక్కుల కోసం మాట్లా డారు, రాశారు. తప్పు దోవ పట్టిన యువతను ద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995లో కేంద్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది.