కన్ను అదిరితే కంగారేల?
నమ్మకం
ఆడవాళ్లకి కుడికన్ను అదిరితే కీడు సంభవిస్తుందని, మగవారికి ఎడమకన్ను అదిరితే కష్టాలు తప్పవని విశ్లేషిస్తుంటారు జ్యోతిషవేత్తలు. ఈ నమ్మకం తాము సృష్టించింది కాదని, రామాయణ కాలంలోనే ఇది ప్రాచుర్యంలో ఉందని చెబుతారు వారు. రావణుడు సీతమ్మవారిని ఎత్తుకెళ్లేందుకు పయనమవగానే... సీతాదేవికి కుడికన్ను, లక్ష్మణుడికి ఎడమకన్ను అదిరాయట. ఆ తరువాత రావణుడు రామపత్నిని అపహరించాడు. అప్పట్నుంచీ కుడికన్ను అదిరితే స్త్రీకి, ఎడమకన్ను అదిరితే పురుషుడికి ప్రమాదాలు సంభవిస్తాయనే నమ్మకం ఏర్పడింది అంటారు. రామదండు లంక మీద దాడి చేయబోయే ముందు రావణుడికి, మండోదరికి కూడా కన్ను అదరిందట.
హవాయిలో ఎడమకన్ను కొట్టుకుంటే ఓ అపరిచితుడు జీవితంలోకి వస్తాడని, కుడి కన్ను అదిరితే... తమ ఇంట్లో కానీ, బంధువుల ఇళ్లలోగానీ పసిబిడ్డ జన్మిస్తుందని విశ్వసిస్తారు. ఆఫ్రికాలో కన్ను పై రెప్ప కొట్టుకుంటే బంధువుల రాక అని, కిందిరెప్ప కొట్టుకుంటే కన్నీళ్ల కుండపోత తప్పదని అంటారు. నైజీరియాలో ఏ కన్ను కొట్టుకున్నా చెడే జరుగుతుందంటారు.
ఇక చైనా వారికి కుడికన్ను అదిరితే మంచి, ఎడమకన్ను అదిరితే కీడు. అంతేకాదు... అదిరే సమయాన్ని బట్టి వారు ఫలితాన్ని అంచనా వేస్తుంటారు. అదెలాగంటే... ఉదయం 11 నుంచి 1 గంట మధ్య అదిరితే ఓ గొప్ప వ్యక్తిని కలుస్తారట. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య అయితే కష్టాలు వస్తాయట. 3 నుంచి 5 మధ్య అయితే విదేశాల నుంచి అతిథులు వస్తారట. ఇలా చాలా లెక్కలున్నాయి వారికి!
అయితే నిద్ర సరిపోకపోయినా, కళ్లు ఎక్కువగా అలసిపోయినా, నరాల బలహీనత, విటమిన్ల లోపం, కొన్ని రకాల కంటి సంబంధిత రోగాల వల్ల కూడా కన్ను అదరడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. వాళ్లు చెప్పేది వాస్తవమే కావచ్చు. కానీ నమ్మకాల మాటేమిటి!