Ramayanam
-
అంతరార్థం..
ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే దాన్ని చూసిన మనం అతడు అలా చేయటం మంచిదనో లేదా చెడ్డదనో వెంటనే తీర్పుచెబుతూ ఉంటాం. అలా చేయటం తగదని శ్రీ రామకృష్ణ పరమహంస రామాయణ, మహాభారతాల నుంచి కొన్ని ఉదాహరణలు చూపారు. రామరావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాది యుద్ధ వీరులంతా చనిపోయారు. రావణుని తల్లి కైకశి ప్రాణభయంతో పారిపోసాగింది.లక్ష్మణుడు అలా పారిపోతున్న ఆ వృద్ధ స్త్రీని గమనించి శ్రీరామ చంద్రునితో, ‘అన్నయ్యా! ఏమిటీ వింత? అనేక మంది పుత్రులను, బంధువులను కోల్పోయి పుత్ర శోకాన్ని అనుభవిస్తూ ఇప్పుడు స్వీయ ప్రాణ రక్షణార్థం ఈ వృద్ధురాలు ఇలా ఎందుకు పారిపోతోంది?’ అని అడిగాడు. అందుకు రాముడు ‘ఆమెనే అడిగి కారణం కనుక్కొందాం’ అన్నాడు. ‘శ్రీరాముడు అభయమిచ్చాడని తెలిపి ఆమెను గౌరవంగా నా కడకు తోడ్కొని రండి అని కొందరిని ఆమె కడకు పంపాడు. వారు అలాగే చేశారు.‘నీవు ప్రాణ భీతితో అలా పారిపోతున్నావా? నిజం చెప్పు’ అన్నాడు శ్రీరామ చంద్రుడు ఆమెతో. అప్పుడామె, ‘ఓ రామా! నేను జీవించి ఉన్నందునే నీ ఈ లీలలను తిలకించ గల్గుతున్నాను. ఈ భూమ్మీద నీవు ఇంకా జరుపబోయే లీలలను కూడా చూడగోరి ఇంకా కొంత కాలం జీవించాలని అభిలషిస్తున్నాను’ అని చెప్పింది. దీంతో సత్యమేమిటో అందరికీ తెలిసి వచ్చింది.మహాభారత ఉదాహరణ చూద్దాం. భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. శ్రీకృష్ణుడు, పంచ పాండవులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. మహావీరుడైన భీష్మాచార్యుల వారి కళ్ళ నుండి అశ్రువులు స్రవించటం వారు గమనించారు. అర్జునుడు శ్రీకృష్ణునితో, ‘సఖా! ఎంత విచిత్రంగా ఉంది. కురు పితామహులైన భీష్ములు మరణ సమయంలో మాయలో పడి దుఃఖిస్తున్నా రేమిటి?’ అన్నాడు. కృష్ణుడే భీష్ముడిని దాన్నిగూర్చి అడిగాడు.అప్పుడు భీష్ముడు, ‘ఓ కృష్ణా! మరణ భయంతో నేను దుఃఖించటం లేదని నీకు బాగా తెలుసు, స్వయంగా భగవంతుడే పాండవులకు సారథిగా ఉన్నప్పటికీ వారి కష్టాలకు అంతులేకుండా ఉందే! ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి లీలలను కించిత్తూ తెలుసుకోలేకుండా ఉన్నానే అని తలచుకొని దుఃఖిస్తున్నాను’ అన్నాడు (శ్రీ రామకృష్ణ కథామృతం–01). కాబట్టి దేన్ని చూసినా, విన్నా త్వరపడి విమర్శించ కూడదు. నిజం నిలకడ మీద తేలుతుంది. – రాచమడుగు శ్రీనివాసులు -
ఆ పాత్ర కోసం కేజీఎఫ్ హీరో సాహసం.. అదేంటో తెలుసా?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో కేజీఎఫ్ స్టార్ యశ్ కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా యశ్‌కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం యశ్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరగనున్నట్లు తాజా సమాచారం. దానికోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. నితీశ్ తివారీ రామాయణంలో యశ్ భారీ పర్సనాలిటీతో కనిపించనున్నారు. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్-3లో యశ్ నటించనున్నారు. ప్రస్తుతం టాక్సిక్ చిత్రంలో నటిస్తోన్న యశ్.. ఆ సినిమా పూర్తయ్యాకే రామాయణం సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. కాగా.. రామాయణం షూటింగ్ ఏప్రిల్‌లో ముంబైలో ప్రారంభమైంది. ఈ మూవీ కోసం దర్శకుడు నితీష్ తివారీ ముంబయి నగర శివార్లలో భారీ సెట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుండగా.. హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తారని సమాచారం. -
రామాయణంకి ఎంతైనా కష్టపడతాను: యశ్
‘‘నమిత్, నేను కలిసి రామాయణంపై మూవీ చేస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం. కానీ, అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలంటే అది మామూలు విషయం కాదు.. బడ్జెట్స్ కూడా సరిపోవు.. అందుకే నేను కూడా కో ప్రోడ్యూస్ చెయ్యాలనుకున్నాను. ఈ ‘రామాయణం’ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు ‘కేజీఎఫ్’ ఫేమ్ హీరో యశ్. ఆయన నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణం నేపథ్యంలో ఓ సినిమా నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకుడు. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీయడంలో న్యాయం చేయగలను అనిపిస్తోంది’’ అన్నారు. కాగా నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ‘రామాయణ్’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికే నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలనే టాక్ వినిపిస్తోంది. -
విల్లు ఎక్కు పెట్టి..!
రెండు రోజుల క్రితం రణ్‌బీర్ కపూర్ తలకిందులుగా నిలబడిన ఫొటో వైరల్ అయ్యింది. ఈ శీర్షాసనం ఎందుకూ అంటే.. శిక్షణలో భాగంగా. రామాయణం ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందనున్న ‘రామాయణ్’ చిత్రం కోసమే రణ్‌బీర్ వర్కవుట్స్ మొదలుపెట్టారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నియమించిన ట్రైనర్ ఆధ్వర్యంలో రణ్‌బీర్ కపూర్ మేకోవర్ అవుతున్నారు. ఒకవైపు ఫిజికల్ మేకోవర్ మరోవైపు యుద్ధ విద్యలు నేర్చుకుంటూ బిజీగా ఉన్నారు రణ్‌బీర్. మొన్న శీర్షాసనం ఫొటో వైరల్ కాగా తాజాగా విలు విద్య నేర్చుకోవడానికి రణ్‌బీర్ సిద్ధమవుతున్న ఫొటోలు బయటికొచ్చాయి. మేకోవర్ ట్రైనర్ వేరు... విలు విద్య నేర్పిస్తున్న ట్రైనర్ వేరు. రాముడంటే యుద్ధ విద్యల్లో సూపర్ కాబట్టి ఆ పాత్రకు న్యాయం చేయడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి రణ్‌బీర్ రెడీ అయిపోయారు. ఇక ఈ చిత్రంలో సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యశ్, కైకేయీగా లారా దత్తా నటిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. -
రామాయణం కోసం 'యష్' దిమ్మతిరిగే రెమ్యూనరేషన్
-
ఆర్థిక విజయానికి రామబాణం
కోట్లాది మంది దశాబ్దాల స్వప్నం సాకారమై, అయోధ్యలో బాలరాముడు కొలువు దీరాడు. రామాయణాన్ని గృహస్థ ధర్మానికి అద్భుతమైన నిదర్శనంగా పేర్కొంటారు. శ్రీరాముడి జీవన మార్గాన్ని పరిశీలించి చూస్తే వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో ఎలా నడుచుకోవాలనే విషయమై విలువైన పాఠాలు కనిపిస్తాయి. శ్రీరాముడిని విశ్వసించే ప్రతి ఒక్కరూ, తమ ఆర్థిక విజయానికి కావాల్సిన సూత్రాలను రామాయణం నుంచి తీసుకోవచ్చు. రాముడి వనవాసం.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళిక అవసరాన్ని గుర్తు చేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితానికి ఆలోచనాత్మక ఆర్థిక ప్రణాళిక ఎంతో అవసరమని నిపుణులు తరచూ సూచిస్తుంటారు. ఆర్థిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం, వాటికి తగిన బడ్జెట్ కేటాయించుకోవడం, వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితంలో అనిశ్చితులు ఎదురైనా, వాటిని సులభంగా అధిగమించొచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాముడు తన బాధ్యతలను ఏనాడూ విస్మరించలేదు. అందుకే ఊహించని పరిస్థితులు ఎదురైతే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం ఎలా అన్నది రాముడి చేసి చూపించాడు. మనం కూడా ఆర్థిక ప్రణాళిక ఆధారంగా జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు సన్నద్ధత ఏర్పాటు చేసుకోవాలి. జీవితానికి తగినంత బీమా కవరేజీ, ఆరోగ్య బీమా తీసుకోవాలి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. జీవిత లక్ష్యాలు, అందుకు కావాల్సిన మొత్తం, చేయాల్సిన పెట్టుబడి, వివిధ సాధనాల మధ్య రిస్క్ ఆధారంగా కేటాయింపులు.. వీటన్నింటికీ ఆర్థిక ప్రణాళిక మార్గం చూపిస్తుంది. ధర్మ మార్గం ధర్మం పట్ల రాముడి అచంచలమైన నిబద్ధత ఆయన జీవన గమనానికి మూలస్తంభంగా కనిపిస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితంలో నైతిక ఆర్థిక విధానాల ఆచరణ అవసరాన్ని ఇది తెలియజేస్తుంది. ఇదే దీర్ఘకాలంలో విజయానికి బాటలు పరుస్తుంది. నిజాయితీ, చిత్తశుద్ధి, ఆర్థిక నిర్ణయాల్లో పారదర్శకత, క్రమశిక్షణ, భావోద్వేగాల నియంత్రణ, వేగంగా ధనవంతులు కావచ్చనే ప్రచారానికి ఆకర్షితులు కాకపోవడం వంటివి ఆర్థిక విజయాలకు భరోసానిస్తుంది. ఆర్థిక విషయాల్లో ధర్మానికి కట్టుబడి ఉండడం వల్ల అది స్థిరమైన, నైతిక సంపద సృష్టికి దారితీస్తుంది. రిస్క్ నిర్వహణ రావణుడితో రాముడు సాగించిన యుద్ధం.. ధైర్యం, రిస్క్ నిర్వహణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక విషయాల్లోనూ వీటి అవసరం ఎంతో ఉంది. సంపద సృష్టికి, ఆర్థిక లక్ష్యాల సాధనకు ధైర్యంగా, తమకు సరిపడే రిస్‌్కలను తీసుకోవాల్సిందే. రిస్‌్కలను మదించే విషయమై, అనిశి్చతులను అధిగమించేందుకు అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవడాన్ని మర్చిపోవద్దు. ధర్మం కోసం రాముడు యుద్ధం చేయక తప్పలేదు. అలాగే, సంపద సృష్టి కోరుకునే వారు కూడా రిస్‌్కతో కలసి నడవాల్సిందే. అది కూడా తాము భరించే స్థాయిలోనే రిస్‌్కను పరిమితం చేసుకోవాలి. పెట్టుబడికి సైతం ముప్పు ఉంటుందని ఈక్విటీలకు దూరంగా ఉండడం సరికాదు. రాబడులకు, పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ఒక్కదాని దృష్టితోనో పరుగులు తీయకూడదు. సరళతరం వనవాస సమయంలో రాముడి నిరాడంబర, సాధారణ జీవన శైలి.. పొదుపు ధర్మాన్ని తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితంలోనూ పొదుపుతో కూడిన జీవనశైలిని అనుసరించడం, అనవసర దుబారాని నియంత్రించడం ఆర్థిక శ్రేయస్సుకు దారి చూపుతుంది. నేడు ప్రతి ఒక్క అవసరానికీ సులభంగా రుణాలు లభిస్తున్నాయి. అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. అవసరాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాలతో కోరికలు తీర్చుకోవడం ఆర్థిక శ్రేయస్సుకు మేలు చేయదు. పొదుపు మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. తెలివిగా ఖర్చు చేస్తూ, పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. క్రెడిట్ కార్డ్ రుణాల నుంచి త్వరగా బయటకు రావాలి. అధిక ఖర్చుకు కళ్లెం వేయాలి. సరైన అవకాశాలు, అనుకూల సమయం కోసం వేచి చూస్తూ ఈక్విటీ మార్కెట్లో వచ్చే విలువైన అవకాశాలను కోల్పోవద్దు. సహనం, పట్టుదల కష్టపడి సంపాదించిన ధనానికి రక్షణగా నిలవాలి. మార్గదర్శకం రాముడి విధేయత, తన అనుచరులతో ఉన్న బలమైన బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెట్టుబడుల విషయంలోనూ సత్సంబంధాలు ఎంతో అవసరం. పరస్పర గౌరవం, నమ్మకం, మద్దతు అనేవి ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు సాయపడతాయి. అవసరం మేరకు ఆర్థిక నిపుణుల సాయాన్ని, మద్దతును, మార్గదర్శకాన్ని తీసుకోవాలి. ఇన్వెస్టర్ రిస్‌్కను మదింపు వేసి, అనుకూలమైన పెట్టుబడి సాధనాలు, ఆర్థిక లక్ష్యాల సాధనకు ఆచరించాల్సి మార్గాన్ని వారు సూచిస్తారు. ఆర్థిక ప్రపంచంలో ఉండే సంక్లిష్టతలను అధిగమించేందుకు సాయపడతారు. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో రాముడి సైన్యంలో కనిపించే వైవిధ్యాన్ని, తమ పెట్టుబడులకూ అన్వయించుకోవాలి. వానరాలు, ఎలుగుబంట్లు, ఉడతలు, గద్దలు ఇవన్నీ రామదండులో కనిపిస్తాయి. ఇదే మాదిరిగా పెట్టుబడుల్లోనూ వైవిధ్యం ఉండాలి. కేవలం పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్లకే (ఎఫ్డీలు) పరిమితం కాకూడదు. అన్ని ముఖ్య సాధనాల్లోకీ పెట్టుబడులు వర్గీకరించుకోవాలి. దీనివల్ల రిస్‌్కను తగ్గించుకోవచ్చు. రాబడులు స్థిరంగా ఉండేలా చూసుకోవచ్చు. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. ఈక్విటీలు, డెట్, గోల్డ్, ఏఐఎఫ్‌లకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. నేనే సుపీరియర్ అనుకోవద్దు..! పెట్టుబడుల విషయంలో అంతా తనకే తెలుసన్న అహంకారం అస్సలు పనికిరాదు. రావణుడి పతనానికి ఇదే దారితీసింది. మెరుగైన పనితీరు చూపించని సాధనాల విషయంలో అహంకారం విడిచి పెట్టి ఆలోచించాలి. నిరీ్ణత కాలానికోసారి సమీక్షించుకుని పెట్టుబడుల్లో మార్పులు చేసుకోవాలి. అలా కాకుండా ఇన్వెస్ట్ చేసి పని అయిపోందని అనుకోవడం ఆర్థిక విజయాలకు దారితీయదు. సంపద సృష్టికి, పెట్టుబడుల మార్గంలో తప్పొప్పులను అంగీకరించాలి. దీనివల్ల నష్టాలను పరిమితం చేసుకునేందుకు వీలుంటుంది. మారుతున్న పరిస్థితులను ఆహా్వనించడం ఆర్థిక శ్రేయస్సుకు అవసరం. శ్రీరాముడి జీవితంలో పొందుపరిచిన జ్ఞానం కేవలం ఆధ్యాత్మికతకు పరిమితం కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియచెపుతుంది. ఇన్వెస్టర్లకు విలువైన అంశాలను తెలియజేస్తుంది. రామాయణాన్ని చదవడం, అందులోని ముఖ్యమైన అంశాలను గ్రహించి, వాటిని తమ పెట్టుబడులకు అన్వయించుకోవడం వల్ల ఆర్థిక విజయాలకు మార్గాన్ని సులభం చేసుకోవచ్చు. చెడుపై మంచి విజయం సాధించడం రామాయణంలో కనిపిస్తుంది. అదే మాదిరిగా ఇన్వెస్టర్లు ఆర్థిక అవరోధాలను అధిగమించి, మంచి ఆర్థిక అలవాట్లతో, క్రమశిక్షణతో మెలగడం ద్వారా సంపద సృష్టికి చేరువకావచ్చు. హద్దులకు కట్టుబడి ఉండడం సంపద సృష్టి కోరుకునే వారు అందుకు అడ్డదారులు (షార్ట్‌కట్స్) వెతుక్కోకూడదు. లంకాధిపతి రావణుడు సీతమ్మ వారిని కోరుకోవడం వల్ల ఎంతటి ఉపద్రవం జరిగిందో రామాయణం చెబుతోంది. కోరికలపై నియంత్రణ అవసరమని, సన్మార్గమే శ్రేష్టమని ఇది సందేశం ఇస్తుంది. పెట్టుబడులపై రాబడుల విషయంలోనూ కోరికలను అదుపులో పెట్టుకుని వ్యవహరించాలి. తమకంటూ ఆర్థిక సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలి. ఉద్రేకంతో కూడిన నిర్ణయాలకు చోటు ఇవ్వకూడదు. టిప్స్‌ను అనుసరించడం కాకుండా కాల పరీక్షకు నిలిచిన బలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. దీనివల్ల విజయం తేలిక అవుతుంది. ఓపిక, క్రమశిక్షణ సముద్రంలో రామసేతు వారధి నిర్మాణం ఎంతో ఓపిక, పట్టుదలతో, ఎంతో మంది కృషితో, సుదీర్ఘ కాలానికి కానీ సాధ్యం కాలేదు. సందప సృష్టి కూడా అంతే. స్వల్ప కాలంలో కుబేరులు కావడం అనేది ఆచరణలో అంత సులభం కాదు. క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది. సిప్ అవసరాన్ని ఇక్కడ గుర్తించాలి. సిప్ రూపంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే, చిన్న మొత్తమే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారుతుంది. దీర్ఘకాలంలో సంపద సృష్టిని సిప్ సులభతరం చేస్తుంది. స్థిరత్వం, సహనం అనేవి దీర్ఘకాల ప్రయాణానికి ఎంతో అవసరం. లక్ష్మణుడి కోసం ఆంజనేయుడు సంజీవని కోసం వెళ్లడం, దాన్ని గుర్తించలేక తన చేత్తో మొత్తం సుమేరు పర్వతాన్ని పెకిలించి చేత్తో తీసుకురావడం తెలిసిందే. ప్రతీ ఇన్వెస్టర్ సంజీవని వంటి కంపెనీలను గుర్తించలేకపోవచ్చు. అలాంటప్పుడు వారి ముందున్న మార్గం మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇన్వెస్టర్లు ఒక్కో కంపెనీ వారీ రిస్‌్కను తగ్గించుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సూచీల్లో ఇన్వెస్ట్ చేసే ప్యాసివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. అందులోని కొన్ని స్టాక్స్ బలహీన పనితీరు చూపించినా కానీ, మిగిలిన వాటి అండతో దీర్ఘకాలంలో మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చు. -
అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!
అది 1973 సంవత్సరం.. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12.05 ని. కావస్తోంది. కాసేపట్లో ఉషశ్రీ ధర్మసందేహాలు కార్యక్రమం.. శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు, ఆ తరువాయి శ్రీమద్భారతం ప్రవచనం.. అంటూ ప్రకటన వినపడగానే తెలుగు లోగిళ్లు నై మిశతపోవనాలుగా మారిపోయాయి. ‘ఉషశ్రీ ఉపన్యాసాలు స్నిగ్ధ గవాక్షాలు’ అని పలువురు పెద్దలు ప్రశంసించారు. అలా ప్రారంభమైన ఆ కార్యక్రమం – 1990 సెప్టెంబరు 7 వ తేదీ ‘ఉషశ్రీ’ కన్నుమూసే వరకు కొనసాగింది. ఆకాశవాణి ద్వారా ఉషశ్రీ.. వాల్మీకి రామాయణం, కవిత్రయ భారతం, పోతన భాగవతాలను తెలుగు శ్రోతలకు వినిపించారు. శ్రోతల సందేహాలకు చమత్కారంగా సమాధానాలిచ్చేవారు. ఉషశ్రీ నేపథ్యం.. పశ్చిమగోదావరి జిల్లా కాకరపర్రు గ్రామంలో 1928, మార్చి 16న పురాణపండ రామమూర్తి, కాశీ అన్నపూర్ణ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ‘ఉషశ్రీ’ కలం పేరుతో తెలుగువారికి సుపరిచితులయ్యారు. జ్వలితజ్వాల, అమృత కలశం, మల్లెపందిరి, సంతప్తులు, ప్రేయసి – ప్రియంవద, తరాలు-అంతరాలు వంటి నవలలు, కథలు, వెంకటేశ్వర కల్యాణం వంటి యక్షగానాలు, పెళ్లాడేబొమ్మా(నవలా లేఖావళి), వ్యాసాలు, విమర్శలు, నాటికలు రాసిన ఉషశ్రీ... రామాయణభారత ఉపన్యాసాలు ప్రారంభించాక ఇక కథలు, పద్యాలు, నవలలు విడిచిపెట్టేశారు. ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా.. తుది శ్వాస విడిచేవరకు రామాయణభారతాలే ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా జీవించారాయన. శృంగేరి శారదా పీఠం ఆస్థానకవిగా సత్కారం అందుకున్నారు. ఉషశ్రీ రచించిన రామాయణ భారత భాగవతాలను తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని లక్షల కాపీలు ముద్రించింది. ఇప్పుడు తెలుగువారు గర్వించే సన్నివేశం చోటు చేసుకుంది. అదే అయోధ్యలో ఉషశ్రీ గళం. అయోధ్య అంతటా.. ఉషశ్రీ గళంలో జాలువారిన రామాయణం ఇప్పుడు అయోధ్యలో వినిపిస్తోంది. అయోధ్యను సందర్శించి, విన్నవారు ఈ సంగతిని చెప్పారు. అంతే కాకుండా దేశంలోని అనేక ఎఫ్.ఎం. స్టేషన్లు కూడా దీనిని ప్రసారం చేస్తున్నాయి. కేంద్రంలో అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ఒకరి చొరవతో ఇది సాధ్యమైందని తెలిసింది. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు తమ ఎఫ్.ఎం. స్టేషన్లలో వీటిని తాజాగా ప్రసారం చేశాయి. వీటిని విన్నవారు, ఇదే స్వరాన్ని అయోధ్య ఆలయంలో కూడా విన్నామని చెబుతున్నారు. ఆటుపోట్ల నడుమ ఆ గళం.. సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం ఉషశ్రీ గళ ప్రస్థానం ఆకాశవాణి విజయవాడలో వినబడడం ప్రారంభమైంది. ధర్మసందేహాలు శీర్షికన మహాభారతంతో మొదలై, శ్రీ భాగవతం వరకూ కొనసాగింది. ఆ సమయంలో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉషశ్రీ గారు భౌతికంగా అదృశ్యమై 33 సంవత్సరాలు అయినా ఆ గళం ఇంకా సజీవంగా ఉండడానికి ప్రధాన కారణం ఆయన అభిమానులు. ఆ తరువాత కరోనా సమయంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉషశ్రీ కుటుంబ సభ్యులను సంప్రదించి.. రామాయణ, భారత, భాగవతాలను ప్రసారం చేసింది. ఇప్పుడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఉషశ్రీ రామాయణం దేశవ్యాప్తంగా అన్ని ఎఫ్.ఎం.లలోనూ ప్రసారమవుతోంది. అయోధ్య రామాలయ పరిసరాల్లోనూ మార్మోగుతోంది. ఉత్తర భారతంలో ఉషశ్రీ రామాయణాన్ని వినిపించడం అది కూడా రాముని విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ప్రసారం చెయ్యడం తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం. -
శ్రీరాముని గుర్తుగా అక్బర్ ఏం చేశాడు?
ఆదర్శ పురుషునిగా పేరొందిన శ్రీరామునిపై మొఘల్ చక్రవర్తి అక్బర్ తన భక్తిని చాటుకున్నాడని చరిత్ర చెబుతోంది. శ్రీరాముని నాణాన్ని రూపొందించడమే కాకుండా పర్షియన్ భాషలోకి రామాయణాన్ని అనువదింపజేశాడు. మొఘలుల కాలంలో అక్బర్ చక్రవర్తిపై రాముని ప్రభావం అధికంగా ఉంది. నాటికాలంలో అక్బర్ ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ ప్యాలెస్‌లో ఎర్ర ఇసుకరాయిపై శ్రీరాముని ఆస్థానం చెక్కించాడు. అక్బర్ తల్లి హమీదా బాను బేగం ఉండే మరియమ్ మహల్లో ఒక స్తంభంపై శ్రీరాముని ఆస్థానంతోపాటు, హనుమంతుని చిత్రం కనిపిస్తుంది. అక్బర్ తల్లి హమీదా బాను బేగం రామాయణ, మహాభారత ఇతిహాసాలను అమితంగా ఇష్టపడేవారని అందుకే ఆమె నివాసభవనంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుని చిత్రాలు కనిపిస్తాయని మాజీ ఏఎస్ఐ డైరెక్టర్, పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ కేకే ముహమ్మద్ తెలిపారు. తన తల్లి ఆసక్తిని గమనించిన అక్బర్ రామాయణం, మహాభారతాలను పర్షియన్ భాషలోకి అనువదింపజేశారని చరిత్ర చెబుతోంది. అక్బర్ తల్లి నివాస భవనంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్న పెయింటింగ్ కూడా కనిపిస్తుంది. -
'ప్రవచనం' కాలక్షేపం కోసం కాదు!
తూర్పుగోదావరి/రాజమహేంద్రవరం: రామకథ యథార్థ తత్త్వాన్ని తెలియచెప్పడమే లక్ష్యంగా తాను రామాయణాన్ని ప్రవచిస్తున్నానని, కాలక్షేపం కోసం కాదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఉద్ఘాటించారు. రాజమహేంద్రవరంలోని హిందూ సమాజంలో రుషిపీఠం మండల దీక్షగా శ్రీరామ మహాయజ్ఞం నిర్వహిస్తోంది. 42 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణ సారాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రవచించి, రామభక్తులను పులకింపచేస్తున్నారు. జనవరి 23వ తేదీ వరకు రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ ప్రవచన మహాయజ్ఞం సాగనుంది. సీతారామలక్ష్మణుల పాదస్పర్శతో పునీతమైన గోదావరీ తీరం రామకథా ప్రవచన, స్మరణాలతో మారు మోగుతోంది. ‘రాజ’మహేంద్రి ‘రామ’మహేంద్రిగా మారింది! ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో సామవేదం ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఉత్తరకాండ అవాల్మీకం కాదు.. లోకంలో ఉత్తరకాండ వాల్మీకి మహర్షి విరచితం కాదనే మాట గట్టిగానే వినపడుతోంది. యుద్ధకాండలో పట్టాభిషేక సర్గలో ఫలశృతి చెప్పాక, తదనంతరం కథ ఉండదని వీరి వాదన. బాలకాండలో మహర్షి స్వయంగా చెప్పారు, షట్కాండలు రచించిన అనంతరం ఉత్తరకాండ రచించినట్లు....‘తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషి’....బాలకాండలో స్పష్టంగా చెప్పారు. రామాయణంలో 24 వేల శ్లోకాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఉత్తరకాండలోని శ్లోకాలు కలుపుకుంటేనే ఈ సంఖ్య వస్తుంది. పురాణాదులలో అవతార పురుషుల ఆవిర్భావం చెప్పినట్లు, అవతార పరిసమాప్తి కూడా చెప్పడం సంప్రదాయం. రామావతార పరిసమాప్తి ఉత్తరకాండలో చూస్తాం. రామాయణంలోని కొన్ని సందేహాలకు మనకు ఉత్తరకాండలో సమాధానాలు కనపడతాయి–ఉదాహరణకు సుందరకాండలో హనుమంతుడిని చూసిన రావణుడు వచ్చినవాడు నందీశ్వరుడా అని అనుమానపడతాడు. రావణ, నందీశ్వరుల నడుమ జరిగినది మనకు ఉత్తరకాండలోనే గోచరిస్తుంది. ఉత్తరం అనే మాటకు సమాధానం అని అర్థం చెప్పుకోవచ్చు. నేటికీ చెదరని రామాయణ ప్రాధాన్యం! ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విమర్శలు, దాడులు చేసినా రామాయణం ప్రాచుర్యం, ప్రాధాన్యం కోల్పోదు. త్రేతాయుగమైనా, కలియుగమైనా, ఏ యుగమైనా మానవధర్మం శాశ్వతమైనది. రాగద్వేషాలు, మానవ సంబంధాలు మారవు. మన స్వభావాలను తీర్చి దిద్దేది రామాయణం. ఈ భూమిపై చెట్లు, పర్వతాలు, నీరు ఉన్నంత కాలం రామాయణం ప్రచలితం కాక మానదు. ఇది బ్రహ్మవాక్కు. -
బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్.. ఆ పాత్రకు భారీగా డిమాండ్ చేసిన యశ్!
రామాయణం ఇతిహాసం ఆధారంగా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఈ ఏడాదిలోనే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ మరో బాలీవుడ్ డైరెక్టర్ పెద్ద సాహసానికి రెడీ అయ్యారు. రామాయణం ఆధారంగా భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు. (ఇది చదవండి: హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే!) ఆదిపురుష్ లాంటి ఫలితం వచ్చిన తర్వాత కూడా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో రావణుడి పాత్రకు కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో యశ్‌ను చిత్రబృందం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం యశ్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రావణుడి పాత్రకు దాదాపు రూ.150 కోట్లు డిమాండ్ చేశారని లేటేస్ట్ టాక్. అయితే ఇందులో నిజమెంతనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. తివారీ రామాయణం ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం ద్వారానే యశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు కేజీఎఫ్-3 మూవీ కూడా చేయాల్సి ఉంది. (ఇది చదవండి: రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?) -
ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న హీరోయిన్ సాయి పల్లవి. వచ్చిన అవకాశాలను కాకుండా నచ్చిన పాత్రలనే అంగీకరించి నటించే అతి కొద్దిమంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఈమె ఇప్పటివరకు లభించిన చిత్రాలన్ని అలాంటివే. గార్గీ వంటి మూవీ సక్సెస్ తర్వాత సాయి పల్లవి ఇప్పటి వరకు తెరపై కనిపించలేదు అంతకుముందు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన సాయి పల్లవి చాలా రోజులు సినిమాలేవీ లేకుండానే ఖాళీగానే ఉంది. అలా పలు అవకాశాలను తిరస్కరించిన ఈ సహజ నటికి తాజాగా భారీ బ్రహ్మాండ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది. (ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!) అదీ పాన్ ఇండియా స్థాయిలో రామాయణం వంటి ఇతిహాసం నేపథ్యంలో రూపొందనున్న చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా సాయి పల్లవి అదృష్టమే అని చెప్పొచ్చు. అవును హిందీతో సహా పలు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందబోతున్న రామాయణం చిత్రంలో సాయి పల్లవి సీతగా నటించనున్నారు. ఈ చిత్రం గురించి అనధికారికంగా ఇప్పటివరకు చాలా ప్రచారం జరిగింది. కాగా నటి సాయి పల్లవి తొలిసారిగా రామాయణం చిత్రంలో సీతగా నటించబోతున్న విషయాన్ని దర్శకుడు నితీష్ తివారి తనను సీతగా ఎలా చూశారు అన్న భావనే తనను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్నారు. ఇది నిజంగానే తనను వరించిన అరుదైన అదృష్టంగా పేర్కొన్నారు. ఈ చిత్రం షూటింగ్‌కు ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇది కచ్చితంగా తనకు సవాల్‌తో కూడిన పాత్ర అని పేర్కొన్నారు. ఎందరో ప్రఖ్యాత నటీమణులు పోషించిన పాత్ర అని.. వారు నటించిన దాంట్లో తాను 10 శాతం చేసిన బాగా నటించినట్లే అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం కథ వినడానికి త్వరలోనే ముంబయికి వెళుతున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే భారతీయ సినీ చరిత్రలో పలు రామాయణం గ్రంథాలు చిత్రాలుగా రూపొందాయని, ఇప్పటివరకు వాల్మీకి రామాయణాన్ని ఎవరు సంపూర్ణంగా తెరపై ఆవిష్కరించలేదని.. ఆ కొరతను తమ రామాయణం తీరుస్తుందనే భావనను వ్యక్తం చేశారు. కాగా ఈ రామ చరితం నేపథ్యంలో రామాయణం చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (ఇది చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి) -
మూడు పార్టులుగా 'రామాయణం' సినిమా.. సీతగా ఆ బ్యూటీ?
తింటే గారెలే తినాలి వింటే రామాయణమే వినాలి అన్నది ఫేమస్ సామెత. రామాయణ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు, ఎన్నో భాషల్లో సినిమాగా తీసినా ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. అది ఆ పుణ్య పురుషులైన సీతారాముల చరితం విశేషం. రామాయణం గురించి విపులంగా టీవీ సీరియలే తీశారు. ఇక చిత్రాలు చాలానే వచ్చాయి. ఇకపై కూడా వస్తూనే ఉంటాయి అనడానికి మరో నిదర్శనం తాజాగా రెడీ అవుతున్న రామాయణం మూవీనే. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్, మధు మంతెన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటికీ బండి ముందుకు కదల్లేదు. ఇప్పుడు దీని గురించి అప్డేట్ వచ్చింది. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా 'కేజీఎఫ్' యష్ నటించనున్నట్లు టాక్. కాగా రామాయణాన్ని మూడు భాగాలుగా తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెడతారట. మొదటి భాగంలో సీతారాములకు సంబంధించిన సీన్స్, రెండవ భాగంలో రావణుడు సీతని లంకకు తీసుకెళ్లడం.. రామ, రావణాసురుల యుద్ధ సన్నివేశాలు ఉంటాయని ఇక మూడో భాగంలో లవకుశల పుట్టుకకు సంబంధించిన అంశాలు ఉంటాయని తెలుస్తోంది. పదేళ్ల ముందు తెలుగులో 'శ్రీరామరాజ్యం' చిత్రంలో నయనతార సీతగా మెప్పించారు. 'ఆదిపురుష్'లో కృతిసనన్ సీతగా నప్పలేదని అన్నారు. దీంతో సాయిపల్లవి సీతగా ఎలా ఉంటుందా అని ఇప్పటి నుంచే డిస్కషన్ మొదలైంది. (ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!) -
మైరావణుని ప్రాణాలు తుమ్మెద రూపంలో
లంకలో రామ రావణ యుద్ధం జరుగుతోంది. వానరసేన ధాటికి, రామలక్ష్మణుల పరాక్రమానికి రాక్షస వీరులు ఒక్కొక్కరే హతమైపోయారు. చివరకు మహాబలశాలి అయిన రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, దేవేంద్రుడిని సైతం జయించిన మేఘనాదుడు హతమైపోయారు. దిక్కుతోచని స్థితిలో పడ్డాడు రావణుడు. ఒంటరిగా కూర్చుని, తన మేనమామ మైరావణుడిని తలచుకున్నాడు. మైరావణుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. రావణుడి పరిస్థితి తెలుసుకున్నాడు. ‘రావణా! విచారించకు. నా మాయాజాలాన్ని దాటి రాముడైనా, దేవుడైనా అంగుళం దాటి అవతలకు పోలేరు. రామలక్ష్మణులిద్దరినీ బంధించి, రేపే వాళ్లను దుర్గకు బలి ఇస్తాను’ అని ధైర్యం చెప్పాడు. విభీషణుడికి చారుల ద్వారా సంగతి తెలిసి, సుగ్రీవుడిని, వానరులను అప్రమత్తం చేశాడు. రామలక్ష్మణులకు కట్టుదిట్టంగా కాపాడుకోవాలని చెప్పాడు. వెంటనే హనుమంతుడు తన తోకను భారీగా పెంచి, రామలక్ష్మణుల చుట్టూ రక్షణవలయంలా ఏర్పాటు చేసి, తోకపై కూర్చుని కాపలాగా ఉన్నాడు. మైరావణుడికి ఇదంతా తెలిసి, రామలక్ష్మణులను తస్కరించుకు తెమ్మని సూచీముఖుడనే అనుచరుణ్ణి పంపాడు. హనుమంతుడి వాలవలయం లోపలికి సూక్ష్మరూపంలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. హనుమంతుడి వాల రోమాలను తాకడంతోనే అతడి ముఖం రక్తసిక్తం కావడంతో వెనుదిరిగాడు. సూచీముఖుడి వల్ల పని జరగకపోవడంతో పాషాణముఖుడిని పంపాడు. వాడు హనుమంతుడి వాలవలయాన్ని తన రాతిముఖంతో బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తే, వాడి ముఖమే బద్దలైంది. చివరకు మైరావణుడే స్వయంగా రంగంలోకి దిగాడు. మాయోపాయాలలో ఆరితేరిన మైరావణుడు హనుమంతుడి వద్దకు విభీషణుడి రూపంలో వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు సురక్షితమే కదా! రాక్షసులు మాయావులు. నేనొకసారి లోపలకు పోయి రామలక్ష్మణులను చూసి వస్తాను’ అన్నాడు. హనుమంతుడు తోకను సడలించి, అతడు లోపలకు పోయేందుకు మార్గం కల్పించాడు. లోపలకు చొరబడిన మైరావణుడు రామలక్ష్మణులను చిన్న విగ్రహాలుగా మార్చి, తన వస్త్రాల్లో దాచి పెట్టుకుని ఏమీ ఎరుగనట్లు బయటకు వచ్చాడు. ‘రామలక్ష్మణులు గాఢనిద్రలో ఉన్నారు. జాగ్రత్త’ అని హనుమంతుడితో చెప్పి, అక్కడి నుంచి తన పాతాళ లంకకు వెళ్లిపోయాడు. వారిని ఒక గదిలో బంధించి, తన సోదరి దుర్దండిని వారికి కాపలాగా పెట్టాడు. కాసేపటికి విభీషణుడు వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు క్షేమమే కదా! ఒకసారి లోపలకు పోయి చూద్దాం’ అన్నాడు. ‘విభీషణా! ఇందాకే కదా వచ్చి వెళ్లావు. ఇంతలోనే మళ్లీ ఏమొచ్చింది’ అడిగాడు హనుమంతుడు. హనుమంతుడి మాటలతో విభీషణుడు ఆందోళన చెందాడు. ‘హనుమా! ఇంతకుముందు నేను రాలేదు. ఇదేదో మైరావణుడి మాయ కావచ్చు. చూద్దాం పద’ అన్నాడు. ఇద్దరూ లోపల చూశారు. రామలక్ష్మణులు కనిపించలేదు. విభీషణుడికి పరిస్థితి అర్థమైంది. ‘హనుమా! మనం క్షణం కూడా ఆలస్యం చెయ్యవద్దు’ అంటూ తనతో హనుమంతుడిని పాతాళ లంకకు తీసుకుపోయాడు. కావలిగా ఉన్న దుర్దండితో విభీషణుడు ‘భయపడకు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో చెప్పు’ అన్నాడు. ‘రామలక్ష్మణులను తెల్లారే బలి ఇవ్వడానికి మైరావణుడు సిద్ధమవుతున్నాడు. వారు ఇదే గదిలో ఉన్నారు’ అని చూపింది. హనుమంతుడు గది తలుపులు బద్దలుకొట్టాడు. ఆ శబ్దానికి కాపలాగా ఉన్న రాక్షసభటులు పరుగు పరుగున ఆయుధాలతో అక్కడకు వచ్చారు. హనుమంతుడు భీకరాకారం దాల్చి, వారందరినీ దొరికిన వారిని దొరికినట్లే మట్టుబెట్టసాగాడు. పాతాళలంకలో రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఈ కలకలం విని మైరావణుడే స్వయంగా వచ్చాడు. రాక్షసులపై వీరవిహారం చేస్తున్న హనుమంతుడితో కలబడ్డాడు. మైరావణుడు తన మీద ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ హనుమంతుడు తుత్తునియలు చేశాడు. చివరకు ఇద్దరూ బాహాబాహీ తలపడ్డారు. హనుమంతుడు ఎన్నిసార్లు తన పిడికిటి పోట్లతో ముక్కలు ముక్కలుగా చేసినా, మళ్లీ అతుక్కుని మైరావణుడు లేచి తలపడుతున్నాడు. హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు. ఇదంతా గమనించిన దుర్దండి ‘మహావీరా! కలవరపడకు. వీడి పంచప్రాణాలు ఐదు తుమ్మెదల రూపంలో ఉన్నాయి. ఆ తుమ్మెదలను ఈ బిలంలోనే దాచి ఉంచాడు’ అంటూ ఆ బిలాన్ని చూపించింది. బిలానికి మూసి ఉన్న రాతిని హనుమంతుడు పిడికిటి పోటుతో పిండి పిండి చేశాడు. బిలం నుంచి తుమ్మెదలు భీకరంగా ఝుంకారం చేస్తూ హనుమంతుడి మీదకు వచ్చాయి. హనుమంతుడు ఒక్కొక్క తుమ్మెదనే పట్టి, తన కాలి కింద వేసి నలిపేశాడు. ఐదు తుమ్మెదలూ అంతమొందడంతోనే, మైరావణుడు మొదలు తెగిన చెట్టులా కుప్పకూలిపోయాడు. రామలక్ష్మణులను విభీషణుడిని తన భుజాల మీద, వీపు మీద కూర్చోబెట్టుకుని హనుమంతుడు శరవేగంగా లంకలోని యుద్ధ స్థావరానికి చేరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకుని సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. హనుమంతుణ్ణి అభినందించాడు. ∙సాంఖ్యాయన (చదవండి: విఘ్నేశ్వరుని పూజ తరువాత వాయనదానం మంత్రం ) -
రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్?
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి.. ఇంకొన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఓ సినిమాను నిర్మించనున్నట్లుగా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు ముగిసింది. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో ఈ చిత్రం నిలిచి΄ోయిందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలని నిర్మాతలు అనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమా పనులను మరింత వేగవంతం చేశారని బాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు వంటి ప్రధాన పాత్రలకు ఆర్టిస్టులను ఎంపిక చేసి, లుక్ టెస్ట్‌ను నిర్వహించేందుకు నితీష్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడి పాత్రలో యశ్‌లు నటించనున్నారని, ముందు వీరి లుక్ టెస్ట్ జరుగుతుందని టాక్. మరి.. ఈ ‘రామాయణం’లో రియల్ లైఫ్ జంట ఆలియా, రణ్‌బీర్ సీతారాములుగా కనిపిస్తారా? ‘కేజీఎఫ్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విజృంభించిన యశ్ ఈ చిత్రంలో రావణుడిగా బీభత్సం సృష్టిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
మందు కొట్టి తీశారా?.. ఆదిపురుష్ మేకర్స్‌పై నటుడు ఆగ్రహం!
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు ఇంకా ఆగడం లేదు. దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏ మూహుర్తనా మొదలెట్టాడో ఆది నుంచి విమర్శల పాలవుతోంది. టీజర్ మొదలు సినిమా రిలీజ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగ్స్, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు మాజీ నటులు మేకర్స్‌పై మండిపడ్డారు. ఆ తర్వాత ఆదిపురుష్ టీం తమ తప్పులను అంగీకరించిన సినిమాలో మార్పులు కూడా చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆయనతో డేటింగ్.. నా జీవితమే నాశనమైంది: టాప్ హీరోయిన్) అయితే తాజాగా మరో నటుడు ఆదిపురుష్ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ విందు ధారా సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా హనుమంతుని పాత్రను వక్రీకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. విందు ధారా సింగ్ చాలాసార్లు హనుమంతుడి పాత్రను తెరపై పోషించాడు. అంతే కాకుండా అతని తండ్రి, దివంగత నటుడు ధారా సింగ్, రామానంద్ సాగర్ టీవీ షో రామాయణంలో హనుమంతుడి పాత్రను కూడా పోషించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విందు ధారా సింగ్.. ఆదిపురుష్ నిర్మాతల తీరును ఎండగట్టారు. హనుమంతుడిగా నటించిన దేవదత్తా నాగేపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. హనుమంతుడు పవర్‌ఫుల్‌గా, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఆ పాత్రలో నటించిన దేవదత్తా నాగే హిందీలో కూడా సరిగ్గా మాట్లాడలేడు. అతడికి ఇచ్చిన డైలాగ్‌లతో ఆ పాత్రను మరోవిధంగా చూపారు. ఈ విషయంలో నిర్మాతలు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. హనుమంతుడి పాత్రలో తన తండ్రి ధారా సింగ్ చరిత్ర సృష్టించాడని.. ఆయన నటనకు మీరు దరిదాపుల్లోకి కూడా రాలేరని అన్నారు. విందు ధారా సింగ్ మాట్లాడుతూ.. 'వీళ్లు చేసిన పని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. మందు తాగి వచ్చారో కానీ.. వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో కూడా వాళ్లకు తెలియదు. ఇంత భారీ బడ్జెట్‌తో అద్భుతమైన సినిమా తీసే గోల్డెన్ ఛాన్స్ నాశనం చేశారు. వారు తమాషా చేస్తూ కథతో ఆడుకున్నారు. అందుకే ఆదిపురుష్ తీవ్రంగా నిరాశపరిచింది.' అన్నారాయన. ఆదిపురుష్ వివాదం ఆదిపురుష్ చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముంబై పోలీసులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సెన్సార్ బోర్డు, చిత్ర నిర్మాతలపై తీవ్ర స్థాయిలో మడిపడింది. సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది? మీరు భవిష్యత్ తరాలకు ఏం నేర్పాలనుకుంటున్నారు?" అని కోర్టు ప్రశ్నించింది. డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. -
రామాయణం ఎన్నిరకాలు ? రామాయణం ఎన్నిరకాలు ?
-
‘టీవీ రాముడి’ పాదాల చెంత అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లాడిని ఉంచగానే..
‘ఆది పురుష్’ సినిమాపై జరుగుతున్న హంగామా ఇప్పట్లో చల్లారేలా లేదు. రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను చూసినవారంతా దర్శకనిర్మాత రామానంద్‌సాగర్ రూపొందించిన టీవీ రామాయణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీవీ రామాయణంలో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్ కూడా ‘ఆది పురుష్’ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రామాయణం రూపొందించినప్పుడు దానిని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దామని, అందుకే ఇప్పటికీ నాటి రామాయణం సీరియల్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. సోషల్ మీడియాలో ‘ఆది పురుష్’సినిమాపై స్పందించిన ఆయన గతంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వివరించారు. గతంలో ఒకసారి తనను సాక్షాత్తూ శ్రీరామునిగా భావించిన ఒక మహిళ తన పాదాల చెంత అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని ఉంచిందన్నారు. అప్పుడు తాను అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పిల్లివాడిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలలని చెబుతూ, పిల్లాడి ఆరోగ్యం కోసం ప్రార్థించానన్నారు. తరువాత ఆమె తన చేతిని ఆ కుర్రాడి తలపై ఉంచాలని కోరిందన్నారు. తరువాత ఆమె ఆ పిల్లాడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు. మూడు రోజుల తరువాత ఆ మహిళ తన పిల్లాడిని తీసుకుని తిరిగి సెట్‌కు వచ్చిందని, అప్పుడు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారన్నారు. ఆ పిల్లాడు అనారోగ్యం నుంచి కోలుకుని ఆడుకుంటున్నాడని అరుణ్ గోవిల్ తెలిపారు. దేశంలో శ్రీరామునిపై ప్రజలకు భక్తిశ్రద్ధలు ఆ స్థాయిలో ఉంటాయని అరుణ్ గోవిల్ దీనిని ఉదహరించారు. ఏ మతానికి సంబంధించిన సినిమా రూపొందించినా, అది విలువలతో కూడి ఉండాలని ఆయన సూచించారు. దేశంలోని ప్రజలు శ్రీరాముని పాత్రను ఎంతో గొప్పగా చూస్తారని, అందుకే ఓం రౌత్ రూపొందించిన రామాయణంలో విలువలు లేవని విమర్శిస్తున్నారన్నారు. రామాయణం రూపకల్పన విషయంలో తగిన విధంగా ఆలోచించి ఉంటే, ఇన్ని విమర్శలు వచ్చేవికావని, పైగా ప్రేక్షకులు మెచ్చుకునేవారన్నారు. ఇది కూడా చదవండి: ‘ఆదిపురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట! -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కానీ అంతే అంతేస్థాయిలో విమర్శల దాడి ఎదుర్కొంది. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?) తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రీ ఆదిపురుష్ చిత్రం చూశానని తెలిపారు. అయితే ఈ చిత్రంలో రెండు అంశాలు మాత్రమే తనకు నచ్చాయని వెల్లడించారు. కానీ ఈ సినిమా చూసేందుకు ఎందుకు వచ్చానా? అనిపించిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదిపురుష్ తనను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు. సునీల్ లహ్రీ మాట్లాడుతూ.. 'నేను ఆదిపురుష్ సినిమా చూశా. ఈ చిత్రంపై నాకు చాలా ఆశలు పెట్టుకున్నా. కానీ చాలా నిరాశకు గురి చేసింది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు ఈ చిత్రం ఎవరు తీశారు? నేను ఎందుకు సినిమా చూసేందుకు వచ్చానా అనిపించింది. హనుమాన్ను ఓ వీధి భాష మాట్లాడే వారిలా చూపించారు. సినిమాలో నాకు నచ్చినవి రెండే అంశాలు బాగున్నాయి. ఒకటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ. ఈ రెండు మినహాయిస్తే ఈ మూవీ చూసిన వారికి నిరాశ తప్పదు. సినిమా థియేటర్లో నా పక్కన కూర్చున్నవారు సైతం సినిమా బాగాలేదన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ తప్పా.. చిత్రంలో ఏం లేదని అన్నారు. మరో వ్యక్తి మాట్లాడుతూ రామాయణం పేరుతో ప్రజలకు ఏం చూపిస్తున్నారంటూ మండిపడ్డారని.' తెలిపారు. (ఇది చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని! ) -
ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ నుంచి సినిమా రిలీజైన కూడా వివాదాలు వదలడం లేదు. మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని హనుమంతుని డైలాగ్స్, పాత్రల వేషధారణను తప్పుబడుతున్నారు. అసలు రామాయణాన్ని వక్రీకరించారంటూ రోజు రోజుకు ఆదిపురుష్‌పై చిత్రబృందంపై మండిపడుతున్నారు. ఇప్పటికే శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా దర్శకుడు ఔం రౌత్‌కు రామాయణం గురించి కొంచెం కూడా అవగాహన లేదని విమర్శించారు. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) తాజాగా రామాయణం సీరియల్లో సీత పాత్ర పోషించి నటి దీపికా చిక్లియా ఆదిపురుష్ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పురాణ, ఇతిహాసాలైన రామాయణంపై సినిమాలు తీయడం ఆపేయాలని దీపికా విజ్ఞప్తి చేశారు. ఆదిపురుష్‌పై మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారమె. పాఠశాలల్లో విద్యార్థులకు పురాణాన్ని తప్పనిసరిగా బోధించాలని సూచించారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్లో దీపిక సీత పాత్ర పోషించింది. దీపికా మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా గురించి నేను కామెంట్స్ చేయదలచుకోలేదు. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. రామాయణం మన వారసత్వం. దీనిపై ఇక నుంచి సినిమాలు చేయకూడదనేది నా ఉద్దేశం. రామాయణంపై సినిమా చేసిన ప్రతిసారీ ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. రామాయణం మనకు చాలా పవిత్రమైనది. ఈ విషయంలో ఎవరినీ నొప్పించకూడదనుకుంటున్నా. మన విశ్వాసాన్ని మనం గౌరవించుకుందాం. రామాయణం అనేది వినోదానికి సంబంధించినది కాదు.' అని అన్నారామె. కాగా.. ఇప్పటికే దీపికా సహనటుడు అరుణ్ గోవిల్ కూడా ఆదిపురుష్ హాలీవుడ్ కార్టూన్ సినిమా అంటూ ఎద్దేవా చేశారు. కాగా.. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే..) View this post on Instagram A post shared by Dipika (@dipikachikhliatopiwala) -
‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. అంతేస్థాయిలో విమర్శల పాలైంది. రోజు రోజుకు ఈ చిత్రాన్ని విమర్శించే వారి సంఖ్యం పెరుగుతోంది. తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహరి ఆదిపురుష్ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా వాస్తవానికి చాలా దూరంగా ఉందని విమర్శించారు. (ఇది చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా? ) సునీల్ లహరి మాట్లాడుతూ.. 'వాల్మీకి రామాయణం ఆధారంగా సినిమా తీస్తున్నామని డిస్క్లెయిమర్లో స్పష్టంగా చెప్పడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. అలా ఎందుకు చెప్పారని నేను నిజంగా సిగ్గుపడుతున్నా. ఇది కేవలం ఫాంటసీ అని చెప్పి.. అందుకు భిన్నంగా తీశారు. పుష్పక విమానంతో రావణుడిని చూపించలేదు. మేఘనాథ్, లక్ష్మణ్ యుద్ధాన్ని నీటిలో చూపించారు. డైలాగులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏ పాత్ర క్యారెక్టరైజేషన్ కూడా స్పష్టంగా లేదు. దర్శకుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు కనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు తీశాడో తెలియదు. స్పెషల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్తో మాత్రమే సినిమాని నిలబెట్టలేరు. ఎందుకంటే రామాయణం గురించి సరళంగా చెప్పాలి. హనుమంతునితో ఎలాంటి పాత్రను క్రియేట్ చేశారో.. ఎలాంటి డైలాగులు చెప్పారో అర్థం కావడం లేదు. ' అని అన్నారు. సినిమాలోని పాత్రలపై గురించి ఆయన మాట్లాడుతూ.. 'ఆదిపురుష్‌లో పాత్రలు చూసి నిజంగా ఆశ్చర్యపోయా. రావణుడు అత్యంత సుందరమైన దేశానికి రాజు. అలా ఎందుకు చూపించారో నాకు తెలియదు. సినిమాలో నకిలీ సీతను తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్లు కథను సింపుల్‌గా చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు ఈ సినిమాలో అన్ని పాత్రలూ అయోమయంగా కనిపించాయి. వాటిలో ఏదీ స్పష్టంగా రాలేదు. ఇది నటీనటుల తప్పు కాదు. వారి పాత్రలను స్పష్టంగా లేనందున అలా జరిగింది. ఓం రౌత్ సెన్సిబుల్ డైరెక్టర్ అనుకున్నా. ఈ సినిమా తీయడంలో ఆయన మరింత తెలివిగా వ్యవహరించాల్సింది.' అని అన్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు) -
‘ఆది పురుష్’ను చీల్చిచెండాడిన ‘టీవీ రాముడు’
దర్శకనిర్మాత రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం గతంలో టీవీలో ప్రసారమై, కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను అమితంగా అలరించింది. దానిలో రాముని పాత్ర పోషించి, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు అరుణ్ గోవిల్ తాజాగా విడుదలైన ‘ఆది పురుష్’ సినిమాపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. హీరో ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ జూన్ 16న భారీ స్థాయిలో విడుదలయ్యింది. ఇది మొదలు ఈ సినిమాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి రాముని లుక్ నచ్చకపోగా, మరికొందరికి హనుమంతుని భాష నచ్చలేదు. మరికొందరు అభిమానులు ‘ఆది పురుష్’లో కొన్ని సీన్స్‌పై లెక్కలేన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అలనాడు టీవీలో ప్రసారమైన రామాయణంలో రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ‘ఆది పురుష్’ సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రామాయణం భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని, అయితే ఇప్పుడు ఈ రామాయణం(సినిమా) గురించి రరకాల వాదనలు వినిపిస్తున్నాయన్నారు. రామాయణ కథను, రాముని స్వరూపాన్ని మార్చి చూపించాల్సిన అవసరం లేదన్నారు. ‘ఆధ్యాత్మికతకు అపహాస్యం’ రామాయణం మనకు ఒక ఆధ్యాత్మిక మార్గం. మనకు ధైర్యన్ని అందించే ఉత్తమ గ్రంథం. దీనిని ఎవరైనా అపహాస్యం చేస్తే, స్వీకరించాల్సిన అవసరం లేదు. రామాయణాన్ని ఆధునికమని, సంప్రదాయమని విడదీయడం తగదు. సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్, ప్రెజెంటేషన్ విషయాన్ని పక్కన పెడితే, క్యారెక్టర్లను సరైన రీతిలో చూపించడం తప్పనిస అని అరుణ్ గోవిల్ పేర్కొన్నారు. రాముడు, సీత, హనుమంతుడు మొదలైన క్యారెక్టర్ల విషయంలో ఆధునికం, సంప్రదాయం అని విడదీయడం తగదు. ఈ క్యారెక్టర్ ఆద్యనంతాలు. అంటే ఎప్పటికీ ఒకేలా ఉండేవి. అందుకే అదే స్వరూపాన్ని ఈ సినిమాలో చూపిస్తే తప్పేముంది? అని ప్రశ్నించారు. ‘ఆది పురుష్’ సినిమా నిర్మాతలు దీనిని రూపొందించేముందు ఏ తరహా ప్రేక్షకులకు ఈ కథను చూపించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఉండాల్సిందన్నారు. ‘ఇటువంటి భాష తగదు’ ‘ఆది పురుష్’ సినిమాలో వాడిన భాషపై పలు విమర్శలు వస్తున్నాయని అరుణ్ గోవిల్ ఆరోపించారు. ‘ఆది పురుష్’ సినిమాలో గౌరవప్రదమైన భాష వాడాలని అన్నారు. రామాయణ మూల భావనను తొలగించాల్సిన అవసరం ఏమివచ్చిందన్నారు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో రామాయణాన్ని చూపించాలనుకోవడం సరైనది కాదన్నారు. ఇది కూడా చదవండి: ‘మేం తీసింది రామాయణం కాదు’ -
రామాయణంపై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ సీరియస్
పాట్నా: రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాపై ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని.. హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉండగా.. రామాయణంపై ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామాయణాన్ని మసీదులో రాశారని దనపూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే యాదవ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా దుమారం రేపుతున్నాయి. ఇక, యాదవ్ వ్యాఖ్యలపై జేడీ(యూ) స్పందించింది. యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని భాగస్వామ్య పార్టీ జేడీ(యూ) పేర్కొంది. యాదవ్ అంతటితో ఆగకుండా 11 ఏండ్ల ముస్లిం బాలిక భగవద్గీతను పఠించి మెడల్‌ను గెలుచుకున్నప్పుడు హిందుత్వవాదులు నోరుమెదపలేదని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలెవరూ ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. మరోవైపు.. యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. रामचरित मानस मस्जिद में लिखी गई थी, इतिहास उठाकर देखिए," RJD के विधायक रीतलाल यादव का बयान। #RitlalYadav #Ramcharitmanas pic.twitter.com/Cl1JxDlDjK — The Hint News (@TheHintNews) June 16, 2023 ఇది కూడా చదవండి: పొలిటికల్ స్టంట్.. కాంగ్రెస్‌కు బిగ్ ఆఫరిచ్చిన ఆప్ -
త్వరలోనే మరో రామాయణం.. రాముడు, సీతగా వారిద్దరే!
రామాయణ ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ఆదిపురుష్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ నితేశ్ తివారీ, నిర్మాత మధు మంతెనతో కలిసి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఫోటోలు షేర్ చేసి ట్రోలర్స్‌కు గట్టిగానే రిప్లై ఇచ్చిన నటి) అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌కపూర్‌ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. సీత పాత్రకు బాలీవుడ్ భామ ఆలియా భట్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు నితేశ్ తివారీతో అలియా భట్ కనిపించడంతో ఓకే చెప్పారని సమాచారం. కానీ గతంలో సీతగా సాయిపల్లవి కనిపించనుందని వార్తలొచ్చాయి. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రకు కేజీయఫ్ హీరో యశ్‌ను ఓకే చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ..'నేను కొందరు నిర్మాతలతో కలిసి రామాయణాన్ని నిర్మిస్తున్నా. దాని కోసం నాలుగేళ్లుగా వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రయత్నం. పూర్తవ్వడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందని'. చెప్పారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ వాయిదా పడనుందనే వార్తలపై తాజాగా నిర్మాత మధు మంతెన స్పందించారు. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రారంభించనున్నాం. దయచేసి ఇలాంటివి ప్రచారాన్ని నమ్మకండి అని అన్నారు. దీంతో మరో ఆదిపురుష్ రాబోతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అతనిపై విపరీతమైన క్రష్.. కానీ నన్ను మోసం చేశాడు: హీరోయిన్) -
Ramayana and Indian poetry: వాటిని ఎందుకు చదవాలి?
మనిషి జీవితంలో సంతరించుకోవలసిన గొప్ప గుణాలను గురించి గురజాడ అప్పారావుగారు ఒకచోట ఇలా అన్నారు... ‘‘ ఈవియుదియ్యని మాటయు భావంబున జేయతగిన పనితెలియుటయున్ ఠీవియగు ధైర్యభావము రావు సుమీ యొకని వలన రావలె తనతోన్’’... ఈవియు .. అంటే త్యాగం. మనిషి తనకుతాను సుఖపడితే తప్పుకాదు. మనిషి త్యాగంతో గొప్పవాడు అవుతాడు. ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళను కష్టాల్లోంచి పైకి తీసుకురావడానికి.. తాను ఎంత శక్తిని వినియోగించుకోగలడో, అంత శక్తినీ, ఏ విధమైన గుర్తింపునీ కోరకుండా అది తన కర్తవ్యం అన్న భావనతో ప్రేమ భావనతో చేయదగిన వ్యక్తి ఎవరున్నారో ఆయన త్యాగశీలి. అటువంటి మహానుభావులు ఎందరో పుట్టకపోతే అసలీ దేశానికి స్వాతంత్య్రం ఎలా సిద్ధించి ఉండేది? మన దగ్గర విషయమే తీసుకుంటే... బెజవాడ గోపాలరెడ్డి గారు పుట్టుకతో శ్రీమంతుడయినా దేశంకోసం చాలా శ్రమించాడు, చివరకు జైళ్ళకు కూడా వెళ్ళాడు. ఆయనకేం కర్మ! అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆరోజుల్లో లక్షల సంపాదన ఉన్న న్యాయవాద వృత్తిని వదిలి దేశంకోసం సర్వస్వం ధారపోశారు. స్వాతంత్య్రోద్యమ విశేషాలను, సందేశాలను ప్రజలకు చేరవేయడానికి తన స్వార్జితంతో ‘స్వతంత్ర’ పత్రిక నడిపారు. లక్షలు ఖర్చుపెట్టారు... అటువంటి వారిది త్యాగమయ జీవితం. అంటే... త్యాగం మనిషిని శాశ్వతమైన కీర్తికి అర్హుణ్ణి చేస్తుంది. తియ్యని మాటలు మాట్లాడడం ఒక మంచి సంస్కారం. తిరస్కరించవలసి వచ్చిన సందర్భాల్లోనూ ఎదుటివారిని నొప్పించకుండా మృదువుగా మాట్లాడగలగాలి. హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటిపోతున్నప్పుడు మార్గమధ్యంలో మైనాకుడు తన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలని కోరితే... కటువుగా తిరస్కరించలేదు. ‘‘నాయనా! రామకార్యం మీద పోతున్నాను. వేళ మించిపోతోంది. నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్లే...’’ అంటూ మృదువుగా చేతితో స్పృశించి వెళ్ళాడు తప్ప... ఎక్కడా కటువుగా మాట్లాడలేదు. రామాయణ భారతాది కావ్యాలు ఎందుకు చదవాలంటే... మాట మధురంగా ఉండడం కోసం, సంస్కారవంతమైన వాక్కు తయారవడం కోసం, మాట పదిమందికి పనికొచ్చేదిగా ఉండడం కోసం చదువుకుంటారు. ఎవ్వరికీ ఉపకారం చేయలేకపోవచ్చు. మనం చెప్పే ఓదార్పు మాటలు ఎదుటి వాళ్ళకు స్వాంతన కలిగిస్తాయి. చెడు మార్గంలో ఉన్న వాళ్లను మంచిమార్గం వైపు మళ్ళిస్తాయి. భావంబున చేయదగిన పనిచేయుటయున్... భావం మనోగతం. తాను ఏ పనిచేయాలో ఆ పనినే మనసు తనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి గొప్ప శీలవంతుడవుతాడు. అటువంటి సౌశీల్యం ఉండాలి. ఠీవియగు ధైర్య భావము... ఠీవి అంటే వైభవం.. పిరికితనం చూపకుండా తెగువ, పోరాట పటిమ చూపే సందర్భంలో కాకుండా... ఇక్కడ ధైర్యం అంటే... ఎంత కష్టం కలిగినా ఓర్చుకుని నిలబడి ప్రయత్నాన్ని కొనసాగించి కృతకృత్యులు కావడం.. ఆయన ధైర్యశాలి. ఆ ధైర్యం వైభవోపేతం... ఇటువంటి గొప్పగుణాలు జన్మతః లేకపోయినా ప్రతివారూ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. -
గురువాణి: పాతకొత్తల గొడవ మనకెందుకు!!!
అభ్యుదయం అంటే సమాజానికి మేలు చేయడం. మనుషులలో మంచి గుణాలు ఏర్పడితే అది అభ్యుదయానికి కారణమవుతుంది. మేలు జరగడానికి పాతదా కొత్తదా అని కాదు... పాతదంతా మంచీ కాదు, కొత్తదంతా చెడూ కాదు. అలాగే పాతదంతా చెడూ కాదు, కొత్తవన్ని మంచివీ కావు. రామాయణ భారతాల్లో అన్నీ ఉన్నాయండీ అని కొత్త వాఙ్మయం దేనికండీ అనడం మంచిదికాదు. కొత్తగా వచ్చిన గ్రంథాలలో ఎన్నో మంచి విషయాలుంటాయి. ‘‘పురాణమిత్యేవ న సాధు సర్వం/ నా చాపి కావ్యం నవమిత్యవద్యమ్/ సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే/ మూఢఃపరప్రత్యయనేబుద్ధిః’’ అంటారు మాళవికాగ్నిమిత్రంలో మహాకవి కాళిదాసు. అంటే పాతకాలానికి సంబంధించినది కాబట్టి ఇందులో ఏదీ పనికొచ్చేదీ, మంచిదీ ఉండదు – అనకూడదు. పాతవన్నీ చెడ్డవని ఎలా సిద్ధాంతీకరిస్తారు! ఈ రచన ఇప్పుడు కొత్తగా వచ్చింది, వీటిలో మన మేలు కోరేవి ఏం ఉంటాయి, వీటిని మనం ఆదరించక్కరలేదు... అని చెప్పడమూ కుదరదు. వివేకవంతులు ఏం చేస్తారంటే... అందులో ఏదయినా మంచి చెప్పారా.. అని పరిశీలిస్తారు. జీవితాలకు అభ్యున్నతిని కల్పించే మాటలు ఏవయినా వాటిలో ఉన్నాయా... అని చూస్తారు. కానీ ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం. ..అంటున్నాడు కాళిదాసు. మనకు పనికొచ్చే విషయాలు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయి.. అన్నదానిని పరిశీలించడం నిజమైన అభ్యుదయం. దాని విషయానికొస్తే అది పాతదా, కొత్తదా అని కాదు ఆలోచించాల్సింది, అందులో మంచి ఏముంది, ఇందులో మంచి ఏముంది? అని అంతకన్నా దాటి ఇక పరిశీలన చేయవలసిన అవసరం నాబోటివాడికి అక్కర లేదు. నా వరకు నాకు కావలసినది – అది ఎవరు రాసింది అయినా పాత కాలపుదయినా, కొత్తకాలపుదయినా, ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులు రాసినది అయినా, పాతకాలంలో రుషుల వాఙ్మయం అయినా... అందులో అభ్యుదయానికి చెప్పబడిన మంచి విషయాలు ఏమున్నాయి? అనే. వాటిని స్వీకరించి, జీర్ణం చేసుకుని బాగుపడడానికి ప్రయత్నం చేయడం వరకే. పాతకాలంలో కూడా ఆదరణీయం కానివి, అంగీకారయోగ్యం కానివి, సమాజానికి ఉపయుక్తం కానివి ఎన్నో ఉండవచ్చు. అంతమాత్రం చేత పాతకాలంలో ఉన్న వాఙ్మయంలో పనికొచ్చేవి ఏవీ లేవు.. అని చెప్పడం సాధ్యం కాదు. ‘పురాణమిత్యేవ న సాధు సర్వం ...’ ఇది... ఆకాలంలో కాళిదాసు చెప్పిన మాట. ఈ మాట ఇప్పటికి పనికి రాదా!!! ఇది నేర్చుకుంటే అభ్యుదయం కాదా!!! ఇది నేర్చుకున్నవాడి జీవితం ... చేత దీపం పట్టుకుని నడుస్తున్న వాడిలా ఉండదా? పువ్వు పువ్వు లోంచి తేనెబొట్టు స్వీకరించిన తేనెటీగకాడా !!! అందువల్ల మంచి విషయాలు స్వీకరించడం ప్రధానం కావాలి. అవి ప్రాచీన వాఙ్మయం నుంచి కావచ్చు, కొత్తగా వెలువడుతున్న గ్రంథాలనుంచి కావచ్చు. వ్యక్తులందరూ అలా స్వీకరించాలి, మంచి గుణాలు అలవర్చుకోవాలి, ఆ వ్యక్తుల సమూహమే సమాజ అభ్యుదయానికి కారణమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం అంటున్నాడు కాళిదాసు.